
సాక్షి, అమరావతి : ఎక్కడా ఏ తప్పు చేయలేదని, ధైర్యంగా ముందుకు పోదామని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ కార్యకర్తలకు చెప్పారు. వైఎస్సార్‌సీపీ చేస్తామని చెప్పినవన్నీ చేయనివ్వాలని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా ఒత్తిడి తేవాలని సూచించారు. ఉండవల్లిలోని తన నివాసంలో సోమవారం కుప్పం నుంచి వచ్చిన టీడీపీ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. చంద్రబాబు మాట్లాడుతూ తన పాలనలో ఒకటి రెండే లోపాలున్నాయని, దాన్ని భూతద్దంలో చూపి వ్యతిరేకతగా చెబుతున్నారని తెలిపారు. జరిగింది వదిలేసి భవిష్యత్తు వైపు నడవాలని, లోపాలను సవరించుకోవాలని సూచించారు. తమకు పోరాటం కొత్తకాదని, పలాయనం తమకు తెలియదన్నారు.
ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగిద్దామని చెప్పారు. కుప్పంలో తన మెజారిటీ తగ్గడానికి గల కారణాలను అన్వేషించాలని, ఫలితాలను అధ్యయనం చేయాలని సూచించారు. మరో ఐదేళ్లు అధికారంలో ఉంటే సైబరాబాద్ లాంటి నగరాన్ని నిర్మించేవాళ్లమని చెప్పారు. పలువురు నాయకులు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లే వినియోగిస్తారని, అప్పుడు ఎవరి బలం ఎంతో తేలిపోతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని చంద్రబాబు కోరారు.
ఇఫ్తార్ విందులో చంద్రబాబు
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సోమవారం విజయవాడలో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. నగరంలోని ఏ కన్వెన్షల్ హాల్లో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాష్ట్రం, దేశం బాగుండాలని ఇఫ్తార్ దువా చేశారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి లోకేశ్, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.