సాక్షి, హైదరాబాద్: దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన గాంధీ కుటుంబ చరిత్ర లేకుండా చేసేందుకు కేంద్రంలోని మతతత్వ బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. గాంధీ కుటుంబ త్యాగాలను తక్కువ చేసి చూపిస్తూ వారి చరిత్ర భావితరాలకు తెలియకుండా చేయాలనే ఆలోచనతో మోదీ సర్కారు ముందుకెళుతోందని ఆయన దుయ్యబట్టారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజల హృదయాల్లో మాజీ ప్రధాని రాజీవ్‌తోపాటు గాంధీ కుటుంబం చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. రాజీవ్‌గాంధీ 27వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ సోమాజిగూడలోని ఆయన విగ్రహానికి పార్టీ నేతలతో కలసి ఉత్తమ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడే ఉగ్రవాద వ్యతిరేక దినాన్ని పాటించారు.
ఈ సందర్బంగా ఉత్తమ్ మాట్లాడుతూ చిన్న వయసులోనే దేశ ప్రధానిగా ఎన్నికైన రాజీవ్ గాంధీ ప్రపంచ గొప్ప నేతలలో ఒకరని కొనియాడారు. అనేక విప్లవాత్మక, చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్న రాజీవ్.. యువతకు రాజకీయాల్లో ప్రాధాన్యం ఇచ్చారని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను తరిమికొట్టి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు రాజీవ్ వర్ధంతి స్ఫూర్తిగా కార్యకర్తలు నడుంబిగించాలని ఆయన పిలుపునిచ్చారు. మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ మతతత్వ శక్తులను అడ్డుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులు పనిచేయాలన్నారు. దేశంలో అద్భుత సంస్కరణలకు పునాది వేసిన రాజీవ్ దేశ యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. మాజీ ఎంపీ వీహెచ్ మాట్లాడుతూ బీజేపీ, టీఆర్‌ఎస్‌లను ఓడించేందుకు పార్టీ నేతలు, శ్రేణులు ఐకమత్యంగా పనిచేయాలని కోరారు. అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ అంజన్ కుమార్‌యాదవ్, మాజీ మంత్రి దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
గాంధీ భవన్‌లోనూ నివాళి
రాజీవ్ వర్ధంతి సందర్భంగా గాంధీ భవన్‌లోనూ ఆయన చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉత్తమ్‌తోపాటు సీనియర్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, గూడూరు నారాయణరెడ్డి, సురేశ్‌రెడ్డి, మల్లు రవి, అంజన్‌కుమార్ యాదవ్, అనిల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, రాజీవ్ వర్ధంతి సందర్భంగా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ నేతృత్వంలో గాంధీ భవన్‌లో నిర్వహించిన ఈ శిబిరాన్ని ఉత్తమ్ ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment