ముగ్గురూ.. ముగ్గురే
మెదక్‌లో త్రిముఖ పోటీ
►జగ్గారెడ్డి రాకతో వేడెక్కిన రాజకీయం
►‘ట్రబుల్ షూటర్’పైన మరింత భారం
►నర్సాపూర్‌పైనే సునీతమ్మ ఆశలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మెదక్ లోక్‌సభ ఉపపోరు ఊపందుకుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కీలకమైన అభ్యర్థులనే బరిలోకి దింపటంతో త్రిముఖ పోటీ ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.‘ట్రబుల్ షూటర్’ మంత్రి హరీష్‌రావు ఎత్తులు.. గ్రామీణ ప్రాంతంలో బలమైన క్యాడర్‌తో.. టీఆర్‌ఎస్ పార్టీ పతిష్టమైన స్థితిలో కనిపించినప్పటికీ తీవ్ర పోటీ మాత్రం తప్పదని వారు లెక్కలు కడుతున్నారు. బీజేపీ అభ్యర్థిగా ఫైర్‌బ్రాండ్ జగ్గారెడ్డి బరిలోకి దిగటం, తెలుగుదేశం శ్రేణులు బీజేపీతో కలిసి రావటం, ఇక నర్సాపూర్ నియోజకవర్గంలో పట్టున్న మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి బరిలో నిలబడటంతో మూడు స్తంబాలాట మొదలైంది.
మెదక్ పార్ల మెంటు నియోజకవర్గం కింద మెదక్, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, నర్సాపూర్, పటాన్‌చెరు, సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.ఈ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సిద్దిపేట, దుబ్బాక, నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌కు మంచి పట్టు ఉండగా, నర్సాపూర్ నియోజకవర్గం సునీతారెడ్డికి, సంగారెడ్డి నియోజకవర్గం జగ్గారెడ్డికి అనుకూలంగా ఉంది. పటాన్‌చెరు నియోజకవర్గంలో మూడు పార్టీలకు చెందిన ఓటర్లు ఉన్నారు. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజవర్గాల్లో భారీ మెజార్టీ తెచ్చుకోవాలని టీఆర్‌ఎస్ ఎత్తులు వేస్తుండగా... సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ మెజార్టీని నిరోధించగలిగితే గెలుపు బాట పట్టవచ్చని బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు యోచిస్తున్నారు.
ముఖ్యులంతా ఇన్‌చార్జులే...
రాష్ట్రంలో టీఆర్‌ఎస్, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాల 100 రోజుల పాలనకు ఈ ఉప ఎన్నికలు రెఫరెండంగా మారాయి. ఇక కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకు ఈ ఎన్నికలు జీవగంజి లాంటివి. ఈ నేపథ్యంలో మూడు పార్టీలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నాయి. గులాబీ దళపతి కేసీఆర్‌కు గత ఎన్నికల్లో 3.97 లక్షల ఓట్ల మెజార్టీ వచ్చింది. కేసీఆర్‌కు 6,57,497 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రవణ్‌కుమార్‌రెడ్డికి 2,60,463 ఓట్లు వచ్చాయి.
ఈ సారి కనీసం 4 లక్షల పైచిలుకు ఓట్ల మెజార్టీ తీసుకరావాలని కేసీఆర్ జిల్లా నేతలకు ఆదేశాలు జారీ చే శారు. పార్లమెంటు నియోజవర్గంలో ప్రతి మండలానికి ఒక ఎమ్మెల్యేను, ఎమ్మెల్సీలను ఇన్‌చార్జిగా నియమించారు. పూర్తి పర్యవేక్షణ బాధ్యతలను హరీష్‌రావుకు అప్పగించారు. ఇక కాంగ్రెస్ , బీజేపీ పార్టీలు కూడా మండలానికో ఎమ్మెల్యేను ఇన్‌చార్జులుగా నియమించింది.
గులాబీ దళపతి మీదనే ఆశలు..
టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు గులాబీ దళపతి కేసీఆర్‌నే నమ్ముకోగా, కాంగ్రెస్ పార్టీ రాహుల్‌గాంధీ, సోనియాగాంధీలతో పాటు దిగ్విజయ్‌సింగ్, తదితరులను రంగంలోకి దించేందుకు పథకం రచిస్తోంది. రాష్ర్ట నాయకులు పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు పర్యవేక్షిస్తారు. బీజేపీ కూడా భారీ ప్రణాళికే వేస్తోంది. మోడీని ప్రచారంలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. ఆయనతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులతో పాటు సినీనటుడు పవన్ కల్యాణ్‌ను కూడా ప్రచార రంగంలోకి దించడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.