
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం దేనికైనా తెగిస్తామని మాజీమంత్రి, టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోవాలని, మంద కృష్ణ మాదిగను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లోయర్ ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట గురువారం ఆయన మౌనదీక్షకు దిగారు. దీక్షకు దిగిన వెంటనే మోత్కుపల్లితోపాటు టీడీపీ నేతలు బొట్ల శ్రీనివాస్, సారంగపాణి, బి.ఎన్.రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి, రాంగోపాల్‌పేట పోలీసుస్టేషన్‌కి తరలించారు. అక్కడ కూడా మోత్కుపల్లి దీక్షను సాయంత్రం దాకా కొనసాగించారు, దీక్ష చేస్తున్న మోత్కుపల్లికి టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా మోత్కుపల్లి మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాధికారం ఇస్తామని, దళితుడినే తొలి ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి దళితులను జైళ్లలో పెడుతున్నారని విమర్శించారు. ఎస్సీ రిజర్వేషన్ల ఏబీసీడీ వర్గీకరణ చట్టబద్ధతకు కృషి చేస్తామని, ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకు వెళ్తామని ఇచ్చిన హామీని ఎప్పటిలోగా నెరవేరుస్తారో చెప్పాలని మోత్కుపల్లి డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్‌ను గద్దెదించడానికి అనేక కుట్రలు జరుగుతున్నాయని, వాటిలో ఎక్కడా భాగస్వామ్యం కాలేదని, మాదిగలకు అన్యాయం జరిగితే నిలబెట్టడమా, కూలగొట్టడమా అనేదానిపైనా నిర్ణయం తీసుకుంటామని మోత్కుపల్లి హెచ్చరించారు. మంద కృష్ణపై కేసు పెట్టిన తర్వాత మౌనదీక్షకు దిగితే తమను నిర్బంధించడం అప్రజాస్వామికమన్నారు.
కేసీఆర్ కొడుకు కేటీఆర్‌ను సీఎంగా చేసుకున్నా తమకు అభ్యంతరం లేదని, మాదిగలకు అన్యాయం జరిగితే మాత్రం సహించమన్నారు. తెలుగు మహాసభల్లోనూ పేద, దళిత కవులను పట్టించుకోలేదని విమర్శించారు. అగ్రవర్ణ ఆధిపత్యం కిందనే కేసీఆర్ పనిచేస్తున్నారని విమర్శించారు. ఇదే వైఖరి కొనసాగితే టీఆర్‌ఎస్‌తో చావోరేవో తేల్చుకుంటామని హెచ్చరించారు.కృష్ణమాదిగను బేషరతుగా విడుదల చేయాలని, కేసులను ఎత్తివేయాలని మోత్కుపల్లి డిమాండ్ చేశారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ మంద కృష్ణను విడుదల చేయాలని, ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌చేశారు.
Comments
Please login to add a commentAdd a comment