ఉత్తమ్... దమ్ముంటే రా..! | CM KCR open challenge to Uttam | Sakshi
Sakshi News home page

ఉత్తమ్... దమ్ముంటే రా..!

Published Thu, Aug 25 2016 12:37 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

ఉత్తమ్... దమ్ముంటే రా..! - Sakshi

ఉత్తమ్... దమ్ముంటే రా..!

టీపీసీసీ చీఫ్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ సవాల్
 
 సాక్షి, హైదరాబాద్: తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్రతో గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుని ఉంటే దాన్ని బయట పెట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సవాల్ విసిరారు. నిజాయితీ ఉంటే.. దమ్ముంటే.. ఆ ఒప్పంద పత్రాన్ని బేగంపేట ఎయిర్‌పోర్టుకు తీసుకురావాలని, ఒప్పందం నిజమే అయితే తాను ఇంటికి కాకుండా నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు రాజీనామా లేఖ సమర్పిస్తానని, రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు. గోదావరి ప్రాజెక్టులకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాల అనంతరం బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్న ముఖ్యమంత్రికి బేగంపేట ఎయిర్‌పోర్టు వద్ద ఘన స్వాగతం లభించింది. పలు జిల్లాల నుంచి రైతులు, ప్రజలు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రసంగం ఆయన మాటల్లోనే..

కాంగ్రెస్‌వి పచ్చి అబద్ధాలు
 మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందం రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. రాష్ట్రానికి చిరకాలం, కలకాలం పచ్చని  పంటలు పండించే వరప్రదాయని ఈ ఒప్పందం. ఈ రెండేళ్ల కాలం గడిస్తే కాళేశ్వరం, ఎల్లంపల్లి, మిడ్ మానేరు నుంచి మెదక్ జిల్లాకు నీరొస్తే.. మొగులుకు ముఖం పెట్టే పరిస్థితి పోతది. మన పంటలు ఎండని పరిస్థితి ఉంటది. వర్షాలు కురిసినా, కురవక పోయినా వ్యవసాయ రంగంలో తెలంగాణ బ్రహ్మాండంగా ముందుంటది. ఇంత మంచి ఒప్పందాన్ని చాలా ఓపిక, సంయమనం, సామరస్యం, డిప్లమసీతో గత ఏడాదిన్నరగా కష్టపడి చేసుకున్నం. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నరు. కానీ కాంగ్రెస్ సన్నాసులకు మాత్రం నల్ల జెండాలు కనపడుతున్నాయి.

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి ఇద్దరూ కలిసి ఏం మాట్లడతరు..? ఇంత పచ్చి అబద్ధాలా? ఇంత దారుణంగానా మాట్లాడేది..? అసలు ఇయ్యాల తెలంగాణ గోసకు కార కులెవరు? బాధ్యులెవరు? 60 ఏళ్ల కింద అస్తిత్వంతో, ఆత్మగౌరవంతో ఉన్న తెలంగాణను ఏపీలో బలవంతంగా కలిపిందే మీ  కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత దేవునూరు ప్రాజెక్టును, అప్పర్ కృష్ణా ప్రాజెక్టును ఆగం చేస్తా ఉంటే.. నాగార్జున సాగర్ ప్రాజెక్టు సైట్ మార్చి.. నందికొండ ప్రాజెక్టు పేరును నాగార్జునసాగర్ చేసి తెలంగాణకు నీళ్లు రాకుండా చేస్తా ఉంటే మౌనంగా ప్రేక్షక పాత్ర వహించింది కాంగ్రెస్ పార్టీ. నలభై ఏళ్లు పరిపాలించారు. మీరు చెప్పే తమ్మిడిహెట్టి అగ్రిమెం టు నిజమే అయితే.. మీరు పని ప్రారంభించింది 2008లో. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలోకి వచ్చింది 2014లో. ఆ ఒప్పందం జరిగే ఉంటే ఆరేళ్లలో ఆ బ్యారేజీ దగ్గర తట్టెడు మట్టి కూడా ఎందుకు ఎత్తలేదు? అసత్యాలు చెప్పి.. మీ కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. మల్లన్న సాగర్ దగ్గర, భూ సేకరణ దగ్గర మీ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నరు. పదవుల్లో కులుకుతూ.. పైరవీలు చే సుకుంటూ  తెలంగాణను సర్వనాశనం చేసిందే మీ కాంగ్రెస్ పార్టీ.. మీ తర్వాత పద్దెనిమిదేళ్లు పరిపాలించిన తెలుగుదేశం పార్టీ.

 ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి
 నేను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా.. మీరు మనుషులే అయితే సమాధానాలు చెప్పండి. 2001లో గులాబీ జెండా ఎగిరే వరకు మహబూబ్‌నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టు కట్టినా నీళ్లు నిలుపు కోలేని పరిస్థితి. కర్ణాటక రాష్ట్రానికి నష్టపరిహారం ఇవ్వలేదు. మేం దాడి ప్రారంభిస్తే మోకాళ్ల మీద పరుగెత్తి చంద్రబాబు నష్ట పరిహారం చెల్లించాడు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి కాల్వ మీద లిఫ్టులు ఉన్నయ్. ఎడమ కాల్వ మీద లిప్టులు ఉన్నయ్. కుడి కాల్వ లిప్టులకు అప్పటి ఏపీ ప్రభుత్వం బిల్లులు కడితే.. ఎడమ కాల్వ లిఫ్టుల బిల్లులు మాత్రం రైతులు కట్టుకోవాలి. గులాబీ జెండా ఎగిరిన తర్వాతనే.. ఇదేం నీతి..? ఇంకెందుకు తెలంగాణ ఏపీలో ఉండాలని అడిగితే.. అప్పటికప్పుడు ఆగమేఘాల మీద జీవోలు విడుదల
 
 చేసి ఎడమ కాల్వ బిల్లులు కట్టారు. ప్రభుత్వం మెడలు వంచి కట్టించింది టీఆర్‌ఎస్. అప్పటి దాకా ఎందుకు మౌనంగా ఉన్నారని అడుగుతున్నా. అసలు గులాబీ జెండా ఎందుకు పుట్టేది? 610 జీవోను కూడా సమాజం మరిచిపోయేట్లు చేశారు. ఏ ఒక్క విషయంలో కూడా మీరు కలిసి రాలేదు. టీఆర్‌ఎస్ పోరాటం చేస్తుంటే.. సమైక్య పాలకుల చంకలో దూరి మమ్మల్ని ఎగతాళి చేశారు. ఢిల్లీకి పోయి మాకు అభివృద్ధి ముఖ్యం... తెలంగాణ కాదని హై కమాండ్‌కు లెటర్లు ఇచ్చిన ముఖాలు మీవి. మీ హయాంలో తెలంగాణకు న్యాయం జరిగి ఉంటే.. మీరు చెప్పిన 98 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చి ఉంటే.. ఎక్కడికి పోయినై? కాకులు తాగినయా.. పిట్టలు తాగినయా? 98 లక్షల ఎకరాలు పారితే.. తెలంగాణ ఉద్యమం అవసరం ఎందుకు ఉండేది? రెండేళ్లుగా పూర్తి అవినీతి రహిత పాలన జరుగుతోంది. మొన్న పీఎం కూడా చెప్పారు. దీన్ని చూసి ఓర్వలేక, ప్రాజెక్టుల అంచనాలు పెరిగాయి.. అవినీతి పెరిగిందంటున్నారు.

రుజువు చేయకుంటే జైలు కూడే..
 రెండేళ్లుగా మౌనం పాటించిన. మర్యాదగా పెద్ద మనిషిగా ఉందామనుకున్నా. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అండ్ కంపెనీ, ప్రజలు చీదరించుకున్న తెలుగుదేశం కంపెనీలూ.. జాగ్రత్త.. ఇక నుంచి కేసులు పెట్టబోతున్నాం! ఆరోపణలు రుజువు చేయాలి.. లేదంటే జైలు కూడు తినాల్సి ఉంటుంది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిప్పులా పనిచేస్తోంది. ఈ వాస్తవాలు ప్రజలకు చెప్పేందుకు ఒక టీవీ చాన ల్‌లో కూర్చుని మూడు నాలుగు గంటలు మీ చరిత్ర, మీ బండారం బయటపెడతా. కేసీఆర్ దృష్టిని, ఏకాగ్రతను, ప్రభుత్వం ఏకాగ్రతను దెబ్బ తీయొచ్చు అనుకుంటున్నరు. కేసీఆర్ జగమొండి. పట్టుబడితే.. సాధించి తీరిండు. వెనక్కి పోలే. ప్రాణాలు బలిపెట్టి ముందుకు పోయిండు. ఎన్నిసార్లు రాజీనామాలు చేయలేదు. త్యాగాల చరిత్ర టీఆర్‌ఎస్‌ది. ఈ చరిత్ర చూసే కదా.. దేశ రాజకీయ వ్యవస్థ దిగి వచ్చి.. తీసుకో బిడ్డా మీ తెలంగాణ అని మా చేతిలో పెట్టింది. అలాంటి టీఆర్‌ఎస్ ప్రభుత్వం కచ్చితంగా.. ఆరునూరైనా కాళేశ్వరం నీళ్లు తెచ్చి ఉత్తర తెలంగాణ రైతుల పాదాలు కడుగుతది. 2018లో వరంగల్, నల్లగొండ, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాలో నిజాంసాగర్‌లో, శ్రీరాంసాగర్‌లో రెండు పంటలు పండించి చూపిస్తం.

‘మిగులు’ కోసం కేంద్రాన్ని నిలదీస్తం
 గోదావరిలో నికర జలాలు 1,480 టీఎంసీలు. అందులో తెలంగాణకు కేటాయించింది 950 టీఎంసీలు. ఇది కాక గోదావరిలో 3 వేల టీఎంసీల నీటి లభ్యత ఉంది. ఇందులో 1,500 టీఎంసీలు నికర జలాలు. 1,500 టీఎంసీలు మిగులు జలం. తెలంగాణ బిడ్డగా.. తెలంగాణ సీఎంగా వెంటనే ప్రధానికి లేఖ రాయబోతున్నా. మంత్రి హరీశ్ నేతృత్వంలో ఢిల్లీకి ఎంపీల బృందాన్ని పంపుతా. మిగులు జలాలు 1,500 టీఎంసీల్లో తెలంగాణ వాటా తేల్చాలని కేంద్రాన్ని నిలదీయబోతున్నాం. తెలంగాణకు ఇచ్చి న 950 టీఎంసీలు కాదు.. వాటికి అదనంగా ఏడెనిమిది వందల టీఎంసీల మిగులు జలాలను కేటాయింప చేసుకుని 50 లక్షల నుంచి 60 లక్షల ఎకరాలకు ఇదే మేడిగడ్డ, కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకు వచ్చి చూపిస్తా. ఎవరెన్ని అవాంతరాలు సృష్టించినా.. ఉద్యమాన్ని నాశనం చేయాలని చూసి నా.. నన్ను అనేక రకాలుగా.. వ్యక్తిగతంగా నిందించినా, మడమ తిప్పకుండా 14 ఏళ్లు పోరాడి తెలంగాణ తెచ్చి పెట్టినం. ఇది చరిత్ర. ఏ ఒక్క రోజు మీరు కలిసి రాలేదు. తెలంగాణ ప్రజలతో మమేకం కాలేదు. ఒక్కనాడు మీ పదవులకు రాజీనామా చేయలేదు. అంతా మీరు నాశనం చేస్తే.. ఆ బాధలో, అ మంట నుంచి ఎగిరిందే గులాబీ జెండా. అందులో నుంచి మోగిందే.. కేసీఆర్ గొంతు!
 
 కోటి ఎకరాల పచ్చని తెలంగాణ చూపిస్తా..
 తెలంగాణ ప్రజలకు మీ బిడ్డగా ఒక్కటే మనవి చేస్తున్నా.. మీకు తెలుసు ఎవరేం ఆలోచిస్తరో.. ఆనాడు 2001లో చెప్పిన.. ఇంటికొక యువకుడిని నాకివ్వండి.. తెలంగాణ తెచ్చి మీ పాదాల దగ్గర పెడతా అని చెప్పిన. ఒకవేళ తెలంగాణ ఉద్య మం నుంచి పక్కకు పోతే.. నన్ను రాళ్లతో కొట్టి చంపమని చెప్పిన. మళ్లీ ఈ రోజు చెబుతున్నా.. తెలంగాణ యావ త్తు పులకరించి పండుగ చేసుకుంటున్న ఈ శుభ సందర్భంలో ఒక్కటే మాట చెబుతున్నా. కోటి ఎకరాలకు కృష్ణా, గోదావరి నీళ్లు తెస్తా. నా ప్రాణం పోయినా సరే. నా రైతులకు అండదండగా ఉంటా. ఆ విషయంలో ఎట్టి పరిస్థితిలో రాజీ పడే ప్రసక్తే లేదు. మీ దీవెన ఉండాలి. ఈ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ఎవరూ కాదు. ఎవర డ్డం వచ్చినా అన్నింటినీ అధిగమించి కోటి ఎకరాల పచ్చని తెలంగాణ మీకు ప్రసాదించి చూపెడతా. విశ్వాసంతో ఉండి దీవించండి. అనేక రకాలుగా శ్రమించి మహారాష్ట్ర మంత్రితో, అధికారులతో మాట్లాడి.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఇరిగేషన్ మంత్రి హరీశ్‌కు, ఇరిగేషన్ శాఖకు, ఇంజనీర్లకు,. అధికారులకు అందరికీ ధన్యవాదాలు. రాబోయే కొద్ది రోజుల్లో బస్సు యాత్ర ప్రారంభిస్తా. మీ దగ్గరకే.. జిల్లాకు రాబోతున్నా.. అక్కడ కలుసుకుందాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement