మెదక్‌లో మరోసారి టీఆర్‌ఎస్ ఘనవిజయం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మెతుకుసీమలో ‘కొత్త గులాబీ’ పరిమళించింది. టీఆర్‌ఎస్ పార్టీకే ప్రజలు మరోసారి పట్టం కట్టారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై జిల్లా ఓటర్లు సంపూర్ణ విశ్వాసం ప్రకటించారు. మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికలో పోలింగ్ శాతం తగ్గినా.. ప్రత్యర్థుల మీద ఆ పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించింది. ఏకపక్షంగా సాగిన ఓట్ల లెక్కింపులో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి 3,61,286 ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలుపొందారు.
కాంగ్రెస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి రెండో స్థానంలో, బీజేపీ అభ్యర్థి తూర్పు జగ్గారెడ్డి మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఈ ఇద్దరు అభ్యర్థులు ఓటమి పాలైనప్పటికీ డిపాజిట్లు రావడంతో పరువు దక్కినట్టయింది. గత సాధారణ ఎన్నికలతో పోలిస్తే టీఆర్‌ఎస్ పార్టీకి ఉప ఎన్నికలో 0.2 శాతం ఓట్లు అదనంగా వచ్చాయి. గత ఎన్నికల్లో ఆ పార్టీకి 55 శాతం ఓట్లు రాగా, ఈసారి 55.2 శాతం ఓట్లు వచ్చాయి.
పోటీలో నిలబడిన అభ్యర్థులు ఎవరూ తమకు నచ్చలేదని 10,687 మంది ఓటర్లు ‘నోటా’కు ఓటు వేశారు. మంగళవారం మొత్తం 22 రౌండ్లలో జరిగిన ఓట్ల లెక్కింపులో ప్రతి రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థి ఆధిక్యత కనబరిచారు. గజ్వేల్, సిద్దిపేట, మెదక్, పటాన్‌చెరు, సంగారెడ్డి, దుబ్బాక, నర్సాపూర్ నియోజకవర్గాల్లో ప్రభాకర్‌రెడ్డికి మెజార్టీ ఓట్లు లభించాయి. ఓటమిని ముందే ఊహించిన సునీతా లక్ష్మారెడ్డి, జగ్గారెడ్డి ఓట్ల లెక్కింపు కేంద్రానికి కూడా రాలేదు.
ముగ్గురిలో ఇద్దరు కారు గుర్తుకే..
మొత్తం 10,46,114 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోగా ప్రతి ముగ్గురిలో ఇద్దరు కారు గుర్తుకే ఓటేశారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డికి 5,71,810 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థికి 2,10,524 ఓట్లు, బీజేపీ అభ్యర్థి తూర్పు జగ్గారెడ్డికి 1,86,343 ఓట్లు వచ్చాయి. గత సాధారణ ఎన్నికల్లో 77.35 శాతం పోలింగ్ కాగా, అప్పుడు కేసీఆర్‌కు 3.97 లక్షల ఓట్ల మెజార్టీ వచ్చింది. అదే మెజార్టీని తిరిగి సాధించాలని టీఆర్‌ఎస్ పావులు కదిపింది. అయితే ఈ సారి 9.56 మేర పోలింగ్ శాతం తగ్గింది.
ప్రభుత్వంపై వ్యతిరేకత కారణంతోనే పోలింగ్ శాతం తగ్గిందని ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. రైతు వ్యతిరేకత బలంగా ఉందని, తమకే మెజార్టీ ఓట్లు పడతాయని, టీఆర్‌ఎస్ పార్టీ భారీగా నష్టపోతారని ప్రతిపక్షాలు అంచనా వేశాయి. కేసీఆర్ వంద రోజుల పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండం అనే వాదనను తెరమీదకు చెప్పి భారీ ప్రచారం చేశారు. నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు కూడా మెదక్ ప్రజల తీర్పు మా పాలనకు రెఫరెండమే అని ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయాల్లో మెదక్ ఉప ఎన్నిక ప్రత్యేకతను సంతరించుకుంది. అయితే ప్రతిపక్షాల అంచనాలను మెదక్ జిల్లా ప్రజలు తలకిందులు చేశారు.
త్రుటిలో తప్పింది...
బీజేపీ అభ్యర్థి తూర్పు జగ్గారెడ్డి ‘డిపాజిట్’ గండం నుంచి త్రుటిలో బయటపడ్డారు. అభ్యర్థులకు డిపాజిట్లు దక్కాలంటే పోలయిన మొత్తం ఓట్లలో కనీసం 6 వంతు ఓట్లు రావాలి. ఉప ఎన్నికలో మొత్తం 10,46,114 ఓట్లు పోలయ్యాయి. ఆరో వంతు అంటే 1,74,353 ఓట్లు రావాలి. అనూహ్యంగా జగ్గారెడ్డికి 1,86,343 ఓట్లు రావటంతో డిపాజిట్ దక్కింది. జగ్గారెడ్డి సంగారెడ్డి నియోజకవర్గంపై భారీ ఆశలే పెట్టుకున్నారు. ఇక్కడ తనకు ఆధిక్యత వస్తుందని అంచనా వేశారు. అయితే సంగారెడ్డిలో 18,849 ఓట్లు వెనుకబడిపోయారు.
ఇక కాంగ్రెస్ పార్టీని సాంప్రదాయక ఓట్లు ఆదుకున్నాయి. డిపాజిట్ ఓట్ల కంటే సునీతారెడ్డికి 36,171 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. సునీతారెడ్డి తన సొంత నియోజకవర్గం నర్సాపూర్ మీద ఆశలు పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి బాగా కలిసి వస్తుందని భావించారు. కానీ అక్కడ టీఆర్‌ఎస్‌కు 6,443 ఓట్ల ఆధిక్యత లభించింది. టీఆర్‌ఎస్‌కు 73,710 ఓట్లు రాగా, సునీతారెడ్డికి 67,267 ఓట్లు మాత్రమే వచ్చాయి.
సత్తా చాటిన సిద్దిపేట
సిద్దిపేట మునుపటి సత్తా చాటింది. కొత్త ప్రభాకర్‌రెడ్డికి తిరుగులేని ఆధిక్యతను తెచ్చిపెట్టింది. టీఆర్‌ఎస్ ఆధిపత్యానికి చెక్ పెట్టడానికి కాంగ్రెస్, బీజేపీలు సిద్దిపేటనే టార్గెట్ చేశాయి. మరో వైపు మంత్రి హరీష్‌రావు సిద్దిపేటను పూర్తిగా తన కార్యకర్తలకు అప్పజెప్పి ఆయన సంగారెడ్డి, పటాన్‌చెరు, నర్సాపూర్ మీదనే దృష్టి సారించారు. అనుకున్నట్టుగానే సిద్దిపేట నియోజకవర్గంలో భారీగా పోలింగ్ తగ్గటంతో ప్రతిపక్ష నాయకులు తమ వ్యూహం ఫలించినట్టుగానే భావించారు.
టీఆర్‌ఎస్ మెజారిటీకి గండి పడ్డట్లేనని అనుకున్నారు. కానీ ప్రజా తీర్పు వేరేలా ఉంది. ఇక్కడ మొత్తం 1,35,593 ఓట్లు పోల్ కాగా.. ఇందులో 70 శాతం ఓట్లు అంటే 93,759 ఓట్లు టీఆర్‌ఎస్ పార్టీకి వచ్చాయి. మూడు నెలల కిందట జరిగిన ఎన్నికల్లో కూడా సిద్దిపేటలో టీఆర్‌ఎస్‌కు 70 శాతం ఓట్ల ఆధిక్యత రావటం గమనార్హం.
పోస్టల్ బ్యాలెట్‌లోనూ టీఆర్‌ఎస్ ఆధిక్యం...
పోస్టల్ బ్యాలెట్లలోనూ టీఆర్‌ఎస్‌కు ఆధిక్యమే లభించింది. ఎన్నికల అధికారులు ముందుగా పోస్టల్ బ్యాలెట్లనే లెక్కించారు. మొత్తం 22 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రాగా అందులో 10 టీఆర్‌ఎస్‌కు, 9 బీజేపీకి, ఒకటి కాంగ్రెస్‌కు దక్కాయి. రెండు ఓట్లు చెల్లలేదని అధికారులు ప్రకటించారు.