main political parties
-
ముగ్గురూ.. ముగ్గురే
మెదక్‌లో త్రిముఖ పోటీ ►జగ్గారెడ్డి రాకతో వేడెక్కిన రాజకీయం ►‘ట్రబుల్ షూటర్’పైన మరింత భారం ►నర్సాపూర్పైనే సునీతమ్మ ఆశలు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మెదక్ లోక్‌సభ ఉపపోరు ఊపందుకుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కీలకమైన అభ్యర్థులనే బరిలోకి దింపటంతో త్రిముఖ పోటీ ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.‘ట్రబుల్ షూటర్’ మంత్రి హరీష్‌రావు ఎత్తులు.. గ్రామీణ ప్రాంతంలో బలమైన క్యాడర్‌తో.. టీఆర్ఎస్ పార్టీ పతిష్టమైన స్థితిలో కనిపించినప్పటికీ తీవ్ర పోటీ మాత్రం తప్పదని వారు లెక్కలు కడుతున్నారు. బీజేపీ అభ్యర్థిగా ఫైర్‌బ్రాండ్ జగ్గారెడ్డి బరిలోకి దిగటం, తెలుగుదేశం శ్రేణులు బీజేపీతో కలిసి రావటం, ఇక నర్సాపూర్ నియోజకవర్గంలో పట్టున్న మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి బరిలో నిలబడటంతో మూడు స్తంబాలాట మొదలైంది. మెదక్ పార్ల మెంటు నియోజకవర్గం కింద మెదక్, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, నర్సాపూర్, పటాన్చెరు, సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.ఈ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సిద్దిపేట, దుబ్బాక, నియోజకవర్గాల్లో టీఆర్ఎస్కు మంచి పట్టు ఉండగా, నర్సాపూర్ నియోజకవర్గం సునీతారెడ్డికి, సంగారెడ్డి నియోజకవర్గం జగ్గారెడ్డికి అనుకూలంగా ఉంది. పటాన్చెరు నియోజకవర్గంలో మూడు పార్టీలకు చెందిన ఓటర్లు ఉన్నారు. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజవర్గాల్లో భారీ మెజార్టీ తెచ్చుకోవాలని టీఆర్ఎస్ ఎత్తులు వేస్తుండగా... సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ మెజార్టీని నిరోధించగలిగితే గెలుపు బాట పట్టవచ్చని బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు యోచిస్తున్నారు. ముఖ్యులంతా ఇన్చార్జులే... రాష్ట్రంలో టీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాల 100 రోజుల పాలనకు ఈ ఉప ఎన్నికలు రెఫరెండంగా మారాయి. ఇక కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకు ఈ ఎన్నికలు జీవగంజి లాంటివి. ఈ నేపథ్యంలో మూడు పార్టీలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నాయి. గులాబీ దళపతి కేసీఆర్‌కు గత ఎన్నికల్లో 3.97 లక్షల ఓట్ల మెజార్టీ వచ్చింది. కేసీఆర్‌కు 6,57,497 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రవణ్‌కుమార్‌రెడ్డికి 2,60,463 ఓట్లు వచ్చాయి. ఈ సారి కనీసం 4 లక్షల పైచిలుకు ఓట్ల మెజార్టీ తీసుకరావాలని కేసీఆర్ జిల్లా నేతలకు ఆదేశాలు జారీ చే శారు. పార్లమెంటు నియోజవర్గంలో ప్రతి మండలానికి ఒక ఎమ్మెల్యేను, ఎమ్మెల్సీలను ఇన్చార్జిగా నియమించారు. పూర్తి పర్యవేక్షణ బాధ్యతలను హరీష్‌రావుకు అప్పగించారు. ఇక కాంగ్రెస్ , బీజేపీ పార్టీలు కూడా మండలానికో ఎమ్మెల్యేను ఇన్చార్జులుగా నియమించింది. గులాబీ దళపతి మీదనే ఆశలు.. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గులాబీ దళపతి కేసీఆర్‌నే నమ్ముకోగా, కాంగ్రెస్ పార్టీ రాహుల్‌గాంధీ, సోనియాగాంధీలతో పాటు దిగ్విజయ్‌సింగ్, తదితరులను రంగంలోకి దించేందుకు పథకం రచిస్తోంది. రాష్ర్ట నాయకులు పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు పర్యవేక్షిస్తారు. బీజేపీ కూడా భారీ ప్రణాళికే వేస్తోంది. మోడీని ప్రచారంలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. ఆయనతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులతో పాటు సినీనటుడు పవన్ కల్యాణ్‌ను కూడా ప్రచార రంగంలోకి దించడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. -
82 నామినేషన్లు తిరస్కరణ
ప్రధాన పార్టీల నామినేషన్లు పదిలం పార్లమెంట్ స్థానాలకు 13 అనర్హం అసెంబ్లీకి 278 నామినేషన్లు దాఖలు బరిలోని అభ్యర్థులు 209 మంది రేపటి వరకు ఉపసంహరణకు గడువు కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు దాఖలైన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ సోమవారం పూర్తయింది. ప్రధాన పార్టీల నామినేషన్లన్నింటికీ ఆమోదం లభించింది. పోటీ చేస్తున్న అభ్యర్థుల సమక్షంలోనే సంబంధిత రిటర్నింగ్ అధికారులు నామినేషన్లను పరిశీలించారు. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి సి.సుదర్శన్‌రెడ్డి తన చాంబర్లో ఏఈ సత్యనారాయణమూర్తితో కలిసి స్క్రూటిని నిర్వహించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి బుట్టా రేణుకతో పాటు ఇతర అభ్యర్థులు హాజరయ్యారు. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 18 మంది నామినేషన్లు దాఖలు కాగా ఐదింటిని తిరస్కరించారు. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గానికి 24 నామినేషన్లు దాఖలు కాగా.. ఎనిమిదింటిని తిరస్కరించారు. రెండు పార్లమెంట్ స్థానాల్లో ప్రస్తుతం 29 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 69 నామినేషన్లను వివిధ కారణాలతో రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు 278 మంది నామినేషన్లు వేయగా, స్క్రూటి అనంతరం 209 మంది అభ్యర్థులు పోటీలో మిగిలారు. అత్యధికంగా బనగానపల్లిలో 11 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఇక్కడ 18 మంది నామినేషన్లు వేయగా ఏడుగురు మాత్రమే పోటీకి అర్హత సాధించారు. ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో నామినేషన్లన్నీ ఆమోదం పొందడం విశేషం. ఇదిలాఉండగా నామినేషన్ల పరిశీలన పూర్తి కాగా.. 23వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం కల్పించారు. బుధవారం 3 గంటలకు ఈ గడువు పూర్తి కానుంది. ఆ తర్వాత బరిలోని అభ్యర్థులకు గుర్తులను కేటాయించనున్నారు. -
దూసుకెళ్తా
పోటాపోటీగా ప్రచారం బరిలో దిగిన ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్ల చుట్టూ నేతలు స్టార్ క్యాంపెయినర్ల హడావుడి సుడిగాలి పర్యటనలు హామీల వర్షం ఎక్కడ చూసినా ప్రచార సందడే సాక్షి, సిటీబ్యూరో : నామినేషన్ల ఘట్టం ముగిసింది. ప్రచారానికి తెర లేచింది. హోరాహోరీ పోరులో గెలుపు అవకాశాలను చేజిక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు నడుం బిగించాయి. ముఖ్య నాయకులు, బరిలో నిలిచిన అభ్యర్థులు, స్టార్ క్యాంపెయినర్ల సుడిగాలి పర్యటనలతో ‘గ్రేటర్’లో ప్రచారం జోరుగా సాగుతోంది. శనివారం సాయంత్రం నుంచే కొందరు రంగంలోకి దిగగా.. ఆదివారం పలు రాజకీయ పార్టీలు మొదలు పెట్టిన ప్రచార పర్వం మిన్నంటిన ఉత్సాహంతో ప్రారంభమైంది. జనం నాడిని తెలుసుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఆయా పార్టీల ప్రచార తీరు ఇలా ఉంది.. వైఎస్సార్సీపీ ప్రచార జోరు వైఎస్సార్ సీపీ ప్రచారం జోరుగా సాగుతోంది. ఆదివారం మౌలాలి డివిజన్ పరిధిలోని వెంకటేశ్వరనగర్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల కార్యాలయాన్ని వైఎస్సార్సీపీ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి దినేష్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి సమర్థవంతమైనపాలనను ఎంచుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి, సంక్షేమం తన అజెండాగా పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోనే సాధ్యమన్నారు. మల్కాజిగిరిలో ప్రజలు సుదీర్ఘకాలంగా రైల్వే చక్రబంధంలో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారని, ఆర్‌యూబీలు, ఫ్లైఓవర్లు నిర్మించి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తానన్నారు. బీజేపీ మార్గం ఇదీ.. నిజాయితే మార్గం... అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న తనకు అంబర్‌పేట నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం కావాలని బీజేపీ అభ్యర్థి, ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి ప్రజలను కోరారు. గోల్నాక డివిజన్ బీజేపీ అధ్యక్షులు బి.నర్సింగ్‌యాదవ్ ఆధ్వర్యంలో గోల్నాక చౌరస్తా నుంచి కిషన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. చౌరస్తా నుంచి శాంతినగర్, లక్ష్మీనగర్, సాయిబాబా టెంపుల్ లేన్, తులసీరాంనగర్ కాలనీ, అశోకనగర్, శంకర్‌నగర్, జిందాతిలస్మాత్ నగర్ తదితర బస్తీలలో తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మోడీ పాలనతోనే దేశాభివృద్ధి సాధ్యమని ఆయన ప్రచారం చేశారు. కాంగ్రెస్ ప్రచారానికి సై.. మహిళల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అంబర్పేట్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి వి.హనుమంతరావు అన్నారు. ఆదివారం బాగ్‌అంబర్‌పేట డివిజన్లోని ఛే నంబర్ చౌరస్తా నుంచి కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి, ప్రస్తుత ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్‌తో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఛే నంబర్, సాయిమధుర నగర్, శ్రీవెంకటేశ్వర నగర్, బతుకమ్మకుంట తదితర బస్తీల్లో ఆయన ఇంటింటికీ తిరుగుతూ ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఎంఐఎం ప్రచార పర్వం ఇలా.. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆదివారం పాతనగరంలో విస్తృతంగా ప్రచారం చేశారు. సంఘ్ పరివార్, ఆరెస్సెస్, బీజేపీ మోడీల వైఖరిపైనే ప్రధానంగా విమర్శనాస్త్రాలు సంధించారు. దేశవ్యాప్తంగా ముస్లింలపై జరుగుతున్న అకృత్యాలను ఎండగట్టేందుకు చట్టసభల్లో మైనార్టీల గళం వినిపించేందుకు ఎంఐఎంకు ఓటు వేసి గెలిపించాలని ప్రచారం చేశారు. టీడీపీ సరళి ఇదీ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం మల్కాజిగిరి పార్లమెంటు సెగ్మెంటులో ప్రచారం చేపట్టారు. ఆదివారం సాయంత్రం మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గంలో రోడ్‌షో నిర్వహించారు. తన పాలనలోనే గ్రేటర్ నగర అభివృద్ధి జరిగిందన్నారు. తన ప్రసంగంలో టీడీపీతోనే మహిళలకు భద్రత సాధ్యమని పేర్కొన్నారు. అభివృద్ధిని కాంక్షించేవారు తమ పార్టీకి ఓటు వేయాలని కోరారు. గ్రేటర్ టీడీపీ అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్‌నగర్‌లో ప్రచారాన్ని ప్రారంభించారు. టీఆర్ఎస్లో ఎవరికి వారే గ్రేటర్లో ఆయా స్థానాల్లో బరిలోకి దిగిన టీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరికి వారే ప్రచారం చేసుకుంటున్నారు. ఎల్బీనగర్, కూకట్పల్లి, సికింద్రాబాద్, గోషామహల్, సనత్‌నగర్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థులు బంగారు తెలంగాణ నిర్మాణం టీఆర్ఎస్తోనే సాధ్యమని విస్తృత ప్రచారం చేశారు. ఆమ్ ఆద్మీ తీరే వేరు సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి ఛాయారతన్ ఆదివారం యూసుఫ్‌గూడ, వెంకటగిరి ఎక్స్‌రోడ్, కృష్ణానగర్‌లలో ప్రచారం నిర్వహించారు. హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి లుబ్నా సర్వత్ యాకుత్‌పురా, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లో పర్యటించారు. పాతబస్తీలో ఉపాధి శిక్షణ సంస్థలు నెలకొల్పుతామని హామీ ఇచ్చారు. లోక్‌సత్తా ఇలా.. పుట్టిన ప్రతి బిడ్డ ఎదిగేందుకు సమాన అవకాశాలుండాలని లోక్‌సత్తా కోరుకోంటుందని లోక్‌సత్తా జాతీయ కన్వీనర్, మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ జయప్రకాష్ నారాయణ అన్నారు. ఎల్బీనగర్ రింగ్‌రోడ్డులోని ఓ హోటల్లో ఆదివారం ‘వాక్ ఇన్ ఇంటర్యూ ఆఫ్ డాక్టర్ జేపీ ఫర్ ఎంపీ’ అనే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జయప్రకాష్ నారాయణతో పాటు లోక్‌సత్తా ఎల్బీనగర్ అభ్యర్ధి దోసపాటి రాము పాల్గొన్నారు. పలువురు యువకులు అడిగిన ప్రశ్నలకు, సందేహాలకు వారు సమాధానమిచ్చారు. లోక్‌సత్తా సాధించిన విజయాలను, చేపట్టబోయే ప్రణాళికలను వివరించారు.