Kuppam Development Works: YSR Congress Party Govt Welfare Schemes Development Works Kuppam - Sakshi
Sakshi News home page

కుప్పం.. ఇన్నేళ్లకు అభివృద్ధి పట్టం

Published Tue, Sep 21 2021 4:39 AM | Last Updated on Tue, Sep 21 2021 10:43 AM

YSR Congress Party Govt Welfare Schemes Development works Kuppam - Sakshi

చందం గ్రామం ఏరియల్‌ రివ్యూ

సాక్షి ప్రతినిధి, తిరుపతి: కుప్పం నియోజకవర్గం కుప్పం మండలం చందం గ్రామ సచివాలయ పరిధిలో 541 కుటుంబాలున్నాయి. మొత్తం 2,400 మంది నివసిస్తున్నారు. ఆ గ్రామంలో అర్హులైన 44 మందికి వైఎస్సార్‌ కాపు నేస్తం, 77 మందికి వైఎస్సార్‌ చేయూత, 302 మందికి వైఎస్సార్‌ రైతు భరోసా, 510 మందికి వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ, 34 సంఘాలకు వైఎస్సార్‌ ఆసరా, 453 మందికి వైఎస్సార్‌ బీమా, 290 మందికి జగనన్న అమ్మఒడి, 394 మందికి జగనన్న విద్యాకానుక, 18 మందికి జగనన్న తోడు, 245 మందికి పింఛన్లు, 40 సంఘాలకు సున్నా వడ్డీ, 55 మంది విద్యార్థులకు విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు అందుతున్నాయి. ఇలా ఆ గ్రామ పరిధిలోని అర్హులందరికీ కులం, మతం, పార్టీ, వివక్ష లేకుండా రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి చేకూరుతోంది. ఒక్క చందం గ్రామమే కాదు.. కుప్పం నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లోని అన్ని గ్రామాల్లోనూ ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ఇలాగే అందుతున్నాయి... ఇదంతా ఇప్పుడు ఎందుకనుకుంటున్నారా... కుప్పం ఎమ్మెల్యే ఎవరో మీకు తెలుసు కదా.. వరుసగా మూడు దశాబ్దాలకు పైగా ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

వరుసగా గెలిపిస్తున్న కుప్పంపై బాబు నిర్లక్ష్యం
1989 నుంచి తనను వరుసగా గెలిపిస్తూ వచ్చిన కుప్పం నియోజకవర్గంపై చంద్రబాబు తనదైన శైలిలో నిర్లక్ష్యం చూపించారు. ‘2004 ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ చావు దెబ్బతిన్నా... నన్ను మాత్రం గెలిపించి పరువు నిలబెట్టారు’ అని అప్పట్లో బాబు కుప్పంకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు. 2009లోనూ సేమ్‌ సీన్‌.. 2019లోనూ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. మరి ఇంతగా ఆదరించిన.. ఓరకంగా చెప్పాలంటే సొంత నియోజకవర్గం చంద్రగిరిలో పరాభవం జరిగిన తర్వాత ఇన్నేళ్లుగా ఆదరిస్తున్న కుప్పం పట్ల ఆయన కనీస కృతజ్ఞత చూపించలేకపోయారనేందుకు అక్కడ ఇన్నాళ్లూ పాతుకుపోయిన వెనుకబాటుతనమే ప్రత్యక్ష ఉదాహరణ.

ఇప్పుడు వర్తమానంలోకి వద్దాం 
‘కులం చూడం.. మతం చూడం.. వర్గాలు చూడం.. పార్టీలు చూడం.. రాజకీయాలు చూడం.. అందరికీ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందిస్తాం’.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఈ భరోసా మాటలను ముఖ్యమంత్రి కాగానే అక్షరాలా నిజం చేసి చూపించారు. కులమతవర్గాలు రాజకీయాలకతీతంగా అభివృద్ధి ఫలాల్లో అందరికీ సమాన ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు. ఏదైనా అనుమానముందా.. అయితే ఎక్కడో ఎందుకు.. స్వయంగా చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికే ఒకసారి వెళ్లి చూద్దాం రండి.


కుప్పంకు మునిసిపాలిటీ హోదా
రాష్ట్రంలో చిట్టచివరి అసెంబ్లీ నియోజకవర్గ సంఖ్యను కలిగి ఉన్న కుప్పంకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన ఆర్నెల్లలోనే మునిసిపాలిటీ హోదా వచ్చింది. 
14,800 మందికి ఇళ్ల పట్టాలు కుప్పం నియోజకవర్గంలో ఈ రెండేళ్ల కాలంలో 14,800 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో 5,158 మందికి ఇళ్ల పట్టాలకు అనుమతి ఇచ్చి వారిలో 4,150 మందికి మాత్రమే పంపిణీ చేశారు.

అర్హులందరికీ పింఛన్లు
గత ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీల ఆమోదం ఉంటేనే పింఛన్‌ వచ్చేది. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అర్హులైన వారందరికీ నేరుగా అందిస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలో 2014–2019 మధ్య 30,970 మందికి పింఛన్లను అందించగా ప్రస్తుతం గతం కంటే ఎక్కువగా 34,956 మందికి పింఛన్లు ఇస్తున్నారు.

గతంలో 44.. ప్రస్తుతం 83 భవనాల నిర్మాణం
గత ఐదేళ్ల టీడీపీ పాలనలో కుప్పంలో 44 పక్కా ప్రభుత్వ కార్యాలయాల భవనాలను నిర్మించారు. ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రెండేళ్లలోనే 83 గ్రామ సచివాలయ, పంచాయతీ భవనాలను నిర్మించింది.

13,940 మందికి ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్సలు
2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కుప్పం నియోజకవర్గంలో 13,940 మందికి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యచికిత్సలు అందించారు. ఈ పథకం ద్వారా వారికి రూ.27 కోట్ల ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించింది. టీడీపీ ప్రభుత్వ పాలనలో 9,348 మందికే లబ్ధి కలిగింది.

53,187 మందికి అమ్మఒడి
కుప్పం నియోజకవర్గంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం జగనన్న అమ్మఒడి పథకం ద్వారా ఏటా ఆదుకుంటోంది. ఇందులో భాగంగా 53,187 మంది తల్లుల ఖాతాల్లో రూ.79.78 కోట్లను జమ చేసింది. గత ప్రభుత్వ పాలనలో పిల్లల చదువులకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయని పరిస్థితి.

30 ఏళ్లుగా తీరని సమస్యలు.. రెండేళ్లలోనే పరిష్కారం
► కుప్పం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి ఉపాధి కోసం ప్రజలు బెంగళూరుకు వెళ్లాల్సిన దుస్థితి. దీంతో ఆ ప్రాంత ప్రజలకు ఉపాధి సౌకర్యం కల్పించేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు లక్ష మందికి ఉపాధి సౌకర్యం కల్పించేలా గ్రానైట్‌ సర్వే స్టోన్‌ కటింగ్, పాలిషింగ్‌ యూనిట్‌ను నెలకొల్పేందుకు రంగం సిద్ధం చేసింది. కుప్పం పరిధిలోని దళవాయి కొత్తపల్లి సమీపంలో పల్లార్లపల్లి వద్ద నాలుగు ఎకరాల స్థలంలో యూనిట్‌ను స్థాపించేందుకు అధికారిక యంత్రాంగం చర్యలు చేపట్టింది.
► కుప్పంలోని రైల్వే బ్రిడ్జి సమస్య దీర్ఘకాలికంగా అపరిష్కృతంగానే ఉంది. దీనివల్ల సమీపంలోని 60 గ్రామాల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ సమస్యను వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే పరిష్కరించింది. రెండు నూతన రైల్వేఅండర్‌ గ్రౌండ్‌ బ్రిడ్జిలను నిర్మించి ప్రారంభించింది. ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు ఎన్నో ఉన్నాయి. అందుకే కుప్పం ప్రజలు 2019 తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ‘ఫ్యాన్‌’కి తిరుగులేని పట్టం కట్టారు. 


రాజకీయాలకతీతంగా కుప్పంకు నిధులు మంజూరు  
రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఎమ్మెల్యేలకు ప్రభుత్వం రూ.కోటి చొప్పున నిధులను కేటాయించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ (ఎస్‌డీఎఫ్‌) కింద కేవలం టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకే నిధులు మంజూరయ్యేవి. అప్పటి ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు అడిగినా నిధులు ఇచ్చేది కాదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ పథకం పేరును ముఖ్యమంత్రి అభివృద్ధి నిధులు (సీఎండీఎఫ్‌)గా మార్పు చేసింది. అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలనే తేడా లేకుండా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకూ నిధులు విడుదల చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలిచ్చారు. ఈ క్రమంలోనే చంద్రబాబు లేఖ రాసిన వెంటనే కుప్పంకు రూ.కోటి నిధులు మంజూరు చేశారు.

జగన్‌ సీఎం అయ్యాకే మాకు సంక్షేమ పథకాలు
నా పేరు శాంతమ్మ. మేము చందం గ్రామంలో నివసిస్తున్నాం. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాకే సంక్షేమ పథకాలు మా కుటుంబానికి అందాయి. మాకు కొంత భూమి ఉండడంతో
రైతుభరోసా పథకం వల్ల లబ్ధి పొందుతున్నాం. ప్రతి నెలా వలంటీర్‌ పింఛన్‌ను మా ఇంటికే తెచ్చి ఇస్తున్నారు. వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా వచ్చిన డబ్బులతో చిరు వ్యాపారం చేసుకుంటున్నాం. మా కుటుంబం ఎప్పటికీ వైఎస్‌ జగన్‌కు రుణపడి ఉంటుంది.  
 – శాంతమ్మ, చందం గ్రామం, కుప్పం 

ఇంత లబ్ధి ఎప్పుడూ లేదు
నా పేరు.. శోభారాణి. చందం పంచాయతీలో కొత్త ఇంటిలో ఉంటున్నాం. చాలా ఏళ్లు ఉండడానికి సొంతిల్లు లేకపోవడంతో అద్దె ఇంట్లో ఉండాల్సిన దుస్థితి. గతంలో చాలాసార్లు ఇంటి స్థలం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ప్రయోజనం శూన్యం. జగనన్న సీఎం అయ్యాక నా పేరుతో ఇంటి స్థలాన్ని ఇచ్చారు. కాపునేస్తం, రైతుభరోసా, పిల్లల చదువులకు అమ్మఒడి, వైఎస్సార్‌ ఆసరా పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నాను. గతంలో ఎన్నడూ ఇన్ని పథకాలు అందలేదు.    
– శోభారాణి, చందం గ్రామం, కుప్పం 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement