Irrigation Minister Harish Rao
-
దేశం చూపు.. తెలంగాణ వైపు
సాక్షి సిద్దిపేట: కాళేశ్వరం ప్రాజెక్టుతో అన్ని కాలాల్లో ప్రతి గ్రామానికి గోదావరి నీటిని అందించే బృహత్తర పథకాన్ని చేపట్టిన తెలంగాణ వైపు దేశం మొత్తం చూస్తోందని నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం సిద్దిపేట నియోజకవర్గంలో మంత్రి పర్యటించారు. జిల్లా కేంద్రంలో హజ్ యాత్రికులకు సన్మానం, పెద్దకోడూరులో రూ.3 కోట్లతో నిర్మించిన పాలిటెక్నిక్ హాస్టల్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. గతంలో ప్రాజెక్టులు నిర్మించడానికి 30 ఏళ్లు పట్టేదని, తెలంగాణ వచ్చాక 20 నెలల్లో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తున్నామని మంత్రి తెలిపారు. దసరా నాడు అటూ ఇటూ గోదావరి నీటి ని తరలిస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుకు బీమా పథకంతో ధీమాను ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. రూ.వెయ్యి కోట్లతో రాష్ట్రంలోని ప్రతి మండలంలో గోదాంలను నిర్మించనున్నామని తెలిపారు. రాష్ట్రంలో సివిల్, ఎలక్ట్రికల్ కోర్సులకు మంచి డిమాండ్ ఉందని, ప్రభు త్వ, ప్రైవేటు రంగంలోనూ అవకాశాలున్నాయన్నా రు. మైనార్టీల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ పాటుపడుతున్నారని చెప్పారు. ఏడాదిలో ఎల్కతుర్తి జాతీయ రహదారి... ఇటీవల కేంద్ర మంత్రి గడ్కరీతో భేటీ సమయంలో వరంగల్–ఎల్కతుర్తి జాతీయ రహదారి నిర్మాణానికి రూ.500 కోట్లు ఖర్చుచేసే విధంగా కేంద్ర ప్రణాళికలో చేర్పించామని హరీశ్‌రావు వెల్లడించారు. సిద్ది పేట జిల్లాలో రైల్వే లైన్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. జిల్లాకు రెండు జాతీయ రహదారులు మంజూరు కావడంతో పారిశ్రామికంగా సిద్దిపేట మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. సిద్దిపేట పరిసర ప్రాంతంలో ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. రంగనాయక సాగర్ ద్వారా లక్షా పది వేల ఎకరాలకు సాగు నీరు అందించేలా ప్రణాళిక రూపొందించామన్నారు. సమావేశం లో ఎమ్మెల్యే బాబూమోహన్, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, ఫరూఖ్ హుస్సేన్ పాల్గొన్నారు. -
గంధమల్ల నిర్మాణానికి సహకరించాలి
తుర్కపల్లి (ఆలేరు) : గంధమల్ల ప్రాజెక్ట్ నిర్మాణానికి రైతులు, గ్రామస్తులు సహకరించాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం తుర్కపల్లి మండలంలోని గంధమల్ల గ్రామాన్ని సందర్శించి రైతులు, గ్రామస్తులతో కలిసి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గంధమల్ల ప్రాజెక్ట్ నిర్మాణం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి ముంపు గురవుతున్న రైతులు పూర్తిగా సహకరించాలన్నారు. ప్రాజెక్ట్ కింద నష్టపోతున్న భూ నిర్వాసితులకు అన్ని విధాల న్యాయం జరిగేందుకు తన వంతు కృషి చేస్తామని తెలిపారు. ప్రాజెక్ట్‌లు నిర్మాణం జరిగితేనే తెలంగాణ అన్ని విధాల సస్యశ్యామలమవుతుందన్నారు. న్యాయమైన డిమాండ్లకు ఓ కమిటీ వేసుకొని తెలియజేస్తే అట్టి నిర్ణయాలను భారీ ప్రాజెక్ట్‌ల మంత్రి హరిశ్‌రావు, ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి నష్టపోయిన రైతులకు పూర్తి పరిహారం అందే వరకు అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ అనుమూల వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు జూపల్లిలక్ష్మీచంద్రయ్య,టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షడు పడాల శ్రీనివాస్,తలారి శ్రీనివాస్,జక్కుల వెంకటేశం,గజం మురళి,బొత్తరాములు,మందల మల్లయ్య,బిచ్చిరెడ్డి,జక్కుల కిష్టయ్య,కడిపె ఇస్తారి,జెల్ల వెంకటేశం,ఎలగల రాజు,కుంభం మల్లేశం గ్రామస్తులు,రైతులు తదితరులు పాల్గొన్నారు. -
వెంగళరావు పార్కుకు మహర్దశ !
బంజారాహిల్స్: జలగం వెంగళరావు పార్కుకు మహర్దశ పట్టనుంది. పార్కులో దుర్గంధంతో నిండిపోయిన చెరువును బాగు చేయాలని, ఇందు కోసం వారం రోజుల్లోగా ప్రతిపాదనలు రూపొందించి తనకు అందించాలని భారీ నీటి పారుదల శాఖా మంత్రి హరీష్‌రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. జలగం వెంగళరావు పార్కు వాకర్స్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు సోమవారం ఆయన అధికారులతో కలిసి పార్కును సందర్శించారు. ఇక్కడి చెరువు దుస్థితిని చూసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చుట్టుపక్కల నుంచి వచ్చే మురుగు నీరు చెరువులో కలుస్తున్నట్లు తెలుసుకొని ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే ఈ సీవరేజీ పైప్‌లైన్ మళ్లింపు పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇందులో మురుగు నీరు కలవకుండా పైప్‌లైన్ నిర్మాణ పనుల కోసం ఇప్పటి వరకు రూ. 28 లక్షలు ఖర్చు చేశారనిన జీహెచ్ఎంసీ ఇంకో రూ. 45 లక్షలు వాటర్ వర్క్స్‌కు అందిస్తే ఆ పనులు కూడా పూర్తవుతాయని వాకర్లు తెలపగా అక్కడే ఉన్న జోనల్ కమిషనర్ రవికిరణ్‌కు తక్షణం ఈ నిధులు వాటర్ వర్క్స్‌కు అందజేయాలని ఆదేశించారు. వాటర్ వర్క్స్, జీహెచ్ఎంసీ సమన్వయంతో పని చేసి వచ్చే సోమవారం నాటికి ఇందుకు తగిన ప్రతిపాదనలు తయారు చేసి తన వద్దకు రావాలని చెప్పారు. ఐ లాండ్ నిర్మాణంతో పాటు వాటర్ ఫాల్స్ నిర్మాణం కూడా చేపట్టాలని వాకర్లు మంత్రిని కోరారు. మంత్రి వెంటసెంట్రల్ జోనల్ కమిషనర్ రవికిరణ్, ఉప కమిషనర్ సోమరాజు, వాటర్ వర్క్స్ చీఫ్ ఇంజనీర్ రామేశ్వర్రావు, ఆర్అండ్బి చీఫ్ ఇంజనీర్, నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ రామకృష్ణతో పాటు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజిరెడ్డి పాల్గొన్నారు. -
డిసెంబర్ నుంచి చెరువుల పునరుద్ధరణ
* నాలుగేళ్లలో పనులు పూర్తి * మంత్రి హరీష్‌రావు వెల్దుర్తి: కాకతీయుల కాలంలో నిర్మించిన చెరువులు, కుంటలను పునరుద్ధరించడాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ‘మిషన్ కాకతీయ’ లక్ష్యం కూడా అదేనని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు తెలిపారు. ఆదివారం మండలంలోని మాసాయిపేట రామప్ప చెరువును ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ, చెరువులు, కుంటల పునరుద్ధరణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత నిస్తోందన్నారు. అందువల్లే ప్రస్తుత బడ్జెట్లో చెరువు, కుంటల పునరుద్ధరణ కోసం రూ.3 వేల కోట్లు కేటాయించామని తెలిపారు. డిసెంబర్ నాటికి రూ.5 వేల కోట్లతో టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. రానున్న నాలుగేళ్లలో చెరువులు, కుంటల్లో నీటినిల్వ సామర్థ్యం పెరిగి పొలాలన్నీ కళకళలాడేలా చేస్తామన్నారు. పునరుద్ధరణ పనుల్లో భాగంగా చెరువు శిఖం భూముల కబ్జా కాకుండా చెరువు చుట్టూ కందకాలను తవ్వించి పలు రకాల చెట్లతో పాటు ఈత వనాలను పెంచుతామన్నారు. దీంతో ఆయా కులవృత్తులకు పూర్వవైభవం వస్తుందన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో 1,172 చెరువులు, కుంటలు ఉన్నాయని, ఈ సంవత్సరం 267 చెరువులు, కుంటల పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపడుతామన్నారు. అందులో భాగంగా మాసాయిపేట రామప్పచెరువు పునరుద్ధరణ కోసం రూ.60 వేలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. గత ప్రభుత్వాలన్నీ చెరువుల పునరుద్ధరణ పేరిట నిధులు మంజూరు చేసి వారి పార్టీల కార్యకర్తలకు పంచి పెట్టాయన్నారు. అందువల్లే చెరువులు, కుంటలు పూడికతో నిండిపోయి ఎందుకూ పనికిరాకుండా పోయాయన్నారు. దీంతో చెరువునీళ్లపై ఆధారపడి సాగుచేసే పొలాలూ బీళ్లుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్లే తాము అధికారంలోకి రాగానే చెరువుల పునరుద్ధరణపై దృష్టి సారించామన్నారు. కాకతీయులు, నిజాంల కాలంలో చెరువులు, కుంటలు ఎలా ఉండేవో అలాగే తీర్చిదిద్దుతామన్నారు. పునరుద్ధరణ పనుల్లోనూ పూర్తి పారదర్శకత పాటిస్తున్నామన్నారు. పనులకు సంబంధించిన ఫొటోతో కూడిన వివరాలను ప్రత్యేక వెబ్సైట్లో పొందుపరుస్తామన్నారు. విదేశాల్లో ఉన్న చాలా మంది తెలంగాణ బిడ్డలు వారి స్వగ్రామాల్లోని చెరువులను దత్తత తీసుకుని అభివృద్ధి చేసేందుకు ముందుకు వస్తున్నారని, వారి సహకారం కూడా తీసుకుంటామన్నారు. అంతేకాకుండా చెరువులను దత్తత తీసుకునే వారి పేర్లను కూడా వెబ్సైట్లో పొందుపరుస్తామన్నారు. అంతేకాకుండా మహిళలకు తాగునీటి కోసం ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో వాటర్ గ్రిడ్ పథకానికి రూపకల్పన చేశామని, రానున్న నాలుగేళ్లలో వాటర్‌గ్రిడ్ పథకం ద్వారా ఇంటింటికీ నల్లా నీరందిస్తామన్నారు. మంత్రి వెంట డిప్యూటి స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జాతోపాటు ఆయా శాఖల అధికారులు ఉన్నారు. -
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటమి ఖాయం
- కొత్త ప్రభాకర్‌రెడ్డి విజయం తథ్యం - ప్రతిపక్షాలవి అర్థం లేని విమర్శలు - నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు గజ్వేల్: మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు బుద్ధిచెప్పడం ఖాయమని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. శనివారం గజ్వేల్‌లోని పీఎన్ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన టీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి విజయం తథ్యమని పేర్కొన్నారు. గజ్వేల్ శాసనసభా నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్నందున మెదక్ లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఇక్కడే అత్యధిక మెజార్టీని తీసుకురావడానికి కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. సమైఖ్యవాదాన్ని భుజాన వేసుకుని తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడిన జగ్గారెడ్డి మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో టికెట్ ఏవిధంగా ఇచ్చారో? ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జగ్గారెడ్డి వైఖరి మారిందా? బీజేపీ స్టాండ్ మారిందో వివరించాల్సిన అవసరమున్నదన్నారు. మరోవైపు జిల్లా ప్రజలకు కాంగ్రెస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి ఒరగబెట్టిందేమీలేదని మండిపడ్దారు. నాలుగేళ్లుగా జిల్లాలో వడగళ్ల వానల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోగా అప్పట్లో మంత్రిగా పనిచేసిన సునీతారెడ్డి రైతులకు పరిహారం ఇప్పించలేకపోయారని చెప్పారు. నిండు సభలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు నిధులివ్వను..ఏం చేసుకుంటారో చేసుకోండి.. అంటూ మాట్లాడినా తెలంగాణ ప్రజాప్రతినిధులు ఏం చేయలేకపోయారని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నాలుగేళ్ల ఇన్‌ఫుట్ సబ్సిడీ రూ.480 కోట్లు విడుదల చేశారని పేర్కొన్నారు. జనగామలో చెల్లనిరూపాయిగా మారిన టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మెదక్‌లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తానని చెప్పడం విడ్డూరంగా ఉన్నదని చెప్పారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఎంపీగా పోటీచేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. తనను గెలిపిస్తే ప్రజల కష్టసుఖాల్లో నిరంతరం పాలుపంచుకుంటానని పేర్కొన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి ద్రోహం తలపెట్టిన జగ్గారెడ్డికి ఎన్ని శిక్షలు వేసినా తక్కువేనని చెప్పారు. ఆయనకు టికెట్ ఇవ్వడం ద్వారా ఇక్కడి ప్రజలను బీజేపీ అవమానించిందని మండ్డిపడ్డారు. సమాశంలో జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్, జిల్లా పరిషత్ చైర్మన్ రాజమణి, ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, రాములు నాయక్, టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి రాజయ్యయాదవ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణ, టీఆర్ఎస్ రాష్ట్ర నేత చాగన్ల నరేంద్రనాథ్, గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి మడుపు భూంరెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ లక్ష్మీకాంతారావు, గజ్వేల్ నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ జి.ఎలక్షన్‌రెడ్డి, గజ్వేల్ మాజీ ఎంపీపీ పొన్నాల రఘుపతిరావు, మాజీ మార్కెట్ కమీటీ చైర్మన్ డాక్టర్ వి.యాదవరెడ్డి, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్, ప్రొఫెసర్ సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.