12 స్థానాలు.. 71 నామినేషన్లు
ముగిసిన ‘స్థానిక’ ఎమ్మెల్సీ నామినేషన్ల ఘట్టం
సాక్షి నెట్‌వర్క్: తెలంగాణలోని 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల గడువు బుధవారం ముగిసింది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లు కూడా నామినేషన్లు వేసి బరిలో నిలిచారు. మొత్తం 71 సెట్ల నామినేషన్ల పత్రాలు దాఖలు అయ్యాయి. ఇందులో ఒక్కో అభ్యర్థి రెండు, మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. వరంగల్‌లో ఐదుగురు, నిజామాబాద్‌లో ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉండగా, ఒక్కో అభ్యర్థి మూడు సెట్ల నామినేషన్లు వేశారు. మహబూబ్‌నగర్‌లో 22 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. రంగారెడ్డిలో ఆరుగురు, ఆదిలాబాద్ మూడు, కరీంనగర్ ఏడు, నల్లగొండ ఐదుగురు, కరీంనగర్‌లో ఐదుగురు, మెదక్‌లో తొమ్మిది సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి.
వరంగల్ జిల్లాలోని ఒక స్థానానికి ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కొండా మురళీధర్‌రావు నామినేషన్ దాఖలు చేయగా.. మిగతా ఐదు నామినేషన్లు ఇండిపెండెంట్ అభ్యర్థులు దాఖలు చేసినవి. ఇండిపెండెంట్ అభ్యర్థుల్లో అనుమాండ్ల నరేందర్‌రెడ్డి, దురిశట్టి చంద్రమౌళి, జక్క మహబూబ్‌రెడ్డి, మోడెం మల్లేష్, రంగరాజు రవీందర్ ఉన్నారు.
రంగారెడ్డి జిల్లాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు మొత్తం ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ తరఫున ఒకస్థానానికి ఎ. చంద్రశేఖర్, మరోస్థానానికి ధారాసింగ్ జాదవ్ నామినేషన్ వేశారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులు పట్నం నరేందర్‌రెడ్డి, శంబీపూర్‌లు రాజులు నామినేషన్లు వేశారు. తెలుగుదేశం పార్టీ తరఫున బుక్కా వేణుగోపాల్ నామినేషన్ వేశారు. కాగా, బుధవారం ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి నామినేషన్ వేశారు.
నిజామాబాద్ జిల్లాలోని ఒక స్థానానికి ముగ్గురు అభ్యర్థులు తొమ్మిది సెట్ల నామినేషన్లు వేశారు. టీఆర్‌ఎస్ తరఫున రేకుల భూపతిరెడ్డి మూడు సెట్లు, కాంగ్రెస్ అభ్యర్థి కాటిపెల్లి వెంకటరమణారెడ్డి మూడు సెట్లు, ఎంపీటీసీల ఫోరం నుంచి బత్తిని జగదీశ్ మూడు సెట్ల నామినేషన్లు వేశారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి భూపతిరెడ్డి తరఫున ఆయన సతీమణి వినోదినిరెడ్డి సోమవారమే ఒక సెట్టు నామినేషన్ దాఖలు చేశారు.
ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ స్థానానికి మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. తెలుగుదేశం పార్టీ తరఫున లక్ష్మిపురం నారాయణ్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం నుంచి ఎండీ రియాజొద్దీన్ మంగళవారమే నామినేషన్లు వేయగా.. బుధవారం తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున పురాణం సతీష్‌కుమార్ నామినేషన్ వేశారు.
కరీంనగర్ జిల్లాలోని రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఇద్దరు టీఆర్‌ఎస్ అభ్యర్థులు, ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులుగా నారదాసు లక్ష్మణ్‌రావు, తాటిపర్తి భానుప్రసాద్‌రావు బరిలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థులుగా కాంగ్రెస్‌కు చెందిన మునిపాక తిరుపతిరావు, ముద్దసాని రంగయ్య, తాటిపాముల రాజు, సరిల్ల ప్రసాద్, బీజేపీకి చెందిన సైదాపూర్ ఎంపీపీ ముత్యాల ప్రియూరెడ్డి నామినేషన్లు వేశారు.
నల్లగొండలోని ఒక స్థానానికి ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. టీఆర్‌ఎస్ నుంచి తేరా చిన్నపరెడ్డి, కాంగ్రెస్ నుంచి రాజగోపాల్‌రెడ్డి, టీడీపీ నుంచి సాదినేని శ్రీనివాసరావులు నామినేషన్లు వేశారు. ఎంపీపీల ఫోరం తరఫున మిట్ట పురుషోత్తంరెడ్డి, కాంగ్రెస్ రెబల్‌గా డీసీసీ మాజీ అధ్యక్షుడు సుంకరి మల్లేశ్‌గౌడ్‌లు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఉన్నారు.
మహబూబ్‌నగర్ స్థానానికి ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ నుంచి కె. దామోదర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నుంచి ఎస్. జగదీశ్వర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోళ్ల కరుణాకర్, స్వతంత్య్ర అభ్యర్థిగా జగదీశ్వర్‌రెడ్డి, మరో స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాసాచారి నామినేషన్లు వేశారు. టీడీపీ నుంచి కొత్తకోట దయాకర్‌రెడ్డిలతో పాటు మరో ఏడుగురు 22 సెట్ల నామినేషన్లు వేశారు.
మెదక్ జిల్లాలో మొత్తం తొమ్మిది నామినేషన్లు దాఖలయ్యాయి. టీఆర్‌ఎస్ అభ్యర్థి వి. భూపాల్‌రెడ్డి మూడు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి శివరాజ్‌పాటిల్, టీడీపీ అభ్యర్థి కొన్యాల బాల్‌రెడ్డిలు రెండు సెట్ల నామినేషన్లు వేశారు. మరో ఇద్దరు ఇండిపెండెంట్లు నామినేషన్లు వేశారు.
ఖమ్మం జిల్లాలోని ఒక స్థానానికి ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. సీపీఎం, టీడీపీ, కాంగ్రెస్ మద్దతుతో సీపీఐ అభ్యర్థి పువ్వాడ నాగేశ్వరరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి లింగాల కమల్‌రాజ్, అధికార టీఆర్‌ఎస్ నుంచి బాలసాని లక్ష్మీనారాయణ నామినేషన్లు దాఖలు చేశారు. ఖమ్మం నగరానికి చెందిన గౌడి లక్ష్మీనారాయణ, ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడుకు చెందిన కరణం లక్ష్మీనారాయణ స్వతంత్య్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు.
ఆ రెండు మండలాల వారికి ఓటు హక్కు
రాష్ట్ర పునర్విభజనలో భాగంగా పాక్షికంగా ఆంధ్రలో విలీనమైన ఖమ్మం జిల్లా బూర్గంపాడు, భద్రాచలం ఎంపీటీసీలు, జెడ్పీటీసీల ఓటు హక్కుపై ఎన్నికల సంఘానికి కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ లేఖ రాయగా, దీనిపై స్పష్టత వచ్చింది. వారికి ఇక్కడి ఎమ్మెల్సీ స్థానానికి ఓటు వేసే అవకాశం లభించింది. దీంతో వీరిని కూడా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో నమోదు చేశారు. అలాగే ఖమ్మం జిల్లా ప్రత్యేక ఎన్నికల పరిశీలకుడిగా నవీన్‌మిట్టల్‌ను ఎన్నికల సంఘం నియమించింది.