సంగారెడ్డిలో కాంగ్రెస్ ప్రజా గర్జన సభ
హైదరాబాద్ : జూన్ 1వ తేదీన సంగారెడ్డిలో తెలంగాణ ప్రజా గర్జన పేరుతో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆయన గురువారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ..ఉద్యోగాలు రాని నిరుద్యోగులు, గిట్టుబాటు ధర దక్కక ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల కోసమే ప్రజా గర్జన సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజా గర్జన సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారని ఉత్తమ్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడతామని అన్నారు. కేసీఆర్ పాలన నియంతృత్వం ట్రేడ్‌మార్క్‌లా మారిందని ఉత్తమ్ ధ్వజమెత్తారు.
రైతు ఆత్మహత్యలకు గత ప్రభుత్వాలే కారణమని నిస్సిగ్గుగా ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్నారని, ఇటీవల జరిగిన రైతుల ఆత్మహత్యలు మీ పాలనలో కాదా ఆయన సూటిగా ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండోస్థానంలో ఉందని ఉత్తమ్ మండిపడ్డారు. భూ సేకరణ చట్టాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని తెలిపారు. బీజేపీ తమవి గొప్ప సిద్ధాంతాలంటూ ప్రతి ఇల్లు తిరుగుతూ కాంగ్రెస్ నేతలను ప్రలోభపెడుతుందన్నారు. ఎవరు ఏ పార్టీలో చేరడం లేదని... కాంగ్రెస్ పార్టీలో చేరతామంటూ బీజేపీ సీనియర్లే తమను సంప్రదిస్తున్నారని ఉత్తమ్ అన్నారు.