విద్యారంగాన్ని కలుషితం చేస్తారా?
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: జ్ఞానాన్ని అందించే కేంద్రాలైన యూనివర్సిటీలను, విద్యారంగాన్ని కాషాయంతో కలుషితం చేసే కుట్రలో భాగంగా జేఎన్‌యూ, పటియాలా హౌజ్ కోర్టులో జరిగిన ఘటనలు బాధాకరమని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ నేతలు ఎం.కోదండరెడ్డి, వేణుగోపాల్‌రావులతో కలసి శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ, అసహనంతో జరుగుతున్న ఇలాంటి సంఘటనలు దేశ ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు.
వర్సిటీల్లో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ వాటి అనుబంధ సంస్థ ఏబీవీపీ అనుసరిస్తున్న తీరును వ్యతిరేకించిన వారిపై తప్పు డు కేసులు పెడుతున్నారని ఉత్తమ్ ఆరోపించారు. ఏబీవీపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న కన్హయ్య కుమార్ దేశద్రోహానికి పాల్పడినట్టుగా కాంగ్రెస్‌పార్టీ నమ్మడం లేదన్నారు. యూనివర్సిటీల్లో ప్రశాంత వాతావరణాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాలకు ఉత్తమ్ విజ్ఞప్తి చేశారు.