మెదక్‌లో టీఆర్‌ఎస్‌దే హవా | Medak TRS party in the Lok Sabha by-election | Sakshi
Sakshi News home page

మెదక్‌లో టీఆర్‌ఎస్‌దే హవా

Published Wed, Sep 17 2014 12:45 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

మెదక్‌లో టీఆర్‌ఎస్‌దే హవా - Sakshi

మెదక్‌లో టీఆర్‌ఎస్‌దే హవా

కొత్త ప్రభాకర్‌రెడ్డి ఘనవిజయం
ప్రచారంలో విఫలమై భారీ మూల్యం చెల్లించిన కాంగ్రెస్, బీజేపీ
రెండు, మూడు స్థానాలకు పరిమితం


సంగారెడ్డి: మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ పార్టీ మరోసారి సత్తా చాటింది. ప్రతిపక్షాలను చిత్తు చేసి ఎంపీ స్థానాన్ని ఏకపక్షంగా గెలుచుకుంది. ఆ పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డిపై 3,61,288 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన బీజేపీ అభ్యర్థి తూర్పు జగ్గారెడ్డి మూడో స్థానానికి పడిపోయారు. తెలుగుదేశం పార్టీ ఆయనకు అండగా నిలిచినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.

మొత్తం 14 మంది అభ్యర్థులు బరిలో నిలబడగా.. 11 మందికి డిపాజిట్లు గల్లంతయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామాతో మెదక్ స్థానానికి లోక్‌సభ ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఈ నెల 13న ఉప ఎన్నిక జరగగా, మంగళవారం ఓట్ల లెక్కింపు జరిగింది. మొత్తం 10,46,092 ఓట్లు పోలవ్వగా టీఆర్‌ఎస్ అభ్యర్థికి 5,71,810 ఓట్లు వచ్చాయి. 2,10,524 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి రెండో స్థానంలో, 1,86,343 ఓట్లతో బీజేపీ అభ్యర్థి మూడో స్థానంలో నిలిచారు. గత సాధారణ ఎన్నికల్లో 77.35 శాతం పోలింగ్ నమోదు కాగా, ఇక్కడ పోటీ చేసిన కేసీఆర్‌కు 3.97 లక్షల ఓట్ల మెజార్టీ వచ్చింది. అయితే ఈసారి 67.79 శాతం మాత్రమే పోలింగ్ నమోదైనప్పటికీ టీఆర్‌ఎస్‌కు ఓట్ల శాతం తగ్గకపోవడం గమనార్హం. గత ఎన్నికల్లో గులాబీ దండుకు 55 శాతం ఓట్లు రాగా.. ఈ ఉపఎన్నికలో దాన్ని స్వల్పంగా పెంచుకుని 55.2 శాతం ఓట్లను కొల్లగొట్టింది. కాగా, ఈ ఎన్నికలో ఘన విజయం సాధించిన కొత్త ప్రభాకర్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. భారీ మెజార్టీ సాధించడంలో కీలక పాత్ర పోషించిన మంత్రి హరీష్‌రావును సైతం అభినందించారు.

సిద్దిపేటదే హవా..

కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆధిక్యతలో సిద్దిపేట నియోజకవర్గమే కీలకమైంది. ఇక్కడ 76,733 ఓట్ల మెజార్టీతో టీఆర్‌ఎస్ అభ్యర్థికి తిరుగులేని ఆధిక్యత దక్కింది. మొత్తం 1,35,593 ఓట్లు పోల్ కాగా.. ఇందులో 93,759 ఓట్లు టీఆర్‌ఎస్ పార్టీకే వచ్చాయి. ఇక నర్సాపూర్ నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్న సునీతారెడ్డి నిరాశ చెందక తప్పలేదు. నర్సాపూర్‌లో సునీతారెడ్డికి 67,267 ఓట్లు మాత్రమే రాగా... టీఆర్‌ఎస్‌కు 73,710 ఓట్లు పడ్డాయి. వెనుకబడి పోతారనుకున్న చోటే గులాబీ దండుకు 6,443 ఓట్ల ఆధిక్యత లభించడం విశేషం. ఇక సంగారెడ్డి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డికి షాక్ తగిలింది. ఇక్కడి ఓటర్లు కూడా టీఆర్‌ఎస్ అభ్యర్థికే అండగా నిలిచారు. ఈ నియోజకవర్గంలో 18,849 ఓట్లతో జగ్గారెడ్డి వెనుకబడ్డారు.

చతికిలపడిన ప్రతిపక్షాలు

రైతు రుణమాఫీపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత రాలేదన్న అంశాన్ని అస్త్రంగా చేసుకుని ప్రజల్లోకి వెళ్లిన ప్రతిపక్షాలు.. అధికారపార్టీపై పెద్దగా ఒత్తిడిని పెంచలేకపోయాయి. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ప్రజా సమస్యలను వదిలి వ్యక్తిగత దూషణలు అందుకోవడం కూడా వారికి నష్టం చేకూర్చింది. టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి వంటి వారు ఇంకో అడుగు ముందుకేసి బహిరంగ చర్చలతో సవాళ్లకు దిగారు. మరోవైపు మంత్రి హరీష్‌రావు ఈ వాతావరణాన్ని తనకు అనుకూలంగా మలచుకున్నారు. వ్యూహాత్మకంగా వ్యవహరించి ప్రతిపక్షాలను ఇరకాటంలో పెట్టారు. రుణమాఫీ, రైతుల ఆత్మహత్యల అంశాల జోలికి వెళ్లకుండా సవాళ్లు, ప్రతిసవాళ్లకే వాటిని పరిమితం చేశారు. సిద్దిపేట తరహా అభివృద్ధిని రాష్ర్ట మంతటికీ విస్తరిస్తామని కేసీఆర్ కూడా అభివృద్ధి అంశాన్ని తెరపైకి తెచ్చారు. మరోవైపు సిద్దిపేట అభివృద్ధిని జగ్గారెడ్డి అడ్డుకున్నాడని ఆరోపణ చేస్తూ, కాదని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని హరీష్ సవాల్ విసరడంతో బీజేపీ నేతలు పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయారు. దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో వివరణలకే పరిమితమై విలువైన సమయాన్ని వృథా చేసుకున్నారు. మొత్తానికి ప్రధాన సమస్యలపై ప్రజల్లోకి వెళ్లాల్సిన కాంగ్రెస్, బీజేపీలు అస్త్ర సన్యాసం చేసినట్టు వ్యవహరించి ఉప ఎన్నికలో విఫలమయ్యాయి. అందుకే ఓటింగ్ శాతం భారీగా పడిపోయినా టీఆర్‌ఎస్ మెజార్టీలో పెద్దగా తేడా రాలేదని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement