బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటమి ఖాయం
- కొత్త ప్రభాకర్‌రెడ్డి విజయం తథ్యం
- ప్రతిపక్షాలవి అర్థం లేని విమర్శలు
- నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు
గజ్వేల్: మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు బుద్ధిచెప్పడం ఖాయమని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. శనివారం గజ్వేల్‌లోని పీఎన్‌ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన టీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి విజయం తథ్యమని పేర్కొన్నారు.
గజ్వేల్ శాసనసభా నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్నందున మెదక్ లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఇక్కడే అత్యధిక మెజార్టీని తీసుకురావడానికి కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. సమైఖ్యవాదాన్ని భుజాన వేసుకుని తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడిన జగ్గారెడ్డి మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో టికెట్ ఏవిధంగా ఇచ్చారో? ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
జగ్గారెడ్డి వైఖరి మారిందా? బీజేపీ స్టాండ్ మారిందో వివరించాల్సిన అవసరమున్నదన్నారు. మరోవైపు జిల్లా ప్రజలకు కాంగ్రెస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి ఒరగబెట్టిందేమీలేదని మండిపడ్దారు. నాలుగేళ్లుగా జిల్లాలో వడగళ్ల వానల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోగా అప్పట్లో మంత్రిగా పనిచేసిన సునీతారెడ్డి రైతులకు పరిహారం ఇప్పించలేకపోయారని చెప్పారు. నిండు సభలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు నిధులివ్వను..ఏం చేసుకుంటారో చేసుకోండి.. అంటూ మాట్లాడినా తెలంగాణ ప్రజాప్రతినిధులు ఏం చేయలేకపోయారని విమర్శించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నాలుగేళ్ల ఇన్‌ఫుట్ సబ్సిడీ రూ.480 కోట్లు విడుదల చేశారని పేర్కొన్నారు. జనగామలో చెల్లనిరూపాయిగా మారిన టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మెదక్‌లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తానని చెప్పడం విడ్డూరంగా ఉన్నదని చెప్పారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఎంపీగా పోటీచేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. తనను గెలిపిస్తే ప్రజల కష్టసుఖాల్లో నిరంతరం పాలుపంచుకుంటానని పేర్కొన్నారు.
దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి ద్రోహం తలపెట్టిన జగ్గారెడ్డికి ఎన్ని శిక్షలు వేసినా తక్కువేనని చెప్పారు. ఆయనకు టికెట్ ఇవ్వడం ద్వారా ఇక్కడి ప్రజలను బీజేపీ అవమానించిందని మండ్డిపడ్డారు. సమాశంలో జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్, జిల్లా పరిషత్ చైర్మన్ రాజమణి, ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, రాములు నాయక్, టీఆర్‌ఎస్ జిల్లా ఇన్‌చార్జి రాజయ్యయాదవ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణ, టీఆర్‌ఎస్ రాష్ట్ర నేత చాగన్ల నరేంద్రనాథ్, గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి మడుపు భూంరెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ లక్ష్మీకాంతారావు, గజ్వేల్ నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ జి.ఎలక్షన్‌రెడ్డి, గజ్వేల్ మాజీ ఎంపీపీ పొన్నాల రఘుపతిరావు, మాజీ మార్కెట్ కమీటీ చైర్మన్ డాక్టర్ వి.యాదవరెడ్డి, టీఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్, ప్రొఫెసర్ సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.