కుప్పంలోని విజయవాణి స్కూల్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందిపై దాడి చేస్తున్న టీడీపీ నాయకురాలు, కార్యకర్తలు
సాక్షి, తిరుపతి/నెట్‌వర్క్: చిత్తూరు జిల్లా కుప్పం పట్టణ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్‌కు ఓటర్లు పోటెత్తడం టీడీపీలో ప్రకంపనలు సృష్టించింది. ఉదయం నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు స్థానికులు బారులుతీరారు. మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో చంద్రబాబు, ఆ పార్టీ నేతలు ఒక్కసారిగా బెంబేలెత్తిపోయారు. వెంటనే అమరావతి నుంచే కుప్పం టీడీపీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.
పోలింగ్ శాతాన్ని తగ్గిస్తే టీడీపీకి ప్రయోజనం కలుగుతుందని భావించి అలజడులు సృష్టించాలని ఆదేశించారు. అందుకు శాంతిపురం, రామకుప్పం, గుడుపల్లి, వీ కోట, పలమనేరు నుంచి టీడీపీ శ్రేణులను రంగంలోకి దింపాలని సూచించారు. వారిని చూపించి వైఎస్సార్‌సీపీ తరఫున దొంగ ఓట్లు వేసేందుకు వచ్చారని గొడవ చేయమన్నారు. అంతేకాక.. టీడీపీ శ్రేణులతో చంద్రబాబు మాట్లాడిన టెలికాన్ఫరెన్స్‌ను రికార్డు చేసి మిగిలిన కార్యకర్తలకు పంపి రెచ్చగొట్టారు. కుప్పానికి తాను వస్తున్నాని చెప్పటంతో టీడీపీ శ్రేణులు మరింతగా రెచ్చిపోయారు.
16వ వార్డులో రగడ రగడ
చంద్రబాబు డ్రామాను రక్తికట్టించేందుకు 16వ వార్డుని ఎంచుకున్నారు. వైఎస్సార్‌సీపీ తరఫున పోటీచేస్తున్న డాక్టర్ సుధీర్ చైర్మన్ అభ్యర్థి కావటంతో ఈ వార్డును ఎంచుకున్నారు. స్థానిక మహిళలు ఇద్దరు ఓటేసేందుకు వెళ్తుంటే వారు దొంగ ఓటర్లని టీడీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. స్థానికులమేనని వారు ఆధార్ కార్డు చూపించినా వినలేదు. వెంటనే టీడీపీ శ్రేణులందరికీ ఫోన్లుచేసి 16వ వార్డుకు పిలిపించుకుని నానా యాగీ చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం రాజుకుంది. మరో వర్గం టీడీపీ శ్రేణులు అదే వార్డులో ఉన్న విజయవాణి స్కూల్లో పనిచేస్తున్న సిబ్బందిపై దాడిచేశారు. తాము దొంగ ఓటర్లు కాదని ఎంత మొత్తుకున్నా వినకుండా జుట్టు పట్టుకుని లాగిలాగి కొట్టారు. అదే విధంగా 17వ వార్డులోనూ దొంగ ఓటర్లు వస్తున్నారంటూ టీడీపీ ఏజెంట్లు కుర్చీలు విరగొట్టారు.
పోలీసులు ఎంత వారించినా లెక్కచేయలేదు. పోలీసులను కోర్టుకు లాగుతామంటూ బెదిరించారు. అయితే గొడవ చేసేందుకు వచ్చిన టీడీపీ శ్రేణులు కూడా స్థానికేతరులే కావడం గమనార్హం. ఈ పరిస్థితులను తన అనుకూల మీడియా, సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రావటానికి ఆలోచనలో పడ్డారు. 90 శాతం పోలింగ్ జరుగుతుందని అందరూ ఊహిస్తే టీడీపీ తీరుతో 76.84 శాతానికి పరిమితమైంది. అయితే.. పట్టణ ప్రజలు మాత్రం ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యం బతికే ఉందని నిరూపించారు. మరోవైపు.. కుప్పం మీదుగా బస్సులో వెళ్లే ప్రయాణీకులను కూడా వైఎస్సార్‌సీపీ నేతలు పంపిన దొంగ ఓటర్లంటూ హంగామా చేశారు. ఇక ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్‌ను టీడీపీ అడ్డుకుని అలజడులు సృష్టించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బారులు తీరిన మహిళలు
కుప్పం మున్సిపాలిటీ మహిళా ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. ప్రభుత్వం నుంచి లబ్ధిపొందుతున్నందుకు కృతజ్ఞత తీర్చుకోవాలని భావించినట్లు స్పష్టమైంది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలు పెద్దసంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని మధ్యాహ్నం వరకు క్యూలైన్‌లోనే ఉన్నారు. మ.2 గంటలు దాటినా భోజనానికి వెళ్లకుండా ఓటు వేసేందుకు ఆస్తి చూపించారు.
జిల్లాల వారీగా పోలింగ్ ఇలా..
► వైఎస్సార్ జిల్లాలో రాజంపేట, కమలాపురం మున్సిపాలిటీలతోపాటు బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డుకు ఎన్నికలు జరిగాయి. టీడీపీ నేతలు దౌర్జన్యకాండకు పాల్పడ్డారు. ఏకంగా పోలీసులపైనే దాడులు చేసి గాయపరిచారు. అధికార పార్టీ వాళ్లు దొంగ ఓట్లు వేస్తున్నారంటూ పోలింగ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కమలాపురంలోనూ ఇదే పరిస్థితి. పోలింగ్ బూత్‌లపైకి ఎగబడ్డారు. అడ్డుకున్న పోలీసులను నానా దుర్బాషలాడారు. దీంతో వారు టీడీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. రాజంపేటలో టీడీపీ వాళ్లు చేసిన రాళ్ల దాడిలో సీఐ విశ్వనాథరెడ్డి చేతికి తీవ్రగాయమైంది. మరో సీఐ డ్రైవర్ తలకు గాయమైంది.
► అనంతపురం జిల్లా పెనుకొండ నగర పంచాయతీ ఎన్నికల పోలింగ్ కూడా సోమవారం ప్రశాంతంగా ముగిసింది. సమస్యాత్మకంగా ముద్రపడిన పెనుకొండలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంలో పోలీసులు సఫలమయ్యారు. ఇక్కడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి నోటి దురుసు ప్రదర్శించారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ మాధవ్‌ను రాజేశ్వరి కాలనీలోని 17వ పోలింగ్ కేంద్రం వద్ద చూసిన బీకే ‘నీవు ఇక్కడికి రాకూడద’ంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. పోలీసుల పట్ల కూడా అగౌరవంగా మాట్లాడారు.
► కర్నూలు జిల్లా బేతంచెర్ల నగర పంచాయతీకి సోమవారం జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్వగ్రామంలో మొదటిసారి నగర పంచాయతీ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా జరిగాయి.
► శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సోమవారం మున్సిపల్ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అధికారుల ముందస్తు చర్యలతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. అక్కడక్కడ టీడీపీ కార్యకర్తలు యాగీ చేశారు. మరోవైపు.. పోలింగ్ కేంద్రాల్లో హెల్త్ క్యాంపులను ఏర్పాటుచేసి కోవిడ్ వ్యాక్సిన్‌లను అందుబాటులో ఉంచారు.
► ప్రకాశం జిల్లాలోని దర్శి నగర పంచాయతీ ఎన్నికలూ సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. 13, 19 వార్డుల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను టీడీపీ నేతలు అడ్డుకుంటూ హంగామా చేశారు.
► గుంటూరు జిల్లాలో స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. గుంటూరు 6వ డివిజన్‌లో టీడీపీ నేతలు హడావుడి చేసి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దాచేపల్లిలో టీడీపీ నేతలు ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నించడంతో వైఎస్సార్‌సీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.
► కృష్ణాజిల్లా జగ్గయ్యపేట, కొండపల్లి మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. సోమవారం ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులు తీరారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు.
► పశ్చిమగోదావరి జిల్లాలో పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. వర్షంలోనూ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
► తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కార్పొరేషన్‌లోని 3, 9, 16, 30 డివిజన్లలో సోమవారం జరిగిన ఉప ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగింది.
► విజయనగరంలోని 1వ వార్డు ఉప ఎన్నిక సోమవారం సజావుగా జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment