దూసుకెళ్తా | Competitive campaign | Sakshi
Sakshi News home page

దూసుకెళ్తా

Published Mon, Apr 14 2014 3:50 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM

దూసుకెళ్తా - Sakshi

దూసుకెళ్తా

  •      పోటాపోటీగా ప్రచారం
  •     బరిలో దిగిన ప్రధాన రాజకీయ పార్టీలు
  •     ఓటర్ల చుట్టూ నేతలు
  •     స్టార్ క్యాంపెయినర్ల హడావుడి
  •     సుడిగాలి పర్యటనలు
  •     హామీల వర్షం
  •     ఎక్కడ చూసినా ప్రచార సందడే
  •  సాక్షి, సిటీబ్యూరో : నామినేషన్ల ఘట్టం ముగిసింది. ప్రచారానికి తెర లేచింది. హోరాహోరీ పోరులో గెలుపు అవకాశాలను చేజిక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు నడుం బిగించాయి. ముఖ్య నాయకులు, బరిలో నిలిచిన అభ్యర్థులు, స్టార్ క్యాంపెయినర్ల సుడిగాలి పర్యటనలతో ‘గ్రేటర్’లో ప్రచారం జోరుగా సాగుతోంది. శనివారం సాయంత్రం నుంచే కొందరు రంగంలోకి దిగగా.. ఆదివారం పలు రాజకీయ పార్టీలు మొదలు పెట్టిన ప్రచార పర్వం మిన్నంటిన ఉత్సాహంతో ప్రారంభమైంది. జనం నాడిని తెలుసుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఆయా పార్టీల ప్రచార తీరు ఇలా ఉంది..
     
    వైఎస్సార్‌సీపీ ప్రచార జోరు


     వైఎస్సార్ సీపీ ప్రచారం జోరుగా సాగుతోంది.  ఆదివారం మౌలాలి డివిజన్ పరిధిలోని వెంకటేశ్వరనగర్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల కార్యాలయాన్ని వైఎస్సార్‌సీపీ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి దినేష్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి సమర్థవంతమైనపాలనను ఎంచుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి, సంక్షేమం తన అజెండాగా పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి  వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలోనే సాధ్యమన్నారు. మల్కాజిగిరిలో ప్రజలు సుదీర్ఘకాలంగా రైల్వే చక్రబంధంలో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారని, ఆర్‌యూబీలు, ఫ్లైఓవర్‌లు నిర్మించి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తానన్నారు.  
     
    బీజేపీ మార్గం ఇదీ..

     
    నిజాయితే మార్గం... అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న తనకు అంబర్‌పేట నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం కావాలని బీజేపీ అభ్యర్థి, ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి ప్రజలను కోరారు. గోల్నాక డివిజన్ బీజేపీ అధ్యక్షులు బి.నర్సింగ్‌యాదవ్ ఆధ్వర్యంలో గోల్నాక చౌరస్తా నుంచి కిషన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. చౌరస్తా నుంచి శాంతినగర్, లక్ష్మీనగర్, సాయిబాబా టెంపుల్ లేన్, తులసీరాంనగర్ కాలనీ, అశోకనగర్, శంకర్‌నగర్, జిందాతిలస్మాత్ నగర్ తదితర బస్తీలలో తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మోడీ పాలనతోనే దేశాభివృద్ధి సాధ్యమని ఆయన ప్రచారం చేశారు.

    కాంగ్రెస్ ప్రచారానికి సై..
     
    మహిళల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అంబర్‌పేట్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి వి.హనుమంతరావు అన్నారు. ఆదివారం బాగ్‌అంబర్‌పేట డివిజన్‌లోని ఛే నంబర్ చౌరస్తా నుంచి కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి, ప్రస్తుత ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్‌తో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఛే నంబర్, సాయిమధుర నగర్, శ్రీవెంకటేశ్వర నగర్, బతుకమ్మకుంట తదితర బస్తీల్లో ఆయన ఇంటింటికీ తిరుగుతూ ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.
     
    ఎంఐఎం ప్రచార పర్వం ఇలా..
     
    ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆదివారం పాతనగరంలో విస్తృతంగా ప్రచారం చేశారు. సంఘ్ పరివార్, ఆరెస్సెస్, బీజేపీ మోడీల వైఖరిపైనే ప్రధానంగా విమర్శనాస్త్రాలు సంధించారు. దేశవ్యాప్తంగా ముస్లింలపై జరుగుతున్న అకృత్యాలను ఎండగట్టేందుకు చట్టసభల్లో మైనార్టీల గళం వినిపించేందుకు ఎంఐఎంకు ఓటు వేసి గెలిపించాలని ప్రచారం చేశారు.
     
    టీడీపీ సరళి ఇదీ..
     
    టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం మల్కాజిగిరి పార్లమెంటు సెగ్మెంటులో ప్రచారం చేపట్టారు. ఆదివారం సాయంత్రం మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గంలో రోడ్‌షో నిర్వహించారు. తన పాలనలోనే గ్రేటర్ నగర అభివృద్ధి జరిగిందన్నారు. తన ప్రసంగంలో టీడీపీతోనే మహిళలకు భద్రత సాధ్యమని పేర్కొన్నారు. అభివృద్ధిని కాంక్షించేవారు తమ పార్టీకి ఓటు వేయాలని కోరారు. గ్రేటర్ టీడీపీ అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్‌నగర్‌లో ప్రచారాన్ని ప్రారంభించారు.
     
    టీఆర్‌ఎస్‌లో ఎవరికి వారే

     
    గ్రేటర్‌లో ఆయా స్థానాల్లో బరిలోకి దిగిన టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఎవరికి వారే ప్రచారం చేసుకుంటున్నారు. ఎల్బీనగర్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, గోషామహల్, సనత్‌నగర్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న టీఆర్‌ఎస్ అభ్యర్థులు బంగారు తెలంగాణ నిర్మాణం టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని విస్తృత ప్రచారం చేశారు.
     
    ఆమ్ ఆద్మీ తీరే వేరు
     
    సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి ఛాయారతన్ ఆదివారం యూసుఫ్‌గూడ, వెంకటగిరి ఎక్స్‌రోడ్, కృష్ణానగర్‌లలో ప్రచారం నిర్వహించారు. హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి లుబ్నా సర్వత్ యాకుత్‌పురా, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లో పర్యటించారు. పాతబస్తీలో ఉపాధి శిక్షణ సంస్థలు నెలకొల్పుతామని హామీ ఇచ్చారు.
     
    లోక్‌సత్తా ఇలా..

     
    పుట్టిన ప్రతి బిడ్డ ఎదిగేందుకు సమాన అవకాశాలుండాలని లోక్‌సత్తా కోరుకోంటుందని లోక్‌సత్తా జాతీయ కన్వీనర్, మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ జయప్రకాష్ నారాయణ అన్నారు. ఎల్‌బీనగర్ రింగ్‌రోడ్డులోని ఓ హోటల్‌లో ఆదివారం ‘వాక్ ఇన్ ఇంటర్యూ ఆఫ్ డాక్టర్ జేపీ ఫర్ ఎంపీ’ అనే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జయప్రకాష్ నారాయణతో పాటు లోక్‌సత్తా ఎల్‌బీనగర్ అభ్యర్ధి దోసపాటి రాము పాల్గొన్నారు. పలువురు యువకులు అడిగిన ప్రశ్నలకు, సందేహాలకు వారు సమాధానమిచ్చారు. లోక్‌సత్తా సాధించిన విజయాలను, చేపట్టబోయే ప్రణాళికలను వివరించారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement