కలెక్టరేట్, న్యూస్‌లైన్
బ్యాంకులలో రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలని టీడీపీ శాసనసభా పక్ష ఉపనేత మోత్కుపల్లి నర్సింహులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వర్షాలకు నష్టపోయిన బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో గురువారం నల్లగొండలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు అన్ని నియోజకర్గాల నుంచి నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ధర్నానుద్దేశించి నర్సింహులు మాట్లాడుతూ పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినా మంత్రులు జిల్లా మొత్తం పర్యటించకుండా నియోజకవర్గాలకే పరిమితమవడం సిగ్గుచేటన్నారు. నియోజకర్గాలకు మంత్రులా.. లేక రాష్ట్రానికా.. అని ప్రశ్నించారు. నిలువ నీడలేక రైతులు నానా అవస్థలు పడుతున్నా పట్టించుకోవడంతో ప్రభుత్వం విఫలమైందన్నారు.
కాంగ్రెస్ పార్టీని బొంద పెడితేనే ప్రజల సమస్యలు తీరుతాయన్నారు. పొలిట్‌బ్యూరో సభ్యురాలు ఎలిమినేటి ఉమామాధవరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పంట నష్టం అంచనా వేయించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఇళ్లు కూలిన బాధిత కుటుంబాలకు బియ్యం కూడా పంపిణీ చేయలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. మంత్రుల చేతకాని తనం వల్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. కోదాడ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు మాట్లాడుతూ రైతుల సమస్యలపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. వెయ్యి కోట్ల రూపాయల పనులను తన అనుచరులకు కట్టబెట్టి డబ్బులు దోచిపెడుతున్నారని ఆరోపించారు. అనంతరం కలెక్టరేట్ లోపలికి వెళ్లగా కలెక్టర్ లేకపోవడంతో ప్రధాన ద్వారం వద్ద బైటాయించారు. మంత్రి జానారెడ్డితో చర్చించి సమీక్ష సమావేశం నిర్వహించే తేదీని ప్రకటిస్తేనే ఆందోళన విరమిస్తామని కలెక్టర్‌కు తేల్చి చెప్పారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు.
కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు కేతావత్ బీల్యానాయక్, నన్నూరి నర్సిరెడ్డి, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు తేరా చిన్నపరెడ్డి, పటేల్ రమేష్‌రెడ్డి, పాల్వాయి రజనీకుమారి, వంగాల స్వామి, కంచర్ల భూపాల్‌రెడ్డి, కర్నాటి వెంకటేశం, గుండెబోయిన రామ్మూర్తి యాదవ్, కటికం సత్తయ్య గౌడ్, బడుగుల లింగయ్యయాదవ్, గార్లపాటి నిరంజన్‌రెడ్డి, మాదగోని శ్రీనివాస్‌గౌడ్, చిలువేరు కాశీనాథ్, బోయపెల్లి కృష్ణారెడ్డి, నెల్లూరు దుర్గాప్రసాద్, జక్కలి అయితయ్య యాదవ్ , ఎదుళ్ల మహేందర్‌రెడ్డి, గుమ్మడి గోవర్దన్‌రెడ్డి, వీరబోయిన లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.
రైతుల రుణాలు మాఫీ చేయాలి
Published Fri, Nov 8 2013 2:21 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement