టీడీపీకి మోత్కుపల్లి రాం రాం?
టీడీపీ సీనియర్ నాయకుడు, తుంగతుర్తి ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు ఆ పార్టీని వీడే యోచనలో ఉన్నారు. రాజ్యసభ సభ్యత్వం మొదలు అన్ని విషయాల్లో చంద్రబాబు తనకు తీవ్ర అన్యాయం చేశారని ఆయన చాలా రోజులుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కార్యకలాపాల్లో కూడా చురుగ్గా పాల్గొనడంలేదు. అంతకుముందు ఏ వేదికపై అయినా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద, ఆ పార్టీ నాయకుల మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేసే మోత్కుపల్లి.. ఇప్పుడు మాత్రం ముభావంగా కనిపిస్తున్నారు.
ఆయన ఒకటి రెండు రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఆ పార్టీ నాయకులతో మంతనాలు జరిగినట్లు చెబుతున్నారు. వాస్తవానికి టీఆర్ఎస్లో చేరేందుకు ప్రయత్నించినా, కుదరదని కేసీఆర్ చెప్పడంతో ఇక కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ కాంగ్రెస్కు వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన ఉత్తమ్ కుమార్ రెడ్డిది కూడా నల్లగొండ జిల్లానే. తన జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన దళిత నేతను తీసుకుంటే మైలేజి వస్తుందని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే, మొదట్నుంచి కాంగ్రెస్ను వ్యతిరేకించిన మోత్కుపల్లిని తీసుకోవడం సరికాదని కొందరు కార్యకర్తలు అంటున్నారు. ఇందులో గ్రూపు రాజకీయాలు కూడా పనిచేస్తున్నాయి. మోత్కుపల్లికి ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్న తుంగతుర్తి సీటు కాకుండా, నకిరేకల్ ఇవ్వాలని అనుకుంటున్నారు. ప్రస్తుత నకిరేకల్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వర్గానికి చెందినవాళ్లు. దాంతో తమను తొక్కేయడానికే ఇలా చేస్తారా అంటూ కోమటిరెడ్డి బ్రదర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.