రాత్రి దాడులు.. పొద్దున్న రాజీలు..! | TDP Workers Threaten YSRCP Voters In Guntur District | Sakshi
Sakshi News home page

రాత్రి దాడులు.. పొద్దున్న రాజీలు..!

Published Tue, Apr 16 2019 8:47 AM | Last Updated on Tue, Apr 16 2019 8:47 AM

TDP Workers Threaten YSRCP Voters In Guntur District - Sakshi

 గురజాల పట్టణంలో ముస్లింల ఇళ్ళపై దాడులకు తెగబడుతున్న టీడీపీ గుండాలు (ఫైల్‌), లగడపాడులో ఆదివారం రాత్రి పోలీసులఎదుటే కర్రలు, రాడ్‌లతో ఎస్సీలపై దాడికి యత్నిస్తున్న దృశ్యం

సాక్షి, గుంటూరు: రాత్రి పూట ఇష్టానుసారం దాడులకు తెగబడటం.. పొద్దున్నే పోలీసుల ద్వారా రాజీలకు పంపడం.. టీడీపీ నేతల తీరిది. ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేశారనే అక్కసుతో ఎస్సీ, ముస్లిం మైనార్టీ వర్గాలే టార్గెట్‌గా దాడులకు పాల్పడుతున్నారు. టీడీపీ నేతలు విచక్షణా రహితంగా దాడులకు తెగబడుతుంటే కఠిన చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు శాంతి కమిటీల పేరుతో వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇరువర్గాలపై కేసుల నమోదు పేరుతో హడావుడి చేసి, ఇరువర్గాల పెద్దలను పిలిపించి రాజీ కుదిర్చి చేతులు దులుపుకుంటున్న పరిస్థితి. పోలింగ్‌ నిలిపేశారంటూ గ్రామస్తులు తిరగబడితే మాత్రం హత్యాయత్నం కేసులు నమోదు చేస్తూ పోలీసుస్టేషన్‌లకు లాక్కెళుతున్నారు. దీన్ని బట్టి చూస్తే పోలీసులు పక్షపాత ధోరణి ఏవిధంగా ఉందో ఇట్టే అర్థమవుతోంది. గుంటూరు జిల్లాలో ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతూనే ఉన్నాయి.

పోలీసుల కళ్లెదుటే దౌర్జన్యకాండ
జిల్లాలో ఎన్నికలు ముగిసినప్పటి నుంచి ఓటమి భయంతో టీడీపీ నేతలు రెచ్చిపోతూ అరాచకాలకు, దౌర్జన్యాలకు, దాడులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలే టార్గెట్‌గా పోలీసుల ఎదుటే వీరంగం వేస్తూ దాడులకు పాల్పడుతున్నారు. తమకు ఓట్లు వేయలేదనే అక్కసుతో ఎన్నికలు ముగిసిన వెంటనే టీడీపీ నేతలు గురజాల పట్టణంలోని ముస్లింల ఇళ్లపై విచక్షణా రహితంగా దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్‌సీపీ నేతల ఆస్తులను ధ్వంసం చేశారు. మూడు గంటల పాటు గురజాల పట్టణంలో తిరుగుతూ విధ్వంస కాండకు పాల్పడ్డారు. ఇదంతా అక్కడి సీఐ రామారావు సమక్షంలోనే జరగడం గమనార్హం. డీఎస్పీ హెడ్‌క్వార్టర్‌ అయిన గురజాల పట్టణంలో మూడు గంటలపాటు రోడ్లపై కత్తులు, రాడ్‌లు, కర్రలతో టీడీపీ నేతలు వీరంగం సృష్టిస్తున్నా పోలీసులు అడ్డుకున్న దాఖలాలు లేవంటే వీరు టీడీపీ నేతలకు ఏ స్థాయిలో ఊడిగం చేస్తున్నారో అర్థమవుతోందని బాధితులు వాపోతున్నారు. ఎట్టకేలకు ఇరువర్గాల నుంచి ఫిర్యాదులు తీసుకుని రెండు కేసులు నమోదు చేశారు. అయితే విధ్వంసం సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోకుండా శాంతి కమిటీల పేరుతో రాజీ అంటూ కాలయాపన చేస్తున్నారు. ఇంత దారుణ ఘటన జరిగి ఐదు రోజులు గడుస్తున్నా ఏ ఒక్కరినీ అరెస్టు చేసిన దాఖలాలు లేవు. 

దాడులు చేస్తే కేసులు పెట్టరా?
పెదకూరపాడు మండలం లగడపాడు గ్రామంలో ఆదివారం రాత్రి అంబేడ్కర్‌ జయంతి వేడుకలు జరుపుకుంటున్న ఎస్సీ వర్గీయులను టీడీపీ నేతలు అడ్డుకుని దాడులకు యత్నించారు. వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేస్తారా అంటూ దూషిస్తూ తరుముకుంటూ వెళ్లారు. కర్రలు, రాడ్‌లతో వీరంగం సృష్టించారు. అర్ధరాత్రి సమయంలో ఎస్సీ మహిళలంతా అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట ధర్నాకు దిగినప్పటికీ టీడీపీ నేతలు వెనక్కు తగ్గలేదు. ఇదిలా ఉండగా ఎస్సీలపై దాడికి దిగిన టీడీపీ నేతలపై కేసు నమోదు చేయని పోలీసులు సోమవారం రాత్రి ఇరువర్గాల పెద్దలతో రాజీ కోసం తెరతీసినట్లు సమాచారం. ఇరువర్గాలతో శాంతి కమిటీలు ఏర్పాటు చేసి గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నట్లుగా కలరింగ్‌ ఇస్తున్నారు. నిజంగా పోలీసులకు గ్రామాల్లో శాంతిని నెలకొల్పాలనే ఉద్దేశమే ఉంటే దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలా చేస్తేనే వారు భవిష్యత్‌లో దాడులకు దిగకుండా భయం ఉంటుందని పలువురు సూచిస్తున్నారు. పోలింగ్‌ సమయంలో బూత్‌లోకి వెళ్లి రెండు గంటలపాటు తలుపులు మూసుకుని ఉద్రిక్తతకు కారణమైన స్పీకర్‌ కోడెలపై కేసు నమోదు చేయకుండా, అది తప్పు అని చెప్పినా వినకపోవడంతో తిరగబడిన గ్రామస్తులపై మాత్రం హత్యాయత్నం కేసు నమోదు చేసి వేధింపులకు గురిచేయడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement