motkupalli NARSIMHULU
-
ఎస్సీ వర్గీకరణపై దేనికైనా తెగిస్తాం: మోత్కుపల్లి
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం దేనికైనా తెగిస్తామని మాజీమంత్రి, టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోవాలని, మంద కృష్ణ మాదిగను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లోయర్ ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట గురువారం ఆయన మౌనదీక్షకు దిగారు. దీక్షకు దిగిన వెంటనే మోత్కుపల్లితోపాటు టీడీపీ నేతలు బొట్ల శ్రీనివాస్, సారంగపాణి, బి.ఎన్.రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి, రాంగోపాల్‌పేట పోలీసుస్టేషన్‌కి తరలించారు. అక్కడ కూడా మోత్కుపల్లి దీక్షను సాయంత్రం దాకా కొనసాగించారు, దీక్ష చేస్తున్న మోత్కుపల్లికి టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాధికారం ఇస్తామని, దళితుడినే తొలి ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి దళితులను జైళ్లలో పెడుతున్నారని విమర్శించారు. ఎస్సీ రిజర్వేషన్ల ఏబీసీడీ వర్గీకరణ చట్టబద్ధతకు కృషి చేస్తామని, ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకు వెళ్తామని ఇచ్చిన హామీని ఎప్పటిలోగా నెరవేరుస్తారో చెప్పాలని మోత్కుపల్లి డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ను గద్దెదించడానికి అనేక కుట్రలు జరుగుతున్నాయని, వాటిలో ఎక్కడా భాగస్వామ్యం కాలేదని, మాదిగలకు అన్యాయం జరిగితే నిలబెట్టడమా, కూలగొట్టడమా అనేదానిపైనా నిర్ణయం తీసుకుంటామని మోత్కుపల్లి హెచ్చరించారు. మంద కృష్ణపై కేసు పెట్టిన తర్వాత మౌనదీక్షకు దిగితే తమను నిర్బంధించడం అప్రజాస్వామికమన్నారు. కేసీఆర్ కొడుకు కేటీఆర్‌ను సీఎంగా చేసుకున్నా తమకు అభ్యంతరం లేదని, మాదిగలకు అన్యాయం జరిగితే మాత్రం సహించమన్నారు. తెలుగు మహాసభల్లోనూ పేద, దళిత కవులను పట్టించుకోలేదని విమర్శించారు. అగ్రవర్ణ ఆధిపత్యం కిందనే కేసీఆర్ పనిచేస్తున్నారని విమర్శించారు. ఇదే వైఖరి కొనసాగితే టీఆర్ఎస్తో చావోరేవో తేల్చుకుంటామని హెచ్చరించారు.కృష్ణమాదిగను బేషరతుగా విడుదల చేయాలని, కేసులను ఎత్తివేయాలని మోత్కుపల్లి డిమాండ్ చేశారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ మంద కృష్ణను విడుదల చేయాలని, ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌చేశారు. -
ప్రచారం కాదు.. అమలు ఎప్పుడో చెప్పాలి
రిజర్వేషన్లపై టీడీపీ నేతలు రమణ, రేవంత్, మోత్కుపల్లి సాక్షి, హైదరాబాద్: గిరిజనులకు, ముస్లింలకు రిజర్వేషన్లని గొప్పలు చెప్పుకోవడానికే పరిమితం కాకుండా, వాటిని ఎప్పటినుంచి అమలుచేస్తారో చెప్పాలని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి, పొలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని కార్యాల యంలో సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ రిజర్వేషన్ల గురించి ప్రచారం చేసుకోవడం, గొప్పలు చెప్పుకోవడానికే టీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారన్నారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోను బైబిల్, భగవద్గీత, ఖురాన్‌గా చెప్పుకుంటున్న కేసీఆర్ ఇప్పటిదాకా ఎన్ని హామీలను అమలు చేశారో ప్రజలకు చెప్పాలన్నారు. దేశంలోని ఏ ముఖ్యమంత్రి అయినా సచివాలయానికి వచ్చి, అభివృద్ధి, సంక్షేమ పథకాలను పూర్తి చేస్తుంటే కేసీఆర్ మాత్రం 150 ఎకరాల గడీ నుంచి నియంతృత్వంగా పాలిస్తున్నాడని ఎల్.రమణ విమర్శించారు. రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ... సీఎం కేసీఆర్‌కు చాలా తెలివి ఉందని, దానినంతా తెలంగాణ ప్రజలను మోసం చేయడానికే ఉపయోగిస్తు న్నారని విమర్శించారు. 2018లోపు గిరిజన, ముస్లింలకు రిజర్వేషన్లను అమలు చేయకుంటే ఓట్లు అడగను అని ప్రకటించే ధైర్యం కేసీఆర్‌కు ఉందా అని ప్రశ్నించారు. ఇప్పుడు తెలంగాణలో బంగారు తెలంగాణ బ్యాచ్ అంతా జేబుల్లో పాల ప్యాకెట్లు, కేసీఆర్ ఫొటో పెట్టుకుని పాలాభిషేకాలు చేయడానికి తిరుగుతున్నదని ఎద్దేవా చేశారు. మోత్కుపల్లి మాట్లాడుతూ టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఏ హామీని పూర్తిగా అమలుచేశారో చెప్పాలన్నారు. -
నాయకుల అరెస్ట్‌లు అప్రజాస్వామికం
టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వరంగల్ పర్యటన సందర్భంగా ఇళ్లలో ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించడం అత్యంత అప్రజాస్వామికమని టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. అరెస్టయిన వారిలో ఉగ్రవాదులు, టైస్టులు లేరని.. సీఎం పర్యటన సాకుతో తెల్లవారుజామున 5 గంటలకు టీడీపీ నాయకులను అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సీఎం పర్యటన పేరుతో పోలీసులు ఆలేరు పట్టణంలో షాపులు బంద్ చేయించడం, కనబడిన వారిపై చేయి చేసుకోవడం చూస్తుంటే టీఆర్ఎస్ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని మండిపడ్డారు. ఈ పరిస్థితిని ఖండిస్తున్నామని, పండగ రోజున ప్రజలను ఇబ్బంది పెట్టడం సరైంది కాదన్నారు. ప్రతిపక్షాల నోరు నొక్కడమే పరిపాలన అని కేసీఆర్ అండ్ కో భావిస్తే.. రాబోయే రోజుల్లో ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. -
నాకే క్లారిటీ లేదు
గవర్నర్ పదవిపై మోత్కుపల్లి నల్లగొండ రూరల్: గవర్నర్ పదవిపై తనకే క్లారిటీలేద ని, వచ్చినప్పుడు విషయం చెబుతానని టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. సోమవారం నల్లగొండలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలు, మండలాల విభజన శాస్త్రీయంగా జరగడం లేదని తెలిపారు. యాదగిరిగుట్టను జిల్లాగా చేయడం శుభపరిణామమన్నారు. మండల వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్కే దక్కిందన్నారు. ఆలేరు నియోజకవర్గంలోని గుండాల, ఆలేరు, రాజాపేట మండలాలను జనగాం డివిజన్లో కలపొద్దన్నారు. ఈ మేరకు కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చినట్లు చెప్పారు. -
గవర్నర్గిరిపై నాకే క్లారిటీ లేదు
గవర్నర్ పదవిపై తనకే క్లారిటీలేదని, వచ్చినప్పుడు విషయం చెబుతానని మాజీ మంత్రి, టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. సోమవారం నల్లగొండలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలు, మండలాల విభజన శాస్త్రీయంగా జరగడం లేదని ఫలితంగా ప్రజలకు ఇబ్బందులు తప్పవన్నారు. యాదగిరిగుట్టను జిల్లాగా చేయడం శుభపరిణామమన్నారు. మండల వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్కే దక్కిందన్నారు. ఆలేరు నియోజకవర్గంలోని గుండాల, ఆలేరు, రాజాపేట మండలాలను జనగాం డివిజన్లో కలపొద్దన్నారు. ఈ మేరకు కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చినట్లు చెప్పారు. -
'నల్గొండను కరువు జిల్లాగా ప్రకటించాలి'
నల్గాడ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నేతలు కార్యకర్తలు గురువారం మధ్యాహ్నం రాజపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాజుపేట తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ, సీపీఐ, సీపీఎం నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, శోభారాణి తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. -
టీడీపీ నేతల మధ్య జిల్లాల చిచ్చు
నల్లగొండ : జిల్లాల ఏర్పాటు అంశంపై నల్లగొండ జిల్లా టీడీపీ నేతల మధ్య చిచ్చు నెలకొంది. కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై ఆ జిల్లా నేతల నుంచి భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ టెంపుల్ సిటీ 'యాదాద్రి'ని జిల్లాగా చేయాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు చేపట్టిన దీక్షకు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మద్దతు తెలిపారు. అయితే, దీక్ష చేస్తున్న మోత్కుపల్లికి తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు మద్దుతు ఇవ్వడంపై ఆ పార్టీ నాయకురాలు ఉమా మాదవరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎవరికి వారుగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని ఉమా మాదవరెడ్డి అభిప్రాయపడ్డారు. భువనగిరిని జిల్లాగా ప్రకటించేవరకు పోరాడుతానని ఆమె స్పష్టంచేశారు. యాదాద్రిని జిల్లా చేయాలని కోరుతూ మంగళవారం యాదగిరిగుట్టలో మోత్కుపల్లి నర్సింహులు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. -
యాదగిరిగుట్టలో మోత్కుపల్లి దీక్ష
యాదాద్రిని జిల్లా చేయాలని కోరుతూ మంగళవారం యాదగిరిగుట్టలో మోత్కుపల్లి నర్సింహులు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టనున్నారు. కాగా ఈ దీక్షకు టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంఘీభావం తెలపనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష నిర్వహించనున్నారు. -
మోత్కుపల్లికి గవర్నర్ గిరీ!
ఈశాన్య రాష్ట్రాల్లో ఒకదానికి నియమించే అవకాశం హైదరాబాద్: టీటీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులుకు గవర్నర్ పదవి ఖరారైంది. ఆయనను త్వ రలోనే ఈశాన్య రాష్ట్రాల్లో ఒక దానికి గవర్నర్‌గా నియమించనున్నట్లు సమాచారం. ఈ మేరకు కేంద్రం టీడీపీ అధినేత చంద్రబాబుకు సమాచారమిచ్చినట్లు తెలిసింది. మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీలు అటు కేంద్రం, ఇటు ఏపీలో అధికారాన్ని పంచుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీలో బీజేపీ నేతలకు, జాతీయస్థాయిలో టీడీపీ నేతలకు పదవులు ఇవ్వాలని ఆ రెండు పార్టీలు ఒక అవగాహనకు వచ్చాయి. అందులో భాగంగానే ఈ పదవుల పంపకం జరుగుతోంది. గతంలో ఆయనకు రాజ్యసభ అవకాశం ఇవ్వని చంద్రబాబు.. కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వస్తే గవర్నర్ పదవి ఇప్పిస్తానని హామీనిచ్చారు. ఖాళీగా ఉన్న పలు రాష్ట్రాల గవర్నర్ పదవుల నియామకానికి కేంద్రం కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే మోత్కుపల్లిని గవర్నర్‌గా నియమించనున్నారు. ట్రైఫెడ్ చైర్మన్‌గా రమేష్ రాథోడ్ గిరిజన సహకార మా ర్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ నియమితులు కానున్నారు. ఆయనను ట్రైఫెడ్ చైర్మన్‌గా నియమించేందుకు కేంద్రం సమ్మతించింది. -
అవినీతి భయంతోనే మీడియాపై ఆంక్షలు!
టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి అక్రమాలు బహిర్గతమవుతాయనే భయంతోనే మీడియాపై కేసీఆర్ అంక్షలు విధిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ధ్వజమెత్తారు. తప్పులు చేయకపోతే మీడియా అంటే భయమెందుకని ఆయన ప్రశ్నించారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మీడియా లేకపోతే ప్రజాస్వామ్యమే లేదన్నారు. మీడియాను అణిచివేయాలని చూసిన ఎవ్వరూ మనుగడ సాధించలేదని మోత్కుపల్లి చెప్పారు. శాసనసభ సమావేశాల సమయంలోనే తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్ష చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అందుకే ఈనెలాఖరున చేపట్టాల్సిన దీక్షను మార్చి 9న చేస్తున్నట్లు చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వ విధానాలను ఈ సందర్భంగా తూర్పారబట్టారు. -
ఎన్టీఆర్ ఘాట్ వద్ద మోత్కుపల్లి నిరసన దీక్ష
-
ఎన్టీఆర్ ఘాట్ వద్ద మోత్కుపల్లి నిరసన దీక్ష
హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు శనివారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నిరసన దీక్షకు దిగారు. శంషాబాద్ విమానాశ్రయంలో దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర శాసనసభ శుక్రవారం తీర్మానం చేసిన విషయం తెలిసిందే. దాంతో ప్రభుత్వ తీర్మానాన్ని నిరసిస్తూ మోత్కుపల్లి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి మాట్లాడుతూ సీఎం కేసీఆర్... ఎన్టీఆర్ పేరును అవమానపరిచే విధంగా మాట్లాడటం దురదృష్టకరమన్నారు. తీర్మానాన్ని ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మోత్కుపల్లితో పాటు పలువురు తెలంగాణ టీడీపీ నేతలు, కార్యకర్తలు దీక్షలో పాల్గొన్నారు. -
మోత్కుపల్లి నర్సింహులు కూరలో కరివేపాకేనా?
కూరలో కరివేపాకు... టీడీపీలో ఆ మాట మోత్కుపల్లి నరసింహులుకు బాగా అతుకుతుంది. కేసీఆర్ ను తిట్టాలంటే చంద్రబాబుకు మోత్కుపల్లి గుర్తుకు వస్తారు. ఎన్నికలప్పుడు టికెట్ ఇవ్వాలంటే మోత్కుపల్లి గుర్తకురారు. ఓడ దాటే దాకా ఓడ మల్లయ్య. ఓడ దాటిన తరువాత బోడ మల్లయ్య. పాపం మోత్కుపల్లితో చంద్రబాబు ఫుట్ బాల్ ఆడుకుంటున్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఆదరించిన ఆలేరు ఓటర్లు 2004లో మోత్కుపల్లిని తిరస్కరించారు. ఆ తరువాత 2009 లో ఆలేరులో పోటీ చేద్దామంటే అది జనరల్ నియోజకవర్గం అయింది. దీంతో మోత్కుపల్లి వేరే నియోజక వర్గం వెతుక్కుని, తుంగతుర్తి నుంచి పోటీ చేసి గెలిచారు. ఈ మధ్య ఆయన రాజ్యసభ రూటులో ఢిల్లీకి వెళ్దామనుకున్నారు. చివరి దాకా ఊరించిన చంద్రబాబు చివరికి తుస్సుమనిపించారు. మోత్కుపల్లి అప్పట్నుంచీ అలకపూనారు. ఇంతలోనే ఎన్నికలు ముంచుకురావడంతో మోత్కుపల్లి అసెంబ్లీ సీటు కోసం పోటీ చేయాల్సి వచ్చింది. తీరా చూస్తే తుంగతుర్తిలో వోటర్లు ఆయనపై కోపంగా ఉన్నారు. అక్కడ పోటీ చేస్తే గెలవడం కష్టం అనిపించింది. దీంతో ఆయన ఖమ్మం జిల్లా మధిరకు మారిపోయారు . నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో మధిర ఎస్సీ రిజర్వుడ్‌గా మారిపోయింది. మధిరలో సీపీఎంకు గట్టి పట్టుంది. గతంలో కొద్ది తేడాతో ఓడిపోయినసీపీఎం అభ్యర్థి లింగాల కమల్ రాజ్ ఈ సారి మళ్లీ పోటీ పడుతున్నారు. పైగా ఇక్కడి నుంచే డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క కూడా పోటీ పడుతున్నారు. మధిరలో మన మోత్కుపల్లికి లక్ కలిసొస్తుందా? ఆయన గెలుపు సాధించగలరా? మధిరలో ఇప్పటివరకూ 13 సార్లు ఎన్నికలు జరిగితే, కార్గిల్ వేవ్ పుణ్యమా అని ఒక్క 1999 లో మాత్రమే టీడీపీ గెలిచింది. ఈ సారి మోత్కుపల్లి నరసింహులు చరిత్రను తిరగరాయగలరా? బిజెపికి ఏ హవా లేని మధిరలో, బిజెపి పొత్తుతో గట్టెక్కగలరా? లెట్స్ వెయిట్ అండ్ సీ! -
టీడీపీకి మోత్కుపల్లి రాం రాం?
టీడీపీ సీనియర్ నాయకుడు, తుంగతుర్తి ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు ఆ పార్టీని వీడే యోచనలో ఉన్నారు. రాజ్యసభ సభ్యత్వం మొదలు అన్ని విషయాల్లో చంద్రబాబు తనకు తీవ్ర అన్యాయం చేశారని ఆయన చాలా రోజులుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కార్యకలాపాల్లో కూడా చురుగ్గా పాల్గొనడంలేదు. అంతకుముందు ఏ వేదికపై అయినా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద, ఆ పార్టీ నాయకుల మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేసే మోత్కుపల్లి.. ఇప్పుడు మాత్రం ముభావంగా కనిపిస్తున్నారు. ఆయన ఒకటి రెండు రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఆ పార్టీ నాయకులతో మంతనాలు జరిగినట్లు చెబుతున్నారు. వాస్తవానికి టీఆర్ఎస్లో చేరేందుకు ప్రయత్నించినా, కుదరదని కేసీఆర్ చెప్పడంతో ఇక కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన ఉత్తమ్ కుమార్ రెడ్డిది కూడా నల్లగొండ జిల్లానే. తన జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన దళిత నేతను తీసుకుంటే మైలేజి వస్తుందని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే, మొదట్నుంచి కాంగ్రెస్‌ను వ్యతిరేకించిన మోత్కుపల్లిని తీసుకోవడం సరికాదని కొందరు కార్యకర్తలు అంటున్నారు. ఇందులో గ్రూపు రాజకీయాలు కూడా పనిచేస్తున్నాయి. మోత్కుపల్లికి ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్న తుంగతుర్తి సీటు కాకుండా, నకిరేకల్ ఇవ్వాలని అనుకుంటున్నారు. ప్రస్తుత నకిరేకల్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వర్గానికి చెందినవాళ్లు. దాంతో తమను తొక్కేయడానికే ఇలా చేస్తారా అంటూ కోమటిరెడ్డి బ్రదర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. -
రైతుల రుణాలు మాఫీ చేయాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్ బ్యాంకులలో రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలని టీడీపీ శాసనసభా పక్ష ఉపనేత మోత్కుపల్లి నర్సింహులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వర్షాలకు నష్టపోయిన బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో గురువారం నల్లగొండలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు అన్ని నియోజకర్గాల నుంచి నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ధర్నానుద్దేశించి నర్సింహులు మాట్లాడుతూ పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినా మంత్రులు జిల్లా మొత్తం పర్యటించకుండా నియోజకవర్గాలకే పరిమితమవడం సిగ్గుచేటన్నారు. నియోజకర్గాలకు మంత్రులా.. లేక రాష్ట్రానికా.. అని ప్రశ్నించారు. నిలువ నీడలేక రైతులు నానా అవస్థలు పడుతున్నా పట్టించుకోవడంతో ప్రభుత్వం విఫలమైందన్నారు. కాంగ్రెస్ పార్టీని బొంద పెడితేనే ప్రజల సమస్యలు తీరుతాయన్నారు. పొలిట్‌బ్యూరో సభ్యురాలు ఎలిమినేటి ఉమామాధవరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పంట నష్టం అంచనా వేయించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఇళ్లు కూలిన బాధిత కుటుంబాలకు బియ్యం కూడా పంపిణీ చేయలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. మంత్రుల చేతకాని తనం వల్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. కోదాడ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు మాట్లాడుతూ రైతుల సమస్యలపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. వెయ్యి కోట్ల రూపాయల పనులను తన అనుచరులకు కట్టబెట్టి డబ్బులు దోచిపెడుతున్నారని ఆరోపించారు. అనంతరం కలెక్టరేట్ లోపలికి వెళ్లగా కలెక్టర్ లేకపోవడంతో ప్రధాన ద్వారం వద్ద బైటాయించారు. మంత్రి జానారెడ్డితో చర్చించి సమీక్ష సమావేశం నిర్వహించే తేదీని ప్రకటిస్తేనే ఆందోళన విరమిస్తామని కలెక్టర్‌కు తేల్చి చెప్పారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు కేతావత్ బీల్యానాయక్, నన్నూరి నర్సిరెడ్డి, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు తేరా చిన్నపరెడ్డి, పటేల్ రమేష్‌రెడ్డి, పాల్వాయి రజనీకుమారి, వంగాల స్వామి, కంచర్ల భూపాల్‌రెడ్డి, కర్నాటి వెంకటేశం, గుండెబోయిన రామ్మూర్తి యాదవ్, కటికం సత్తయ్య గౌడ్, బడుగుల లింగయ్యయాదవ్, గార్లపాటి నిరంజన్‌రెడ్డి, మాదగోని శ్రీనివాస్‌గౌడ్, చిలువేరు కాశీనాథ్, బోయపెల్లి కృష్ణారెడ్డి, నెల్లూరు దుర్గాప్రసాద్, జక్కలి అయితయ్య యాదవ్ , ఎదుళ్ల మహేందర్‌రెడ్డి, గుమ్మడి గోవర్దన్‌రెడ్డి, వీరబోయిన లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.