నామినేషన్లను పరిశీలిస్తున్న కలెక్టర్, చిత్రంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు
ప్రధాన పార్టీల నామినేషన్లు పదిలం
పార్లమెంట్ స్థానాలకు 13 అనర్హం
అసెంబ్లీకి 278 నామినేషన్లు దాఖలు
బరిలోని అభ్యర్థులు 209 మంది
రేపటి వరకు ఉపసంహరణకు గడువు
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు దాఖలైన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ సోమవారం పూర్తయింది. ప్రధాన పార్టీల నామినేషన్లన్నింటికీ ఆమోదం లభించింది. పోటీ చేస్తున్న అభ్యర్థుల సమక్షంలోనే సంబంధిత రిటర్నింగ్ అధికారులు నామినేషన్లను పరిశీలించారు. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి సి.సుదర్శన్‌రెడ్డి తన చాంబర్‌లో ఏఈ సత్యనారాయణమూర్తితో కలిసి స్క్రూటిని నిర్వహించారు.
వైఎస్సార్సీపీ అభ్యర్థి బుట్టా రేణుకతో పాటు ఇతర అభ్యర్థులు హాజరయ్యారు. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 18 మంది నామినేషన్లు దాఖలు కాగా ఐదింటిని తిరస్కరించారు. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గానికి 24 నామినేషన్లు దాఖలు కాగా.. ఎనిమిదింటిని తిరస్కరించారు. రెండు పార్లమెంట్ స్థానాల్లో ప్రస్తుతం 29 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.
14 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 69 నామినేషన్లను వివిధ కారణాలతో రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు 278 మంది నామినేషన్లు వేయగా, స్క్రూటి అనంతరం 209 మంది అభ్యర్థులు పోటీలో మిగిలారు. అత్యధికంగా బనగానపల్లిలో 11 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
ఇక్కడ 18 మంది నామినేషన్లు వేయగా ఏడుగురు మాత్రమే పోటీకి అర్హత సాధించారు. ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో నామినేషన్లన్నీ ఆమోదం పొందడం విశేషం. ఇదిలాఉండగా నామినేషన్ల పరిశీలన పూర్తి కాగా.. 23వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం కల్పించారు. బుధవారం 3 గంటలకు ఈ గడువు పూర్తి కానుంది. ఆ తర్వాత బరిలోని అభ్యర్థులకు గుర్తులను కేటాయించనున్నారు.