* నాలుగేళ్లలో పనులు పూర్తి
* మంత్రి హరీష్‌రావు
వెల్దుర్తి: కాకతీయుల కాలంలో నిర్మించిన చెరువులు, కుంటలను పునరుద్ధరించడాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ‘మిషన్ కాకతీయ’ లక్ష్యం కూడా అదేనని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు తెలిపారు. ఆదివారం మండలంలోని మాసాయిపేట రామప్ప చెరువును ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ, చెరువులు, కుంటల పునరుద్ధరణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత నిస్తోందన్నారు. అందువల్లే ప్రస్తుత బడ్జెట్‌లో చెరువు, కుంటల పునరుద్ధరణ కోసం రూ.3 వేల కోట్లు కేటాయించామని తెలిపారు.
డిసెంబర్ నాటికి రూ.5 వేల కోట్లతో టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. రానున్న నాలుగేళ్లలో చెరువులు, కుంటల్లో నీటినిల్వ సామర్థ్యం పెరిగి పొలాలన్నీ కళకళలాడేలా చేస్తామన్నారు. పునరుద్ధరణ పనుల్లో భాగంగా చెరువు శిఖం భూముల కబ్జా కాకుండా చెరువు చుట్టూ కందకాలను తవ్వించి పలు రకాల చెట్లతో పాటు ఈత వనాలను పెంచుతామన్నారు. దీంతో ఆయా కులవృత్తులకు పూర్వవైభవం వస్తుందన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో 1,172 చెరువులు, కుంటలు ఉన్నాయని, ఈ సంవత్సరం 267 చెరువులు, కుంటల పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపడుతామన్నారు.
అందులో భాగంగా మాసాయిపేట రామప్పచెరువు పునరుద్ధరణ కోసం రూ.60 వేలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. గత ప్రభుత్వాలన్నీ చెరువుల పునరుద్ధరణ పేరిట నిధులు మంజూరు చేసి వారి పార్టీల కార్యకర్తలకు పంచి పెట్టాయన్నారు. అందువల్లే చెరువులు, కుంటలు పూడికతో నిండిపోయి ఎందుకూ పనికిరాకుండా పోయాయన్నారు. దీంతో చెరువునీళ్లపై ఆధారపడి సాగుచేసే పొలాలూ బీళ్లుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్లే తాము అధికారంలోకి రాగానే చెరువుల పునరుద్ధరణపై దృష్టి సారించామన్నారు.
కాకతీయులు, నిజాంల కాలంలో చెరువులు, కుంటలు ఎలా ఉండేవో అలాగే తీర్చిదిద్దుతామన్నారు. పునరుద్ధరణ పనుల్లోనూ పూర్తి పారదర్శకత పాటిస్తున్నామన్నారు. పనులకు సంబంధించిన ఫొటోతో కూడిన వివరాలను ప్రత్యేక వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామన్నారు. విదేశాల్లో ఉన్న చాలా మంది తెలంగాణ బిడ్డలు వారి స్వగ్రామాల్లోని చెరువులను దత్తత తీసుకుని అభివృద్ధి చేసేందుకు ముందుకు వస్తున్నారని, వారి సహకారం కూడా తీసుకుంటామన్నారు.
అంతేకాకుండా చెరువులను దత్తత తీసుకునే వారి పేర్లను కూడా వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామన్నారు. అంతేకాకుండా మహిళలకు తాగునీటి కోసం ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో వాటర్ గ్రిడ్ పథకానికి రూపకల్పన చేశామని, రానున్న నాలుగేళ్లలో వాటర్‌గ్రిడ్ పథకం ద్వారా ఇంటింటికీ నల్లా నీరందిస్తామన్నారు. మంత్రి వెంట డిప్యూటి స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జాతోపాటు ఆయా శాఖల అధికారులు ఉన్నారు.
డిసెంబర్ నుంచి చెరువుల పునరుద్ధరణ
Published Mon, Nov 10 2014 1:16 AM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM
Advertisement