
టీడీపీ నేతల మధ్య జిల్లాల చిచ్చు
నల్లగొండ : జిల్లాల ఏర్పాటు అంశంపై నల్లగొండ జిల్లా టీడీపీ నేతల మధ్య చిచ్చు నెలకొంది. కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై ఆ జిల్లా నేతల నుంచి భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ టెంపుల్ సిటీ 'యాదాద్రి'ని జిల్లాగా చేయాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు చేపట్టిన దీక్షకు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మద్దతు తెలిపారు. అయితే, దీక్ష చేస్తున్న మోత్కుపల్లికి తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు మద్దుతు ఇవ్వడంపై ఆ పార్టీ నాయకురాలు ఉమా మాదవరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎవరికి వారుగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని ఉమా మాదవరెడ్డి అభిప్రాయపడ్డారు. భువనగిరిని జిల్లాగా ప్రకటించేవరకు పోరాడుతానని ఆమె స్పష్టంచేశారు. యాదాద్రిని జిల్లా చేయాలని కోరుతూ మంగళవారం యాదగిరిగుట్టలో మోత్కుపల్లి నర్సింహులు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.