లోక్‌సభ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్
క్షేత్రస్థాయి ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్ విఫలం
ప్రచారానికి నేటితో తెర
సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రం ఏ ర్పడిన మూడు నెలలకే వచ్చిన మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికను మూడు ప్రధాన పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అధికార టీఆర్‌ఎస్ తమకు బాగా పట్టున్న సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాలపై దృష్టి సారిం చింది. వాటిలో భారీ మెజారిటీ సాధిస్తే చాలని భావిస్తోంది. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉం డటంతో పాటు తమ అభ్యర్థి జగ్గారెడ్డికి సంగారెడ్డి అసెంబ్లీ స్థానంలో ఉన్న సానుకూలతను సొమ్ము చేసుకోవాలని చూస్తోంది. కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి నర్సాపూర్ అసెంబ్లీ స్థానంపై, పార్టీ ఓటుబ్యాంకుపై ఆశలు పెట్టుకున్నారు. గురువారం సాయంత్రంతో ప్రచారానికి తెర పడనుండటంతో ఎన్నికల రంగం రసవత్తరంగా మారింది.
టీఆర్‌ఎస్ వైపే...
మూడు పార్టీలూ గట్టివారినే బరిలోకి దించినా టీఆర్‌ఎస్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ‘ట్రబుల్ షూటర్’ మంత్రి హరీశ్‌రావు పర్యవేక్షణ... గ్రామీణ ప్రాంతాల్లో బలమైన కేడర్‌తో టీఆర్‌ఎస్ పటిష్టంగా కనిపిస్తోందని వారు అంటున్నారు. మెదక్ లోక్‌సభ స్థానం పరిధిలో.. మెదక్, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, నర్సాపూర్, పటాన్‌చెరు, సంగారెడ్డి అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇటీవలి సాధారణ ఎన్నికల్లో ఈ ఏడు చోట్లా టీఆర్‌ఎసే గెలిచింది. సిద్దిపేట, దుబ్బాక ఆ పార్టీకి కంచుకోటలే. గజ్వేల్లోనూ ఇటీవల టీఆర్‌ఎస్ పట్టు బిగించింది. మెదక్, పటాన్‌చెరు అసెంబ్లీ స్థానాల పరిధిలో కూడా టీఆర్‌ఎస్‌కు మెజారిటీ వచ్చే అవకాశాలున్నాయి. పటాన్‌చెరుకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డితో పాటు సునీతారెడ్డికి కుడిభుజం వంటి బాల్‌రెడ్డి, చంద్రారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు.
ప్రచారంలో ప్రతిపక్షాలు విఫలం!
రైతు రుణమాఫీపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం స్పష్టమైన హమీ ఇవ్వకపోవడంతో రైతులు కొంత ఆగ్రహంగా ఉన్నప్పటికీ అది ప్రభుత్వ వ్యతిరేక ఓటుగా మారలేదు. పైగా దీన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో ప్రతిపక్షాలు విఫలమయ్యాయి. బీజేపీ, కాంగ్రెస్ తమతమ జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులతో ప్రచారం చేసినా అదంతా ప్రెస్‌మీట్లు, కార్యకర్తల సమావేశాలకే పరిమితమైంది. ఏ నాయకుడూ పల్లెల్లోకి వెళ్లి ఇంటింటి ప్రచారం చేయలేదు. పైగా అభ్యర్థులు సునీత, జగ్గారెడ్డి కూడా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లలేకపోయారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన గత 100 రోజుల్లో ఏ సంక్షేమ పథకం కూడా పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం, సీఎం కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్‌లోనే ఏడుగురు రైతులు బలవన్మరణం పాలవడం, రుణం చెల్లించాలంటూ బ్యాంకు అధికారులు రైతులను పిలిచి మరీ ఒత్తిడి చేయడం వంటివాటిని తమకు సానుకూలంగా మలచుకోలేకపోయారు. నర్సాపూర్ అసెంబ్లీ స్థానంలో గతంలో ఆమె ఓడిన సానుభూతి సునీతకు బాగానే ఉన్నా అది ఓట్లుగా మారడం అనుమానమేనంటున్నారు. ఇక జగ్గారెడ్డికి కోర్టుల చుట్టూ తిరగడంతోనే సరిపోయింది.
రసవత్తరంగా మెదక్ పోరు
Published Thu, Sep 11 2014 1:26 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement