Medak Lok Sabha
-
మెదక్‌లో బీఆర్ఎస్కు ఓటమి తప్పదు: కోమటిరెడ్డి
సాక్షి, నల్లగొండ: కల్వకుంట్ల కవిత చేసిన పనికి తెలంగాణ ప్రజలకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అలాగే, మెదక్‌లో ఎన్ని కోట్లు ఖర్చు చేసిన బీఆర్ఎస్ గెలవలేదని జోస్యం చెప్పారు. కాగా, మంత్రి కోమటిరెడ్డి బుధవారం నల్లగొండలో మీడియాతో మాట్లాడుతూ..‘ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం హాస్యాస్పదం. మేము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్లో ఒక్కరు కూడా మిగలరు. మూడు నెలల్లో బీఆర్ఎస్ కనుమరుగవుతుంది. మెదక్‌లో వెయ్యి కోట్లు ఖర్చు చేసినా బీఆర్ఎస్ గెలవలేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలు గెలుస్తుంది. కేసీఆర్ కూతురు అవినీతి చేసి తీహార్ జైలులో ఉన్నారు. బిడ్డ చేసిన పనికి కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు జైలుకు వెళ్తారు. యాదాద్రి పవర్ ప్లాంట్ అవినీతి విషయంలో జగదీష్ రెడ్డి జైలుకు పోతారు. జగదీష్ రెడ్డి వేల కోట్ల రూపాయాలు దోచుకున్నారు. శంషాబాద్‌లో ఫామ్ హౌస్ కూడా కొన్నాడు. జగదీష్ రెడ్డి అవినీతిని బయటకు తీస్తాం. నల్లగొండ, భువనగిరి లోక్‌సభ స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీలకు డిపాజిట్లు కూడా రావు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
నీలం మధుకే మెదక్ టికెట్
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : మెదక్ లోక్‌సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థిత్వంపై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఈ టికెట్ నీలం మధు ముదిరాజ్‌కు దక్కింది. బీసీ సామాజిక సమీకరణ ఈయనకు కలిసొచ్చింది. ఇదివరకే ఈ స్థానం నుంచి బీఆర్ఎస్, బీజేపీలు ఓసీలకు టికెట్లు కేటాయించాయి. కాగా, కాంగ్రెస్ వ్యూహాత్మకంగా బీసీ నేతను బరిలోకి దింపుతోంది. ఈ అభ్యర్థిత్వం విషయమై నీలం మధు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెగ్గారెడ్డి సతీమణి నిర్మల జగ్గారెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. బీఆర్ఎస్లో ఉన్న హైదరాబాద్‌కు చెందిన సీహెచ్.నరేంద్రనాథ్ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. ఆయన కాంగ్రెస్‌లో చేరి టికెట్ దక్కించుకుంటారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరిగింది. మరో పారిశ్రామికవేత్త పేరు సైతం వినిపించింది. కానీ హస్తం పార్టీ అధినాయత్వం చివరకు మధు వైపే మొగ్గు చూపింది. ఆయనకు సీఎం రేవంత్ ఆశీస్సులున్నాయి. బీఎస్పీ నుంచి పోటీ బీఆర్ఎస్లో చాలా కాలం కొనసాగిన నీలం మధు అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్చెరు స్థానం నుంచి టికెట్ ఆశించారు. దక్కక పోవడంతో కాంగ్రెస్‌లో చేరి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్నారు. చివరి క్షణంలో ఆయన స్థానంలో కాటా శ్రీనివాస్‌గౌడ్‌ను పార్టీ బరిలోకి దింపడం తెలిసిందే. దీంతో మధు బీఎస్పీ కండువా కప్పుకుని ఆ పార్టీ తరఫున పోటీ చేశారు. మారిన రాజకీయ పరిణామాలతో ఇటీవల కాంగ్రెస్ చేరారు. సామాజిక సమీకరణాల్లో భాగంగా ఆయనకు ఈ టికెట్ దక్కింది. వార్డుమెంబర్ నుంచి ఎంపీ అభ్యర్థిగా.. మధు.. 2001లో బీఆర్ఎస్తో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. పటాన్చెరు మండలం చిట్కుల్లో వార్డ్ మెంబర్‌గా ఎన్నికయ్యారు. తర్వాత 2019లో చిట్కూర్ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఎన్ఎంఆర్ ఫౌండేషన్ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ఆయనకు పటాన్‌చెరుతో పాటు జిల్లా వ్యాప్తంగా అనుచరులున్నారు. ప్రధానంగా ముదిరాజ్ సామాజికవర్గంలో మంచి పట్టున్న నేతగా పేరుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ సామాజికవర్గం ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన బరిలోకి దించడం ద్వారా ఆ సామాజికవర్గానికి ప్రాతినిథ్యం వహించినట్లు అవుతుందని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోంది. -
Medak Lok Sabha: మెదక్ నుంచి కేసీఆరే!
గులాబీ దళపతి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మెదక్ ఎంపీ స్థానం నుంచి బరిలో దిగనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అలాగే శ్రేణులను కార్యోన్ముఖులను చేసేలా రంగం సిద్ధమైనట్లు సమాచారం. మరో వైపు వంటేరు ప్రతాప్ రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ ఖరారైనట్లు కూడా ప్రచారం జరుగుతోంది. మెదక్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి తేలిన తరువాతే బరిలో ఎవరుంటారన్నది తేలనుందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో జహీరాబాద్, మెదక్ లోక్‌సభ స్థానాలున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు జహీరాబాద్ స్థానానికి అభ్యర్థులను ప్రకటించాయి. కానీ మెదక్ కు వచ్చేసరికి బీజేపీ మాత్రమే అభ్యర్థిని ప్రకటించింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు మాత్రం తమ అభ్యర్థులెవరో ఇంకా ప్రకటించకపోవడంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఈ ఉత్కంఠకు ఎప్పుడు తెరపడనుందో వేచిచూడాల్సిందే మరి.. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : మెదక్ లోక్‌సభ అభ్యర్థిత్వం విషయంలో గులాబీ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని జహీరాబాద్ టికెట్‌ను ప్రకటించినప్పటికీ, మెదక్ విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ టికెట్‌ను వంటేరు ప్రతాప్‌రెడ్డికి ఇవ్వాలని అధినేత కేసీఆర్ పక్షం రోజుల క్రితమే నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇంకా అధికారికంగా ప్రకటించడం లేదు. కాంగ్రెస్ అభ్యర్థిత్వం తేలిన తర్వాత ఇక్కడి అభ్యర్థిని ప్రకటించే అవకాశాలున్నాయని గులాబీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ టికెట్‌పై ఉత్కంఠ అలాగే కొనసాగుతోంది. కాగా ఈ టికెట్ కోసం మరో ఇద్దరు ముఖ్యనాయకులు పోటీ పడుతున్నారు. మరికొంత మంది కూడా ఆశిస్తున్నారు. ముఖ్యంగా నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలువుల మదన్‌రెడ్డి రేసులో ఉన్నారు. కొన్ని నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ టికెట్‌ను సునీతారెడ్డికి ఖరారు చేసిన సందర్భంగా ఆయనకు ఎంపీ టికెట్ ఇస్తామని బీఆర్ఎస్ అధినాయకత్వం హామీ కూడా ఇచ్చింది. అలాగే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన గాలి అనిల్‌కు కూడా ఎంపీ టికెట్ ఇస్తామనే హామీ ఇచ్చారు. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయనకు జహీరాబాద్ టికెట్ ఖరారు చేశారు. మరోవైపు తమకే కేటాయించాలని సంగారెడ్డికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు బీరయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్లో చేరిన కంఠారెడ్డి తిరుపతిరెడ్డి కూడా అధినాయకత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అధినేత కేసీఆర్ మాత్రం వంటేరు ప్రతాప్‌రెడ్డికి ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వంటేరును లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో పని చేసుకోమన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కానీ అధికారికంగా మాత్రం ప్రకటించకపోవడంతో ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే కాంగ్రెస్ అభ్య ర్థిత్వం ఒకటీ రెండు రోజుల్లో ప్రకటించే అవకాశాలున్నాయి. బీజేపీ మాత్రం వారం రోజుల క్రితమే ప్రకటించింది. ఈ టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు కేటాయించింది. ఆయన నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. అధినేతే బరిలోకి దిగుతారనే ప్రచారం? ఈ మెదక్ లోక్‌సభ స్థానం నుంచి స్వయంగా అధినేత కేసీఆరే బరిలోకి దిగే అవకాశాలు లేకపోలేదనే ప్రచారం కూడా షురూ అయింది. అందుకోసమే ఈ అభ్యర్థిత్వంపై అధికారిక ప్రకటన రాలేదనే టాక్ జోరందుకుంటోంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ గెలుచుకునే సీట్లలో మెదక్ సీటు ముందుంటుందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఏడు ఎమ్మెల్యే స్థానాల్లో ఆరు చోట్ల బీఆర్ఎస్ విజయం సాధించింది. ఒక్క మెదక్ అసెంబ్లీ స్థానం మాత్రం కాంగ్రెస్ గెలిచింది. ఈ ఎన్నికల్లో కూడా కారు జోరందుకునే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ టికెట్ విషయంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో నెలకొంది. -
కేసీఆర్ పులి కాదు.. కలుగులోకి వెళ్లాల్సిన ఎలుక: రఘునందన్‌రావు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ, నేతలపై మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా పేరు మార్చుకున్నప్పుడే తెలంగాణతో ఆ పార్టీకి పేగుబంధం తెగిపోయిందన్నారు. హరీష్ రావు రాజకీయాల్లోకి రాకముందే(1999) మెదక్ పార్లమెంట్ స్థానాన్ని బీజేపీ గెలుచుకుందని తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ సీట్లు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్, సంతోష్.. అయిదుగురు పోటీ చేయాలని సవాల్ విసురుతున్నట్లు తెలిపారు. వీరెవరు పోటీ చేసినా గెలవరని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేస్తే హుస్సేన్ సాగర్‌లో వేసినట్లేనని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబానికి వాత పెట్టడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉందన్నారు. చదవండి: జనవరి కరెంట్ బిల్లులు కట్టకండి: కేటీఆర్ కేసీఆర్‌ను కేటీఆర్ పులి అంటున్నారు. పులి జనాల్లో ఎందుకు ఉంటుంది. అడవిలో ఉంటుందనే విషయం కేటీఆర్ తెలుసుకోవాలని సెటైర్లు వేశారు. కేసీఆర్ పులి కాదు, పిల్లి అంతకన్నా కాదు. ఎలుక అంటూ ఎద్దేవా చేశారు. బయటకు వచ్చేది పులి కాదు.. కలుగులోకి వెళ్లాల్సిన ఎలుక అంటూ కేసీఆర్‌ను ఉద్ధేశించి వ్యాఖ్యలు చేశారు రఘునందన్‌రావు. ‘గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్లు అమ్ముకుంది. పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా సూట్ కేసులు ఇచ్చే వాళ్లకు టికెట్లను ఆ పార్టీ నాయకులు అమ్ముకుంటున్నారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ లాంటి వాళ్లకు టికెట్ల ఇవ్వరు. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు లోక్ సభ సీటు ఇవ్వగలరా?. బీజేపీ యేతర ముఖ్యమంత్రులు ప్రధానిని కలిసి నిధులు తెచ్చుకున్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం కొత్త సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కలిశారని గుర్తుచేశారు. గతంలో ప్రధాని మోదీ తెలంగాణ వస్తే అప్పటి సీఎం కేసీఆర్ మొహం చాటేశారు’ అని గుర్తుచేశారు. -
కాంగ్రెస్ 420 హామీలు అమలు చేసేదాకా విడిచిపెట్టం
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ పార్టీ నోటికి ఎంతొస్తే అంత అన్నట్టుగా హామీలు ఇచ్చిందని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణభవన్‌లో శుక్రవారం జరిగిన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారంటీలు కాదని, అవి 420 హామీలని మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ గుల్లయ్యిందని, రాష్ట్ర ఏర్పాటు విఫలమైందని, అబద్ధాలు మాట్లాడించారని, వాస్తవాలు ఏంటో తెలియజేసేందుకు ‘స్వేద’పత్రం విడుదల చేసినట్టు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన తెలంగాణ సమగ్ర అభివృద్ధిని గణాంకాలు, ఆధారాలతో సహా వివరించినట్టు చెప్పారు. అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని, రూ.2 లక్షల రుణం తెచ్చుకోండని పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ మాట్లాడారని గుర్తు చేశారు. కానీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రుణాలు వసూలు చేయాలని, లేకుంటే కేసులు పెట్టమని ఆదేశాలు జారీ చేశారన్నారు. వ్యవసాయ రుణాలు విడతల వారీగా మాఫీ చేస్తా మని ఇచ్చిన హామీని విస్మరించి, ముక్కుపిండి వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేయడం శోచనీయమన్నారు. ప్రియాంకాగాంధీ నిరుద్యోగ భృతి ఇస్తామని చెబితే, భట్టి విక్రమార్క అలా చెప్పలేదని హరీశ్‌రావు అడిగిన ప్రశ్నకు అసెంబ్లీ సాక్షిగా అబద్ధం చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను అమలు చేసేదాకా విడిచి పెట్టేది లేదని పునరుద్ఘాటించారు. ప్రధాని, అదానీ ఒక్కటని విమర్శలు చేసిన రాహుల్‌గాందీ, రేవంత్‌రెడ్డి నేడు ఆయనతోనే ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఎద్దేవా చేశారు. రాహుల్‌గాంధీ అదానీని తిడితే, రేవంత్‌రెడ్డి అదే సమయంలో దావోస్‌లో ఒప్పందం చేసుకున్నారని, నోటికి వచ్చినట్టు మాట్లాడిన కాంగ్రెస్, బీజేపీ నాయకుల అసలు రంగు బయట పడుతున్నదన్నారు. కేసీఆర్ ఉన్నంతకాలం అదానీ ఇక్కడ అడుగు పెట్టలేదని, కానీ కాంగ్రెస్ రాగానే ఎలా వస్తున్నాడని కేటీఆర్ నిలదీశారు. ఈసారి కూడా మెదక్ మనదే ... మెదక్ లోక్‌సభ సెగ్మెంట్లో మరోసారి గులాబీ జెండా ఎగరబోతున్నదని కేటీఆర్ అన్నారు. గత ఎంపీ ఎన్నిక ల్లో హరీశ్‌రావు నాయకత్వంలో కార్యకర్తలంతా క్రియాశీలకంగా పనిచేయడంతో అత్యధిక మెజారిటీ సాధించామని, మరోసారి అది పునరావృతం కావాలన్నారు. కొందరు దు్రష్పచారం చేయడంతోనే మెదక్ పార్లమెంట్ పరిధిలో తాను ఒక్కదాన్నే ఓడిపోయానని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, ఎమ్మెల్సీలు వెంకటరామిరెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, వంటేరు ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు. పనికొచ్చే సమీక్షలు చేయడం లేదు: హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వం పనికొచ్చే సమీక్షలు చేయడం లేదని, సమీక్షల తర్వాత కేసీఆర్ ప్రభుత్వం అవినీతి చేసిందంటూ లీకులు ఇస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు మండిపడ్డారు. ఇదంతా ఓ ఆరునెలలు సాగుతుందేమో, ఆ తర్వాత చెల్లదని స్పష్టం చేశారు. ఎవరూ అధైర్య పడొద్దని, భవిష్యత్‌లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత నిజమైన మార్పు వస్తుందన్నారు. కొందరు బీఆర్ఎస్ నుంచి అధికారం కోసం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారని, చెత్త పార్టీ నుంచి వెళ్లిపోతోందని భావిద్దామని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ వారు బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, పోలీసులతో భయ భ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. పోలీస్ స్టేషన్లు, జైళ్లు, పోరాటాలు తమకు కొత్త కాదన్నారు. కార్యకర్తలకు ఏం జరిగినా, 39 మంది బీఆర్ఎస్ ఎమ్మె ల్యేలు బస్సు వేసుకుని భాదితుల దగ్గరికి వచ్చి అండగా ఉంటారన్నారు. రైతు బంధు విషయంలో కేసీఆర్ చిత్తశుద్ధిని, ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. -
కాంగ్రెస్ 420 హామీలను అమలు చేసేదాకా విడిచి పెట్టం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదని, 420 హామీలని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నోటికి ఎంత వస్తే అంత అనుకుంటూ హామీలు ఇచ్చారని, అందుకే 420 హామీలను అమలు చేసేదాకా విడిచి పెట్టామని తెలిపారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు పాల్గొని బీఆర్ఎస్ నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రధాని, అదానీ ఒక్కటని విమర్శలు చేసిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నేడు ఆయనతోనే ఒప్పందాలు కుదుర్చుకున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ నిన్ననే అదానీని తిడితే, రేవంత్ రెడ్డి అదే సమయంలో దావోస్‌లో ఒప్పందం చేసుకున్నారని వ్యంగ్యస్త్రాలు సంధించారు. . కేసీఆర్ ఉన్నంత కాలం అదానీ ఇక్కడ అడుగు పెట్టలేదు. కానీ కాంగ్రెస్ రాగానే ఎలా అడుగు పెడుతున్నాడని కేటీఆర్ నిలదీశారు. నోటికి వచ్చినట్లు మాట్లాడిన కాంగ్రెస్, బీజేపీ నాయకుల అసలు రంగు బయట పడుతుందన్నారు. ‘గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ గుళ్ళ అయ్యిందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విఫలం అయ్యిందని అబద్ధాలు మాట్లాడించారు. అందుకే స్వేద పత్రం విడుదల చేశాం. తెలంగాణ సమగ్ర అభివృద్ధిని పొందుపరిచాం. గణాంకాలు, ఆధారాలతో సహా వివరించాం. అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తా.. రూ. 2 లక్షల రుణం తెచ్చుకోండి అని పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ మాట్లాడారు. తుమ్మల నాగేశ్వర్ రావు రుణాలు వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. లేకుంటే కేసులు పెట్టండి అని అంటున్నాడు. పత్రికల్లో కూడా వచ్చింది. ప్రియాంక గాంధీ నిరుద్యోగ భృతి ఇస్తామని చెబితే, భట్టి విక్రమార్క భృతి ఇస్తామని చెప్పలేదని హరీష్ రావు అడిగిన ప్రశ్నకు అసెంబ్లీ సాక్షిగా అబద్దం చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెస్తామని హామీ ఇచ్చారు కానీ అది సాధ్యం కాదని మొన్న స్పష్టమైంది. కేసీఆర్, హరీశ్ రావు నాయకత్వంలో కార్యకర్తలంతా క్రియాశీలకంగా పని చేయడంతో గత ఎంపీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించాం. ఈ సారి కూడా మెదక్‌లో గులాబీ జెండా ఎగరబోతున్నది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. గత పదేళ్ళలో తెలంగాణ తరుపున గళం విప్పింది మన బీఆర్ఎస్ ఎంపీలు అనే విషయం మరచి పోవద్దు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. మన బలం, మన గళం, మన గులాబీ జెండా పార్లమెంట్లో ఉండాలి. లేకుంటే తెలంగాణ ప్రయోజనాలకు నష్టం జరుగుతుందని. ఇదే విషయం ప్రజలకు చెప్పాలి. నిరాశ వీడాలి. బయటికి రావాలి’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కేటీఆర్‌తోపాటు మాజీ మంత్రులు హరీష్ రావు, సునీతా లక్ష్మా రెడ్డి, కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ లు పోచారం శ్రీనివాస్ రెడ్డి, మధుసూధనాచారి, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్చార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు. మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారి ప్రసంగం ముఖ్యాంశాలు. గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ గుళ్ళ అయ్యిందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విఫలం అయ్యిందని అబద్ధాలు మాట్లాడించారు. అందుకే స్వేద పత్రం విడుదల చేశాం. తెలంగాణ సమగ్ర అభివృద్ధిని… pic.twitter.com/T5oUTyWAAP — BRS Party (@BRSparty) January 19, 2024 -
ఓట్ల పండుగ.. జనం నిండుగ
సాక్షి,మెదక్: మెదక్ నియోజకవర్గంలో గురువారం జరిగిన లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కొన్ని చోట్ల సాంకేతిక లోపంతో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. 273 పోలింగ్ కేంద్రాల్లో 72.84 శాతం పోలింగ్ జరిగింది. ఇందులో చిన్నశంకరంపేట మండలంలో 75 శాతం పోలింగ్ నమోదై నియోజకవర్గంలోనే ముందంజలో ఉంది. ఇక చిన్నశంకరంపేట మండలంలో 75 శాతం పోలింగ్ కాగా రామాయంపేట మండలంలో 73.76 శాతం, నిజాంపేటలో 69.49 శాతం, పాపన్నపేట మండలంలో 71.46 శాతం, రేగోడ్ మండలంలో 66 శాతం, పెద్దశంకరంపేట మండలంలో 69 శాతం, టేక్మాల్ మండలంలో 68.33 శాతం పోలింగ్ నమోదైంది. మెదక్ మున్సిపాలిటీ: మెదక్ పట్టణంలో గురువారం జరిగిన పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పట్టణంలోని 27 వార్డుల్లో మొత్తం 33 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలనుంచి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఓటింగ్‌లో యువకులు, వృద్ధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సందర్శించి ఓటింగ్ సరళిన అడిగి తెలుసుకున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలను ఆకట్టుకునేందుకు బెలూన్ల తోరణాలతో అందంగా ముస్తాబు చేశారు. నవాబుపేటలో మెదక్ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, ఆయన సతీమణి గాయత్రి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే వైస్‌చైర్మన్ రాగి అశోక్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న యువకులు సెల్పీలు దిగుతూ సందడి చేశారు. శభాష్ పోలీస్ పార్లమెంట్ ఎన్నికల నేపధ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తుగా నిర్వహించిన పలువురు కానిస్టేబుళ్లు తమ సేవా ధృక్పదాన్ని చూపి పలువురి చేత శభాష్ పోలీస్ అనిపించుకున్నారు. ఓ వైపు విధులు నిర్వహిస్తూనే కేంద్రాలకు వచ్చిన వృద్ధులకు, వికలాంగులను సేవలందించారు. నడవలేని వికలాంగులు, వృద్ధులను ఎత్తుకొని పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లారు. మహిళల కోసం వెయింటింగ్ హల్.. చిన్నశంకరంపేట(మెదక్): ఓటు వేసేందుకు గంటల తరబడి క్యూలో నిలబడాలి. అయితే ఓ గ్రామ సేవకుడి ఐడియా మహిళలకు క్యూౖలో నిలబడె శ్రమను తప్పించింది. మండలంలోని మడూర్‌లోని ఓ పాఠశాలలో పోలింగ్ కేంద్రం ఏర్పాటుచేశారు. ఓటు వేసేందుకు వచ్చిన వారి కోసం వెయింట్ హాల్ ఏర్పాటుచేశారు. దీంతో ఎండలో వచ్చినవారు వెయింట్ హాల్ కూర్చొని సేదతీరారు. గ్రామ సేవకుడు యాదగిరిని పలువురు అభినందించారు. -
యువకులే ‘విజయ వికారి’లు
మెదక్ లోకసభ నియోజకవర్గంలో కొత్త ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. తెలుగు నూతన సంవత్సరం వికారినామ సంవత్సరంలో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల విజయంలో యువ ఓటర్లే కీలకం కానున్నారు. గెలుపోటముల నిర్ణేతలు 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులే కావడం గమనార్హం. సాక్షి, దుబ్బాక టౌన్: మెదక్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఏడు సెగ్మెంట్ల పరధిలో కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్ల జాబితాలో యువతుల కంటే యువకుల ఓట్లే అధికంగా ఉన్నాయి. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు కొత్త ఓటర్లుగా నమోదయ్యారు. ఇందులో అన్ని నియోజకవర్గాల్లోను యువతుల ఓట్లు తక్కువగా ఉండగా యువకుల ఓట్లు అత్యధికంగా ఉన్నాయి. దుబ్బాక నియోజకవర్గంలో కొత్త ఓటర్లలో 2,938 మంది పురుషులు ఉంటే కేవలం 1,937 మంది యువతులు ఉన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో 2,810 పురుషులు, 2,277 మంది మహిళలు, ఇతరులు 1, నర్సాపూర్ నియోజకవర్గంలో 3,011 పురుషులు, 2,378 మంది మహిళలు, మెదక్ నియోజకవర్గంలో 3,082 మంది పురుషులు, 2,380 మహిళలు, సంగారెడ్డి నియోజకవర్గంలో 3,191 పురుషులు, 2,378 మహిళలు, గజ్వేల్ నియోజకవర్గంలో 3,779 పురుషులు, 2,566 మహిళలు, ఇతరులు 1, పటాన్చెరు నియోజకవర్గంలో 3,410 పురుషులు, 2,715 మహిళలు, ఇతరులు 2గా కొత్త ఓటర్లుగా నమోదయ్యారు. మొత్తం మెదక్ లోక్‌సభ పరిధిలో 38,648 మంది ఓటర్లకు గాను 22,221 మంది పురుషులు, 16,422 మంది మహిళలు, ఇతరులు 5 మంది ఉన్నారు. కొత్త ఓటర్లలో పురుషుల కంటే 5,799 మంది మహిళా ఓటర్లు తక్కువగా ఉండటం శోచనీయం. యువకుల ఓట్లే అధికం మెదక్ లోక్‌సభ పరిధిలో ఉన్న దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్చెరు నియోజకవర్గాల్లోను కొత్త ఓటర్లు ఘననీయంగా పెరిగారు. ఓటర్ల తుది జాబితాలో కొత్త ఓటర్లు 88,219 మంది పెరగగా ఇందులో యువ ఓటర్లు అత్యధికంగా ఉండటం విశేషం. కొత్తగా 38,648 మంది 18 ఏళ్లు నిండిన యువత కొత్త ఓటర్లుగా నమోదయ్యారు. కొత్తగా ఓటుహక్కు పొందిన వారు మొదటి ఓటు వేసేందుకు సంతోషంగా ఎదురుచూస్తున్నారు. 16,02,947 ఓటర్లు మెదక్ లోక్‌సభ పరిధిలో తాజాగా ప్రకటించిన జాబితా ప్రకారం మొత్తం 16,02,947 ఓటర్లు ఉన్నారు. గతంలో 15,14,728 మంది ఓటర్లు ఉండేవారు. అంటే 88,219 మంది ఓట్లు పెరిగాయి. వీరిలో 38,648 మంది 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్లు ఉండడం విశేషం. యువ ఓటర్లు పట్టం కట్లేదెవరికో..? పెరిగిన యువ ఓటర్లు గెలుపు, ఓటముల్లో కీలకంగా మారనున్నారు. మెదక్ లోక్‌సభ పరిధిలో 88,219 కొత్త ఓటర్లు పెరగగా వీరిలో 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్లు 38,648 మంది ఉండటంతో ఎంపీగా ఎవరికి వారు పట్టం కడతారో చూడాలి మరి.. గజ్వేల్ అత్యధికం.. దుబ్బాకలో అత్యల్పం మెదక్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లోను కొత్త ఓటర్లు భారీగా పెరిగారు. లోక్‌సభ పరిధిలోని గజ్వేల్ నియోజకవర్గంలో అత్యధికంగా 6,346 మంది కొత్త ఓటర్లు, అత్యల్పంగా దుబ్బాక నియోజకవర్గంలో 4,875 మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు. అలాగే సిద్దిపేట నియోజకవర్గంలో 5086 మంది, మెదక్ నియోజకవర్గంలో 5403 మంది ఓటర్లు, నర్సాపూర్‌లో 5,180 మంది, సంగారెడ్డి నియోజకవర్గంలో 5,569 మంది ఓటర్లు, పటాన్చెరు నియోజకవర్గం పరిధిలో 6,127 మంది కొత్త ఓటర్లుగా నమోదయ్యారు. -
కాంగ్రెస్ గల్లీలో లేదు.. ఢిల్లీలో లేదు
పాపన్నపేట(మెదక్)/మెదక్ మున్సిపాలిటీ: కాంగ్రెస్ .. గల్లీలో లేదు. ఢిల్లీలో లేదు.. అలాంటి పార్టీకి ఓటేస్తే పనికి రాకుండా పోతుంది’అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సోమవారం ఆయన మెదక్ జిల్లా పాపన్నపేటలో నిర్వహించిన రోడ్‌షోలో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలసి పాల్గొన్నారు. మెదక్ పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో ఉన్న రైతు ఆత్మహత్యలు ఇప్పుడున్నాయా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌పార్టీలో లీడర్లు ఎక్కువ.. కార్యకర్తలు తక్కువ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో అవినీతి పేరుకు పోయిందని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారని అన్నారు. టీఆర్ఎస్ తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ అని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పథకాలను అటు మోదీ.. ఇటు చంద్రబాబు, మరోవైపు మమతా బెనర్జీ కాపీ కొడుతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు రెండు కళ్ల లాంటివని పేర్కొన్నారు. రాష్ట్రంలో సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి దాకా మనమే ఉన్నామని, ఢిల్లీలో కాంగ్రెస్‌పార్టీ వచ్చేది లేదు.. సచ్చేది లేదని అన్నారు. రాహుల్ గాంధీ ప్రచారానికి వస్తే సభల్లో కుర్చీలన్నీ ఖాళీగానే ఉన్నాయన్నారు. బీజేపీ పువ్వు వాసన అసలే లేదన్నారు. ఈ కార్యక్రమాల్లో కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సొంతూరుకి ఎంపీ
దోమకొండ(నిజామాబాద్): తాను పుట్టి పెరిగిన గ్రామంలో మెదక్ ఎంపీ కొత్తా ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. వివరాలు... ఎంపీ సొంతూరు అయిన నిజామాద్ జిల్లా దోమకొండ మండలం తుజాల్పూర్ గ్రామంలో ఆదివారం పాదయాత్ర నిర్వహించారు. గ్రామస్తులను కలిస సమస్యలు అడిగి తెలసుకున్నారు. అనంతరం వాటి పరిష్కారానికి అధికారులతో మాట్లాడారు. ఎంపీ ,గ్రామ అభివృద్ధికి కమిటీలు వేశారు. -
మెదక్‌లో టీఆర్ఎస్దే హవా
కొత్త ప్రభాకర్‌రెడ్డి ఘనవిజయం ప్రచారంలో విఫలమై భారీ మూల్యం చెల్లించిన కాంగ్రెస్, బీజేపీ రెండు, మూడు స్థానాలకు పరిమితం సంగారెడ్డి: మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ మరోసారి సత్తా చాటింది. ప్రతిపక్షాలను చిత్తు చేసి ఎంపీ స్థానాన్ని ఏకపక్షంగా గెలుచుకుంది. ఆ పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డిపై 3,61,288 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన బీజేపీ అభ్యర్థి తూర్పు జగ్గారెడ్డి మూడో స్థానానికి పడిపోయారు. తెలుగుదేశం పార్టీ ఆయనకు అండగా నిలిచినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. మొత్తం 14 మంది అభ్యర్థులు బరిలో నిలబడగా.. 11 మందికి డిపాజిట్లు గల్లంతయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామాతో మెదక్ స్థానానికి లోక్‌సభ ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఈ నెల 13న ఉప ఎన్నిక జరగగా, మంగళవారం ఓట్ల లెక్కింపు జరిగింది. మొత్తం 10,46,092 ఓట్లు పోలవ్వగా టీఆర్ఎస్ అభ్యర్థికి 5,71,810 ఓట్లు వచ్చాయి. 2,10,524 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి రెండో స్థానంలో, 1,86,343 ఓట్లతో బీజేపీ అభ్యర్థి మూడో స్థానంలో నిలిచారు. గత సాధారణ ఎన్నికల్లో 77.35 శాతం పోలింగ్ నమోదు కాగా, ఇక్కడ పోటీ చేసిన కేసీఆర్‌కు 3.97 లక్షల ఓట్ల మెజార్టీ వచ్చింది. అయితే ఈసారి 67.79 శాతం మాత్రమే పోలింగ్ నమోదైనప్పటికీ టీఆర్ఎస్కు ఓట్ల శాతం తగ్గకపోవడం గమనార్హం. గత ఎన్నికల్లో గులాబీ దండుకు 55 శాతం ఓట్లు రాగా.. ఈ ఉపఎన్నికలో దాన్ని స్వల్పంగా పెంచుకుని 55.2 శాతం ఓట్లను కొల్లగొట్టింది. కాగా, ఈ ఎన్నికలో ఘన విజయం సాధించిన కొత్త ప్రభాకర్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. భారీ మెజార్టీ సాధించడంలో కీలక పాత్ర పోషించిన మంత్రి హరీష్‌రావును సైతం అభినందించారు. సిద్దిపేటదే హవా.. కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆధిక్యతలో సిద్దిపేట నియోజకవర్గమే కీలకమైంది. ఇక్కడ 76,733 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థికి తిరుగులేని ఆధిక్యత దక్కింది. మొత్తం 1,35,593 ఓట్లు పోల్ కాగా.. ఇందులో 93,759 ఓట్లు టీఆర్ఎస్ పార్టీకే వచ్చాయి. ఇక నర్సాపూర్ నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్న సునీతారెడ్డి నిరాశ చెందక తప్పలేదు. నర్సాపూర్‌లో సునీతారెడ్డికి 67,267 ఓట్లు మాత్రమే రాగా... టీఆర్ఎస్కు 73,710 ఓట్లు పడ్డాయి. వెనుకబడి పోతారనుకున్న చోటే గులాబీ దండుకు 6,443 ఓట్ల ఆధిక్యత లభించడం విశేషం. ఇక సంగారెడ్డి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డికి షాక్ తగిలింది. ఇక్కడి ఓటర్లు కూడా టీఆర్ఎస్ అభ్యర్థికే అండగా నిలిచారు. ఈ నియోజకవర్గంలో 18,849 ఓట్లతో జగ్గారెడ్డి వెనుకబడ్డారు. చతికిలపడిన ప్రతిపక్షాలు రైతు రుణమాఫీపై టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత రాలేదన్న అంశాన్ని అస్త్రంగా చేసుకుని ప్రజల్లోకి వెళ్లిన ప్రతిపక్షాలు.. అధికారపార్టీపై పెద్దగా ఒత్తిడిని పెంచలేకపోయాయి. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ప్రజా సమస్యలను వదిలి వ్యక్తిగత దూషణలు అందుకోవడం కూడా వారికి నష్టం చేకూర్చింది. టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి వంటి వారు ఇంకో అడుగు ముందుకేసి బహిరంగ చర్చలతో సవాళ్లకు దిగారు. మరోవైపు మంత్రి హరీష్‌రావు ఈ వాతావరణాన్ని తనకు అనుకూలంగా మలచుకున్నారు. వ్యూహాత్మకంగా వ్యవహరించి ప్రతిపక్షాలను ఇరకాటంలో పెట్టారు. రుణమాఫీ, రైతుల ఆత్మహత్యల అంశాల జోలికి వెళ్లకుండా సవాళ్లు, ప్రతిసవాళ్లకే వాటిని పరిమితం చేశారు. సిద్దిపేట తరహా అభివృద్ధిని రాష్ర్ట మంతటికీ విస్తరిస్తామని కేసీఆర్ కూడా అభివృద్ధి అంశాన్ని తెరపైకి తెచ్చారు. మరోవైపు సిద్దిపేట అభివృద్ధిని జగ్గారెడ్డి అడ్డుకున్నాడని ఆరోపణ చేస్తూ, కాదని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని హరీష్ సవాల్ విసరడంతో బీజేపీ నేతలు పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయారు. దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో వివరణలకే పరిమితమై విలువైన సమయాన్ని వృథా చేసుకున్నారు. మొత్తానికి ప్రధాన సమస్యలపై ప్రజల్లోకి వెళ్లాల్సిన కాంగ్రెస్, బీజేపీలు అస్త్ర సన్యాసం చేసినట్టు వ్యవహరించి ఉప ఎన్నికలో విఫలమయ్యాయి. అందుకే ఓటింగ్ శాతం భారీగా పడిపోయినా టీఆర్ఎస్ మెజార్టీలో పెద్దగా తేడా రాలేదని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
భయపడలేదు.. భయపడేదీ లేదు: పొన్నాల
ఓడిపోయినంత మాత్రాన మేమెప్పుడూ భయపడలేదు, భయపడేది లేనే లేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం సాగిస్తూనే ఉంటామని ఆయన చెప్పారు. ఎన్నికల్లో ఓటమికి పీసీసీ అధ్యక్షుడిగా తానే బాధ్యత వహిస్తానన్నారు. పార్టీని బలోపేతం చేయడానికి కార్యక్రమాలు రూపొందిస్తామని చెప్పారు. మెదక్ లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పొన్నాల ఏమన్నారంటే.. ''గత సాధారణ ఎన్నికల్లో రాష్ట్రపతి పాలన ఉంది. రాజకీయ పార్టీలన్నీ పార్టీలుగానే పోటీపడ్డాయి. అప్పుడు అధికార, ప్రతిపక్షాలేమీ లేవు. ఇప్పుడు మాత్రం టీఆర్ఎస్ తెలంగాణలో, టీడీపీ ఆంధ్రలో, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నాయి. ప్రభుత్వంలో ఉన్న రెండు పార్టీలు పొత్తుపెట్టుకున్నాయి. సీపీఐ, సీపీఎం, ఎంఐఎం మూడూ కూడా అధికార పక్షమైన టీఆర్ఎస్కు పూర్తి మద్దతు పలికాయి. వాళ్ల విధానాలను వ్యతిరేకిస్తూనే పోటీ మాత్రం పెట్టలేదు. అంటే గతంలో ఏకపార్టీగా ఉన్న టీఆర్ఎస్కు ఇప్పుడు మూడు పార్టీలు మద్దతు తెలిపాయి. పార్లమెంటు పరిధిలో బలమైన మాదిగ సామాజికవర్గం ఈసారి బీజేపీకి మద్దతు పలికింది. టీడీపీ-బీజేపీ అధికారపక్షాలై ఉండి, వాళ్ల మద్దతు ఉన్నా కూడా కాంగ్రెస్ కంటే వెనకబడ్డారు. గత మూడుసార్లుగా ఈ నియోజకవర్గం టీఆర్ఎస్ చేతిలో ఉంది. ఎమ్మెల్యేలు, మంత్రులు అంతా ఇక్కడ ప్రచారంలో ఉన్నారు. అధికారబలం, అంగబలం, అర్థబలం ఎన్నికల్లో పనిచేస్తాయి. ఇది నగ్నసత్యం. ఈ పరిస్థితిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే గట్టిపోటీ ఇవ్వగలిగింది. ప్రజలపక్షాన తన వాదన వినిపించింది'' అని ఆయన చెప్పారు. -
వాళ్లు దిక్కుమాలిన ప్రయత్నాలు చేశారు
ప్రతి చిన్న విషయంలో తమను తప్పుబట్టే దిక్కుమాలిన ప్రయత్నాలను కొన్ని విపక్షాలు చేశాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మెదక్ లోక్‌సభా స్థానం ఉపఎన్నికలో విజయం సాధించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ''ప్రజలకిచ్చిన ప్రతి మాటా నెరవేరుస్తామని హామీ ఇస్తున్నాను. జిల్లా మంత్రి, ఈ ఎన్నికల ప్రచార సారథి హరీశ్ రావుకు, అదే నియోజకవర్గానికి చెందిన డిప్యూటీ స్పీకర్, అక్కడకు వెళ్లి పనిచేసిన రాజయ్య గారికి, గౌరవ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు. కార్యకర్తల బలం, కృషి వల్లే ఇది సాధ్యమైంది. మాకు పూర్తి మద్దతు తెలిపిన సీపీఐ, సీపీఎంలకు కృతజ్ఞతలు. ఈ ఎన్నికల్లో తేలిన అంశాలు కొన్ని ఉన్నాయి. చాలా చాలా అతిమాటలు కూడా విన్నాం. ప్రభుత్వం ఏర్పడి ఇంకా కొద్ది కాలమే అయినా, పీసీసీ అధ్యక్షుడు పొన్నాల, టీడీపీ, బీజేపీ నాయకులు అతి మాటలు మాట్లాడారు. ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్పారు. టీడీపీతో జతకట్టినందుకు బీజేపీకి కూడా బుద్ధి చెప్పారు. చావుతప్పి కన్ను లొట్టబోయినట్లు డిపాజిట్ మాత్రం దక్కించుకున్నారు. ప్రతి విషయంలో తప్పుబట్టే దిక్కుమాలిన ప్రయత్నం చేశారు. బాధ్యత లేకుండా ప్రభుత్వం ప్రతి విధానాన్నీ తప్పుబట్టేలా గోబెల్స్ ప్రచారం చేశారు. దాన్ని ప్రజలు తిప్పికొట్టారు. సర్వే అంటే, దుష్ప్రచారం. ఇంజనీరింగ్ కళాశాలల మీద చర్య, పేకాట క్లబ్బుల రద్దు, గృహనిర్మాణాల్లో అక్రమాల మీద విచారణ, జిల్లాల పునర్వ్యవస్థీకరణ.. ఇలా ఏది మాట్లాడినా దాంట్లో తప్పులు తీసి ప్రచారం చేయబోతే ప్రజలు చావుదెబ్బ కొట్టారు. మీ అతితెలివి పనికిరాదని చెప్పారు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని కోరుతున్నాం. వాటిని మేం స్వాగతిస్తాం. కానీ అనవసరంగా ప్రతి విషయంలో కోడిగుడ్డు మీద ఈకలు పీకితే మీకే బూమెరాంగ్ అవుతుంది. అమరుల త్యాగఫలితంగా తెలంగాణ ఏర్పడింది. అడ్డదిడ్డంగా పనిచేస్తే కుదరదు. కొంత టైం తీసుకుని పూర్తిగా పరిస్థితులను అర్థం చేసుకుని పనులు చేస్తాం. నిజం చెప్పాలంటే కేసీఆర్ మార్కు పాలన, టీఆర్ఎస్ మార్కు పాలన ఇంకా తెలంగాణలో ప్రారంభం కాలేదు. మేమింకా మా పని మొదలుపెట్టలేదు. మా ఎజెండా సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాం. దసరా నుంచి పథకాలు ప్రారంభం అవుతాయి. పెన్షన్లు, ఇళ్ల నిర్మాణాలు.. ఇలా అన్నింటిపై దసరా, దీపావళి మధ్య చాలా ఉత్తర్వులు జారీచేస్తాం. మా తల తెగిపడ్డా.. మాట ఇచ్చామంటే అమలుచేస్తాం తప్ప వెనక్కి పోయే పరిస్థితి లేదు'' అని ఆయన చెప్పారు. -
కాంగ్రెస్, బీజేపీలకు గట్టి ఝలక్కే ఇచ్చారు
మెదక్ : తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన కాంగ్రెస్, బీజేపీలకు మెదక్ లోక్ సభ ఉప ఎన్నికల్లో ఓటర్లు గట్టి ఝలక్కే ఇచ్చారు. తాము ఇంకా కారు దిగి రాలేదని ఓటు ద్వారా స్పష్టం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి 2 లక్షల 10 వేల 523 ఓట్లు దక్కాయి. ఇక బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డికి లక్షా 86వేల 334 ఓట్లు పోలయ్యాయి. ఘోరంగా ఓటిపోయినా డిపాజిట్లు దక్కడంతో ఇద్దరు నేతలూ ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు మెదక్ లోక్‌సభ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి భారీ ఆధిక్యంతో గెలుపొందిన విషయం తెలిసిందే. 3 లక్షల 61 వేల 277 ఓట్లతో కొత్త ప్రభాకర్‌రెడ్డి ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నారు. టీఆర్ఎస్కు మొత్తం 5లక్షల 71వేల 800 ఓట్లతో ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 3 లక్షల 97 వేల,029 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. -
గోల్కొండలో జాతీయజెండా ఎగరేస్తాం: కిషన్‌రెడ్డి
మెదక్ లోక్‌సభా స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో తమ బలాన్ని తాము నిలబెట్టుకున్నామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలు వచ్చిన అనంతరం ఆయన ఆ అంశంపై స్పందించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని మండిపడ్డారు. ''సాయుధ పోరాటంలో పాల్గొన్నవారికి పెన్షన్లు ఆపేస్తారా? మా నిజాం రాజు తరతరాల బూజు అన్న దాశరథి మాటలను కేసీఆర్ ఖండిస్తారా? సెప్టెంబర్ 17ను ఎందుకు గుర్తించడంలేదు?'' అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఎంఐఎం ఒత్తిడితో చరిత్రను కాలగర్భంలోకి నెట్టేస్తున్నారని విమర్శించారు. తాము రేపు గోల్కొండలో జాతీయ జెండా ఎగరేస్తామని చెప్పారు. -
ఉపపోరులో 67.79 శాతం పోలింగ్
సాక్షి, సంగారెడ్డి: మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికలో 67.79 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు ఆదివారం వెల్లడించారు. శనివారం సాయంత్రం 65.74 శాతం పోలింగ్ నమోదైనట్లు ప్రకటించిన విషయం విదితమే. ఏడు నియోజకవర్గాల్లో మొత్తం 67.79 శాతం పోలింగ్ నమోదైంది. నర్సాపూర్ నియోజకవర్గంలో అత్యధికంగా 78.44 శాతం, పటాన్చెరు నియోజకవర్గంలో అత్యల్పంగా 54.57 శాతం పోలింగ్ నమోదైంది. మెదక్ లోక్‌సభ పరిధిలో మొత్తం 15,43,075 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 10,46,080 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 4,96,995 మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తగ్గింది. అర్బన్ ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొనేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. ముఖ్యంగా పటాన్చెరు, సంగారెడ్డి, సిద్దిపేట నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం బాగా తగ్గింది. గత సాధారణ ఎన్నికల్లో 77.35 శాతం పోలింగ్ కాగా, ప్రస్తుతం 67.79 శాతం జరిగింది. అంటే 9.56 శాతం మేర తగ్గింది. ఓటింగ్ శాతం తగ్గడం అభ్యర్థుల మెజార్టీపైనా ప్రభావం చూపనుంది. ఇదిలా ఉంటే ఓటింగ్ శాతాన్ని కచ్చితంగా ప్రకటించడంతో జిల్లా అధికారులు విఫలమవుతున్నారు. శనివారం పోలింగ్ ముగిసిన అనంతరం 65.74 శాతం జరిగినట్టు ప్రకటించారు. అయితే మర్నాడు అధికారులు వెల్లడించిన వివరాలతో పోలిస్తే ఓటింగ్ శాతంలో వ్యత్యాసం ఉంది. గత సాధారణ ఎన్నికల్లో సైతం అధికారులు మొదట 88 శాతమని, ఆ తర్వాత 77 శాతం పోలింగ్ జరిగినట్లు ప్రకటించారు. మొత్తంగా ఎన్నికల సమయంలో ఓటింగ్ శాతాన్ని కచ్చితంగా గణించటంలో అధికారులు విఫలమవుతున్నారు. ఎన్నికల అధికారుల మధ్య సమన్వయం లోపించటం వల్లే ఇలా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే వందశాతం పోలింగ్ సాధించటంలోనూ అధికారులు విఫలమయ్యారు. ఎన్నికలకు ముందు వందశాతం ఓటింగ్ సాధన కోసం అధికారులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించినప్పటికీ అది సత్ఫలితాలను ఇవ్వలేకపోయాయి. ఉద్యోగులు, అక్షరాస్యులు అధికంగా ఉండే పటాన్చెరు, సంగారెడ్డి ప్రాంతంలో అతి తక్కువ శాతం నమోదుకావటం అధికారుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఓటింగ్ శాతం తగ్గటానికి గల కారణాలను విశ్లేషించాల్సిందిగా కలెక్టర్ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. -
మెదక్‌లో తగ్గిన పోలింగ్
ఉప ఎన్నిక ప్రశాంతం... 65.74 శాతం పోలింగ్ నమోదు సాధారణ ఎన్నికల్లో పోలైన 77.35 శాతం కంటే 11.4 శాతం తక్కువ అత్యధికంగా నర్సాపూర్‌లో 77%.. తక్కువగా పటాన్చెరులో 52 శాతం ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామ అసెంబ్లీ ఉప ఎన్నికలో 67.5% పోలింగ్ సాక్షి, హైదరాబాద్, సంగారెడ్డి: మెదక్ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికలో పోలింగ్ శాతం భారీగా తగ్గింది. సాధారణ ఎన్నికల్లో ఇక్కడ 77.35 శాతం పోలింగ్ నమోదుకాగా... శనివారం జరిగిన ఉప ఎన్నికలో 11.4% తగ్గిపోయి 65.74 శాతమే నమోదైంది. మొత్తంగా మెదక్ లోక్‌సభ స్థానంతో పాటు ఏపీలోని నందిగామ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాం తంగా ముగిసింది. రైతులు, మహిళలు, వలస జీవులు దూరంగా ఉండటం వల్లే మెదక్ లోక్‌సభ స్థానంలో పోలింగ్ పడిపోయినట్లు అధికారుల అంచనా. అత్యధికంగా నర్సాపూర్ నియోజకవర్గంలో 77%, అత్యల్పంగా పటాన్చెరు నియోజకవర్గంలో 52% పోలింగ్ నమోదైంది. టీఆర్ఎస్ ప్రభావం ఎక్కువగా ఉన్న సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం భారీగా తగ్గటం టీఆర్ఎస్ శ్రేణులను కొంత ఆందోళనకు గురి చేస్తోంది. ఓటర్లు ఆసక్తి చూపలేదు: భన్వర్‌లాల్ నందిగామ అసెంబ్లీ, మెదక్ ఎంపీ స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగి శాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ వెల్లడించారు. ఆయన శనివారం రాత్రి సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదని, రీ పోలింగ్ ప్రస్తావన కూడా లేదన్నారు. ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం ఆశాజనకంగా లేదని, ఇరు ప్రాంతాల్లోని పట్టణ ప్రాంత ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపలేదని పేర్కొన్నారు. మెదక్ లోక్‌సభ స్థానం పరిధిలో అక్రమంగా తరలిస్తున్న రూ. కోటి, నందిగామలో రూ. 60 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు 16న ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. మెదక్ స్థానానికి హైదరాబాద్‌లోని గీతం వర్సిటీలో, నందిగామకు అదే ప్రాంతంలోని కేవీఆర్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. ఓటు వేసిన కేసీఆర్ దంపతులు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు తన స్వగ్రామం సిద్దిపేట మండలం చింతమడకలో తన సతీమణి శోభతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో అక్కడికి తరలివచ్చి కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికారు. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం: బీజేపీ మెదక్ పార్లమెంటు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని బీజేపీ ఆరోపించింది. అసెంబ్లీ నియోజకవర్గానికో మంత్రి, గ్రామానికో ఎమ్మెల్యే చొప్పున ఉండి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.ఆచారి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
చప్పగా... సాఫీగా..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మెదక్ లోక్‌సభ ఉప ఎన్నిక చప్పగా.. ప్రశాంతంగా ముగిసింది. రైతులు, మహిళలు ఓటు వేయడానికి పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో, గ్రామాల్లో ఎన్నికల సందడి కనిపించలేదు. ఓటింగ్ శాతం తగ్గినా కారు జోరు మాత్రం తగ్గలేదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. రుణ మాఫీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు ముభావం ప్రకటించినా.. వ్యతిరేక ఓటు మాత్రం వేయలేదని వారు విశ్లేషిస్తున్నారు. ఉప ఎన్నికలో 65.74 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. ‘అయితే ఇది ఉజ్జాయింపు మాత్రమేనని, ఖచ్చితమైన లెక్కలు తీసుకుంటే పోలింగ్ 60 శాతానికి మించి ఉండకపోవచ్చ’ని ఎన్నికల అధికారి ఒకరు ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు. గత సాధారణ ఎన్నికల్లో పోలింగ్ రోజున 82 శాతం పోలింగ్ నమోదైందని ప్రకటించగా, ఈ తర్వాత లెక్కల్లో 77.35 శాతం అని తేలిందని, ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుందని వారు వివరించారు. శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైనా దాదాపు 9 గంటల వరకు ఓటర్లు లేక పోలింగ్ కేంద్రాలు బోసిపోయి కనిపించాయి. పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. మొదటి రెండు గంటల్లో కేవలం 7.5 శాతం మాత్రమే పోలింగ్ నమోదు కావడం గమనార్హం. అత్యధికంగా నర్సాపూర్ నియోజకవర్గంలో 77 శాతం, అత్యల్పంగా పటాన్చెరు నియోజకవర్గంలో 52 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ బొజ్జా ప్రకటించారు. రామాయంపేట మండలం శివ్వాయపల్లిలో 96 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. ఇదిలా ఉండగా అక్కడక్కడా ఈవీఎంలు మొరాయించినప్పటికీ అది పెద్ద సమస్య కాలేదు. 30 నిమిషాల వ్యవధిలో అధికారులు తిరిగి కొత్త మిషన్లను తెచ్చిపెట్టారు. కాగా, ఎన్నికలను టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రుణమాఫీపై ప్రభుత్వ స్పష్టత ఇవ్వకపోవడం, అన్నదాత ఆత్మహత్యల పరంపర నేపథ్యంలో మెతుకుసీమ రైతన్న కాస్త ముభావాన్ని ప్రదర్శించారు. సర్కారు మీద అసంత ృప్తిని వ్యక్తం చేస్తూ ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. అధిక శాతం మహిళలు ఓటు వేయడానికి ఆసక్తి చూపలేదు. సమగ్ర సర్వే ప్రభావం.. గత నెల 19న నిర్వహించిన సమగ్ర సర్వే ప్రత్యక్షంగా, పరోక్షంగా పోలింగ్ మీద ప్రభావం చూపించింది. ఈ సర్వే కోసం వలస జీవులు, ఉద్యోగులు, యువకులు పిల్లా పాపలతో కలిసి ఊళ్లకు వచ్చారు. అందరూ ఒకేసారి కలిసిరావడం, చాలా ఏళ్ల తర్వాత బంధుమిత్రులంతా ఒకేచోట కలవడంతో రెండు రోజుల పాటు పల్లెల్లోనే గడిపారు. దీంతో ప్రతి కుటుంబం సగటున రవాణా చార్జీలు, ఇతర భత్యాలతో కలసి రూ. 4 వేల నుంచి రూ.5 వేల వరకు ఖర్చయ్యాయి. 20 రోజులు కూడా గడవకుండానే మళ్లీ ఎన్నికలు రావడంతో ప్రజలు ఓటేసేందుకు స్వగ్రామలకు రావడానికి ఇష్టపడలేదు. కాగా సర్వే ప్రభావం రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందోనని కొంతమంది ఓటర్లు భయపడుతున్న నేపథ్యంలో స్వల్పంగా బీజేపీ లాభపడ్డట్టు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. -
నేడు నందిగామ అసెంబ్లీ, మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికలు
-
మెదక్ ఉప ఎన్నిక ఏర్పాట్లు పూర్తి
సంగారెడ్డి: మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికకు శనివారం పోలింగ్ జరగనుంది. పోలింగ్‌కు అన్ని ఏర్పా ట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ బొజ్జా తెలిపారు. ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి, బీజేపీ అభ్యర్థి తూర్పు జయప్రకాశ్‌రెడ్డి మధ్యే పోటీ ఉంది. ఈ నెల 16న ఓట్ల లెక్కింపు చేపడతామన్నారు. పోలింగ్ సందర్భంగా జిల్లాలో పరిశ్రమలకు, ప్రైవేటు సంస్థలకు సెలవు ప్రకటించారు -
నిర్భయంగా ఓటు వేయండి
నేడు నందిగామ అసెంబ్లీ, మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికలు ఉభయ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలపై సీఈఓ భన్వర్‌లాల్ ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్, 16న కౌంటింగ్ ఓటర్ స్లిప్లేని వారు 11 గుర్తింపు కార్డుల్లో దేనితోనైనా ఓటేయవచ్చు మెదక్ లోక్‌సభకు 1,837 పోలింగ్ కేంద్రాలు నందిగామ అసెంబ్లీకి 200 పోలింగ్ కేంద్రాలు మెదక్‌లో మంత్రులు, ఉప సభాపతి, ఎమ్మెల్యేలు ఓటేసి వచ్చి ఇంట్లో కూర్చోవాలి ఓటర్ కాని వారు నియోజకవర్గాల్లో ఉండరాదు హైదరాబాద్: తెలంగాణలోని మెదక్ లోక్‌సభ నియోజకవర్గానికి, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా నందిగామ అసెంబ్లీ స్థానానికి శనివారం ఉప ఎన్నికలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రెండు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. శుక్రవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. గత ఎన్నికల్లో కన్నా అత్యధికంగా ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం నమోదు చేయాలని, స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు వేయాలని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు. 95 శాతం మంది ఓటర్లకు ఫొటోలతో కూడిన ఓటర్ స్లిప్‌లను పంపిణీ చేశామని, ఎవరికైనా ఫొటో ఓటర్ స్లిప్ రాకపోతే పోలింగ్ బూత్‌ల దగ్గర స్లిప్‌లు ఇచ్చే ఏర్పాటు చేశామన్నారు. ఓటర్ గుర్తింపు, ఫొటో ఓటర్ స్లిప్ లేని వారు ప్రత్యామ్నాయంగా 11 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు వేయవచ్చునని ఆయన వివరించారు. మెదక్ లోక్‌సభ స్థానంలో 15,43,700 మంది ఓటు హక్కు విని యోగించుకోవడానికి 1,837 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో 1,141 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సరళిని లైవ్ వెబ్ కాస్టింగ్ చేస్తున్నామన్నారు. మండల, జిల్లా కలెక్టర్ల కార్యాలయంలో అభ్యర్థులు, ప్రజలు పోలిం గ్ సరళిని లైవ్‌లో చూడవచ్చునని ఆయన తెలి పారు. నందిగామ అసెంబ్లీ స్థానంలో 1,84,061 మంది ఓటర్లు ఉన్నారని, వారికి 200 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పా రు. ఇందులో 129 పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ చేస్తున్నామన్నారు. మెదక్‌లో కేంద్ర ఎన్నికల సంఘం నలుగురు పరిశీలకులను, నందిగామలో ఇద్దరు పరిశీలకులను నియమిం చిందన్నారు. గత ఎన్నికల్లో ఏర్పాటు చేసిన చోటే ఇప్పుడు పోలింగ్ కేంద్రాలున్నాయని ఆయన తెలిపారు. గత ఎన్నికల్లో మెదక్ లోక్‌సభ స్థానంలో 77 శాతం, నందిగామ అసెంబ్లీ స్థానంలో 85 శాతం పోలింగ్ జరిగిందని, ఇప్పు డు అంతకు మించి పోలింగ్ జరుగుతుందని భన్వర్‌లాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. పోలింగ్ భద్రతకు 19 కేంద్ర సాయుధ పోలీసు కంపెనీల ను ఏర్పాటు చేశామని, అలాగే 11,000 మంది పోలీసు, పోలింగ్ సిబ్బందిని వినియోగిస్తున్నామన్నారు. ఓటు వేయడంలో ఎటువంటి సమస్యలు వచ్చినా 1950 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యా దు చేయవచ్చన్నారు. మెదక్ లోక్‌సభ పరిధిలో ఒక మంత్రి, ఉపసభాపతి, నలుగురు ఎమ్మెల్యేలున్నారని, శనివారం వారు ఓటు వేసి వచ్చి ఇంట్లో కూర్చోవాలని, బయట తిరగడానికి వీల్లేదని ఆయన స్పష్టం చేశారు. ఓటర్లు కాని వారు ఎవరూ ఆయా నియోజకవర్గాల పరిధిలో ఉండరాదని ఆయన చెప్పారు. డబ్బు, మద్యం పంపిణీని అరికట్టేందుకు గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు. మెదక్ లోక్‌సభ పరిధిలో కోటి రూపాయలు, నందిగామలో 27.30 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. కర్ణాటక సరిహద్దుల్లో చెక్‌పోస్టును ఏర్పాటు చేశామన్నారు. ఓటర్ గుర్తింపు కార్డు లేని వారు ఇలా.. ఓటర్ గుర్తింపు కార్డు లేని వారు ఈ కార్డుల్లో దేనితోనైనా వెళ్లి ఓటు వేయవచ్చు. పాస్‌పోర్టు, డ్రైవింగ్ లెసైన్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గుర్తింపు కార్డు, బ్యాంకు, పోస్టాఫీస్ పాసు పుస్తకం, పాన్ కార్డు, ఆధార్ కార్డు, స్మార్ట్ కార్డు, ఉపాధి హామీ కార్డు, కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా కార్డు, పెన్షన్ డాక్యుమెంట్, ఫొటోతో కూడిన ఓటర్ స్లిప్. -
ఓటరు చూపెటో?
సాక్షి, సంగారెడ్డి: మెదక్ లోక్‌సభ స్థానానికి శనివారం జరగనున్న ఉప పోరులో ఓటరు తన తీర్పు ఇవ్వనున్నాడు. ఈ మేర కు రెండు వారాలుగా పలు రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేశాయి. 14 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలు విజయమే లక్ష్యంగా శ్రమించాయి. శనివారం ఎన్నికలు జరగనుండటంతో ఓటరు దేవుడు ఎటువైపు మొగ్గు చూపుతాడోనన్న ఉత్కంఠ ఆయా పార్టీల్లో నెలకొంది. మెదక్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో మొత్తం 15,43,075 మంది ఓటర్లు ఉండగా వీరిలో 7.79 లక్షల పురుష, 7.63 లక్షల మహిళా ఓటర్లు ఉన్నారు. మెదక్, నర్సాపూర్, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో మూడు చోట్ల వీరి తీర్పు కీలకం కానుంది. సంగారెడ్డి, పటాన్చెరు, సిద్దిపేట నియోజకవర్గాల్లో మైనార్టీ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. సంగారెడ్డి, పటాన్చెరు నియోజకవర్గాల్లో స్థానికేతర ఓటర్లు ఉండటంతో స్థానికేతరులు వీరు ఎటు వైపు మొగ్గు చూపుతారోనని ప్రధాన పార్టీలు ఆరా తీస్తున్నాయి. టీడీపీ-బీజేపీలు స్థానికేతర ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు మహిళలు, మైనార్టీల ఓటర్లపై ఎక్కువగా దృష్టిపెట్టాయి. కాంగ్రెస్ పార్టీ ఆశలన్నీ సంప్రదాయ ఓటు బ్యాంకుపైనే ఉంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలతోపాటు మైనార్టీలు ఉప పోరులో తమకు అండగా నిలుస్తాయని ఆ పార్టీ భరోసాతో ఉంది. టీఆర్ఎస్ పార్టీ తమ విజయం ఖాయమని, మెజార్టీపైనే మా దృష్టి అని చెబుతోంది. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల్లో ఈ పార్టీకి పట్టు ఎక్కువగా ఉంటుంది. దీంతో మూడు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్కు మిగితా పార్టీల కంటే అధిక మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మిగితా నాలుగు నియోజకవర్గాల్లో సైతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఉద్యోగులు, మైనార్టీలు తమకు అండగా ఉంటాయని ఆ పార్టీ భావిస్తోంది. ఇదిలా ఉంటే మోడీ ప్రభావం, జగ్గారెడ్డి చరిష్మా, టీడీపీ ఓటు బ్యాంకు, యువత బలం తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. దీనికితోడు స్థానికేతర ఓటర్లు తమవైపు మొగ్గుచూపుతారని ఆ పార్టీ భావిస్తోంది. అయితే ఓటర్లు ఎటు వైపు మొగ్గుచూపుతారో చూడాల్సి ఉంది. ఓటరు ఆసక్తి చూపేనా... మెదక్ ఉప ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరుగుదలకు ఎన్నికల సంఘం పలు చర్యలు తీసుకుంది. గత ఏడాది 77.23 శాతం పోలింగ్ నమోదు కాగా ఈ దఫా పోలింగ్ శాతాన్ని పెంచేందుకు పలు కార్యక్రమాలు చేపట్టింది. ఇవి ఏ మేరకు ఫలితాన్ని ఇస్తాయో వేచి చూడాలి. శనివారం ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. గత ఎన్నికలు తెలంగాణలో తొలిసారి కావడం, కేసీఆర్ బరిలో ఉన్నందున ఓటర్లు ఓటేసేందుకు ఆసక్తి చూపారు. ప్రస్తుత ఉప ఎన్నికల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవటంపై ఈ పరిస్థితి ఉంటుందో లేదోనన్న సంశయం వ్యక్తమవుతోంది. -
మెదక్ ఎంపీ ఉప పోరు నేడే
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మెదక్ లోక్‌సభ ఉప పోరుకు సర్వం సిద్ధమైంది. శనివారం ఉదయం ఏడు నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగే పోలింగ్‌కు జిల్లా అధికార యంత్రాగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచే పోలింగ్ సిబ్బంది ఈవీఎంలను, ఇతర ఎన్నికల సామగ్రిని తీసుకుని పోలింగ్ కేంద్రాలకు వెళ్లారు. సిద్దిపేట, దుబ్బాక, పటాన్చెరు, సంగారెడ్డి, నర్సాపూర్, మెదక్, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కలిపి మొత్తం 1,817 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో 15,43,422 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త సర్కారు ఏర్పడిన మూడు నెలలకే వచ్చిన తొలి ఎన్నికలు. పైగా స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపీగా రాజీనామా చేయగా ఏర్పడిన ఖాళీ.. కనుక అన్ని ప్రధాన పార్టీలు ఉప పోరును ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నాయి. టీఆర్ఎస్ నుంచి కొత్త ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి సునీతాలక్ష్మారెడ్డి, బీజేపీ నుంచి తూర్పు జగ్గారెడ్డిలు పోటీలో ఉన్నారు. వీరితో పాటు మరో 11 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. అయితే పోటీ మాత్రం ఏకపక్షంగా ఉంటుం దని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టీఆర్ఎస్ మెజారిటీపైనే... ఉప పోరుపై జోరుగా బెట్టింగ్ జరుగుతోంది. అయితే ఈ బెట్టింగ్ గెలుపు ఓటమిలపై కాకుండా టీఆర్ఎస్ అభ్యర్థికి ఎంత మెజార్టీ వస్తుంది? రెండవ స్థానంలో ఏ పార్టీ ఉంటుంది? మిగిలిన పార్టీలకు డిపాజిట్ వస్తుందా? రాదా? అనే దానిపైనే పందేలు కాస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థికి మూడు లక్షలకు పైగా మెజార్టీ వస్తుందని భారీగా పందెం కాస్తున్నారు. కాగా ఈ నెల 16న ఓట్ల లెక్కింపు చేపడతారు. గత ఎన్నికల్లో కేసీఆర్‌కు 3.97 లక్షల ఓట్ల మెజార్టీ వచ్చింది. అయితే అప్పుడు 79 శాతం పోలింగ్ నమోదు కావటంతో అంత మెజార్టీ వచ్చింది. ఈ సారి 65 శాతం మించి పోలింగ్ నమోదు కాకపోవచ్చని అంచనా వేస్తున్నారు. మంత్రి హరీష్‌రావు ఉప ఎన్నిక కోసం ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించారని, భారీగా చేరికలు జరిగాయని, ప్రతి ఓటరు కూడా కారు గుర్తు వైపుకే మొగ్గు చూపే విధంగా ప్రచారం చేసి, పావులు కదిపారని, కనుక మెజార్టీ 3 లక్షలకు దాటిపోతుందని పందెం కడుతున్నారు. పందెం విలువ రూ. 1000 నుంచి లక్షల్లో కొనసాగుతోంది. -
చింతమడకలో ఓటేయనున్న కేసీఆర్
హైదరాబాద్: మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల పోలింగ్ సందర్భంగా సీఎం కేసీఆర్ తన స్వగ్రామమైన చింతమడకలో శనివారం ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికలు జరి గినప్పుడల్లా కేసీఆర్ తన స్వగ్రామానికి వె ళ్లి ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలసి చింతమడక వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలని నిర్ణయించారు. -
మెదక్ ఉప ఎన్నిక ప్రచారం సమాప్తం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మెదక్ లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారం గురువారం సాయంత్రంతో పరిసమాప్తమైంది. మైకులు మూగబోయాయి. శనివారం జరిగే పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మూడు ప్రధాన పార్టీలు స్టార్ క్యాంపెయినింగ్‌తో ప్రచారం చేసినా, ప్రచారం ఏకపక్షంగానే సాగిందనే చెప్పాలి. కాగా రైతు రుణమాఫీ, అన్నదాతల ఆత్మహత్యలను అస్త్రంగా చేసుకోవడంలో విపక్షాలు విఫలమయ్యాయని పరిశీలకులు భావిస్తున్నారు. మంత్రి హరీష్‌రావు వ్యూహాలు.. కాంగ్రెస్, టీడీపీ నేతలను ఆత్మరక్షణలో పడేశాయని వారు చెబుతున్నారు. టీఆర్ఎస్ నూరు రోజుల పాలన ప్రోగ్రెస్ రిపోర్టును పరిశీలిస్తే.. సంక్షేమ పథకాలు అమలు , ఫలాలను ప్రజలకు అందించడంలో కేసీఆర్ ప్రభుత్వానికి పాస్ మార్కులు రాలేదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ పాలనకు రెఫరెండంగా మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికను భావించవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. సమస్యలు వదిలేసి.. సవాల్ విసిరి రైతు రుణమాఫీ, సొంతింటి కల సాకారం హామీలతో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. గతంలో వైఎస్సార్ అధికారంలోకి రాగానే ఒకే ఒక సంతకంతో రైతు రుణాలను మాఫీ చేశారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటివరకు రుణమాఫీపై ఇప్పటికీ స్పష్టతకు రాలేదు. దీన్ని అస్త్రంగా చేసుకొని ప్రజల్లోకి వెళ్లి, అధికార టీఆర్ఎస్ మీద ఒత్తిడి తేవాల్సిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు ప్రజా సమస్యలను విస్మరించి వ్యక్తిగత ధూషణలు అందుకున్నారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డిలాంటి నాయకులు ఇంకో అడుగు ముందుకేసి బహిరంగ చర్చలు, బస్తీమే సవాల్ అంటూ తొడ చరిచి బరి గీశారు. ‘జగ్గారెడ్డి గెలిస్తే హరీష్‌రావు రాజకీయ సన్యాసానికి సిద్ధమా?’ అంటూ సవాల్ వేశారు. సరిగ్గా ఇదే అదునుకోసం ఎదురుచూస్తున్న హరీష్‌రావు అంది వచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకున్నారు. తనకు అనుకూలంగా మార్చుకున్నారు. రైతు రుణమాఫీ, ఆత్మహత్యల అంశాల మీదకు వారిని వెళ్లనివ్వకుండా సవాల్, ప్రతి సవాల్ అంశాలకే వారిని ఫిక్స్ చేస్తూ.. మీ సవాల్‌కు నేను సిద్ధమే అంటూ తన దైనశైలిలో వ్యూహం రచించారు. ఈ సవాల్ స్వీకరణతో బీజేపీ కూటమి ఆత్మరక్షణలో పడి వాస్తవ అంశాలను ప్రజలకు వివరించడంలో విఫలమైందని పరిశీలకుల వాదన. వెంటనే హరీష్‌రావు మరో అస్త్రాన్ని సంధిస్తూ... ‘సిద్ధిపేట అభివృద్ధిని జగ్గారెడ్డి అడ్డుకున్నారని ఆరోపిస్తూ, కాదని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసరడంతో బీజేపీ నేతలు పూర్తిగా డిఫెన్స్‌లో పడిపోయారనే చెప్పాలి. దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో హరీష్ ఆరోపణలకు వివరణ ఇచ్చుకుంటూ, గతాన్ని తవ్వుతూ వర్తమానం మరిచిపోయి విలువైన ఎన్నికల సమయాన్ని వృథా చేసుకున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. -
నేటితో ఎన్నికల ప్రచారానికి తెర
-
రసవత్తరంగా మెదక్ పోరు
లోక్‌సభ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ క్షేత్రస్థాయి ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్ విఫలం ప్రచారానికి నేటితో తెర సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రం ఏ ర్పడిన మూడు నెలలకే వచ్చిన మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికను మూడు ప్రధాన పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అధికార టీఆర్ఎస్ తమకు బాగా పట్టున్న సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాలపై దృష్టి సారిం చింది. వాటిలో భారీ మెజారిటీ సాధిస్తే చాలని భావిస్తోంది. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉం డటంతో పాటు తమ అభ్యర్థి జగ్గారెడ్డికి సంగారెడ్డి అసెంబ్లీ స్థానంలో ఉన్న సానుకూలతను సొమ్ము చేసుకోవాలని చూస్తోంది. కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి నర్సాపూర్ అసెంబ్లీ స్థానంపై, పార్టీ ఓటుబ్యాంకుపై ఆశలు పెట్టుకున్నారు. గురువారం సాయంత్రంతో ప్రచారానికి తెర పడనుండటంతో ఎన్నికల రంగం రసవత్తరంగా మారింది. టీఆర్ఎస్ వైపే... మూడు పార్టీలూ గట్టివారినే బరిలోకి దించినా టీఆర్ఎస్కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ‘ట్రబుల్ షూటర్’ మంత్రి హరీశ్‌రావు పర్యవేక్షణ... గ్రామీణ ప్రాంతాల్లో బలమైన కేడర్‌తో టీఆర్ఎస్ పటిష్టంగా కనిపిస్తోందని వారు అంటున్నారు. మెదక్ లోక్‌సభ స్థానం పరిధిలో.. మెదక్, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, నర్సాపూర్, పటాన్చెరు, సంగారెడ్డి అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇటీవలి సాధారణ ఎన్నికల్లో ఈ ఏడు చోట్లా టీఆర్ఎసే గెలిచింది. సిద్దిపేట, దుబ్బాక ఆ పార్టీకి కంచుకోటలే. గజ్వేల్‌లోనూ ఇటీవల టీఆర్ఎస్ పట్టు బిగించింది. మెదక్, పటాన్చెరు అసెంబ్లీ స్థానాల పరిధిలో కూడా టీఆర్ఎస్కు మెజారిటీ వచ్చే అవకాశాలున్నాయి. పటాన్‌చెరుకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డితో పాటు సునీతారెడ్డికి కుడిభుజం వంటి బాల్‌రెడ్డి, చంద్రారెడ్డి టీఆర్ఎస్లో చేరారు. ప్రచారంలో ప్రతిపక్షాలు విఫలం! రైతు రుణమాఫీపై టీఆర్ఎస్ ప్రభుత్వం స్పష్టమైన హమీ ఇవ్వకపోవడంతో రైతులు కొంత ఆగ్రహంగా ఉన్నప్పటికీ అది ప్రభుత్వ వ్యతిరేక ఓటుగా మారలేదు. పైగా దీన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో ప్రతిపక్షాలు విఫలమయ్యాయి. బీజేపీ, కాంగ్రెస్ తమతమ జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులతో ప్రచారం చేసినా అదంతా ప్రెస్మీట్లు, కార్యకర్తల సమావేశాలకే పరిమితమైంది. ఏ నాయకుడూ పల్లెల్లోకి వెళ్లి ఇంటింటి ప్రచారం చేయలేదు. పైగా అభ్యర్థులు సునీత, జగ్గారెడ్డి కూడా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లలేకపోయారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన గత 100 రోజుల్లో ఏ సంక్షేమ పథకం కూడా పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం, సీఎం కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్‌లోనే ఏడుగురు రైతులు బలవన్మరణం పాలవడం, రుణం చెల్లించాలంటూ బ్యాంకు అధికారులు రైతులను పిలిచి మరీ ఒత్తిడి చేయడం వంటివాటిని తమకు సానుకూలంగా మలచుకోలేకపోయారు. నర్సాపూర్ అసెంబ్లీ స్థానంలో గతంలో ఆమె ఓడిన సానుభూతి సునీతకు బాగానే ఉన్నా అది ఓట్లుగా మారడం అనుమానమేనంటున్నారు. ఇక జగ్గారెడ్డికి కోర్టుల చుట్టూ తిరగడంతోనే సరిపోయింది. -
హేమాహేమీలంతా ఒక్కటైన వేళ!
ఉపఎన్నికల్లో ఇంటింటికీ తిరుగుతున్న కాంగ్రెస్ నేతలు హైదరాబాద్: సాధారణ ఎన్నికల్లో ఎవరికి వారే అన్నట్టు వ్యవహరించిన తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలంతా మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల పుణ్యమా అని ఒక్కతాటిపైకి వచ్చారు. కాంగ్రెస్ అభ్యర్ధి సునీతా లక్ష్మారెడ్డి గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ పాలనను ఎండగట్టడంతోపాటు కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించే ప్రయత్నం చేస్తున్నారు. కరపత్రాలనూ ఇంటింటికీ పంచుతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత కె.జానారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్షనేత డి.శ్రీనివాస్, కేంద్ర మాజీమంత్రులు సర్వే సత్యనారాయణ, బలరాంనాయక్, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, మాజీ మంత్రులు డీకే అరుణ, జె.గీతారెడ్డి, శ్రీధర్‌బాబు, షబ్బీర్‌అలీ, చిన్నారెడ్డి, జీవన్‌రెడ్డి, రెడ్యానాయక్, రాంరెడ్డి వెంకటరెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క, ఎంపీలు నంది ఎల్లయ్య, గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాపోలు ఆనందభాస్కర్సహా తెలంగాణ కాంగ్రెస్ ప్రముఖులంతా వారంరోజులుగా ఎన్నికల ప్రచారంలో ఇంటిం టికీ తిరుగుతూ చెమటోడుస్తున్నారు. ప్రతిరోజు ఉదయం పొన్నాల, జానారెడ్డి, షబ్బీర్‌అలీ ప్రత్యేకంగా సమావేశమై ప్రచార సరళి, పార్టీ పరిస్థితిపై పోలింగ్‌బూత్‌ల వారీగా సమీక్ష నిర్వహించడంతోపాటు పార్టీ బలహీనంగా ఉన్న బూత్‌లను గుర్తించి వాటిపై ప్రత్యేకశ్రద్ధ పెట్టాలంటూ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. నిన్నటివరకు ఆర్థికవనరుల్లేక ప్రచారంలో వెనుకబడినప్పటికీ ప్రచార ఖర్చు భరించేందుకు కొందరు ముఖ్యనేతలు తాజాగా ముందుకు రావడంతో ద్వితీయ శ్రేణి నాయకులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. సవాల్‌గా తీసుకున్న హైకమాండ్: ఉపఎన్నికలను సవాల్‌గా తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం తన దూతలుగా ఏఐసీసీ కార్యదర్శులు రామచంద్ర కుంతియా, బి.కృష్ణమూర్తిలను నియమించింది. తెలంగాణలో మకాం వేసిన ఆయా నేతలు ఎప్పటికప్పుడు ఉప ఎన్నికల పరిస్థితిని హైకమాండ్‌కు తెలియజేయడంతోపాటు రాష్ట్ర నేతలకు తగిన సూచనలిస్తున్నారు. అంతేకాక వారిద్దరూ ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కాంగ్రెస్ నాయకులంతా ఏకతాటిపైకి రావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కన్పిస్తోందని మాజీమంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. -
కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్ గల్లంతే
సిద్దిపేట రూరల్ : మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్ గల్లంతు ఖాయమని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. మంగళవారం మం డలంలోని నారాయణరావుపేట గ్రామం లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారంలోకి రాగానే 43 అంశాలపై మేనిఫెస్టో అమలు చేసిన ఘనత టీఆర్ఎస్కే దక్కుతుందన్నారు. తెలంగాణకు వ్యతిరే కంగా ఉన్న బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి ప్రజలను ఓట్లు ఎలా అడుగుతారన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలో ఉండి ఏం అభివృద్ధి చేశారో ఇప్పుడు ఏం చేయడానికి ఓటు వేయమని అడుగుతున్నారో కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్, ఎంపీపీ ఎర్ర యాదయ్య, ఉపాధ్యక్షుడు శ్రీహరిగౌడ్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, గ్రామ సర్పంచ్ బాలమణి రంగాగౌడ్, ఎంపీటీసీ మునిగెల కిష్టయ్య, నాయకులు కమలాకర్‌రావు, బాలకిషన్‌రావు, శ్రీనివాస్‌రావు, నల్ల నరేందర్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, బాల్రంగరం, రవీందర్‌రెడ్డి, మేర్గు మహేష్, రాజయ్య పాల్గొన్నారు. -
13న పెయిడ్ హాలిడే
సాక్షి, హైదరాబాద్: మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నిక సందర్భంగా ఈనెల 13న పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఫ్యాక్టరీలు, వాణిజ్య సంస్థల్లో పనిచేసే కార్మికులకు పెయిడ్ హాలిడే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి చంద్రవదన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. షిఫ్టు పద్ధతిన నడిచే సంస్థల్లో పనిచేసే కార్మికులకు పోలింగ్ సమయంలో మాత్రమే ఈ సెలవు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉత్తర్వుల అమలుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కార్మికశాఖ కమిషనర్‌ను, డెరైక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ను ఆదేశించారు. -
బీజేపీ భారీ బైక్ ర్యాలీ
సంగారెడ్డి క్రైం : మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికలో భాగంగా జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో శనివారం బీజేపీ, టీడీపీ సమైక్యంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించాయి. పట్టణ శివారులోని వైకుంఠపురం నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణ ప్రధాన వీధుల గుండా పాత బస్టాండ్, కొత్త బస్టాండ్, కలెక్టరేట్, పోతిరెడ్డిపల్లి వరకు కొనసాగింది. యువత పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి తూర్పు జయప్రకాష్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి, టీడీపీ రాష్ట్ర నాయకుడు పెద్దిరెడ్డి, జిల్లా నాయకుడు మాణిక్యం తదితరులు ఓపెన్టా ప్ జీప్‌లో నిల్చుని ప్రజలకు అభివాదం చేశా రు. పోతిరెడ్డిపల్లి నుంచి కంది, చేర్యాల్, ఇస్మాయిల్‌ఖాన్‌పేట తదితర గ్రామాల్లో ఈ బైక్ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడు తూ బీజేపీని గెలిపిస్తే మెతుకుసీమ అభివృద్ధి చెందుతుందన్నారు. కేంద్రం నుంచి అధిక ని దులు జిల్లాకు మంజూరయ్యే అవకాశముం దని చెప్పారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ను గెలిపిస్తే ఉపయోగమేమీ ఉండదన్నారు. బీజేపీని గెలిపిస్తే మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రోరైల్ రప్పిస్తానని, ఇంటింటికీ మంజీరా నీరు అందించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కె.జగన్, వాసు, విష్ణువర్దన్ పాల్గొన్నారు. -
వారు అభివృద్ధి నిరోధకులు
సిద్దిపేట జోన్: మెదక్ ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న తూర్పు జయప్రకాశ్‌రెడ్డి, సునీతాలకా్ష్మరెడ్డిలు అభివృద్ధి నిరోధకులని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా తనవద్ద ఉన్నాయని ఆయన వెల్లడించారు. శనివారం ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా సిద్దిపేట పట్టణంలోని పలు వార్డుల్లో మంత్రి ఈటెల రాజేందర్‌తో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నాసర్‌పురాలో ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. సిద్దిపేట మున్సిపాలిటీలో విలీనం చేసిన ఆరు గ్రామాల అభివృద్ధి కోసం తాను ఎమ్మెల్యే హోదాలో రూ. 150 కోట్లతో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా, అప్పుడు ప్రభుత్వ విప్‌గా ఉన్న జగ్గారెడ్డి అడ్డుకున్నారన్నారు. జగ్గారెడ్డి అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి రాసిన లేఖ ఇదే నంటూ బహిరంగ సభలో ప్రజలకు చూపించారు. ఇక మంత్రి హోదాలో సునీతాలక్ష్మారెడ్డి సిద్దిపేటలో పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటును వ్యతిరేకిస్తూ అప్పటి ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చిన విషయం వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. సిద్దిపేట అభివృద్ధిని అడ్డుకున్న వారిద్దరూ నేడు సిద్దిపేట నియోజకవర్గ ప్రజలను ఓట్లు అభ్యర్థించడం ఎంతవరకు సమంజసమన్నారు. ఈ ఉప ఎన్నికల్లో వారిద్దరి డిపాజిట్లు గల్లంతు చేసి సిద్దిపేట దెబ్బ ఎలా ఉంటుందో చూపాలన్నారు. అనంతరం ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, సిద్దిపేట ప్రజలు లేనిది కేసీఆర్ లేడని, కేసీఆర్ లేనిది తెలంగాణ ఉద్యమం లేదన్నారు. మంచి ముఖ్యమంత్రిని రాష్ట్రానికి అందించిన ఘనత సిద్దిపేట నియోజకవర్గ ప్రజలకు దక్కుతుందన్నారు. ఎంత చేసిన సిద్దిపేట రుణం తాము తీర్చుకోలేమన్నారు. సమావేశంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, టీఆర్ఎస్ నాయకులు రాజనర్సు, మచ్చవేణుగోపాల్‌రెడ్డి, చిన్న, నయ్యర్, బర్ల మల్లికార్జున్, జంగిటి కనకరాజు, కూర బాల్‌రెడ్డి, కాముని నగేష్, బోనాల నర్సింలు, కిషన్‌రావు తదితరులు పాల్గొన్నారు. బీజేపీకి ఓటు వేస్తే బెజవాడ బాబుకు వేసినట్లే సిద్దిపేట రూరల్: మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే తెలంగాణను అడుగడుగునా అడ్డుకున్న చంద్రబాబుకు ఓటు వేసినట్లేనని, ఇక కాంగ్రెస్ ఓటు వేస్తే అది మురిగిపోతుందని మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. శనివారం సిద్దిపేట మండలం మిట్టపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ సిద్దరబోయిన రాజ్యలక్ష్మి శ్రీనివాస్‌తో పాటు పలువురు నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, వివిధ సంఘాలు ‘ఓటుకు నోటు కార్యక్రమం’ నిర్వహించారు. అనంతరం హరీష్‌రావు, ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కలిసి మాట్లాడుతూ, బీజేపీకి అభ్యర్థులు లేక సమైక్యవాదిని నిలబెట్టారన్నారు. తెలంగాణ ఏర్పడినప్పటికీ బీజేపీలో ఆంధ్రాపెత్తనం కొనసాగుతోందని, చంద్రబాబు చెప్పిన వ్యక్తికి టికెట్ ఇచ్చారని, ఈ విషయం కిషన్‌రెడ్డికి తెల్వదా అని ప్రశ్నించారు. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలో ఉండి ఏం అభివృద్ధి చేశారో ఇప్పుడు ఏం చేయడానికి ఓటు వేయమని అడుగుతున్నారో చెప్పాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల ఓటమి అందరికి తెలుసని అందుకే ఇక్కడి ప్రచారానికి జాతీయ నాయకులు రావడం లేదన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీ నెరవేరుస్తుందని, అలాగే రుణమాఫీ ఈ నెలాఖరులోగా పూర్తవుతుందని తెలిపారు. కార్యక్రమంలో మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కిషన్‌రెడ్డి, గ్రామ ఎంపీటీసీ భూలక్ష్మి శ్రీనివాస్, నాయకులు నారేంద్రనాథ్, స్వామిచరణ్, బాలకిషన్‌రావు, శ్రీనివాస్‌రావు, ప్రవీణ్‌రెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ చెంప చెళ్లుమనే తీర్పు వస్తుంది
మెదక్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం: పొన్నాల హైదరాబాద్: మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ చెంప చెళ్లుమనిపించే తీర్పు రాబోతుందని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వ్యా ఖ్యానించారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఖాయమని, ఈ విషయం తెలిసే టీఆర్ఎస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఎద్దేవా చేశారు. శుక్రవారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధికార ప్రతినిధి మల్లు రవితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల్లో రూ.5 లక్షల కోట్లకుపైగా విలువైన హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్.. మూడు నెలల్లో ఒక్కటి కూడా అమలు చేయలేకపోయిందని విమర్శించారు. రుణమాఫీని ఎగ్గొట్టడానికి వీలైనన్ని దారులు వెతుకుతున్నారని దుయ్యబట్టారు. రుణమాఫీ అందక, కరెంటు లేక, కరువుతో అల్లాడుతున్న రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేసీఆర్‌కు మాత్రం పట్టడంలేదని ధ్వజమెత్తారు. ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడానికి, విదేశీ ప్రతినిధుల తో మాట్లాడటానికి గంటల తరబడి కేటాయిస్తున్న సమయాన్ని ప్రజా సమస్యలపై మాత్రం వెచ్చించకపోవడం బాధాకరమన్నారు. వాస్తుదోషాలు, కార్ల రంగులు, గులాబీ పూల పైనున్న శ్రద్ధ.. రైతుల జాతకాన్ని మార్చేందుకు లేకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు ఎన్నికలకు ముందు కేసీఆర్పైనున్న భ్రమలన్నీ తొలగిపోయాయని, టీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడేందుకు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. సొంత పార్టీలో ముసలం ప్రారంభమైనందునే కేసీఆర్ ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహిస్తున్నారని అనుమా నం వ్యక్తంచేశారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలందరూ కలిసినా ప్రభుత్వాన్ని పడగొట్టలేరని తెలిసి కూడా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకోవడం వెనుక ఆంతర్యమేమిటో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. -
మోడీ వచ్చినా డిపాజిట్ దక్కదు: కేటీఆర్
మిరుదొడ్డి: మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికలో ప్రధాని నరేంద్ర మోడీతో ప్రచారం చేయించినా బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ దక్కదని మంత్రి కె. తారకరామారావు అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా మిరుదొడ్డిలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్యవాది అయిన జగ్గారెడ్డి అంటేనే మెదక్ జిల్లా ప్రజలు భగ్గు మంటున్నారన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని సునీతా లక్ష్మారెడ్డికి తెలంగాణ ప్రజల ఓట్లను అడిగే నైతిక హక్కు లేదన్నారు. -
తాటాకు చప్పుళ్లకు బెదరం: కిషన్‌రెడ్డి
సంగారెడ్డి/రామచంద్రాపురం: టీఆర్ఎస్ తాటాకు చప్పుళ్లకు భయపడబోమని, మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా సంగారెడ్డి, రామచంద్రాపురంలలో బుధవారం జరిగిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. వంద రోజుల టీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఏం చేసిందో కేసీఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. సర్వేల పేరుతో తెలంగాణ ప్రజల్లో భయానక వాతావరణం సృష్టించారన్నారు. కొత్త సంక్షేమ పథకాలు అమలు కాకపోగా ఉన్న రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇళ్లు తొలగించడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం సిగ్గుచేటని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. -
పకడ్బందీగా మెదక్ ఉప ఎన్నిక: భన్వర్‌లాల్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సాధారణ ఎన్నికల కంటే ఉప ఎన్నికల నిర్వహణే అత్యంత సవాలుతో కూడుకున్నదని, ఈ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ కోరారు. మెదక్ లోక్‌సభ ఉప ఎన్నిక నిర్వహణపై అధికారులతో మంగళవారం సమీక్షించారు. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకు ఆ పోలింగ్ కేంద్రంలోనే ఓటు హక్కును వినియోగించుకునే విధానాన్ని అమలు చేస్తామని భన్వర్‌లాల్ తెలిపారు. పోలింగ్ ప్రక్రియను పరిశీలించే అవకాశాన్ని ఈసారి రాజకీయ పక్షాలకు కూడా కల్పిస్తున్నామని తెలిపారు. -
మెదక్ బాటలో..
సాక్షి, మహబూబ్‌నగర్: మెదక్ పార్లమెంట్ ఉపఎన్నిక సెగ పాలమూరును తాకింది. ఆయా రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్య నేతలంతా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. అన్నిపక్షాలు కూడా ఈ ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో నాయకులంతా అటువైపే క్యూ కట్టారు. ఇప్పటికే జిల్లాకు చెందిన పలువురు ముఖ్యనేతలు మెదక్‌లో మకాం వేసి ప్రచారపర్వంలో మునిగిపోయారు. ముఖ్యంగా అధికారపార్టీ టీఆర్ఎస్కు చెందిన ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, డాక్టర్ సి.లక్ష్మారెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాల్‌రాజ్, అంజయ్య యాదవ్‌లకు మెదక్‌లోని ఆయా నియోజకవర్గాల ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగించారు. లకా్ష్మరెడ్డికి మెదక్ నియోజకవర్గం, జూపల్లి కృష్ణారావు, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, అంజయ్య యాదవ్‌లకు దుబ్బాక నియోజకవర్గం, వి.శ్రీనివాస్‌గౌడ్‌కు పటాన్చెరు నియోజకవర్గం, మర్రి జనార్దన్‌రెడ్డికి నర్సాపూర్ నియోజకవర్గం, గువ్వల బాల్‌రాజ్ సంగారెడ్డి నియోజకవర్గ ప్రచార బాధ్యతలు చూస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఎంపీ నంది ఎల్లయ్య, ఎమ్మెల్యేలు డీకే అరుణ, జి.చిన్నారెడ్డి, వంశీచందర్‌రెడ్డి, మల్లు రవి తదితరులు కూడా మెదక్‌కు పయనమయ్యారు. అరుణకు మెదక్ అసెంబ్లీ సెగ్మెంట్ ప్రచార బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో ఆమె ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని దూసుకెళ్తున్నారు. టీడీపీ, బీజేపీ నేతలు కూడా.. మెదక్ బరిలో ఎన్డీ ఏ కూటమి నుంచి బీజేపీ అభ్యర్థికి మద్దతుగా టీడీపీ, బీజేపీ నేతలు పయనమయ్యారు. టీడీపీ నుంచి మంచి వాగ్దాటి కలిగిన కొడంగల్ ఎమ్మెల్యే ఎ.రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో ముందునుండి స్టార్ క్యాంపెనర్‌గా కొనసాగుతున్నారు. అలాగే జిల్లాలో సీనియర్ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి కూడా మెదక్‌లో మకాం వేసి వ్యూహరచన చేస్తున్నారు. బీజేపీ ముఖ్యనేత నాగం జనార్దన్‌రెడ్డి తమ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేసేందుకు మెదక్ పయనమయ్యారు. నాగంకు మెదక్ పార్లమెంట్ ప్రచారం నిర్వహించాల్సిందిగా పార్టీ దిశానిర్దేశం చేసింది. స్థానం సుస్థిరం కోసమే...! అన్ని పార్టీల ముఖ్యనేతలు కూడా వారివారి స్థానాలను సుస్థిరం చేసుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రివర్గ విస్తరణలో స్థానం పదిలం చేసుకునేందుకు శతవిధాల యత్నిస్తున్నారు. మంత్రివర్గంలో స్థానంకోసం పోటీపడుతున్న జూపల్లి కృష్ణారావు, సి.లకా్ష్మరెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్ తమదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ ముఖ్యనేత డీకే అరుణ పార్టీలో కీలకస్థానం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇటీవల ఆమె ఢిల్లీ వెళ్లి మంత్రాంగం నడిపించారు. ఈ నేపథ్యంలో మెదక్ ఉప ఎన్నికలను ఆమె ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అలాగే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నందున ముఖ్య పదవి కోసం నాగం జనార్దన్‌రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఏదైనా రాష్ట్రం కోటాలో రాజ్యసభ సీటు దక్కించుకునేందుకు కష్టపడుతున్నారు. ఇలా జిల్లా నేతలకు కూడా మెదక్ ఉప ఎన్నికల ప్రతిష్టాత్మకంగా మారింది. -
సీమాంధ్ర ఏజెంటు జగ్గారెడ్డి
డిప్యూటీ సీఎం మహమూద్ అలీ పటాన్చెరు రూరల్: సీమాంధ్ర పాలకులు చంద్రబాబునాయడు, వెంకయ్యనాయుడుల ఏజెంటుగా వ్యవహరిస్తున్న జగ్గారెడ్డిని ఓడించాలని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని పాటి చౌరస్తాలోని ఎస్వీఆర్ గార్డెన్లో టీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశం స్థానిక ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మాట్లాడుతూ తెలంగాణ ద్రోహి అయిన జగ్గారెడ్డిని మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికలో చిత్తుగా ఓడించాలన్నారు. తెలంగాణలో ఉద్యమాలు నడుస్తుంటే అడ్డుకున్న జగ్గారెడ్డి ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారన్నారు. ఎమ్మెల్యేలు, బాబూమోహన్, గ్యాదరి కిశోర్, ఎమ్మెల్సీలు భూపాల్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, యాదవరెడ్డి, భాను ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే టీఆర్ఎస్తోనే సాధ్యమన్నారు. చాగన్ల నరేంద్రనాథ్ మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలు జిల్లా ప్రజలకు చేసిందేమీలేదన్నారు. అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ పటాన్చెరు వరకు మెట్రో రైలు, సంగారెడ్డి వరకు ఎంఎంటీఎస్ తీసుకవ స్తానన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఆర్. సత్యనారాయణ, రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్పనగేశ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
కుటుంబ పాలనను అంతం చేయండి
రామచంద్రాపురం: మెదక్ పార్లమెంటు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి తూర్పు జయప్రకాశ్‌రెడ్డిని గెలిపించి కేసీఆర్ కుటుంబ పాలనను అంతం చేయాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని మల్లికార్జున ఫంక్షన్హాల్లో బీజేపీ, టీడీపీ నియోజకవర్గ సమన్వయ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. జగ్గారెడ్డి మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఎదిగి బీజేపీ బలోపేతానికి ఎంతో కృషి చేశారని తెలిపారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా తాను ఉన్నానంటూ ఎప్పుడు ముందుంటే మనస్తత్వం ఆయనదన్నారు. ప్రజల శ్రేయస్సు కోసం పని చేసే వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని తెలిపారు. బీజేపీ అభ్యర్థిని గెలిపించి మెదక్ జిల్లా నుంచే టీఆర్ఎస్ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పేదొకటి చేసేదొకటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే నీటి సమస్య, విద్యుత్ సమస్య ఉండదని చెప్పిన ఆయన ఇప్పుడు చేస్తుందేంటని ప్రశ్నించారు. ఈ సమస్యపై ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో చర్చించి ఉంటే ఈ సమస్య పరిష్కారమయ్యేదని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం సచివాలయానికి పరిమితమై ఆదేశాలివ్వడానికే సరిపోతుందన్నారు. పార్లమెంటులో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన మజ్లిస్ పార్టీతో ఇప్పుడు కేసీఆర్ పొత్తు పెట్టుకోవడం సిగ్గుచేటన్నారు. ఇక పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తూర్పు జయప్రకాశ్‌రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారని అది ఆయన హోదాకు తగదన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్, మాజీ ఎమ్మెల్యే కె.సత్యనారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షుడు బుచ్చిరెడ్డి, రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు అంజన్‌కుమార్‌గౌడ్, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు శశికళాయాదవరెడ్డి, నాయకులు అంజిరెడ్డి, మోహన్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, విశ్వనాథం, రవీందర్, గిరి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. మునిపల్లి: బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ అందోల్ నియోజకవర్గ కన్వీనర్ ఎల్లయ్య అన్నారు. ఆదివారం మండలంలోని కంకోల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. మెదక్ ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున లోక్‌సభ అభ్యర్థిగా బరిలో ఉన్న జగ్గారెడ్డిని చూసి టీఆర్ఎస్ ఆందోళనకు గురవుతోందని తెలిపారు. రాష్ర్టం విడిపోయిన తర్వాత కూడా ఆయనపై విమర్శలు చేయడం టీఆర్ఎస్ నాయకులకు సిగ్గుచేటని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు ఎన్నికలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రతి పక్ష పార్టీలను విమర్శించడమే తమ లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమేనని ప్రజలిచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకుని అభివృద్ధికి పాటుపడాలే తప్ప ప్రతిపక్ష పార్టీలను విమర్శించడం తగదని హితవు పలికారు. జగ్గారెడ్డి బరిలో ఉండటం వల్ల తమ అభ్యర్థి ఎక్కడ ఓడిపోతాడోననే భయం.. టీఆర్ఎస్ మంత్రులకు కునుకు లేకుండా చేస్తోందని ఎద్దేవా చేశారు. నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు, రైతు రుణమాఫీ, పెన్షన్ల పెంపు తదితర హామీలను వెంటనే నెరవేర్చాలని తెలిపారు. టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా జగ్గారెడ్డి గెలుపును ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. జగ్గారెడ్డి గెలుపు ఖాయం జిన్నారం: మెదక్ ఎంపీ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి విజయాన్ని ఎవరూ ఆపలేరని ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మండల పరిధిలోని గుమ్మడిదల గ్రామంలో ఆదివారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా చింతల మాట్లాడుతూ.. పార్టీ గెలుపునకు ప్రతిఒక్కరూ శక్తి వంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. నరేంద్రమోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తోందని తెలిపారు. జగ్గారెడ్డి గెలుపునకు ప్రతిఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని కోరారు. అనంతరం పలువురు యువకులు బీజేపీలో చేరారు. వీరిని రామచంద్రారెడ్డి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ నాయకు లు అంజరెడ్డి, విష్ణువర్ధణ్రెడ్డి, మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు. -
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటమి ఖాయం
- కొత్త ప్రభాకర్‌రెడ్డి విజయం తథ్యం - ప్రతిపక్షాలవి అర్థం లేని విమర్శలు - నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు గజ్వేల్: మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు బుద్ధిచెప్పడం ఖాయమని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. శనివారం గజ్వేల్‌లోని పీఎన్ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన టీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి విజయం తథ్యమని పేర్కొన్నారు. గజ్వేల్ శాసనసభా నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్నందున మెదక్ లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఇక్కడే అత్యధిక మెజార్టీని తీసుకురావడానికి కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. సమైఖ్యవాదాన్ని భుజాన వేసుకుని తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడిన జగ్గారెడ్డి మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో టికెట్ ఏవిధంగా ఇచ్చారో? ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జగ్గారెడ్డి వైఖరి మారిందా? బీజేపీ స్టాండ్ మారిందో వివరించాల్సిన అవసరమున్నదన్నారు. మరోవైపు జిల్లా ప్రజలకు కాంగ్రెస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి ఒరగబెట్టిందేమీలేదని మండిపడ్దారు. నాలుగేళ్లుగా జిల్లాలో వడగళ్ల వానల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోగా అప్పట్లో మంత్రిగా పనిచేసిన సునీతారెడ్డి రైతులకు పరిహారం ఇప్పించలేకపోయారని చెప్పారు. నిండు సభలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు నిధులివ్వను..ఏం చేసుకుంటారో చేసుకోండి.. అంటూ మాట్లాడినా తెలంగాణ ప్రజాప్రతినిధులు ఏం చేయలేకపోయారని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నాలుగేళ్ల ఇన్‌ఫుట్ సబ్సిడీ రూ.480 కోట్లు విడుదల చేశారని పేర్కొన్నారు. జనగామలో చెల్లనిరూపాయిగా మారిన టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మెదక్‌లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తానని చెప్పడం విడ్డూరంగా ఉన్నదని చెప్పారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఎంపీగా పోటీచేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. తనను గెలిపిస్తే ప్రజల కష్టసుఖాల్లో నిరంతరం పాలుపంచుకుంటానని పేర్కొన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి ద్రోహం తలపెట్టిన జగ్గారెడ్డికి ఎన్ని శిక్షలు వేసినా తక్కువేనని చెప్పారు. ఆయనకు టికెట్ ఇవ్వడం ద్వారా ఇక్కడి ప్రజలను బీజేపీ అవమానించిందని మండ్డిపడ్డారు. సమాశంలో జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్, జిల్లా పరిషత్ చైర్మన్ రాజమణి, ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, రాములు నాయక్, టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి రాజయ్యయాదవ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణ, టీఆర్ఎస్ రాష్ట్ర నేత చాగన్ల నరేంద్రనాథ్, గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి మడుపు భూంరెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ లక్ష్మీకాంతారావు, గజ్వేల్ నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ జి.ఎలక్షన్‌రెడ్డి, గజ్వేల్ మాజీ ఎంపీపీ పొన్నాల రఘుపతిరావు, మాజీ మార్కెట్ కమీటీ చైర్మన్ డాక్టర్ వి.యాదవరెడ్డి, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్, ప్రొఫెసర్ సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. -
మెదక్ పోరుకు 17 మంది నామినేషన్లు
సంగారెడ్డి: మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికకు బుధవారం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మూడు ప్రధాన రాజకీయ పార్టీల తో పాటు స్వతంత్రులను కలుపుకొని మొత్తం 17 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్ఎస్ నుంచి కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీజేపీ నుంచి తూర్పు జయప్రకాష్‌రెడ్డి(జగ్గారెడ్డి), కాంగ్రెస్ నుంచి సునీతాలక్ష్మారెడ్డి నామినేషన్లు వేశారు. దాఖలైన నామినేషన్లను గురువా రం పరిశీలిస్తారు. ఉపసంహరణకు 30న గడువు నిర్దేశించారు. అనంతరం పోటీలో ఉండే అభ్యర్థులను ప్రకటిస్తారు. వచ్చే నెల 13వ తేదీన పోలింగ్ నిర్వహించి.. 16న ఫలితాలను ప్రకటిస్తారు. అయితే మెదక్ లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ప్రధాన పార్టీల నుంచి, బలహీనవర్గాల నుంచి అభ్యర్థులు లేకపోవటం ఇదే మొదటిసారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. 3 సెట్లు సమర్పించిన సునీతారెడ్డి.. కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి మూడు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాజీ మంత్రులు గీతారెడ్డి, షబ్బీర్ అలీ, ఎంపీ వి.హన్మంతరావు, ఎమ్మెల్యే కిష్టారెడ్డి, మాజీ ఎంపీలు సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్గౌడ్లతో కలిసివెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందించారు. బీజేపీ నుంచి ఇద్దరు! ఇప్పటిదాకా డీసీసీ అధ్యక్షుడిగా, కాంగ్రెస్ అభ్యర్థిగా రేసులో ఉన్న జగ్గారెడ్డి రాత్రికి రాత్రే బీజేపీలో చేరి.. ఆ పార్టీ తరఫున నామినేషన్ వేశారు. ఆయన నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖ లు చేశారు. బీజేపీ తరఫున జగ్గారెడ్డి బరిలోకి దిగుతుండడంతో మెదక్ జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, నేతలు బద్దం బాల్‌రెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి, రఘునందన్‌రావు, టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి, శశికళాయాదవ్, పాదూరి కరుణ తదితరులు వెంట ఉన్నారు. అయితే ఎస్సార్ ట్రస్టు అధినేత అంజిరెడ్డి కూడా బీజేపీ నుంచి నామినేషన్ వేయడం గమనార్హం. ఐదు రోజుల కిందట హైదరాబాద్ పర్యటనకు వచ్చిన బీజేపీ జాతీయు అధ్యక్షుడు అమిత్ షాతో పవన్‌కల్యాణ్ భేటీ అయిన సమయంలో వారి మధ్య జగ్గారెడ్డి అభ్యర్థిత్వ అంశం చర్చకు వచ్చినట్టు తెలిసింది. మరోవైపు టీడీపీ కూడా జగ్గారెడ్డికి టికెట్ ఇవ్వాలని బీజేపీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. అప్పటికప్పుడు పార్టీ సభ్యత్వం ఇచ్చి బీఫాం కేటాయించటం వెనక బీజేపీ జాతీయ నాయకత్వ నిర్ణయం ఉన్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ను ఢీకొని నిలిచే నేతలు స్థానికంగా లేరనే వాదన నేపథ్యంలో పార్టీ అధిష్టానం జోక్యం చేసున్నట్టు సవూచారం. టీఆర్ఎస్ నుంచి ప్రభాకర్‌రెడ్డి.. టీఆర్ఎస్ నుంచి కొత్త ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ వేశారు. ఈయన తరఫున బుధవారం ఉదయమే ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌రెడ్డి, మదన్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రాజమణి మురళి యాదవ్ రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అనంతరం మధ్యాహ్నం ప్రభాకర్‌రెడ్డి మరో రెండు సెట్ల నామినేషన్ పత్రాలను మంత్రి హరీష్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, చింతా ప్రభాకర్, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి తదితరులతో కలిసి వచ్చి రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఇది తెలంగాణ ద్రోహులకు, ఆత్మగౌరవానికి మధ్య పోరాటం: హరీశ్ తెలంగాణ ద్రోహులకు, ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరాటమే మెదక్ లోక్‌సభ ఉప ఎన్నిక అని మార్కెటింగ్, నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అభివర్ణించారు. విజ్ఞలైన మెతుకుసీమ ప్రజలు తెలంగాణ వద్దేవద్దన్న ద్రోహులకు బుద్ధిచెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ విజయం ఎప్పుడో ఖరారైపోయిందని, ద్వితీయ, తృతీ య స్థానాల కోసమే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్నాయన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డితో నామినేషన్ వేయించిన అనంతరం మంత్రి హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో విద్యార్థులు, ఉద్యోగుల మీద కేసులు పెట్టించిన మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, అసలు తెలంగాణ రాష్ర్టం వద్దేవద్దు.. సమైక్య రాష్ట్రమే ముద్దు.. అని సీమాంధ్ర ముఖ్యమంత్రులకు వత్తాసు పలికిన జగ్గారెడ్డి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఎన్నికల్లో నిలబడ్డారని హరీశ్‌రావు ప్రశ్నించారు. తెలంగాణ ద్రోహి జగ్గారెడ్డిని పిలిచి టికెట్ ఇచ్చే బదులు.. ఆ పార్టీలో ఎవరికి టికెట్ ఇచ్చినా బీజేపీకి గౌరవం దక్కేదన్నారు. బీజేపీకి అభ్యర్థే కరువు: పొన్నాల హైదరాబాద్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మెదక్ లోక్‌సభ స్థానంలో అభ్యర్థే కరువయ్యాడనీ, దీంతో కాంగ్రెస్‌పార్టీ టికెట్ నిరాకరించిన వ్యక్తిని బతిమిలాడి అరువు తెచ్చుకోవాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడిందని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు.బుధవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ ఎస్, బీజేపీలను ప్రజలు న మ్మే పరిస్థితి లేదన్నారు. తమకుటీఆర్ఎస్ ప్రధాన ప్రత్యర్థి అవుతుందని, బీజేపీ అసలు పోటీనే కాదన్నారు. కేసీఆర్‌ను నిద్రపోనివ్వను: జగ్గారెడ్డి మెదక్ ఎంపీగా తనను గెలిపిస్తే సీఎం కేసీఆర్‌ను నిద్రపోనివ్వనని.. ఆయున ఫామ్‌హౌస్‌లో పడుకున్నా ప్రజా సమస్యలపై పోరాడి నిద్దురలేపుతానని బీజేపీ ఎంపీ అభ్యర్థి జగ్గారెడ్డి అన్నారు. బుధవారం సంగారెడ్డిలో టీడీపీ, బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. దొంగమాటలు చెప్పటంలో కేసీఆర్ దిట్ట అని అన్నారు. హైదరాబాద్‌ను సింగపూర్ చేస్తానని చెబుతున్న కేసీఆర్ రేపొద్దున అక్కడి నుంచే తెలంగాణకు నీళ్లు తీసుకువస్తానని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. -
మెదక్ సీటును మోడీకి బహుమతిగా ఇద్దాం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సంగారెడ్డి క్రైం: మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డిని గెలిపించి ప్రధాని నరేంద్రమోడీకి బహుమతిగా ఇవ్వాలని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లిలోని ఓ ప్రైవేట్ హోటల్లో బుధవారం రాత్రి కార్యకర్తలతో ఆయన అంతర్గత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ మెదక్ ఎంపీగా పోటీచేస్తున్న జగ్గారెడ్డిని గెలిపించేందుకు పార్టీ కార్యకర్తలు గ్రామస్థాయి నుంచి విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. మెదక్ జిల్లా చాలా వెనుకబడి ఉందని, మెదక్ ఎంపీగా బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే జిల్లా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందన్న విషయాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున ఎక్కువ నిధులు మంజూరవుతాయన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి జిల్లా అభివృద్ధి చెందాలనే ఆలోచన లేదని విమర్శించారు. కేవలం పార్టీ బలోపేతం కోసమే పనిచేస్తోందన్నారు. ఇప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమ పార్టీగానే భావిస్తోందన్నారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చే విషయంలో కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిం చారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నిధుల మంజూరు విషయంలో కేంద్రాన్ని కోరిన సందర్భమే లేదని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో కయ్యానికి కాలు దువ్వుతోందని విమర్శించారు. మెదక్ ఎంపీగా బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే సేవ చేయడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటామన్నారు. ఇన్‌చార్‌జల నియామకం సమావేశంలో జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లను ఎన్నుకున్నారు. సమావేశంలో జిల్లా ఇన్చార్జ్ మనోహర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి, ఇంద్రసేనారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, బీజేపీ రాష్ట్ర సంఘటన మంత్రి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి, కొండాపురం జగన్, సునీల్ పాల్గొన్నారు. -
ముగ్గురూ.. ముగ్గురే
మెదక్‌లో త్రిముఖ పోటీ ►జగ్గారెడ్డి రాకతో వేడెక్కిన రాజకీయం ►‘ట్రబుల్ షూటర్’పైన మరింత భారం ►నర్సాపూర్పైనే సునీతమ్మ ఆశలు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మెదక్ లోక్‌సభ ఉపపోరు ఊపందుకుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కీలకమైన అభ్యర్థులనే బరిలోకి దింపటంతో త్రిముఖ పోటీ ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.‘ట్రబుల్ షూటర్’ మంత్రి హరీష్‌రావు ఎత్తులు.. గ్రామీణ ప్రాంతంలో బలమైన క్యాడర్‌తో.. టీఆర్ఎస్ పార్టీ పతిష్టమైన స్థితిలో కనిపించినప్పటికీ తీవ్ర పోటీ మాత్రం తప్పదని వారు లెక్కలు కడుతున్నారు. బీజేపీ అభ్యర్థిగా ఫైర్‌బ్రాండ్ జగ్గారెడ్డి బరిలోకి దిగటం, తెలుగుదేశం శ్రేణులు బీజేపీతో కలిసి రావటం, ఇక నర్సాపూర్ నియోజకవర్గంలో పట్టున్న మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి బరిలో నిలబడటంతో మూడు స్తంబాలాట మొదలైంది. మెదక్ పార్ల మెంటు నియోజకవర్గం కింద మెదక్, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, నర్సాపూర్, పటాన్చెరు, సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.ఈ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సిద్దిపేట, దుబ్బాక, నియోజకవర్గాల్లో టీఆర్ఎస్కు మంచి పట్టు ఉండగా, నర్సాపూర్ నియోజకవర్గం సునీతారెడ్డికి, సంగారెడ్డి నియోజకవర్గం జగ్గారెడ్డికి అనుకూలంగా ఉంది. పటాన్చెరు నియోజకవర్గంలో మూడు పార్టీలకు చెందిన ఓటర్లు ఉన్నారు. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజవర్గాల్లో భారీ మెజార్టీ తెచ్చుకోవాలని టీఆర్ఎస్ ఎత్తులు వేస్తుండగా... సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ మెజార్టీని నిరోధించగలిగితే గెలుపు బాట పట్టవచ్చని బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు యోచిస్తున్నారు. ముఖ్యులంతా ఇన్చార్జులే... రాష్ట్రంలో టీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాల 100 రోజుల పాలనకు ఈ ఉప ఎన్నికలు రెఫరెండంగా మారాయి. ఇక కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకు ఈ ఎన్నికలు జీవగంజి లాంటివి. ఈ నేపథ్యంలో మూడు పార్టీలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నాయి. గులాబీ దళపతి కేసీఆర్‌కు గత ఎన్నికల్లో 3.97 లక్షల ఓట్ల మెజార్టీ వచ్చింది. కేసీఆర్‌కు 6,57,497 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రవణ్‌కుమార్‌రెడ్డికి 2,60,463 ఓట్లు వచ్చాయి. ఈ సారి కనీసం 4 లక్షల పైచిలుకు ఓట్ల మెజార్టీ తీసుకరావాలని కేసీఆర్ జిల్లా నేతలకు ఆదేశాలు జారీ చే శారు. పార్లమెంటు నియోజవర్గంలో ప్రతి మండలానికి ఒక ఎమ్మెల్యేను, ఎమ్మెల్సీలను ఇన్చార్జిగా నియమించారు. పూర్తి పర్యవేక్షణ బాధ్యతలను హరీష్‌రావుకు అప్పగించారు. ఇక కాంగ్రెస్ , బీజేపీ పార్టీలు కూడా మండలానికో ఎమ్మెల్యేను ఇన్చార్జులుగా నియమించింది. గులాబీ దళపతి మీదనే ఆశలు.. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గులాబీ దళపతి కేసీఆర్‌నే నమ్ముకోగా, కాంగ్రెస్ పార్టీ రాహుల్‌గాంధీ, సోనియాగాంధీలతో పాటు దిగ్విజయ్‌సింగ్, తదితరులను రంగంలోకి దించేందుకు పథకం రచిస్తోంది. రాష్ర్ట నాయకులు పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు పర్యవేక్షిస్తారు. బీజేపీ కూడా భారీ ప్రణాళికే వేస్తోంది. మోడీని ప్రచారంలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. ఆయనతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులతో పాటు సినీనటుడు పవన్ కల్యాణ్‌ను కూడా ప్రచార రంగంలోకి దించడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. -
'తెలంగాణ ఇచ్చిన ఓడించామన్న బాధ ప్రజల్లో ఉంది'
హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఓడించామనే బాధ రాష్ట్ర ప్రజల్లో ఉందని మాజీ మంత్రి, మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌లో టీ.పీసీసీ చీఫ్ పోన్నాల లక్ష్మయ్య నుంచి మెదక్ లోక్‌సభ అభ్యర్థిగా ఆమె బీఫారం తీసుకున్నారు. అనంతరం సునీత విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ...దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించారని అలాగే మెదక్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో అధికారన్ని కైవసం చేసుకున్న టీఆర్ఎస్ పార్టీ... ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుకు ఆ పార్టీ కార్యాచరణను ప్రకటించలేకపోయిందని ఆమె విమర్శించారు. అందుకే టీఆర్ఎస్ పార్టీపై తెలంగాణ ప్రజలు అపనమ్మకంతో ఉన్నారని సునీత లక్ష్మారెడ్డి తెలిపారు. -
ఎన్నో మలుపులు..మార్పులు!
కొత్త ప్రభాకర్‌రెడ్డికే గులాబీ మాల కేసీఆర్ అధికారిక ప్రకటన దేవిప్రసాద్‌కు ‘ఎమ్మెల్సీ’ ఇస్తామని హామీ ఎన్నో మలుపులు.. మార్పులు...ఎత్తులు.. కసరత్తులు... తర్వాత ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. మెదక్ లోకసభ ఉప పోరుకు నామినేషన్ల గడువు బుధవారంతో ముగుస్తుండటంతో మంగళవారం పొద్దుపోయే వరకు కాంగ్రెస్, బీజేపీలు కసరత్తు చేశాయి. చిట్టచివరకు అభ్యర్థుల జాబితాను మదింపు చేసి గెలుపు గుర్రాలను ఎంపిక చేసి బరిలోకి దింపారు. గెలుపుపై దీమా ఉన్న టీఆర్ఎస్ ముందుగా తన అభ్యర్థిని ప్రకటించింది. సునీతారెడ్డికే కాంగ్రెస్ టికెట్ మెదక్ ఉప ఎన్నికకు కాంగ్రెస్‌పార్టీ.. మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి పేరును ఖరారు చేసింది. మేధోమథనం నేపథ్యంలో దాదాపు ఐదు రోజుల పాటు రాష్ట్రంలోనే మకాం వేసిన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ మెదక్ ఉప ఎన్నికపైనే దృష్టి సారించారు. పోటీ చేసేందుకు మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ, జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహ భార్య పద్మినీరెడ్డి పోటీ పడ్డారు. రేసులో మొదట సర్వే సత్యనారాయణ ముందంజలో ఉన్నారు. దీంతో జిల్లా నేతలంతా ఏకమై.. జిల్లాకు చెందిన వ్యక్తికే టికెట్ ఇవ్వాలని డిమాండ్ డిమాండ్ చేయడంతో అధిష్టానం సర్వే సత్యనారాయణ పేరును తొలగించినట్టు సమాచారం. ఫలితంగా రేసులో జగ్గారెడ్డి పేరు ముందు వరుసలోకి వచ్చింది. ఇక సీనియర్ నేతలు కొందరు జగ్గారెడ్డికి చెక్ పెట్టేందుకు సునీతా లక్ష్మారెడ్డి పేరును సూచించారు. ఆమె పేరు దాదాపు ఖరారు అయిందనే రెండు రోజుల కిందనే మీడియాలో వార్తలు వచ్చాయి. దీనికి సునీతారెడ్డి స్పందిస్తూ.. అధిష్టానం ఆదేశిస్తే ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను సిద్ధమేనని, అయితే ఆర్థిక సహకారం అందిస్తేనే పోటీలో ఉంటానని మెలిక పెట్టడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. మరో 48 గంటల పాటు తర్జనభర్జన చేసి ఎట్టకేలకు సునీతారెడ్డి పేరునే ఖరారు చేశారు. కమలంలో ఇంకా వీడని సస్పెన్స్... బీజేపీ అభ్యర్థి ఎంపిక విషయంలో ఇంకా సస్పెన్స్ వీడటం లేదు. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రభుత్వ మాజీ విప్ జగ్గారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ భార్య పద్మినీరెడ్డి పేర్లు తెరమీదకు వచ్చాయి. ఇద్దరి పేర్లను రాష్ట్ర నాయకత్వం కేంద్రానికి నివేదించింది. బుధవారం నేరుగా ఢిల్లీ నుంచే బీఫాం అభ్యర్థి పేరు మీదనే రానున్నట్టు సమాచారం. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కోర్ కమిటీ సమావేశమై మంగళవారం పొద్దు పోయేవరకు అభ్యర్థి ఎంపికపై చర్చలు జరిపారు. అంతకు ముందు రెండు రోజులు హైదరాబాద్‌లోనే మకాం వేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మెదక్ ఉపపోరును ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలవాలని రాష్ర్ట నేతలకు సూచించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి గెలుపు గుర్రాల కోసం అన్వేషించారు. పదుల సంఖ్యలో ఉన్న ఆశావహుల జాబితాను వడబోసి తుది జాబితా రూపొందించారు. ఈ జాబితాలో రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఆకుల రాజయ్య, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, ఎస్సార్ ట్రాన్స్‌పోర్టు అధినేత అంజిరెడ్డి పేర్లు తుది పరిశీలనకు వచ్చాయి. వీరిలో ఒకరి పేరు ఖరారు చేస్తారని ప్రచారం జరిగింది. చివరకు జగ్గారెడ్డి, పద్మినీరెడ్డి పేర్లు తెరమీదకు వచ్చాయి. జగ్గారెడ్డి డీసీసీ అధ్యక్షునిగా నియమిస్తున్నట్లు ఈ నెల 23న ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, సీనియర్ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూన్నారనే కారణంతో ఆ మరుసటి రోజే ఆయన నియామకాన్ని నిలిపివేశారు. పార్టీ నిర్ణయం పట్ల జగ్గారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఒక వైపు కాంగ్రెస్ పార్టీ మేధోమథనం కార్యక్రమంలో పాల్గొంటూనే మరోవైపు బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నారు. జగ్గారెడ్డి తనకున్న పాత పరిచయాలతో బీజేపీలో పావులు కదిపారు. జగ్గారెడ్డి సమైక్యవాదిగా ముద్ర పడ్డారనే కారణంతో ఆయన పునరాగమనాన్ని వ్యతిరేకించిన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చివరకు అంగీకరించినట్లు తెలిసింది సంగారెడ్డి: మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. ఉద్యమ సమయంలో పార్టీకి అండగా ఉన్న రియల్ ఎస్టేట్ మిగతా వ్యాపారి కొత్త ప్రభాకర్‌రెడ్డికి టికెట్ ఖరారు చేశారు. ఈ మేరకు మంగళవారం గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లో అధికారికంగా ప్రకటించారు. గత సాధారణ ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు, గజ్వేల్ అసెంబ్లీ నుంచి కేసీఆర్ పోటీచేసి రెండు చోట్లా గెలుపొందిన విషయం విదితమే. తదనంతరం కేసీఆర్ మెదక్ పార్లమెంటుకు రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అప్పటినుంచే ఆశావహులు టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. కొత్త ప్రభాకర్‌రెడ్డితో పాటు టీఎన్జీవోల సంఘం నాయకుడు దేవిప్రసాద్, పొలిట్‌బ్యూరో సభ్యుడు రాజయ్య యాదవ్, విద్యార్థి నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్, రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రవీణ్‌రెడ్డి తదితరులు పోటీ పడ్డారు. ఎంపీ కల్వకుంట్ల కవిత, మంత్రి హరీష్‌రావు ద్వారా కొత్త ప్రభాకర్‌రెడ్డి మంత్రాంగం నడపగా... దేవిప్రసాద్ టీఎన్జీవో సంఘాన్ని నమ్ముకున్నారు.. దేవిప్రసాద్‌కు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టీఎన్జీవోలు కేసీఆర్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. ప్రవీణ్‌రెడ్డి మంత్రి కేటీఆర్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలతో టికెట్‌కోసం యత్నించారు. చివరకు కేసీఆర్.. గులాబీ మాలను కొత్త ప్రభాకర్ మెడలో వేశారు. దేవిప్రసాద్ సేవలు రాష్ట్రానికి అవసరమని, అతణ్ణి ఎమ్మెల్సీగా ఎన్నుకుంటామని స్వయంగా కేసీఆర్ చెప్పడంతో టికెట్ కథ సుఖాంతమైంది. కొత్త ప్రభాకర్‌రెడ్డికి మొదటి నుంచి కేసీఆర్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయి. ప్రస్తుత నిజామాబాద్ ఎంపీ, కేసీఆర్ కూతురు కవిత అప్పట్లో స్థాపించిన తెలంగాణ జాగృతిని పల్లె పల్లెకు విస్తరింపజేయడంలో కొత్త ప్రభాకర్‌రెడ్డి విశేష కృషి చేశారు. గత సాధారణ ఎన్నికల్లో ఆయన దుబ్బాక నియోజకవర్గం నుంచి అసెంబ్లీ టికెట్‌ను అశించారు. అయితే సోలిపేట రామలింగారెడ్డికి టికెట్ దక్కింది. మెదక్ ఉప ఎన్నికలో టికెట్ నీకే ఇస్తానని కేసీఆర్ కొత్త ప్రభాకర్‌రెడ్డికి మాట ఇచ్చినట్లు అప్పట్లోనే ప్రచారం జరిగింది. -
మెదక్ కాంగ్రెస్ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి
-
మెదక్ కాంగ్రెస్ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి ఖరారు
హైదరాబాద్: మెదక్ లోక్‌సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆమె పేరును ఖరారు చేసింది. మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతలు ఏకగ్రీవంగా సునీత లక్ష్మారెడ్డికి మద్దతు పలికారు. కాగా టికెట్ కోసం పోటీ పడ్డ మాజీ విప్ జగ్గారెడ్డి నిరుత్సాహానికి గురైనట్టు సమాచారం. టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖరరావు మెదక్ ఎంపీ, గజ్వేల్ ఎమ్మెల్యేగా ఎన్నికైన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన కేసీఆర్ ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి సునీత శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. -
మెదక్‌కు ప్రవీణ్ లేదా ప్రభాకర్ రెడ్డి..?
దేవీప్రసాద్‌ను బుజ్జగిస్తున్న స్వామిగౌడ్, శ్రీనివాస్‌గౌడ్ అభ్యర్థిత్వంపై పార్టీ {పముఖులతో సీఎం చర్చలు హైదరాబాద్: మెదక్ లోక్‌సభ స్థానానికి జరిగే ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా కొత్త ప్రభాకర్‌రెడ్డి, కుంభాల ప్రవీణ్‌రెడ్డిలతోపాటు పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే పార్టీ టికెట్ ప్రవీణ్‌రెడ్డికే దక్కనుందని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. అభ్యర్థి, గెలుపు వ్యూహంపై పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్లో మెదక్ జిల్లాపార్టీ ముఖ్యులతో సోమవారం సాయంత్రం చర్చించారు. ఆశా వహులంతా నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చునని కేసీఆర్ సూచించారు. మెదక్ ఆశావహులు ఎవరున్నారని జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణను కేసీఆర్ అడిగారు. దీంతో దేవీప్రసాద్, కె.భూపాల్ రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి,ప్రవీణ్ రెడ్డి తదితరుల పేర్లను ఆయన వివరించారు. ఈ దశలో పార్టీ సెక్రటరీ జనరల్, ఎంపీ కె.కేశవరావు జోక్యం చేసుకుని, వారిపేర్లు చెబుతున్న ఆర్.సత్యనారాయణ కూడా టికెట్‌ను ఆశిస్తున్నారని చెప్పారు. దీంతో ఈ ఐదుగురి పేర్లను అభ్యర్థిత్వం కోసం పరిశీలిస్తున్నట్టు కేసీఆర్ తెలిపారు. మెదక్‌లో ఉపఎన్నిక పూర్తయ్యేదాకా ఆరుగురు మంత్రులు, ఐదుగురు ఎంపీలు,పలువురు ఎమ్మెల్యేలు పార్టీ గెలుపు బాధ్యతను నిర్వహించనున్నారు. నియోజకవర్గాల వారీగా మంత్రులు పద్మారావు (గజ్వేల్),టి,రాజయ్య( సంగారెడ్డి), కేటీఆర్(మెదక్),జోగురామన్న(నర్సాపూర్), హరీశ్‌రావు(సిద్దిపేట), ఈటె ల రాజేందర్(పటాన్ చెరు)లు ఇన్చార్జిలుగా వ్యవహరించనున్నారు. స్థానిక ఎమ్మెల్యేతోపాటు మండలానికి ఒక ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ ఇన్చార్జిగా ఉంటారు. ఎన్నికలయ్యేదాకా వీరు అక్కడే ఉండి కార్యకర్తలను సమన్వయం చేస్తారు. ప్రతి నియోజకవర్గం నుంచి 50 వేలకు తక్కువ కాకుండా మెజారిటీ వచ్చే విధంగా వ్యూహం ఉండాలని కేసీఆర్ ఆదేశిం చారు. టికెట్‌ను ఆశిస్తున్న టీఎన్జీఓ అధ్యక్షుడు దేవీ ప్రసాద్‌ను బుజ్జగించడానికి శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్, వి.శ్రీనివాస్‌గౌడ్ ప్రయత్నిస్తున్నారు. దేవీప్రసాద్‌కే టికెట్ ఇవ్వాలని ఉద్యోగసంఘాలు,నేతలు ఇదివరకే కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసినసంగతి తెలిసిందే. ఆయనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యునిగా లేదా ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని కేసీఆర్ వర్తమానం పంపినట్టు తెలిసింది. బుజ్జగించడానికి స్వామిగౌడ్ ను, శ్రీనివాస్‌గౌడ్‌ను పంపడంపై దేవీప్రసాద్ ఆవేదన చెందుతున్నారు. మా ఇద్దరి మధ్య మధ్యవర్తులు అవసరమా?’ అని తన సన్నిహితులతో ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. -
బంపర్ మెజార్టీతో గెలవాలి
హైదరాబాద్: మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావు పార్టీ నాయకులు సూచించారు. నియోజకవర్గంలోని ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో 50 వేలకు పైగా మెజార్టీ రావాలని ఆదేశించారు. కేసీఆర్ పార్టీ ప్రచార బాధ్యతలను తెలంగాణ రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, ఈటెల్ రాజేంద్రకు అప్పగించారు. మెదక్ లోక్‌సభ అభ్యర్థి గురించి టీఆర్ఎస్లో పలువురి పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. దేవీ ప్రసాద్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, ప్రవీణ్‌రెడ్డి తదితరుల పేర్లు పరిశీలించారు. అభ్యర్థి ఎంపిక బాధ్యతను టీఆర్ఎస్ అధినేతకు అప్పగించారు. మెదక్ అభ్యర్థిగా ఎవరిని నింపాలన్న విషయంలో కేసీఆర్ మంగళవారం తుది నిర్ణయం తీసుకోనున్నారు. -
కాంగ్రెస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి!
హైదరాబాద్: మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని బరిలో దించాలని ఏఐసీసీ భావిస్తోంది. పోటీకి పలువురు నేతలు ఆసక్తి చూపుతున్నప్పటికీ సునీతను బరిలో ఉంచడం ద్వారా అధికార పార్టీకి గట్టి పోటీ ఇవ్వొచ్చనే ధీమాతో ఉంది. పార్టీ రాష్ర్ట వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ రెండ్రోజులుగా మెదక్ జిల్లా నాయకులతో సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. పార్టీయే నిధులు సమకూర్చేతే సునీతకే టికెట్ ఇవ్వడమే మంచిదని జిల్లాలో మెజారిటీ నేతలు సూచించారు. -
మెదక్ బరిలో బీజేపీయే!
హైదరాబాద్: మెదక్ లోక్‌సభ ఉపఎన్నికలో టీడీపీ - బీజేపీ కూటమి నుంచి బీజేపీ అభ్యర్థినే పోటీకి నిలపాలని నిర్ణయించారు. ఆయా పార్టీల నేతలు ఆదివారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 26న బీజేపీ హైకమాండ్ ఆమోదం మేరకు పార్టీ అభ్యర్థిని ప్రకటించనున్నారు. 27న నామినేషన్ కార్యక్రమం ఉన్న విషయం తెలిసిందే. టీడీఎల్పీనేత ఎర్రబెల్లి దయాకరరావు నివాసంలో ఆదివారం ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, టీడీఎల్పీ ఉపనేత రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, బీజేఎల్పీ నేత లక్ష్మణ్ సమావేశమయ్యారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఏ పార్టీ నుంచి పోటీ చేయాలన్న అం శం చర్చకు వచ్చినప్పుడు బీజేపీ అభ్యర్థే పోటీ చేస్తారని కిషన్‌రెడ్డి టీడీపీ నేత లకు స్పష్టం చేశారు. మెదక్ ఎన్నిక కోసం తమను సమన్వయకమిటీగా పార్టీ నిర్ణయించిందని, బీజేపీ కూడా ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయాలని రమణ వారికి సూచించారు. కాగా టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా రెండు పార్టీలు కృషి చేయాలని నిర్ణయించారు. కాగా, మెదక్ పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఆ స్థానాన్ని తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘానికి కేటాయించాలని తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సామ వెంకట్‌రెడ్డి రాజకీయ పార్టీలను డిమాండ్ చేశారు. -
మెదక్ బరిలో బీజేపీ
హైదరాబాద్: మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేయనుంది. టీడీపీ, బీజేపీ మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరింది. టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర రావు నివాసంలో టీడీపీ, బీజేపీ నేతలు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. పొత్తులో భాగంగా మెదక్ లోక్‌సభ స్థానాన్ని బీజేపీకి కేటాయించామని తెలంగాణ టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, రమణ చెప్పారు. పార్టీ అధిష్టానం ఆమోదంతో బీజేపీ అభ్యర్థిని ప్రకటించనుంది. ఈనెల 26న మెదక్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించి, 27న నామినేషన్ వేస్తామని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చెప్పారు. -
మెజారిటీయే లక్ష్యం
సాక్షి, సంగారెడ్డి: ఉద్యమపార్టీగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ ఇప్పుడు అధికారపార్టీ. ప్రత్యేక రాష్ర్టంలో పాలనా పగ్గాలు చేపట్టాక మొదటి ఎన్నికను ఎదుర్కొనబోతోంది. అదీ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సొంత జిల్లాలో. కేసీఆర్ రాజీనామా చేసిన మెదక్ పార్లమెంట్ స్థానంపైనే ప్రస్తుతం అన్ని పార్టీలు దృష్టిని సారించాయి. కాగా మెదక్ ఎంపీ స్థానాన్ని తిరుగులేని మెజార్టీతో సొంతం చేసుకుని తమ సత్తా చాటిచెప్పాలని గులాబీ పార్టీ భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా టీఆర్ఎస్ ఉప ఎన్నికకు సమాయత్తమవుతోంది. కేసీఆర్ ఉప ఎన్నిక బాధ్యతలను మంత్రి హరీష్‌రావుకు అప్పగించిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్లో ట్రబుల్షూటర్గా పేరున్న హరీష్.. ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. గెలుపుపై కాకుండా మెజార్టీపైనే దృష్టి పెట్టారు. సుమారు 4 లక్షలకు పైగా మెజార్టీ సాధించి టీఆర్ఎస్ బలాన్ని జాతీయస్థాయిలో చాటాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం పక్కా ప్రచార ప్రణాళికను రూపొందించి ఉపపోరుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కేవలం జిల్లా నేతలతోనే ప్రచారం నిర్వహించి పార్టీకి తిరుగులేని విజయాన్ని అందించాలని హరీష్‌రావు పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. శనివారం జిల్లాకు చెందిన ముఖ్యనేతలతో సమావేశమైన మంత్రి హరీష్‌రావు ఎమ్మెల్యేలు, నేతలకు పలు సూచనలు చేయటంతోపాటు బాధ్యతలు అప్పగించారు. కేసీఆర్ మెదక్ ఎంపీ అభ్యర్థి పేరు ప్రకటించిన వెంటనే ప్రచార రంగంలోకి దిగేలా టీఆర్ఎస్ సిద్ధమవుతోంది. పార్టీ అభ్యర్థి ఎవరైనా అతని విజయం కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని హరీష్‌రావు జిల్లా నేతలు, ఎమ్మెల్యేలకు స్పష్టం చేసినట్లు సమాచారం. మెదక్ ఉప ఎన్నికకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేందుకు టీఆర్ఎస్ ఈ నెల 28 నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు సన్నాహక సభలు నిర్వహించనుంది. ప్రతి నియోజకవర్గంలో ఐదువేల మందితో సన్నాహక సభలు జరపనున్నారు. మంత్రి హరీష్‌రావు సభలకు హాజరై పార్టీ నాయకులు, కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయనున్నారు. ఈ నెల 28 నర్సాపూర్, సంగారెడ్డి, 30న మెదక్, గజ్వేల్ నియోజకవర్గాల్లో సన్నాహక సభలు జరుపుతారు. 31న సిద్దిపేట, దుబ్బాక, 1వ తేదీన పటాన్చెరు నియోజకవర్గంలో సభలు నిర్వహించనున్నారు. సభలకు ఎమ్మెల్యేలు, జిల్లా నాయకులతోపాటు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. సన్నాహక సభలు జరిగిన వెంటనే టీఆర్ఎస్ ఏడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేయనుంది. ఇందుకు అవసరమైన ఎన్నికల ప్రచార సామగ్రిని సిద్ధం చేసుకుంది. అభ్యర్థి ప్రకటించిన వెంటనే ఉప ఎన్నికల ప్రచారానికి టీఆర్ఎస్ గ్రామాల్లో తెరలేపనుంది. కేసీఆర్ సభలపైనే తర్జనభర్జన మెదక్ ఎంపీ ఉప ఎన్నిక ప్రచారంలో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పాల్గొనేందుకు అవసరమైన ఏర్పాట్లను పార్టీ చేపడుతోంది. కేసీఆర్ ప్రచార సభల నిర్వహణపైనా శనివారం జరిగిన జిల్లా ముఖ్యనేతల సమావేశంలో మంత్రి హరీష్‌రావు చర్చించినట్లు సమాచారం. ఉప ఎన్నిక జరగనున్న మెదక్ పార్లమెంట్ పరిధిలోని సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి డివిజన్ కేంద్రాల్లో కేసీఆర్ ప్రచారసభలు నిర్వహించాలా? లేక ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో సభులు ఏర్పాటుచేయాలా? అన్న అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. భారీ మెజార్టీ దక్కించుకోవాలంటే నియోజకవర్గ కేంద్రాల్లో సభలు నిర్వహిస్తే బాగుంటుందని ఎమ్మెల్యేలు అభిప్రాయపడినట్లు సమాచారం. అయితే కేసీఆర్ బహిరంగ సభలపైన ఈ నెలాఖరులోగా స్పష్టత రావొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
ఉపపోరుకు ఏర్పాట్లు
►ఏడు నియోజకవర్గాల్లో 1,817 పోలింగ్ కేంద్రాలు ►2,500 ఈవీఎంలు సిద్ధం చేస్తున్న అధికారులు ►ఎన్నికల విధుల్లో 8 వేల మంది సిబ్బంది ►26 నుంచి శిక్షణా తరగతులు, ఎన్నికల సామగ్రి పంపిణీ ►బందోబస్తులో పోలీసు శాఖ నిమగ్నం సాక్షి, సంగారెడ్డి: మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికలకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇన్చార్జి కలెక్టర్, ఎన్నికల అధికారి డా.ఎ.శరత్ పర్యవేక్షణలో అధికారులు ఎన్నిక ఏర్పాట్లు చేస్తున్నారు. ఉప ఎన్నికకు సంబంధించి ఇది వరకే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కావటంతో అధికారులు ఏర్పాట్లపై దృష్టి సారించారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజక వర్గాలుండగా, మొత్తం 15.36 లక్షల ఓటర్లు ఉన్నారు. వీరిలో 7,75,528 మంది పురుషులు కాగా, 7,60,835 మంది మిహ ళలు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఏడు నియోజకవర్గాల్లోని 1,074 ప్రాంతాల్లో 1,817 పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో కరెంటు, తాగునీరు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలపై ప్రత్యేక బృందాలు పరిశీలించనున్నాయి. ప్రత్యేక బృందాల నివేదిక అనంతరం పోలింగ్ కేంద్రాలను ప్రకటిస్తారు. 10 వేల మంది సిబ్బంది ఉప ఎన్నికల నిర్వహణ కోసం సిబ్బంది నియామకంపై ఎన్నికల అధికారులు ద ృష్టి సారించారు. ఉప ఎన్నికల్లో మొత్తం పదివేల మంది సిబ్బంది పాలుపంచుకోనున్నారు. అధికారులు ఇప్పటి వరకు 8,690 మంది సిబ్బంది నియామకాలపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల విధుల్లో 2,247 మంది ప్రిసైడింగ్ అధికారులు, 6,443 మంది పోలింగ్ ఆఫీసర్లు పాల్గొననున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది నియామకానికి సంబంధించి రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఎన్నికల సిబ్బందికి త్వరలో శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. మొదటగా ఈనెల 26న నియోజకవర్గానికి 30 మంది చొప్పున ప్రిసైడింగ్ ఆఫీసర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ పొందిన ప్రిసైడింగ్ ఆఫీసర్లు 30 తర్వాత నియోజకవర్గాల వారీగా పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇస్తారు. ఇదిలావుంటే ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన ఈవీఎంలను సమకూర్చుకోవటంపై అధికారులు ద ృష్టి సారించారు. ఈ మేరకు భెల్ నుంచి 2,500 కొత్త ఈవీఎంలను జిల్లాకు తెప్పిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. బందోబస్తుకు సిద్ధమవుతున్న పోలీసుశాఖ ఉప ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లపై పోలీసుశాఖ ద ృష్టి సారించింది. ఎస్పీ శెముషీ బాజ్పాజ్ ఎన్నికల బందోబస్తుకు సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేయాల్సిందిగా పోలీసు అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఉప ఎన్నికలతోపాటు గణేష్ నవరాత్రి వేడుకలు వస్తున్నందున పోలీసులు భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎన్నికల సందర్భంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసేందుకు పోలీసుశాఖ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా నియోజకవర్గాల వారీగా సున్నిత, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించే పనిలో పోలీసు శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. -
మెదక్ ఎంపీ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి?
-
ఉప ఎన్నికల నోటిఫికేషన్ జారీ..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ లోక్‌సభ, ఏపీలోని నందిగామ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల నోటిఫికేషన్ బుధవారం జారీ అయింది. మెదక్ లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించిన కే చంద్రశేఖర్‌రావు, గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి కూడా గెలుపొంది సీఎం పదవి చేపట్టారు. ఆయన తన ఎంపీ స్థానానికి రాజీనామా చేయడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అవసరమైంది. కాగా ఏపీలోని నందిగామ నుంచి గెలుపొందిన తంగిరాల ప్రభాకర్ గుండెపోటుతో మరణించడంతో.. ఖాళీ అయిన ఆ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. తొలిరోజున ఈ రెండుస్థానాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ వివరించారు. -
మెదక్ ఉప పోరుకు నోటిఫికేషన్ విడుదల
మొదటి రోజు నామినేషన్లు నిల్ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ బుధవారం విడుదల చేశారు. నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచే నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్ల స్వీకరణకు కలెక్టరేట్లో కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. నామినేషన్ల దరఖాస్తుకు ఈనెల 27వ తేదీ వరకు గడువు విధించారు. 28వ తేదీన నామినేషన్ల పరిశీలన, 30వ తేదీన నామినేషన్ల విత్‌డ్రా ఉంటుంది. సెప్టెంబర్ 13వ తేదీన మెదక్ పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుంది. 16వ తేదీన ఓట్ల కౌంటింగ్ నిర్వహిస్తారు. మొత్తమ్మీద సెప్టెంబర్ 19వ తేదీలోగా ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుంది. ఇదిలా వుంటే నోటిఫికేషన్ విడుదలైన మొదటి రోజైన బుధవారం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఇన్చార్జికి...ఫుల్‌చార్జ్ ఇప్పటివరకు జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్‌గా ఉన్న డా.ఎ.శరత్ ప్రస్తుతం జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరించనున్నారు. దీంతో కలెక్టరేట్లోని ఆయన కార్యాలయ బోర్డులను ఇన్చార్జ్ అనే పదాన్ని తొలగించి కలెక్టర్‌గా మార్చి కొత్తగా బిగించారు. ఇప్పటివరకు జేసీ ఛాంబర్ నుంచే ఇన్చార్జ్ బాధ్యతలు నిర్వహించినప్పటికీ బుధవారం నుంచి డా.ఎ.శరత్ కలెక్టర్ ఛాంబర్లోకి మారారు. -
విపక్షాలతో ‘చేయి’ కలుపుదాం!
టీఆర్ఎస్ ఓటమి లక్ష్యంగా పనిచేద్దాం దిగ్విజయ్‌సింగ్, కుంతియా, పొన్నాల, రాజనర్సింహ మంతనాలు మెదక్ బరిలో బలమైన అభ్యర్థి కోసం వెతుకులాట పరిశీలనలో కోదండరాం, జైపాల్‌రెడ్డి పేర్లు సాక్షి, హైదరాబాద్: మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఎలాగైనా ఓడించాలని భావి స్తున్న కాంగ్రెస్ పార్టీ అందుకోసం విపక్షాల సహకారాన్ని తీసుకోవాలని యోచిస్తోంది. అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే టీఆర్ఎస్పై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని అంచనా వేస్తున్న కాంగ్రెస్ పెద్దలు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండాలంటే విపక్షాలన్నీ ఏకం కావాలనే అభిప్రాయంతో ఉన్నారు. రాష్ట్రానికి వచ్చిన ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్, పరిశీలకుడు రామచంద్ర కుంతియా ఎదుట టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల, ప్రొటోకాల్ చైర్మన్ వేణుగోపాలరావు, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఇదే అంశంపై చర్చలు జరిపారు. మెదక్ ఉప ఎన్నికతోపాటు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించకపోతే భవిష్యత్‌లో ఆ పార్టీని నిలువరించడం కష్టమని వారు పేర్కొన్నారు. వచ్చే నాలుగేళ్లలో ఎలాంటి ఎన్నికలు లేనందున టీఆర్ఎస్ ఏకఛత్రాపధిత్యం కొనసాగుతుందని ఆందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ను ఓడించాలంటే విపక్షాల సహకారం అవసరమని, వారి సలహా మేరకు గట్టి అభ్యర్థిని నిలబెడదామని రాజనర్సింహ హైకమాండ్ పెద్దల ఎదుట ప్రతిపాదించినట్లు తెలిసింది. ఏఐసీసీ కార్యదర్శి జి.చిన్నారెడ్డి అయితే జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను అభ్యర్థిగా నిల బెడితే టీఆర్ఎస్ను ఓడించడం సాధ్యమవుతుందని సూచించారు. రెండు, మూడు రోజుల్లో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాల నేతలతో అంతర్గత సంప్రదింపులు జరపాలనే భావనకు వచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో టీఆర్ఎస్ను ఢీ కొట్టాలంటే కోదండరాం సరైన వ్యక్తి అని, ఆయన పోటీకి ఒప్పుకోకుంటే కేంద్ర మాజీమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డిని బరిలో దించితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. జైపాల్‌రెడ్డి సైతం సానుకూలంగా ఉన్నారని, హైకమాండ్ ఆదేశిస్తే అందరి సహకారంతో ఎన్నికల్లో నిలిచేందుకు అభ్యంతరం లేదని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. -
మెదక్ అభ్యర్థిగా కోదండరాం!
-
దేవీప్రసాద్‌ను నిలపండి
టీఆర్ఎస్కు టీఎన్జీఓ కార్యవర్గం విజ్ఞప్తి.. ఏకగ్రీవ తీర్మానం కారుణ్య నియామకాలు, పదోన్నతులపై నిషేధం వద్దు సాక్షి, హైదరాబాద్: మెదక్ లోక్‌సభ స్థానానికి ఎంపీ అభ్యర్థిగా తమ అధ్యక్షుడు జి. దేవీప్రసాదరావును పోటీ చేయించాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ (టీఎన్జీఓస్) రాష్ట్ర కార్యవర్గం సోమవారం నాడిక్కడ ఏకగ్రీవంగా తీర్మానించింది. తెలంగాణ ఉద్యమంలో కీలక భాగస్వామి అయిన దేవీప్రసాద్‌కు టీఆర్ఎస్ తరపున టికెట్ ఇవ్వాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు విజ్ఞప్తి చేసింది. నాం పల్లి టీఎన్జీఓ భవన్లో సంఘం రాష్ట్ర కార్యవర్గ అత్యవసర సమావేశం జరిగింది. దేవీ ప్రసాద్ పోటీ, జిల్లా స్థాయిలో కారుణ్య నియామకాలు, పదోన్నతులు, సమగ్ర సర్వేపై ఈ సమావేశంలో చర్చించి పలు తీర్మానాలు చేశారు. దేవీప్రసాద్‌కు టికెట్ ఇవ్వాలంటూ పది జిల్లాల కార్యవర్గాలు చేసిన ఏకగ్రీవ తీర్మానాలను కేంద్ర సంఘానికి అందజేశారు. ఆయనకు టికెట్ ఇవ్వడం ద్వారా ఉద్యోగులు అందరినీ గౌరవిం చి న ట్టు అవుతుందన్నారు. కారు ణ్య నియామకాలు, పదోన్నతులపై నిషేధాన్ని ఎత్తివేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం చేపట్టిన ‘మన రాష్ట్రం - మన ప్రణాళిక’ కార్యక్రమంలో, సమగ్రసర్వేలో పని గంటలతో సంబంధం లేకుండా పనిచేయాలని తీర్మానించింది. సర్వేను విజయవంతం చేయాలని ప్రజలను కోరింది. సమావేశంలో టీఎన్జీఓస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రవీందర్‌రెడ్డి, గంగారం, అశోక్, ముజీబ్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
మెదక్ అభ్యర్థిగా కోదండరాం!
టీపీసీసీ విస్తృతస్థాయి భేటీలో చర్చ చిన్నారెడ్డి ప్రతిపాదనకు సానుకూల స్పందన ఉప ఎన్నికల వేళ సదస్సు నిర్వహణపై భిన్నాభిప్రాయాలు 24, 25 తేదీల్లోనే సదస్సు: కుంతియా, పొన్నాల సాక్షి, హైదరాబాద్: మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను నిలిపితే ఎలా ఉం టుందనే దానిపై కాంగ్రెస్ పార్టీ యోచనలు చేస్తోంది. సోమవారం ఏఐసీసీ పరిశీలకుడు ఆర్సీ కుంతియా సమక్షంలో గాంధీభవన్‌లో జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ మేరకు ఒక ప్రతిపాదన వచ్చింది. పార్టీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి మాట్లాడుతూ మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరాంను నిలబెడితే బాగుంటుందని ప్రతిపాదిం చారు. గత ఎన్నికల్లో ఉద్యోగులంతా టీఆర్ఎస్ పక్షాన నిలిచి గెలిపిస్తే కేసీఆర్ మాత్రం కోదండరాంను పక్కనపెట్టడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. చిన్నారెడ్డి ప్రతిపాదన పట్ల పలువురు నేతలు సానుకూలంగా స్పందిం చారు. ఈ నెల 24, 25 తేదీల్లో కాంగ్రెస్ రాష్ర్ట సదస్సు నిర్వహణపై సమావేశం లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్ ఓటమికి నాయకత్వ లోపమనే కారణమనే ఆవేశంతో కార్యకర్తలు ఉన్నారని, ఉప ఎన్నికల వేళ సదస్సు నిర్వహిస్తే వారి ఆగ్రహం మరిం త రెట్టింపవుతుందని గుత్తా సుఖేందర్‌రెడ్డి, షబ్బీర్ అలీ, బలరాం నాయక్ సూచించారు. హైకమాండ్ నిర్ణయం తీసుకున్నందున సదస్సు నిర్వహించి తీరాల్సిందేనంటూ డీకే ఆరుణ, నంది ఎల్లయ్య అన్నారు. అధికారంలో ఉన్నప్పు డు కార్యకర్తలను పట్టించుకోలేదని, సదస్సు వేదికగానైనా వారి ఆవేదనను పంచుకోవాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. సమావే శం అనంతరం కుంతియా, పొన్నాల మాట్లాడుతూ హైకమాండ్ మాత్రం ఈ నెల 24, 25 తేదీల్లో సదస్సు నిర్వహించి పార్టీ బలోపేతం కోసం కార్యాచరణను రూపొందిస్తామని తెలి పారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీనేత జానారెడ్డి, శాసనమండలి ప్రతిపక్షనేత డి.శ్రీనివాస్, సీనియర్ ఎమ్మెల్యేలు గీతారెడ్డి, ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ సహా పలువురు సీనియర్ నాయకులు, పీసీసీ ఆఫీస్ బేరర్స్ సమావేశానికి హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు. రాష్ట్రానికి దిగ్విజయ్‌సింగ్ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ సోమవారం రాత్రి హైదరాబాద్ వచ్చారు. రంగారెడ్డి జిల్లా పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి సోదరుడు కుమారుడి వివాహానికి హాజరయ్యారు. మంగళవారం పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశమై రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, ఈ నెల 24, 25 తేదీల్లో నిర్వహించనున్న కాంగ్రెస్ సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించనున్నారు. సాధారణ ఎన్నికల్లో ఓటమి తరువాత తొలిసారి దిగ్విజయ్‌సింగ్ హైదరాబాద్ రావడంతో ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. -
ఉప పోరుకు సై
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: వ్యూహ రచనలో ప్రత్యర్థి కంటే ఎప్పుడూ మూడు అడుగులు ముందే ఉంటారు గులాబీ దళపతి. ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా మెదక్ పార్లమెంటు నియెజకవర్గంలో తన బలగాల మోహరింపుపై కసరత్తు మొదలు పెట్టారు. ఉప పోరుకు సిద్ధం కావాలని, 4 లక్షల ఓట్లకు పైగా మెజార్టీ లక్ష్యంగా కృషి చేయాలని ఆయన జిల్లా నాయకత్వాన్ని ఆదేశించినట్టు సమాచారం. ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలను జిల్లా మంత్రి, పార్టీ ట్రబుల్ షూటర్ హరీష్‌రావు మీదనే పెట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు కేసీఆర్ సోమవారం మంత్రి హరీష్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మదన్‌రెడ్డి తదితర నాయకులతో సమావేశమయ్యారు. గెలుపు నల్లేరు మీద నడకేనని, ఉహించని విధంగా అధిక మెజార్టీ సాధించాలని కేసీఆర్ చెప్పినట్లు తెలిసింది. సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కేసీఆర్ 2 లక్షలకు పై చిలుకు ఓట్లతో గెలుపొందారు. ఈసారి అభ్యర్థి ఎవరైనా సరే నాలుగు లక్షల మెజార్టీతో గెలిపించాలని జిల్లా పార్టీ నాయకత్వాన్ని ఆదేశించినట్టు తెలుస్తోంది. ఉప ఎన్నికను ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యూహాలపై ఆయన చర్చించినట్లు సమాచారం. అభ్యర్థిని ఎవరిని నిలబెడితే బాగుంటుందనే అంశంపై ఆయన నాయకులను అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. బీసీ,లేక ముస్లిం మైనారిటీ వర్గాల నుంచి అభ్యర్థిని నిలబెడితే ఎలా ఉంటుందనే దానిపైన ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. అలాగే ఎన్నికల సమయంలో ఎక్కడెక్కడా సభలు నిర్వహించాలి? అనే అంశంపై కూడా కూలంకశంగా చర్చినట్లు సమాచారం. ఏది ఏమైనా ఉప ఎన్నికలో అధిక మెజారిటీ సాధించేందుకు ఇప్పటి నుంచే కృషి చేయాలని కేసీఆర్ సూచించినట్టు తెలిసింది. -
సర్వే.. డౌటే!
►ఉప ఎన్నిక నోటిఫికేషన్‌తో సమగ్ర సర్వేపై సందిగ్ధం ►కోడ్ ప్రభావం ఉండకపోవచ్చు: ఇన్చార్జి కలెక్టర్ ►ఫిర్యాదులు వస్తే పరిశీలిస్తామంటున్న ఎన్నికల అధికారులు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో ఈ నెల 19న నిర్వహించబోయే ఇంటింటి సర్వేపై సందిగ్ధత నెలకొంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో జిల్లాలో సర్వే నిర్వహణ సాధ్యాసాధ్యాలపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇదిలా ఉండగా ఎన్నికల నియమావళి ప్రకారం షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. మెదక్ పార్లమెంటు స్థానంలో ఎన్నిక జరుగుతున్నప్పటికీ జిల్లా అంతటికీ కోడ్ వర్తిస్తుంది, కనుక ఎన్నిక ఫలితాలు వచ్చేవరకు జిల్లాలో అధికారిక కార్యకలాపాలు, అభివృద్ధి పనులు దాదాపు నిలిచిపోతాయి. అయితే ఇంటింటి సర్వే ప్రణాళికను ప్రభుత్వం ముందుగానే ప్రకటించింది. కనుక దానిపై ఎన్నికల కోడ్ ప్రభావం ఉండదని, సర్వేను యథాతథంగా నిర్వహించుకోవచ్చని ఎన్నికల సంఘం అధికారులు చెప్తూనే... ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే పరిగణనలోకి తీసుకుని పరిశీలిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం అధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సమగ్ర సర్వేపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. సర్వే పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ శరత్ దృష్టికి తీసుకెళ్లగా... సర్వేపై ఎన్నికల కోడ్ ప్రభావం ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వం ఇంటింటి సర్వేను ముందే ప్రకటించింది. సర్వే ప్రణాళిక ప్రక్రియ జరుగుతున్న సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. కనుక సర్వేను యథాతథంగా కొనసాగించవచ్చని, పైగా ఇది కేవలం ప్రజలకు సంబంధించిన సమాచారాన్నే ప్రభుత్వం సేకరిస్తున్నందున ఎన్నికల కోడ్ ప్రభావం సర్వేపై ఉండదు’ అని చెప్పారు. కాగా 19న సర్వే ఉంటుందనే నమ్మకంలోనే అధికారులు ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మాక్ సర్వే నిర్వహిస్తున్నారు. రాష్ట్రం అంతటా ప్రభావం... ఇంటింటి సమగ్ర సర్వేను ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 19 రాష్ట్రమంతటా ఏకకాలంలో, వేగంగా నిర్వహిస్తామని ప్రకటించారు. అయితే జిల్లాలో సర్వేపై ఎన్నికల కమిషన్ తీసుకునే నిర్ణయం రాష్ట్రమంతటా ప్రభావం చూపనుంది. ఎన్నికల కమిషన్ నుంచి సర్వే కొనసాగింపుపై అనుకూల ప్రకటన వస్తే ఎలాంటి ఇబ్బంది లేదు కాని, ఒకవేళ ప్రతికూల ప్రకటన వస్తేనే రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహణపై ప్రభావం పడనుంది. -
మెదక్ లోక్‌సభ పరిధిలో సమగ్ర సర్వే వద్దు
ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలతో తేల్చి చెప్పిన భన్వర్‌లాల్ సాక్షి, హైదరాబాద్: మెదక్ పార్లమెంట్ స్థానానికి ఉపఎన్నిక నిర్వహణకు షెడ్యూల్ విడుదలైనందున ఆ నియోజకవర్గంలో సమగ్ర కుటుంబ సర్వే చేయవద్దని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ ఆదేశించారు. ‘ఎన్నికల కోడ్’ అమలులోకి వచ్చినందున అక్కడ సర్వే చేయడానికి వీలులేదు. ఆ స్థానాన్ని మినహాయించుకుని మిగతాప్రాంతాల్లో నిర్వహించుకోవచ్చు’ అని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సమగ్ర కుటుంబ సర్వేకు దీంతో తొలి అవాంతరం ఎదురైంది. ఈ నెల 19న ఒకేరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని కుటుంబాల వద్దకు అధికారులు వెళ్లి సర్వే చేయాల్సి ఉండటం తెలిసిందే. -
సెప్టెంబర్ 13న మెదక్ ఎన్నిక
-
ఆళ్లగడ్డను విస్మరించిన ఎలక్షన్ కమిషన్
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ శనివారం షెడ్యూల్ ప్రకటించింది. మెదక్ లోక్‌సభ, నందిగామ అసెంబ్లీ స్థానాలకు సెప్టెంబర్ 13న ఉప ఎన్నిక జరగనుంది. 16న ఓట్ల లెక్కింపు చేపడతారు. కాగా ఈ నెల 20న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. 27 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 28న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఉపసంహరణకు 30 వరకు గడువు. అయితే ఎన్నికల కమిషన్ ఆళ్లగడ్డను విస్మరించింది. ఎన్నికల ప్రచారం ముగించుకుని వెళుతున్నవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఆ ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. అయితే ఆ స్థానానికి ఎన్నిక జరగాల్సి ఉన్నా ఎన్నికల కమిషన్ ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు మెదక్ లోక్ సభ స్థానం నుంచి కేసీఆర్ ఎన్నికయిన విషయం తెలిసిందే. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆ స్థానానికి రాజీనామ చేశారు. మరోవైపు నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్‌రావు గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిపిందే. దాంతో ఆ నియోజకవర్గంలో ఖాళీ ఏర్పడింది. అలాగే గుజరాత్ వడోదరా, యూపీలో అజంగఢ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. -
కేసీఆర్ రాజీనామా ఆమోదం
న్యూఢిల్లీ: మెదక్ పార్లమెంట్ స్థానానికి టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు చేసిన రాజీనావూను ఈ నెల 29న ఆమోదించినట్టు లోక్‌సభ సెక్రటరీ జనరల్ పి.శ్రీధరన్ శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ మెదక్ పార్లమెంట్ స్థానంతోపాటు, గజ్వేల్ అసెంబ్లీ నుంచి ఎన్నికైన విషయం తెలిసిందే. ఆయున టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా ఎన్నిక కావడంతో పాటు, జూన్ 2న తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చే యనున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ మెదక్ పార్లమెంట్ స్థానానికి ఈ నెల 26న రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. -
మెదక్ ఎంపీ అభ్యర్థిపై కేసీఆర్ కసరత్తు
మెదక్ ఎంపీ అభ్యర్థి ఎంపికపై టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కసరత్తును తీవ్ర తరం చేశారు. జూన్ 2వ తేదీన తెలంగాణ సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆ లోపే మెదక్ ఎంపీ అభ్యర్థిని ఎంపిక చేసేందుకు తీవ్రంగా కేసీఆర్ కృషి చేస్తున్నారు. అయితే ఆ లోక్‌సభ స్థానాన్ని ఎవరికి కేటాయించాలి అనే అంశంపై పార్టీ సీనియర్ నేతలు, ఉద్యోగ సంఘాల నేతలతో ఆయన తీవ్రంగా చర్చిస్తున్నారు. మెదక్ లోక్‌సభ స్థానానికి తమ సంఘం నాయకుడు దేవీప్రసాద్‌ని ఎంపిక చేయాలని తెలంగాణ ఎన్జీవో సంఘానికి చెందిన నేతలు కేసీఆర్‌పై ఒత్తిడి తెస్తున్నారు. మెదక్ ఎంపీ స్థానానికి పోటీ చేయాలని మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డిని కేసీఆర్ కోరగా, నాయిని సున్నితంగా తిరస్కరించారు. తానకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఇక్కడే ఉంటూ రాష్ట్రానికి సేవ చేసుకుంటానని ఆయన కేసీఆర్‌కు తన మనసులోని మాట చెప్పారు. అలాగే మాజీ ఐఏఎస్ అధికారి కె.వి.రమణాచారి అయితే ఎలా ఉంటుంది అనే అంశంపై కూడా పార్టీ నాయకులతో తీవ్రంగా చర్చించారు. మెదక్ ఎంపీ అభ్యర్థి పేరుని రేపటిలోగా ఖరారు చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ అటు గజ్వేల్ అసెంబ్లీతోపాటు ఇటు మెదక్ లోక్‌సభ స్థానానికి పోటీ చేసి రెండు చోట్ల విజయం సాధించారు. జూన్ 2వ తేదీ కేసీఆర్ తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్బంగా మెదక్ లోక్‌సభ స్థానానికి కేసీఆర్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. -
కేసీఆర్‌కు ఇక 'పరీక్షా' సమయం
-
కాంగ్రెస్ టికెటా...? వద్దు బాబోయ్.!
మెదక్ నుంచి పోటీచేసేందుకు నేతల అనాసక్తి పోటీకి నో అంటున్న విజయశాంతి, జగ్గారెడ్డి, శ్రవణ్ హస్తం ఇక భస్మాసుర హస్తమేనంటున్న నేతలు హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు మెదక్ పార్లమెంట్ సభ్యత్వానికి సోమవారం రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరగబోయే మొట్టమొదటి ఎన్నిక కాబోతుండడంతో రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక్కడి నుంచి టీఆర్ఎస్, బీజేపీల తరపున పోటీ చేసే ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉన్నప్పటికీ కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు నాయకులెవరూ ఆసక్తి చూపడం లేదు. ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలవడంతో మళ్లీ ఇక్కడి నుంచి పోటీ చేస్తే డిపాజిట్ కూడా దక్కే పరిస్థితి ఉండదనే భయం ఆ పార్టీనేతలను వెంటాడుతోంది. కోట్లు ఖర్చు చేసి ఎన్నికల్లో డిపాజిట్ గల్లంతు చేసుకోవడం కంటే పోటీ చేయకపోవడమే మేలనే భావనలో వారున్నారు. ఇటీవల మెదక్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన డాక్టర్ పి.శ్రవణ్కుమార్రెడ్డిసహా జిల్లా నేతలంతా ఇదే ఆలోచనతో ఉన్నారు. కేసీఆర్ రాజీ నామా చేసిన పార్లమెంట్ స్థానం కావడంతో అధికార టీఆర్ఎస్ పార్టీ ఈ సీటును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటుందని, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే కూడా ఆ పార్టీకే గెలుపు అవకాశాలున్నాయని కాంగ్రెస్ పెద్దలు అంచనా వేస్తున్నారు. ఇలాంటి స్థితిలో ఆ పార్టీకి గట్టిపోటీ ఇవ్వాలంటే జిల్లాలో రాజకీయంగా పట్టున్న మెదక్ మాజీ ఎంపీ విజయశాంతి, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్రెడ్డిలలో ఒకరిని ఉపఎన్నికల్లో పోటీ చేయించడమే మేలని భావిస్తున్నారు. అయితే వారిద్దరూ కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓడిపోయామని, మళ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసి డబ్బులు ఖర్చుచేసి పరువు పోగొట్టుకోవడం తమకు ఏమాత్రం ఇష్టం లేదని వారు చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ పెద్దలు మాత్రం వీరిలో ఎవరు ఒకరు పోటీ చేస్తేనే మేలనే భావనతో ఒప్పించే పనిలో పడ్డారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పలుదఫాలుగా జగ్గారెడ్డి, విజయశాంతిలతో మంతనాలు జరుపుతున్నారు. వారు ఒప్పుకో ని పక్షంలో ఎమ్మెల్సీ వి.భూపాల్‌రెడ్డిని ఉప ఎన్నికల్లో దింపాలని యోచిస్తున్నారు. మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహను పోటీచేయించాలని కొందరు నేతలు ప్రతిపాదిస్తున్నప్పటికీ ఆయన సుముఖంగా లేరని తెలుస్తోంది. కమలం గుర్తుపై పోటీకి సై : బీజేపీ ఆహ్వానిస్తే ఆ పార్టీ తరపున పోటీచేసే ఆలోచనలో విజయశాంతి, జగ్గారెడ్డి ఉన్నారు. వీరు గతంలో బీజేపీలో పనిచేసిన వారే. దేశమంతటా మోడీ గాలి ఉన్నందున కమలం గుర్తుపై పోటీ చేస్తే టీఆర్ఎస్కు గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా గెలిచే అవకాశాలూ లేకపోలేదని భావిస్తున్నారు. మంగళవారం గాంధీభవన్‌కు వచ్చిన జగ్గారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, మెదక్ లోక్ సభకు కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలనే ఆలోచనైతే నాకు లేదు. బీజేపీ వాళ్లు పిలిచి టికెట్ ఇస్తానంటే పోటీచేస్తా. లేకపోతే కాంగ్రెస్‌లోనే కొనసాగుతానన్నారు. -
మెదక్ లోకసభకు కేసీఆర్ రాజీనామా!
-
మెదక్ లోకసభకు కేసీఆర్ రాజీనామా!
న్యూఢిల్లీ: మెదక్ లోక్‌సభ స్థానానికి తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ రాజీనామా సమర్పించారు. నరేంద్రమోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవ్వడానికి దేశ రాజధానికి వెళ్లిన కేసీఆర్ తన రాజీనామ లేఖను లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు అందచేశారు. తాజా ఎన్నికల్లో కేసీఆర్ మెదక్ లోకసభ స్థానానికి, గజ్వేల్ అసెంబ్లీ స్థానాల నుంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన కేసీఆర్ టీఆర్ఎస్ శాసనసభ పక్ష నాయకుడిగా ఎంపికయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత జూన్ 2 తేదిన తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో గజ్వేల్ శాసన సభ్యుడిగా కొనసాగతూ.. మెదక్ లోకసభకు రాజీనామా చేశారు. -
ఆంధ్రప్రదేశ్ లో కేసీఆర్ దే అత్యధిక మెజార్టీ
హైదరాబాద్:ప్రస్తుతం విభజనకు సిద్ధంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అత్యధిక ఓట్లు దక్కించుకుని రికార్డు సృష్టించారు. తెలంగాణ ఉద్యమాన్ని తీవ్ర స్థాయిలో తీసుకువెళ్లి.. రాష్ట్రాన్ని దక్కించుకోవడంలో కీలకపాత్ర పోషించిన కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు పట్టంకట్టారు. మెదక్ లోక్ సభ నుంచి పోటీకి దిగిన ఆయన 3,97,029 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ నేత శ్రవణ్ కుమార్ పై భారీ విజయం సాధించారు. తెలంగాణ సెంటిమెంట్ ను ఆద్యంతం తనవైపుకు తిప్పుకున్న కేసీఆర్.. గతంలో ఇదే స్థానం నుంచే పోటీ చేసి గెలిపొందిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మెజార్టీని అధిగమించారు. ఈ నియోజకవర్గంలో అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఇందిరా గాంధీ సాధించిన 2,19,214 ఓట్ల మెజార్టీనే అత్యధికంగా ఉంది. మెదక్ పార్లమెంట్ నియోజక పరిధిలో ఉన్న గజ్వేల్ అసెంబ్లీ నుంచి కూడా పోటీకి దిగిన కేసీఆర్ 19, 218 ఓట్లతో గెలుపొందారు. కాగా, మహబూబ్ నగర్ లోక్ సభ స్థానంలో మాత్రం అత్యల్ప ఓట్ల మెజార్టీతో మాజీ కాంగ్రెస్ మంత్రి జైపాల్ రెడ్డి ఓటమి పాలైయ్యారు. ఇక్కడ నుంచి పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి జితేందర్ రెడ్డి 2,590 మెజార్టీతో గెలుపొంది తక్కువ ఓట్లతో గెలిచిన అభ్యర్థిగా నిలిచారు. -
మెదక్ ఎంపీ అభ్యర్థిగా నాయిని... రమణాచారి?
తెలంగాణ సీఎం పదవి చేపట్టనున్న కేసీఆర్ మెదక్ ఎంపీ స్థానానికి రాజీనామా చేసేందుకు సిద్దమవుతున్నారు. దాంతో మెదక్ లోక్‌సభ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దింపాలి అనే అంశంపై కేసీఆర్ పార్టీ నాయకులతో తీవ్రంగా చర్చిస్తున్నారు. మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత నాయిని నరసింహారెడ్డిని ఆ స్థానం నుంచి పోటీలోకి దింపాలని కేసీఆర్ భావించారు. అయితే అందుకు నాయినీ సుముఖత వ్యక్తం చేయలేదని సమాచారం. తాను తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కావాలని భావిస్తున్నానని... తనకు ఎమ్మెల్సీ పదవి కేటాయిస్తే తద్వారా మంత్రిగా రాష్ట్రానికి సేవ చేసుకోవాలని భావిస్తున్నట్లు నాయిని తన మనసులోని మాటను కేసీఆర్ ముందు ఉంచినట్లు సమాచారం. దాంతో మెదక్ ఎంపీగా సీనియర్ మాజీ ఐఏఎస్ అధికారి కె.వి.రమణాచారిని రంగంలోకి దింపితే ఎలా ఉంటుందని కేసీఆర్ పార్టీ సీనియర్ నేతలను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మరి కొద్ది సేపట్లో తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎంపీ, ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. ఈ సందర్బంగా కేసీఆర్ ఈ అంశంపై వారితో చర్చించే అవకాశం ఉంది. -
మెదక్ జిల్లాలో పోటాపోటీ
పార్లమెంట్ స్థానంలో కేసీఆర్ ముందంజ.. అసెంబ్లీ స్థానాల్లో పలుచోట్ల కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య ఉత్కంఠ ప్రతిష్టాత్మకమైన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో చతుర్ముఖపోటీ నెలకొంది. టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ అధినేత చంద్రశేఖర్‌రావు స్వయంగా రంగంలోకి దిగిన విషయం విదితమే. కాంగ్రెస్ నుంచి చివరి నిమిషంలో శ్రావణ్‌కుమార్‌రెడ్డి రంగంలో దిగగా.. పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి వదిలిపెట్టింది. బీజేపీ నుంచి చాగన్ల నరేంద్రనాథ్ బరిలో ఉన్నారు. ైవె ఎస్సార్సీపీ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్ రంగంలో ఉన్నారు. గతంలో కరీంనగర్, మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానాల నుంచి గెలుపొందిన చంద్రశేఖరరావు ఈసారి సొంత జిల్లా నుంచి అభ్యర్థిగా రంగంలో దిగడంతో.. ఈ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కొత్త ఊపు వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఇక్కడ నుంచే ఉద్యమం ప్రారంభించిన చంద్రశేఖరరావుకు ఎంపీగా విజయం సునాయాసమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రస్తుత ఎమ్మెల్యేల్లో ఆ పార్టీకి ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. అదీ సిద్దిపేట ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు. మిగిలిన ఆరింటిలో ఒకటి తెలుగుదేశం, ఐదింటిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 14.76 లక్షల మంది ఉన్నారు. ఈ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే అసెంబ్లీ సెగ్మెంట్లలో.. గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్చెరువు ఉన్నాయి. ఈసారి అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు పోటీ చేస్తున్న చంద్రశేఖరరావు ఎలాగైనా తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు. కేసీఆర్ ప్రత్యర్థులకు రాజకీయ అనుభవం పెద్దగా లేకపోవడం గమనార్హం. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న శ్రావణ్‌కుమార్‌రెడ్డి తొలిసారిగా ఎన్నికల బరిలో నిల్చున్నారు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న చాగన్ల నరేంద్రనాథ్ గత సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. కేసీఆర్ స్వయంగా ఈ స్థానం పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆయన ఎంత మెజారిటీతో గెలుస్తారన్న విషయంపైనే అందరి దృష్టి ఉంది. కేసీఆర్ సాధించే మెజారిటీ సిద్దిపేటలో వచ్చే మెజారిటీపై ఆధారపడి ఉంటుందన్న అభిప్రాయం ఉంది. కేసీఆర్ అసెంబ్లీకి పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో తీవ్రపోటీ నెలకొన్న నేపథ్యంలో అక్కడ నుంచి భారీ మెజారిటీ ఆశించలేకపోతున్నారు. అసెంబ్లీ కంటే పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఇతర నియోజకవర్గాల నుంచి క్రాస్‌ఓటింగ్ భారీగా జరిగే అవకాశం ఉంది. మెదక్ పార్లమెంట్ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా నరేంద్రనాథ్ నిల్చున్నా.. తెలుగుదేశం వర్గాలు సంపూర్ణంగా సహకరించడం లేదు. గజ్వేల్ నియోజకవర్గంలో ప్రతాప్‌రెడ్డి ఒక ఓటు తనకు, రెండో ఓటు కేసీఆర్‌కు వేయాలని అంతర్గతంగా చెబుతున్నట్లు సమాచారం. అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసేవారు ఎంపీ స్థానానికి వచ్చేసరికి కేసీఆర్‌వైపు మొగ్గుచూపుతున్నారు. చతుర్ముఖపోటీలో కేసీఆర్ విజయం సాధించడం తేలిక అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పరిశీలిస్తే.. గజ్వేల్: ఈ నియోజకవర్గంలో కేసీఆర్ స్వయంగా రంగంలో ఉన్నారు. టీడీపీ నుంచి వంటేరు ప్రతాప్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి నర్సారెడ్డి, వైఎస్సార్సీపీ నుంచి పురుషోత్తమరెడ్డి బరిలో ఉన్నారు. టీఆర్ఎస్, టీడీపీ మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. స్వల్ప మెజారిటీతో ఎవరినైనా విజయం వరించనుంది. సిద్దిపేట: సిద్ధిపేట నియోజకవర్గం మొదటి నుంచి టీఆర్ఎస్కు పట్టుగొమ్మగా నిలుస్తోంది. ఈసారి కూడా హరీశ్‌రావు విజయం సులభమే అన్న అభిప్రాయం వ్యకమవుతోంది. టీఆర్ఎస్ నుంచి హరీశ్‌రావు, కాంగ్రెస్ నుంచి శ్రీనివాస్‌గౌడ్, పొత్తులో భాగంగా ఇక్కడ బీజేపీ నుంచి విద్యాసాగర్ పోటీ చేస్తుండగా, వైఎస్సార్సీపీ నుంచి జగదీశ్వర్ రంగంలో ఉన్నారు. ఇక్కడ పోటీ కంటే ఏకపక్షంగా ఎన్నిక జరుగుతుందన్న అభిప్రాయం ఉంది. దుబ్బాక: ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్ నుంచి ముత్యంరెడ్డి, టీఆర్ఎస్ నుంచి రామలింగారెడ్డి, బీజేపీ నుంచి రఘునందన్‌రావు, వైఎస్సార్సీపీ నుంచి శ్రావణ్‌కుమార్ గుప్తా పోటీ పడుతున్నారు. అయితే పోటీ మాత్రం టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే నెలకొంది. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయడంతో ముత్యంరెడ్డికి ప్రజల్లో మంచి పేరుంది. అయన అభివృద్ధి కార్యక్రమాలు బాగానే ఉన్నా.. నోటి దురుసుతనం కొంత ఇబ్బంది కలిగిస్తుందని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. రామలింగారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుదగ్గ స్థాయిలో లేకపోవడం గమనార్హం తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌కు అటు నుంచి బీజేపీలో చేరిన రఘునందన్‌రావు ఇక్కడ పోటీ చేయడం వల్ల టీఆర్ఎస్ ఓట్లను చీలుస్తారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మెదక్: ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో చతుర్ముఖ పోటీ ఉన్నా.. ప్రధాన పోటీ మాత్రం టీ ఆర్ ఎస్, కాంగ్రెస్ మధ్య నెలకొంది. టీఆర్ ఎస్ ఎంపీగా ఉన్న విజయశాంతి పార్టీ మారి కాంగ్రెస్ తరుపున బరిలోకి దిగితే.. గతంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పద్మా దేవేందర్‌రెడ్డి ఈసారి టీఆర్ఎస్ తరుపున బరిలో ఉన్నారు. తెలుగుదేశం నుంచి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బట్టి జగపతి, వైఎస్సార్ సీపీ తరపున క్రీస్తుదాసు పోటీ చేస్తున్నారు. నర్సాపూర్: నర్సాపూర్ సెగ్మెంట్లో మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి మరోసారి బరిలోకి దిగారు. టీఆర్ఎస్ నుంచి మదన్‌రెడ్డి బరిలో ఉన్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి చాగన్ల నరేంద్రనాథ్ కుమారుడు బల్వీందర్‌నాథ్ బరిలో ఉన్నారు. వైఎస్సార్ సీపీ నుంచి దందె బస్వానందం పోటీ పడుతున్నారు. ఇక్కడ కూడా పోటీ టీఆర్ ఎస్, కాంగ్రెస్ మధ్యనే ఉండనుంది. పటాన్చెరు: పటాన్చెరులో చతుర్ముఖపోటీ నెలకొంది. ఇక్కడ నుంచి కాంగ్రెస్ నుంచి నందీశ్వర్‌గౌడ్, టీఆర్ఎస్ నుంచి మహిపాల్‌రెడ్డి, టీడీపీ నుంచి సపానదేవ్, వైఎస్సార్సీపీ నుంచి శ్రీనివాస్‌గౌడ్ బరిలో ఉన్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇక్కడ ఎవరు విజయం సాధించినా స్వల్ప ఆధిక్యతతోనే అన్న అభిప్రాయం ఉంది. సంగారెడ్డి: టీఆర్ఎస్ పార్టీని గట్టిగా వ్యతిరేకించే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి(జగ్గారెడ్డి) కాంగ్రెస్ నుంచి రంగంలో ఉన్నారు. టీఆర్ ఎస్ నుంచి చింతా ప్రభాకర్, బీజేపీ నుంచి సత్యనారాయణ, వైఎస్సార్సీపీ అభ్యర్థిగా శ్రీధర్‌రెడ్డి రంగలో ఉన్నారు. పోటీ ప్రధానంగా టీఆర్ ఎస్, కాంగ్రెస్ మధ్యనే ఉంటుంది. -
కేసీఆర్ రాజకీయాల నుంచి తప్పుకో: రాములమ్మ
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గతంలో ఇచ్చిన మాట తప్పారని మెదక్ ఎంపీ విజయశాంతి (రాములమ్మ) మండిపడ్డారు. మాట తప్పడం కేసీఆర్ నైజమని ఆమె గుర్తు చేశారు. ఇచ్చిన మాట మీద నిలబడని కేసీఆర్ రాజకీయాల నుంచి రిటైర్ కావాలని డిమాండ్ చేశారు. గురువారం మెదక్‌లో స్థానిక అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రాములమ్మ గురువారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేసీఆర్‌పై రాములమ్మ నిప్పులు చెరిగారు. తాను మెదక్ ఎంపీగా ప్రజలకు కోసం చేపట్టిన పలు సంక్షేమ పథకాలు ప్రజలకు చేరకుండా ఆ పార్టీ సీనియర్ నేతలు హరీష్‌రావు, పద్మా దేవేందర్ రెడ్డిలు అడ్డుకున్నారని ఆరోపించారు. తన నియోజకవర్గంలో వీధి దీపాలు, నీటీ మోటార్లు ఏర్పాటుకు నిధులు విడుదల చేసిన వాటిని ఆ సదరు నేతలు దుర్వినియోగం చేశారని విమర్శించారు. తాను తెలంగాణ కోసం ఎప్పటి నుంచో పోరాడిన సంగతి ఈ సందర్బంగా రాములమ్మ గుర్తు చేశారు. నిన్నకాక మొన్న పుట్టిన టీఆర్ఎస్ తెలంగాణ కోసం పోరాటాం చేశాననడం విడ్డూరంగా ఉందని రాములమ్మ ఎద్దేవా చేశారు. -
లాఠీ దెబ్బలు తిన్నా, రక్తం చిందించినా.. టికెట్ రాకపాయే
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సామాన్యుడి కడుపు రగిలింది.. లాఠీ దెబ్బలు తిని, రక్తం చిందించి సాధించిన తెలంగాణ ఈనెగాసి నక్కల పాలైపోతోందని ఓ కార్యకర్త గుండె గాయపడింది. కార్యకర్తలు బలిపశువులై, బలిదానాలు చేసి బతికించుకున్న తెలంగాణ ఉద్యమ పార్టీ ఇవాళ బలిసినోళ్ల జాగీరు అయిందని ఆ గుండె మండింది. ఆవేశం కట్టలు తెంచుకుంది. ఆత్మాభిమానం పొంగింది. అభిమాన నేత పేరును రక్తంతో రాసిన ఆ చెయ్యే తిరుగుబాటు జెండా ఎగరేసింది. నవ తెలంగాణ పున ర్నిర్మాణం అంటే ఇదేనా అని నిలదీసింది. ఇంతకాలం ఆత్మ గౌరవ పోరాటం చేసింది ఆత్మాభిమానం చంపుకోవటానికేనా? అని ప్రశ్నించింది. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీరయ్య యాదవ్ ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌పై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఆయన కేసీఆర్‌పై రెబల్‌గా బరిలోకి దిగారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలోనే పనిచేసిన ఆయన వయసు, పైసా ఉద్యమంలో కరిగిపోయాయి. 1986 యుక్త వయసులో గొల్ల కుర్మ సంఘం నేతగా, సామాజిక ఉద్యమకారునిగా జిల్లాలో ఓ వెలుగు వెలిగిన ఆయన 1997లో సమాజ్‌వాది పార్టీ తరఫున మెదక్ ఎంపీ పోటీ చేసి 35 వేల ఓట్లు తెచ్చుకున్నారు. 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత సంగారెడ్డి నియోజకవర్గంలో ఆ పార్టీకి పెద్ద దిక్కయ్యారు. ఈ 14 ఏళ్ల కాలంలో ఉద్యమానికి అండగా నిలబడ్డారు. ఉద్యమకారులకు ఊతకర్రయ్యారు. 2005-06 కాలంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కేసీఆర్‌పై తిరుగుబాటు చేసిన సమయంలో బీరయ్య పార్టీకి అండగా నిలబడ్డారు. చెల్లాచెదురైన కార్యకర్తలను పోగేసి ఉద్యమం నడిపించారు. ఉద్యమానికి ఆర్థికంగా సహాయపడ్డారు. 2004, 2009 ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పి మాట తప్పారు. తెలంగాణ సాధన తప్ప మరో పదవీకాంక్ష వ్యక్తం చేయని బీరయ్య.. తెలంగాణ ఆకాంక్ష నెరవేరిన తర్వాత తన భార్యకు జెడ్పీటీసీ టికెట్ ఇచ్చి జెడ్పీ చైర్మన్ చేయాలని కేసీఆర్‌ను కోరారు. చిరునవ్వుతో కేసీఆర్ ఒప్పుకున్నారు. బీరయ్య జెడ్పీటీసీ బీఫారం ఇవ్వాలని అక్కడే ఉన్న నియోజకవర్గం నాయకులు చింతా ప్రభాకర్, జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆర్. సత్యనారాయణను ఆదేశించినట్లు బీరయ్య చెప్తున్నారు. తీరా బీ ఫారం ఇచ్చే సమయంలోనే తనకు ఉత్తి చేతులు చూపించడంతో ఆయన మనుసు గాయపడింది. నేరుగా కేసీఆర్‌కు లేఖ రాసి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది అవమానించడమే అని బాధపడ్డారు. ఆయినా ఆయన నుంచి స్పందన రాలేదు. కేసీఆర్ నామినేషన్ వేయడానికి సంగారెడ్డి పట్టణానికి వస్తే బీరయ్య ఎదురుపోయి నమస్కరించారు. అయినా కేసీఆర్ నుంచి పలకరింపు లేదు. బీరయ్య ఆత్మాభిమానం దెబ్బతింది. రగుల్జెండా చేతపట్టింది. ఆ తర్వాత ఏమైందో బీరయ్య యాదవ్ మాటల్లోనే.. ‘కేసీఆర్ అగ్రకులం భావజాలం ఉన్న నాయకుడు. కేసీఆర్ ఎజెండా బయటపెట్టాలని 2001లోనే నేను డిమాండ్ చేశా. అప్పుడు వారం రోజుల్లోనే ఎజెండా ప్రకటించారు. చిన్న రాష్ట్రాల వల్ల చిన్న సమూహాలకు రాజ్యాధికారం వస్తుంది. పరిపాలన సౌలభ్యం జరుగుతుంది, అధికార వికేంద్రీకరణ జరుగుతుంది’ అని అంబేద్కర్ మాటలను కేసీఆర్ చెప్పారు. ఆ మాటలతోనే నేను టీఆర్ఎస్ ఉద్యమంలోకి వచ్చాను. ఇప్పటివరకు సుమారు కోటి రూపాయలు, విలువైన నా వయసును ఖర్చు చేశాను. లాఠీ దెబ్బలు తిన్నా... జైలుకు పోయినా.. రాజకీయ పాఠాలు చెప్పా.. సమ్మెలు చేసినా.. ఇల్లు అమ్ముకున్న. తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో నా రక్తం, నా చెమట, నా కష్టం ఉంది. మొన్న కూడా దానం నాగేందర్ మనుషులు వచ్చి కొడితే నరాలు చితికిపోయి చేతులు వణుకుతున్నాయి. పోలీసులు తొక్కితే మూడు రోజులు కడుపులోంచి రక్తం పడింది. ఉద్యమకారునికి ఇది మామూలే అని నా మనుసుకు సర్ది చెప్పుకున్న. వెనుకటికి ఉడుము మూతికి తేనె పూసి దొంగలు కోటలు ఎక్కేవారట. మా మెదడుకు మేం పూసుకున్న జై తెలంగాణ సెంటిమెంటుతో ఉరికాం. కార్యకర్తలం బలి పశువులం అయ్యాం. ఇప్పుడు బలిసినోళ్లు వచ్చి టికెట్లు తీసుకుంటున్నారు. ఇదే కేసీఆర్‌ను నేను అడుగుతున్నా ఉద్యమం చేసిన వాళ్లకు ఎంత మందికి టికెట్లు ఇచ్చారో చెప్పండి. అందరికి ఎమ్మెల్యే పదవులే ఇవ్వాల్సిన పని లేదు. కనీసం ఎంపీటీసీలు, జెడ్పీటీసీ పదవులైనా నిఖార్సుగా ఉద్యమంలో నడిచిన వారికే ఇచ్చారో చెప్పండి చాలు. ఆయారం గయారంలు డబ్బులు చేతిలో పెట్టుకొని రావడం, టికెట్లు తీసుకోవడం, చిన్న చిన్న పదవులు వాళ్ల భజన పరులకు ఇచ్చుకోవడం తప్పితే మాలాంటి వాళ్లకు అవకాశం ఏది? నేను జెడ్పీటీసీ అడిగాను, కేసీఆరే ఇస్తామని చెప్పారు. ఎందుకు ఇవ్వలేదు. నా ఉద్యమ జీవితం కనీసం జెడ్పీటీసికి కూడా పనికి రాదా? పోని నాకంటే గొప్ప ఉద్యమకారుడు ఇప్పుడు మీ పార్టీలో టికెట్లు ఇచ్చిన వాళ్లలో ఉన్నారా? నాలాగే అన్యాయానికి గురైన బీరయ్య యాదవ్‌లు తెలంగాణ రాష్ర్టంలో చాలా మంది ఉన్నారు. అంతెందుకండీ నా కళ్లముందే దాదాపు 100 మందికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తానని కేసీఆర్ నచ్చజెప్పారు. నిజానికి ఎమ్మెల్సీ పదవులు ఎన్ని ఉంటాయి. ఇలాంటి మాటలతో మోసం చేయొద్దనే నా నిరసన తెలియజేయడానికే కేసీఆర్‌పై రెబల్‌గా పోటీ చేశాను. తుది వరకు పోరాడుతా? గెలపు ఓటములు నాకు ముఖ్యం కాదు. జరుగుతున్న అన్యాయాన్ని నలుగురి చెప్పడమే నా లక్ష్యం.’ అంటూ కన్నీరు పెట్టుకున్నాడు బీరయ్య. -
మెదక్‌లో 25 లక్షల విలువైన చీరలు, ప్యాంట్లు స్వాధీనం
ఓటర్లకు పంచేందుక సిద్ధం చేసిన వైనం బీజెపీ లోక్‌సభ అభ్యర్థి నరేంద్రనాథ్ అరెస్ట్.. అనంతరం బెయిల్‌పై విడుదల హైదరాబాద్: ఓటర్లకు పంచడానికి పెద్ద మొత్తంలో చీరెలు, ప్యాంట్లు, షర్టులు, గడియారాలు సిద్ధం చేసిన మెదక్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి సీహెచ్. నరేంధ్రనాథ్ను పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. అనంతరం ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీలింగాపురంలో ఒక్క చోటే బీజెపీ కమలం గుర్తు, సీహెచ్. నరేంధ్రనాథ్ పేరు ముద్రించి ఉన్న 25 లక్షల రూపాయల విలువగల చీరెలు, ప్యాంట్లు, షర్టులు, అల్మారాలు, గోడ వాచీలను పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. మెదక్ లోక్‌సభ పరిధిలోని దుబ్బాక, గజ్వేల్, నర్సాపూర్, పటాన్చెరువు అసెంబ్లీ నియోజకవర్గాల్లో చీరెలు, ప్యాంట్లు, షర్టులు స్వాధీనం చేసుకోగా, తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌కు నివేదిక పంపించారు. దానిని భన్వర్‌లాల్ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపించారు. ఈ విషయాన్ని సీఈసీ తీవ్రంగా పరిగణిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. కాగా, ఆ వస్తువులన్నీ తనవేనని, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి ముందుగా పంపిణీకి సిద్ధం చేశానని నరేంద్రనాథ్ విచారణలో అంగీకరించినట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 123 (1)-ఎ కింద కమిషన్ నిర్ణయం తీసుకోవచ్చునని అధికార వర్గాలు తెలిపాయి. నామినేషన్‌ను కూడా తిరస్కరించే అవకాశం ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. -
కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి
-
'నేనెప్పుడు చనిపోతానా అని చూస్తున్నారు'