వెంగళరావు పార్కుకు మహర్దశ !
బంజారాహిల్స్: జలగం వెంగళరావు పార్కుకు మహర్దశ పట్టనుంది. పార్కులో దుర్గంధంతో నిండిపోయిన చెరువును బాగు చేయాలని, ఇందు కోసం వారం రోజుల్లోగా ప్రతిపాదనలు రూపొందించి తనకు అందించాలని భారీ నీటి పారుదల శాఖా మంత్రి హరీష్‌రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. జలగం వెంగళరావు పార్కు వాకర్స్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు సోమవారం ఆయన అధికారులతో కలిసి పార్కును సందర్శించారు. ఇక్కడి చెరువు దుస్థితిని చూసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చుట్టుపక్కల నుంచి వచ్చే మురుగు నీరు చెరువులో కలుస్తున్నట్లు తెలుసుకొని ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే ఈ సీవరేజీ పైప్‌లైన్ మళ్లింపు పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఇందులో మురుగు నీరు కలవకుండా పైప్‌లైన్ నిర్మాణ పనుల కోసం ఇప్పటి వరకు రూ. 28 లక్షలు ఖర్చు చేశారనిన జీహెచ్‌ఎంసీ ఇంకో రూ. 45 లక్షలు వాటర్ వర్క్స్‌కు అందిస్తే ఆ పనులు కూడా పూర్తవుతాయని వాకర్లు తెలపగా అక్కడే ఉన్న జోనల్ కమిషనర్ రవికిరణ్‌కు తక్షణం ఈ నిధులు వాటర్ వర్క్స్‌కు అందజేయాలని ఆదేశించారు. వాటర్ వర్క్స్, జీహెచ్‌ఎంసీ సమన్వయంతో పని చేసి వచ్చే సోమవారం నాటికి ఇందుకు తగిన ప్రతిపాదనలు తయారు చేసి తన వద్దకు రావాలని చెప్పారు. ఐ లాండ్ నిర్మాణంతో పాటు వాటర్ ఫాల్స్ నిర్మాణం కూడా చేపట్టాలని వాకర్లు మంత్రిని కోరారు. మంత్రి వెంటసెంట్రల్ జోనల్ కమిషనర్ రవికిరణ్, ఉప కమిషనర్ సోమరాజు, వాటర్ వర్క్స్ చీఫ్ ఇంజనీర్ రామేశ్వర్‌రావు, ఆర్‌అండ్‌బి చీఫ్ ఇంజనీర్, నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ రామకృష్ణతో పాటు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజిరెడ్డి పాల్గొన్నారు.