Iftar feast
-
Ramadan 2024: సమతా మమతల పర్వం ఈదుల్ ఫిత్ర్!
అల్లాహు అక్బర్ .. అల్లాహు అక్బర్ .. లాయిలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హంద్ ..! ఈ రోజు ఎటువిన్నా ఈ స్తోత్ర గానమే, ఆ దయామయుని కీర్తిగానమే వినిపిస్తూ హృదయాలను పులకింపజేస్తూ ఉంటుంది. ఊరు, వాడ, పల్లె, పట్నం, చిన్నా పెద్దా, ఆడా మగా, ముసలీ ముతకా అనే తేడా లేకుండా ఎవరి నోట విన్నా ఈ అమృత వచనాలే జాలువారుతూ ఉంటాయి. కొత్తబట్టలు, కొత్తహంగులు, తెల్లని టోపీలు మల్లెపూలలా మెరిసిపోతుంటాయి. అత్తరు పన్నీరు పరిమళాలు, అస్సలాము అలైకుం, ఈద్ ముబారక్‌లు, చిరునవ్వుల కరచాలనాలు, ఆలింగనాల ఆనంద తరంగాలు, అలయ్ బలయ్ లతో విశ్వాసుల హృదయాలు సంతోషసాగరంలో ఓలలాడుతూ ఉంటాయి. సేమ్యాలు, షీర్ ఖుర్మాలు, బగారా, బిర్యానీల ఘుమఘుమలతో, ఉల్లాస పరవళ్ళ హడావిడితో ముస్లిముల లోగిళ్ళు కిలకిల నవ్వుతూ, కళకళలాడుతూ ఉంటాయి. ఇళ్ళలో ఆడాళ్ళ హడావిడికి, పిల్లల సందడికి హద్దులే ఉండవు. ఎందుకంటే ఇది ఒక్కనాటి పండుగ కాదుగదా! నెల్లాళ్ళపాటు భక్తిప్రపత్తులతో జరుపుకున్న పండుగకు అల్విదా చెబుతున్న ముగింపు ఉత్సవం. రమజాన్ నెలరోజులూ ముస్లింల వీధులు ‘సహెరీ’,‘ఇఫ్తార్’ ల సందడితో నిత్యనూతనంగా కొత్తశోభతో అలరారుతుంటాయి. మసీదులన్నీ భక్తులతో కిటకిటలాడుతూ, ప్రేమామృతాన్ని చిలకరిస్తూ వింత అనుభూతుల్ని పంచుతుంటాయి. భక్తులు పవిత్ర గ్రంథ పారాయణా మధురిమను గ్రోలుతూ వినూత్న అనుభూతులతో పరవశించి పోతుంటారు. అవును.., ఇలాంటి అనుభూతులు, ఆనందాలు, ఆహ్లాదాలు, అనుభవాలు, అనుభూతుల సమ్మేళనమే పండుగ. ఇలాంటి ఓ అద్భుతమైన, అపురూప సందర్భమే ‘ఈదుల్ ఫిత్ర్ ’. దీన్నే రమజాన్ పండుగ అంటారు. ముస్లిం సమాజం జరుపుకునే రెండు ముఖ్యమైన పండుగల్లో ఇది మొదటిదీ, అతి పవిత్రమైనదీను. ఈ నెలలో ముస్లింలు అత్యంత నియమనిష్టలతో రోజావ్రతం పాటిస్తారు. భక్తిశ్రద్ధలతో రోజూ ఐదుసార్లు నమాజ్ చేస్తారు. పవిత్రఖురాన్ గ్రంథాన్ని భక్తితో పారాయణం చేస్తూ, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ముహమ్మద్ ప్రవక్త(స)వారిపై సలాములు పంపుతూ ఉంటారు. దైవనామస్మరణలో అనునిత్యం వారి నాలుకలు నర్తిస్తూ ఉంటాయి. ప్రతిరోజూ తరావీహ్ నమాజులో పాల్గొని తన్మయులవుతుంటారు. దానధర్మాలు చేస్తారు, ఫిత్రాలు చెల్లిస్తారు. ఈ విధంగా రమజాన్ చంద్రవంక దర్శనంతో ప్రారంభమైన ఉపవాసదీక్షలు నెలరోజుల తరువాత షవ్వాల్ మాసం నెలవంక దర్శనంతో సమాప్తమవుతాయి. షవ్వాల్ మొదటితేదీన జరుపుకునే ‘ఈదుల్ ఫిత్ర్’ పర్వదినాన్నే మనం రమజాన్ పండుగ అంటున్నాము. ఈ పండుగ సంబంధం రమజాన్ నెలతో ముడివడి ఉన్న కారణంగా ఇది రమజాన్ పండుగగా ప్రసిద్ధి చెందింది. రమజాన్ ఉపవాస దీక్షలు, పవిత్ర ఖురాన్ అవతరణతో దీని సంబంధం పెనవేసుకు పోయి ఉంది. మానవుల్లో దైవభక్తిని, దైవభీతిని, సదాచారాన్ని, మానవీయ విలువల్ని జనింపజేయడానికి సృష్టికర్త ఉపవాస వ్రతాన్ని విధిగా నిర్ణయించాడు. దైవాదేశ పాలనకు మనిషిని బద్దునిగా చేయడమే ఉపవాస దీక్షల అసలు లక్ష్యం. ఒక నిర్ణీత సమయానికి మేల్కొనడం, సూర్యోదయం కాకముందే భుజించడం(సహెరి), సూర్యాస్తమయం వరకూ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా, రోజూ ఐదుసార్లు దైవారాధనచేస్తూ సూర్యాస్తమయం తరువాత రోజా విరమించడం(ఇఫ్తార్), మితాహారం తీసుకోవడం, మళ్ళీ అదనపు ఆరాధనలు అంటే తరావీహ్ నమాజులు చేయడం, మళ్ళీ తెల్లవారు ఝామున లేవడం – ఈవిధంగా రమజాన్ ఉపవాస వ్రతం మనిషిని ఒక క్రమశిక్షణాయుతమైన, బాధ్యతాయుతమైన, దైవభక్తి పరాయణతతో కూడుకున్న జీవనవిధానానికి అలవాటు చేస్తుంది. మానవుల్లో ఇంతటి మహోన్నత విలువలను, సుగుణాలను జనింపజేసే వ్రతాన్ని పరాత్పరుడైన అల్లాహ్ వారికి అనుగ్రహించినందుకు, వాటిని వారు నెలరోజులూ త్రికరణ శుద్ధిగా పాటించ గలిగినందుకు సంతోష సంబరాల్లో తేలిపోతూ కృతజ్ఞతాపూర్వకంగా భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకుంటారు. మరో ముఖ్య విషయం ఏమిటంటే, పవిత్ర రమజాన్ నెలలోనే సమస్త మానవాళి సన్మార్గ దీపిక అయిన మహత్తర గ్రంథరాజం ఖురాన్‌ను దేవుడు మానవాళికి ప్రసాదించాడు. సమస్త మానవజాతికీ మార్గదర్శక జ్యోతి పవిత్ర ఖురాన్. సన్మార్గం చూపే, సత్యాసత్యాలను వేరుపరిచే స్పష్టమైన ఉపదేశాలు ఇందులో ఉన్నాయి. ఈ గ్రంథరాజం మానవులందరికీ సన్మార్గ బోధన చెయ్యడానికి అవతరించిన ప్రబోధనా జ్యోతి. దైవ ప్రసన్నతను చూరగొనడానికి రోజా పాటించడం,‘తరావీహ్ ’లు ఆచరించడం, దానధర్మాలు చేయడంతో పాటు, ఈ నెల చివరిలో‘లైలతుల్ ఖద్ర్’ అన్వేషణలో అధికంగా ఆరాధనలు చేస్తారు. లైలతుల్ ఖద్ర్ అంటే అత్యంత అమూల్యమైన రాత్రి అని అర్థం. ఉపవాసం పాటించడంవల్ల పేదవాళ్ళ ఆకలి బాధలు అర్థమవుతాయన్నారు. సంపన్నులకు, ముప్పూటలా సుష్టుగా తినేవారికి నిరుపేదల ఆకలికేకలు వినబడవు. అలాంటివారు గనక ఉపవాసం పాటించినట్లయితే ఆకలి బాధ ఎలా ఉంటుందో వారికీ తెలుస్తుంది. తద్వారా పేదసాదలను ఆదుకోవడం, వారికి పట్టెడన్నం పెట్టడం ఎంతగొప్ప పుణ్యకార్యమో వారు అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు. ఈ విధంగా రమజాన్ నెల ఆరంభంనుండి అంతం వరకు ఒక క్రమపద్ధతిలో ధర్మం చూపిన బాటలో నడుస్తూ, దైవప్రసన్నత, పుణ్యఫలాపేక్షతో ఈనెలను గడిపినవారు ధన్యులు. నిజానికి ఇలాంటివారే పండుగ శుభకామనలకు అర్హులు. అందుకే ’ఈద్ ’(పండుగ)ను శ్రామికుని వేతనం(ప్రతిఫలం)లభించే రోజు అని చెప్పడం జరిగింది. ఈ విధంగా రమజాన్ పర్వదినం మనిషిని ఒక ఉన్నతమానవీయ విలువలుకలవాడుగా తీర్చిదిద్ది, సమాజంలో శాంతి, సమానత్వం, సామరస్యం, సోదర భావాలకు పునాదివేస్తుంది. ప్రేమ తత్వాన్ని ప్రోదిచేస్తుంది. ఇదే ఈదుల్ ఫిత్ర్ – రమజాన్ పర్వదిన పరమార్ధం. సదాచరణల సంపూర్ణప్రతిఫలం లభించిన సంతోషంలో అంబరాన్నంటేలా సంబురాలు జరుపుకొని ఆనంద తరంగాల్లో తేలియాడే రోజు ఈదుల్ ఫిత్ర్ . – ఆరోజు ముస్లిములందరూ ఈద్ నమాజ్ ముగించుకొని పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటారు. పండుగకు ప్రత్యేకంగా తయారు చేసిన సేమియా పాయసాన్ని తమ హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిఖ్ఖు సోదరులందరికీ ఆప్యాయంగా రుచి చూపించి తమ ఆనందాన్ని వారితో పంచుకుంటారు.‘ఈద్ ముబారక్’ అంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆత్మీయంగా ఆలింగనాలు చేసుకుంటారు. పవిత్ర ఖురాన్ రూపంలో అవతరించిన సృష్టికర్త మహదనుగ్రహం దానవుడి లాంటి మానవుణ్ణి దైవదూతగా మలిచింది. అజ్ఞానం అంధకారాల కారు చీకట్లనుండి వెలికి తీసి, విజ్ఞానపు వెలుగుబాటకు తీసుకు వచ్చింది. నైచ్యపు అగాథాలనుండి పైకిలాగి పవిత్రతా శిఖరాలపై నిలిపింది. మానవుల్లోని పశుప్రవృత్తిని మానవీయ పరిమళంతో పారద్రోలింది. ఆటవికతను నాగరికతతో, అజ్ఞాన తిమిరాన్ని జ్ఞానదీపికతో, అవివేకాన్ని వివేకంతో పారద్రోలి మనుషుల్ని మానవోత్తములుగా సర్వతోముఖంగా తీర్చిదిద్దింది. మానవాళికి ఇంతటి మహదానుగ్రహాలు ప్రసాదించి, వారి ఇహపరలోకాల సఫలతకు పూబాటలు పరిచిన నిఖిల జగన్నాయకునికి కృతజ్ఞతాభివందనాలు చెల్లించుకోవడమే ఈ పండుగ ఉద్దేశ్యం. ఈదుల్ ఫిత్ర్ పర్వదిన శుభాకాంక్షలు – మదీహా అర్జుమంద్ -
‘ఏ మతానికి చెందని వారే అలా మాట్లాడతారు’
పట్నా : ఇఫ్తార్ విందును ఉద్దేశిస్తూ.. కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గిరిరాజ్ వ్యాఖ్యల పట్ల సొంత పార్టీ నేతలే కాక.. జేడీయూ నాయకులు కూడా మండి పడుతున్నారు. ఈ క్రమంలో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాట్లాడుతూ.. ‘మీడియాలో కనిపించడం కోసమే గిరిరాజ్ సింగ్ లాంటి వారు ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేస్తారు. ఇలాంటి వారి మాటలకు నేను పెద్దగా ప్రాధాన్యం ఇవ్వను. ప్రతి మతం ప్రేమ, గౌరవాలను బోధిస్తున్నాయి. కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారికి ప్రత్యేకంగా ఓ మతమంటూ ఉండ’దన్నారు నితీష్. బిహార్‌లో సీఎం నితీశ్ కుమార్, కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ సహా మొత్తం నలుగురు ఎన్డీయే నేతలు ఇఫ్తార్ విందులకు హాజరైన ఫొటోలను గిరిరాజ్ ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ‘నవరాత్రి రోజుల్లో ఫలాహారం ఏర్పాటు చేసి ఇలాంటి ఫొటోలు తీసుకుంటే అవి ఎంత అందంగా ఉండేవో!. మనం మన మతానికి సంబంధించిన కర్మ, ధర్మాలను ఆచరించడంలో నిరాసక్తంగా ఉంటాం కానీ వేరే మతంపై ప్రేమను నటించడంలో ముందుంటాం’ అని ట్వీట్ చేశాడు. ఇది కాస్తా వివాదాస్పందగా మారడంతో అమిత్ షా రంగంలోకి దిగారు. గిరిరాజ్‌ను మందలిస్తూ మళ్లీ భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలను చేయకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. -
ఇఫ్తార్‌పై గిరిరాజ్ వివాదాస్పద ట్వీట్
న్యూఢిల్లీ: బిహార్‌లో ఇఫ్తార్ విందులకు ఎన్డీయే నేతలు హాజరవుతుండటంపై కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు గిరిరాజ్ సింగ్ చేసిన ట్వీట్ ఒకటి వివాదాస్పదమైంది. గిరిరాజ్ ట్వీట్‌పై జేడీయూ నేతలు విమర్శలు వ్యక్తం చేయడంతో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రంగంలోకి దిగి గిరిరాజ్‌ను మందలించారు. బిహార్‌లో సీఎం నితీశ్ కుమార్, కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ సహా మొత్తం నలుగురు ఎన్డీయే నేతలు ఇఫ్తార్ విందులకు హాజరైన ఫొటోలను గిరిరాజ్ ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ‘నవరాత్రి రోజుల్లో ఫలాహారం ఏర్పాటు చేసి ఇలాంటి ఫొటోలు తీసుకుంటే అవి ఎంత అందంగా ఉండేవో!. మనం మన మతానికి సంబంధించిన కర్మ, ధర్మాలను ఆచరించడంలో నిరాసక్తంగా ఉంటాం కానీ వేరే మతంపై ప్రేమను నటించడంలో ముందుంటాం’ అని రాశారు. ఓ ఫొటోలో బిహార్ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సుశీల్ మోదీ కూడా ఉండటం గమనార్హం. లోక్‌జన శక్తి పార్టీ అధ్యక్షుడు పాశ్వాన్తోపాటు బిహార్ ప్రతిపక్ష నేత జితన్ రామ్ మాంఝీ పట్నాలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులకు సంబంధించినవే ఈ ఫొటోలు. గిరిరాజ్ ట్వీట్‌పై జేడీయూ, ఎల్జేపీ నేతలు అసంతృప్తి, విమర్శలు వ్యక్తం చేయడంతో అమిత్ షా రంగంలోకి దిగారు. గిరిరాజ్‌ను మందలిస్తూ ఇలాంటి వ్యాఖ్యలను మళ్లీ భవిష్యత్తులో చేయకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. హిందూత్వ భావజాలం బాగా కలిగిన గిరిరాజ్ గతంలోనూ పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారడం తెలిసిందే. నేడే ఈద్–ఉల్–ఫితర్ న్యూఢిల్లీ/హైదరాబాద్: మంగళవారం నెలవంక దర్శనంతో దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు రంజాన్ నెల ఉపవాసాలు విరమించి బుధవారం ఈద్–ఉల్–ఫితర్ పండుగ ఆచరించనున్నారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన నెలవంక దర్శన కమిటీ సమావేశానంతరం జామా మసీదు షాహి ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారి ఈ మేరకు ప్రకటన చేశారు. ‘మంగళవారం చంద్రుడు కన్పించాడు. అందువల్ల బుధవారం ఈద్ (పండుగ) జరుపుకోవాలి’ అని మసీదు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ నెల 5వ తేదీ బుధవారం ముస్లింలు రంజాన్ పండుగను జరుపుకోవాలని హైదరాబాద్‌లోని రుహియతే హిలాల్ కమిటీ (నెలవంక నిర్ధారణ కమిటీ) అధ్యక్షుడు మౌలానా ఖుబ్బుల్‌పాషా చెప్పారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. -
నా మెజార్టీ తగ్గడానికి కారణాలేంటి: చంద్రబాబు
సాక్షి, అమరావతి : ఎక్కడా ఏ తప్పు చేయలేదని, ధైర్యంగా ముందుకు పోదామని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ కార్యకర్తలకు చెప్పారు. వైఎస్సార్సీపీ చేస్తామని చెప్పినవన్నీ చేయనివ్వాలని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా ఒత్తిడి తేవాలని సూచించారు. ఉండవల్లిలోని తన నివాసంలో సోమవారం కుప్పం నుంచి వచ్చిన టీడీపీ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. చంద్రబాబు మాట్లాడుతూ తన పాలనలో ఒకటి రెండే లోపాలున్నాయని, దాన్ని భూతద్దంలో చూపి వ్యతిరేకతగా చెబుతున్నారని తెలిపారు. జరిగింది వదిలేసి భవిష్యత్తు వైపు నడవాలని, లోపాలను సవరించుకోవాలని సూచించారు. తమకు పోరాటం కొత్తకాదని, పలాయనం తమకు తెలియదన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగిద్దామని చెప్పారు. కుప్పంలో తన మెజారిటీ తగ్గడానికి గల కారణాలను అన్వేషించాలని, ఫలితాలను అధ్యయనం చేయాలని సూచించారు. మరో ఐదేళ్లు అధికారంలో ఉంటే సైబరాబాద్ లాంటి నగరాన్ని నిర్మించేవాళ్లమని చెప్పారు. పలువురు నాయకులు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లే వినియోగిస్తారని, అప్పుడు ఎవరి బలం ఎంతో తేలిపోతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని చంద్రబాబు కోరారు. ఇఫ్తార్ విందులో చంద్రబాబు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సోమవారం విజయవాడలో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. నగరంలోని ఏ కన్వెన్షల్ హాల్లో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాష్ట్రం, దేశం బాగుండాలని ఇఫ్తార్ దువా చేశారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి లోకేశ్, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. -
దేవుడి స్క్రిప్టు గొప్పది
సాక్షి, అమరావతి: దేవుడు ఏం చేసినా చాలా గొప్పగా, ఆశ్చర్యపోయేలా చేస్తాడని, గొప్పగా స్క్రిప్టు రాస్తాడని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. రంజాన్ మాసంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తాను తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని మించి మెరుగైన పాలన అందించేలా ముస్లిం సోదరులు దువా చేయాలని కోరారు. సోమవారం గుంటూరులోని పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన తొలి అధికారిక కార్యక్రమమైన ‘ఇఫ్తార్ విందు’లో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. ముస్లిం సోదరుల ఉపవాస దీక్ష విరమణ కార్యక్రమంలో పాల్గొని చాలాసేపు వారితో ఆత్మీయంగా గడిపారు. పవిత్ర రంజాన్ మాసంలో అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన మహ్మద్ ఇక్బాల్‌కు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని ముస్లిం సోదరుల హర్షధ్వానాల మధ్య జగన్ ప్రకటించారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఐదుగురు ముస్లింలకు అసెంబ్లీ టికెట్లు ఇస్తే నలుగురు విజయం సాధించారని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఇంకా ఏమన్నారంటే... అస్సలామ్ అలైకుమ్... ‘ఈరోజు రంజాన్ శుభమాసంలో ముస్లిం సోదరుల మధ్య ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం నాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. ఈ సందర్భంగా నేను ఒకటి మనవి చేయదల్చుకున్నా. దేవుడు ఏం చేసినా కూడా ఆశ్చర్యంగా, గొప్పగా జరిగింది అనిపించే విధంగా చేస్తాడు. దేవుడు ఎంత గొప్పగా పని చేస్తాడు, ఆయన స్క్రిప్టు రాస్తే ఎంత గొప్పగా ఉంటుందో చెప్పడానికి మొట్ట మొదటి ఉదాహరణ ఇది... ఐదేళ్ల చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పాలనను మీరంతా చూశారు. ఆ సమయంలో అక్షరాలా 67 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఉంటే... 23 మంది ఎమ్మెల్యేలను అన్యాయంగా, డబ్బులిచ్చి ప్రలోభాలకు గురి చేసి కొనుగోలు చేశారు. అందులో నలుగురిని ఏకంగా మంత్రులనే చేశారు. ఎమ్మెల్యేలు ఫిరాయిస్తే వాళ్లను అనర్హులుగా చేయాలి. లేదా వారి చేత రాజీనామాలు చేయించి ఎన్నికల్లో వాళ్ల పార్టీ గుర్తు మీద మళ్లీ గెలిపించుకుని శాసనసభకు తెచ్చుకోవాలి. కానీ ఇవేమీ జరగలేదు. మన కళ్ల ముందే అన్యాయం, అధర్మం కనిపించింది. అన్ని రకాల మోసాలు, అబద్ధాలు కనిపించాయి. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ టికెట్‌తో 9 మంది ఎంపీలు గెలిస్తే ముగ్గురిని ఇదే మాదిరిగా కొనుగోలు చేశారు. రంజాన్ మాసంలోనే... గత నెల 23వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అది కూడా రంజాన్ మాసంలోనే. ఇక టీడీపీకి వచ్చిన ఎమ్మెల్యేల సంఖ్య అక్షరాలా 23, ఆ పార్టీకి వచ్చిన ఎంపీ సీట్లు 3. ఫలితాలు వచ్చింది రంజాన్ మాసంలో మే 23వ తేదీన. ఇంత కన్నా గొప్ప స్క్రిప్టు మరెవరూ రాయలేరు. అదొక్క దేవుడు మాత్రమే రాయగలుగుతాడు. రంజాన్ శుభమాసంలోనే జగన్ అనే నేను మీ అందరి చల్లని దీవెనలతో, దేవుడి ఆశీస్సులతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశా. మళ్లీ రంజాన్ మాసంలోనే ముఖ్యమంత్రిగా నా మొట్టమొదటి అధికార కార్యక్రమాన్ని మీ అందరి సమక్షంలోనే ప్రారంభించి ఈ శుభ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నా. ఆ దేవుడి గొప్పతనానికి ఇంత కన్నా ఉదాహరణలు అవసరం లేదు’’ పెద్ద ఎత్తున హాజరైన ముస్లింలు.. ఇన్షా అల్లాహ్... ఈద్ ముబారక్ ఇన్ అడ్వాన్స్ ... మీ అందరికీ అభినందనలు అంటూ సీఎం వైఎస్ జగన్ తన ప్రసంగాన్ని ముగించారు. అనంతరం మౌలానా ఇస్మాయిల్ ఆధ్వర్యంలో ఇఫ్తార్కీ దువా, ఉపవాస దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలు, షేక్ అంజాద్బాష, మహ్మద్ ముస్తఫా, హఫీజ్‌ఖాన్, నవాజ్‌బాష సీఎం వైఎస్ జగన్‌కు ఖర్జూరం తినిపించారు. జగన్ కూడా వారికి ఖర్జూరం తినిపించారు. అనంతరం మగరీబ్కీ నమాజ్‌లో వైఎస్ జగన్ ముస్లిం సోదరులతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గుంటూరు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ముస్లింలు హాజరయ్యారు. జగన్‌కు రుణపడి ఉన్నా: ఇక్బాల్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి తాను సర్వదా రుణపడి ఉంటానని మాజీ పోలీసు అధికారి, హిందూపురం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మహ్మద్ ఇక్బాల్ పేర్కొన్నారు. ఎన్నికల్లో తాను ఓటమి పాలైనప్పటికీ ఆదరించి ఎమ్మెల్సీని చేస్తామని సీఎం వైఎస్ జగన్ రంజాన్ మాసంలో ప్రకటించడం తనకు నిజంగా శుభవార్త అని తెలిపారు. వైఎస్ జగన్ సుదీర్ఘకాలం రాష్ట్రానికి మంచి పరిపాలన అందిస్తారని తనకు సంపూర్ణంగా విశ్వాసం ఉందని చెప్పారు. మున్సిపల్ కార్మికుల కష్టాలపై ముఖ్యమంత్రి ఆరా! ఇఫ్తార్ విందు ముగించుకుని బయటకు వస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్కడ కనిపించిన మున్సిపల్ కార్మికులను పిలిపించి మాట్లాడారు. వారి జీత భత్యాలపై ఆరా తీశారు. ‘జీతాలు ఏమేరకు పెరగాలని ఆశిస్తున్నారు’ అని అడిగారు. ముఖ్యమంత్రి ఇలా తమను పిలిచి మాట్లాడడంతో వారు ఉబ్బితబ్బిబ్బయ్యారు. పాదయాత్ర సమయంలోనూ పలుచోట్ల మున్సిపల్ కార్మికులు కలిసి తమ కష్టాలు ఏకరువు పెట్టారని సీఎం గుర్తుచేసుకున్నారు. వారి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానన్నారు. ఏపీ భవన్లో ఇఫ్తార్ విందు సాక్షి, న్యూఢిల్లీ: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని సోమవారం ఢిల్లీలోని ఏపీ భవన్లో ముస్లిం సోదరులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు హస్తినలోని ముస్లిం ప్రముఖులతోపాటు పలు దేశాల భారత రాయబార కార్యాలయాల ప్రముఖులు పాల్గొన్నారు. ముందుగా సాయంత్రం రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి దువా చేశారు. ఇఫ్తార్ అనంతరం మగ్రీబ్ నమాజ్ చేశారు. ఏపీ భవన్ రెసిడెంట్ కమీషనర్ ప్రవీణ్ ప్రకాష్ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది ఇఫ్తార్ విందు ఏర్పాట్లను ఘనంగా చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరులో ఇఫ్తార్ విందు ఇస్తుండగా వారి ఆదేశాల మేరకు ఢిల్లీలో కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సంప్రదాయ తెలుగు పండుగలతోపాటు ముస్లిం, క్రిస్టియన్స్ పండుగలను ఏటా ఏపీభవన్‌లో ఘనంగా నిర్వహిస్తున్నామని, దీనిలో భాగంగా రంజాన్ మాసం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందు ఇచ్చినట్టు చెప్పారు. సర్వ మానవ సౌభ్రాతృత్వానికి, శాంతి సామరస్యానికి రంజాన్ పండుగ ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. ఇఫ్తార్ విందులో రిపబ్లిక్ ఆఫ్ పనామా దేశ రాయబారి ముహమ్మద్ తల్హా హాజీ, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ దేశ రాయబార కార్యాలయ ప్రతినిధి అసఘర్ ఒమిది, మారిషస్ హై కమిషనర్ సీవరాజ్ నుందులాల్, పలువురు సీనియర్ ఐఏఎస్‌లు, ఇస్లామిక్ సెంటర్ ప్రతినిధులు పాల్గొన్నారు. హజరత్ నిజాముద్దీన్ ఆలియా జాఫ్ఫాదా నషీన్ దర్గా ప్రముఖ ఇమామ్ సయెద్ జోహాబ్ నిజామి ఆధ్వర్యంలో మగ్రీబ్ నమాజ్ చేశారు. -
నేడు గుంటూరులో ఏపీ ప్రభుత్వం ఇఫ్తార్ విందు
-
రేపు గుంటూరులో సీఎం ఇఫ్తార్ విందు
గుంటూరు వెస్ట్: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం గుంటూరులోని పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారని శాసన మండలి ప్రతిపక్షనేత, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం ఆయన పార్టీ నాయకులు, కలెక్టర్, ఎస్పీ ఇతర అధికారులతో పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉమ్మారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో రాజకీయాలకు అతీతంగా సుమారు 4 వేల మంది ముస్లిం పెద్దలను విందుకు ఆహ్వానిస్తున్నామన్నారు. ఆహ్వానం ఉన్న వారు మాత్రమే రావాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈ జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. ఇఫ్తార్ విందు సందర్భంగా ముఖ్యమంత్రి ముస్లిం పెద్దలతో ముచ్చటిస్తారని ఉమ్మారెడ్డి తెలిపారు. మారిన వేదిక రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదలచిన ఇఫ్తార్ విందుకు సంబంధించి తొలుత అధికారులు, ఎమ్మెల్యేలు, వైఎస్సార్సీపీ నేతలు బీఆర్ స్టేడియాన్ని పరిశీలించి ఏర్పాట్లపై సమీక్షించారు. అయితే శనివారం సాయంత్రం అకస్మాత్తుగా వచ్చిన భారీ గాలులతో కూడిన వర్షానికి బీఆర్ స్టేడియం చిత్తడిగా మారింది. దీంతో జిల్లా కలెక్టర్ కోన శశిధర్, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు చర్చించుకుని, వేదికను పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌కు మార్చారు. ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, షేక్ మొహమ్మద్ ముస్తఫా డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి, కిలారి రోశయ్య, పార్టీ నేతలు లేళ్ళ అప్పిరెడ్డి, చంద్రగిరి ఏసురత్నంతో పాటు ఎస్పీ విజయారావు శనివారం సాయంత్రం పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లోని ఏర్పాట్లను పరిశీలించారు. -
ఆత్మీయులతో జగన్ మమేకం
సాక్షి ప్రతినిధి కడప:పులివెందులలో పర్యటిస్తున్న ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం బిజీబిజీగా గడిపారు. ఆయన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన పార్టీ నాయకులు, ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, యోగ క్షేమాలు తెలుసుకుంటూ వారితో మమేకమయ్యారు. వారి దగ్గర నుంచి వినతులు స్వీకరించిన ఆయన రాబోయేవన్ని మంచి రోజులేనని అందరికి మేలు చేస్తానని భరోసా ఇచ్చారు. పోరాటం చేశాం. కొద్దికాలం ఓపిక పట్టండి..దేవుని దయతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి రానుంది. అందరికీ మంచి జరుగుతుందని జగన్మోహన్రెడ్డి వారితో అన్నారు. కిక్కిరిసిన క్యాంపు కార్యాలయం.. పులివెందులలోని భాకరాపురంలో ఉన్న ప్రతిపక్షనేత క్యాంపు కార్యాలయం ప్రజలతో కిక్కిరిసింది. ఆయనను కలిసేందుకు వివిధ ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, మహిళలు, వృద్ధులు, చిన్నారులు, యువకులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కార్యాలయ ఆవరణం అంతా ఎక్కడ చూసినా పార్టీ శ్రేణులతో నిండిపోయింది. భారీగా వచ్చిన శ్రేణులను కట్టడి చేయడం పోలీసులకు కూడా కష్టతరమైంది. వివిధ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రతిపక్షనేతను కలిసిన వారిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు పి.రవీంద్రనాథరెడ్డి, ఎస్.రఘురామిరెడ్డి, ఎస్.బి.అంజాద్ బాషా, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనువాసులు, డాక్టర్ సుధీర్‌రెడ్డి, కరణం ధర్మశ్రీ, ఏసురత్నం, డాక్టర్ శిద్దారెడ్డి, తిరుపతి ఎంపీ అభ్యర్థి రెడ్డప్ప, కమలాపురం సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శంకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారితో జగన్మోహన్రెడ్డి పలు విషయాలు చర్చించారు. నూతన జంటకు ఆశీర్వాదం.. పులివెందులలోని రాజ్యలక్ష్మి థియేటర్ ఎదురుగా ఉన్న వీధిలో నివాసముంటున్న వైఎస్సార్సీపీ నాయకుడు మోడం పద్మనాభరెడ్డి ఇంటికి ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వెళ్లారు. ఇటీవలే వివాహమైన పద్మనాభరెడ్డి కుమారుడు యశ్వంత్‌రెడ్డి, కోడలు సుజితలను ఆశీర్వదించారు. అప్పట్లో బిజీగా ఉండి వివాహానికి రాలేకపోయిన ఆయన బుధవారం సాయంత్రం మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, పులివెందుల వైఎస్సార్సీపీ నేత వైఎస్ మనోహర్‌రెడ్డిలతో కలిసి వెళ్లి నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇఫ్తార్ విందులో వైఎస్ జగన్.. పులివెందులలోని వీజే ఫంక్షన్ హాల్లో బుధవారం సాయంత్రం వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ అధ్యయన కమిటీ సభ్యులు రసూల్ సాహెబ్ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. వైఎస్ జగన్‌కు ఇమామ్ జామిన్‌ను చేతికి కట్టారు. అనంతరం ఇస్లాం సంప్రదాయ పద్ధతి ప్రకారం టోపీ పెట్టుకుని దువా చేశారు. ఆ తరువాత విందారగించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీకాంత్‌రెడ్డి, కడప ఎమ్మెల్యే అభ్యర్థి అంజాద్ బాషా, పార్టీ నాయకులు వైఎస్ మనోహర్‌రెడ్డి, శివప్రకాష్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ చిన్నప్ప, పట్టణ కన్వీనర్ వరప్రసాద్, మైనార్టీ నాయకుడు ఇస్మాయిల్, రఫీ, హఫీజ్, బాబు, బాషాలతో పాటు పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు పాల్గొన్నారు. -
పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన
-
వైఎస్ జగన్‌ను కలిసిన పార్టీ నేతలు, కార్యకర్తలు
సాక్షి, పులివెందుల : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన రెండోరోజు పులివెందులలో కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ఆయన భాకరాపురంలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఉదయం 8.30 నుంచి నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌ను కలిసేందుకు కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. అలాగే పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఆయనను కలిసి కౌంటింగ్‌పై చర్చించారు. ఇవాళ సాయంత్రం స్థానిక వీజే ఫంక్షన్ హాలులో మైనార్టీ సోదరులు ఇచ్చే ఇఫ్తార్ విందులో వైఎస్ జగన్ పాల్గొంటారు. గురువారం కూడా ఆయన కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన కాగా వైఎస్ జగన్ మంగళవారం రాత్రి పులివెందుల చేరుకున్న విషయం తెలిసిందే. కడప విమానాశ్రయంలో అడుగుపెట్టగానే ఆయనకు పార్టీ నాయకులు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన పులివెందుల చేరుకున్నారు. దారిపొడవునా వేచి వున్న ప్రజలకు అభివాదం చేసుకుంటూ వైఎస్ జగన్ ముందుకు సాగారు. -
నెలంతా రోజా పరిమళాలు
సాయంత్రాలు ఇఫ్తార్ విందులతో వీధులన్నీ ఘుమఘుమలాడ బోతున్నాయి. పిల్లలూ పెద్దల హడావిడితో వాతావరణమంతా సందడిగా మారనుంది. మసీదు మినార్లనుండి సైరన్ మోతలు వీనులవిందు చేయనున్నాయి. మండువేసవిలోనూ నిండు వసంతం కుండపోతలా వర్షించనుంది. మానవాళి పాపాలను తొలగించి, పునీతం చేసే పవిత్రరమజాన్ నెల ప్రారంభం కాబోతున్నది. మనిషిలోని దుర్లక్షణాలను హరింప చేసి, ప్రేమ, దయ, జాలి, కరుణ, సానుభూతి వంటి సానుకూల భావనలను పెంపొందింపచేసే పవిత్ర రమజాన్ మానవాళికి సరైన జీవన సూత్రాలను ప్రబోధించే మార్గదర్శి. రమజాన్ ఒక అలౌకిక భావన. తేజోమయ ఆధ్యాత్మిక తరంగం. సత్కార్యాల సమాహారం. వరాల వసంతం. మండువేసవిలో నిండువసంతం. మానవుల మానసిక, ఆధ్యాత్మిక వికాసానికీ, జీవనసాఫల్యానికి అవసరమైన సమస్తమూ దీనితో ముడివడి ఉన్నాయి. రమజాన్ లో పవిత్ర ఖురాన్ గ్రంథం అవతరించింది. సమస్త మానవాళికీ ఇది ఆదర్శ ప్రబోధిని. కారుణ్య సంజీవిని. మార్గప్రదాయిని. రమజాన్‌లో ఉపవాసాలు విధిగా నిర్ణయించ బడ్డాయి. ఇవి మానవుల్లో దైవభక్తినీ, దైవభీతిని ప్రోదిచేస్తాయి. స్వర్గానికి బాటలు వేస్తాయి. వెయ్యి నెలలకన్నా విలువైన రాత్రి ‘షబేఖద్ర్’ కూడా రమజాన్ లోనే ఉంది. ఈ ఒక్కరాత్రి ఆరాధన వెయ్యినెలల ఆరాధనకన్నా మేలైనది.రమజాన్‌లో సత్కార్యాల ఆచరణ ఎక్కువగా కనబడుతుంది. దుష్కార్యాలు ఆగిపోతాయి. సమాజంలో ఒక చక్కని అహ్లాదకరమైన మార్పు కనిపిస్తుంది. ఐదుపూటల నమాజుతోపాటు, అదనంగా తరావీహ్ నమాజులు ఆచరించబడతాయి. సాధారణ దానధర్మాలతోపాటు, ఫిత్రా’అనబడే ప్రత్యేక దానం కూడా రమజాన్ లోనే చెల్లిస్తారు. దీనివల్ల సమాజంలోని పేదసాదలకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. చాలామంది ‘జకాత్ ’ కూడా రమజాన్ లోనే చెల్లిస్తారు. ఇది కూడా పేదల అవసరాలు తీర్చడంలో గణనీయంగా తోడ్పడుతుంది. అంతేకాదు, రమజాన్ నెలతో అనుసంధానమై ఉన్న విషయాలు అనేకం ఉన్నాయి. ప్రధాన ఆరాధన, ప్రత్యేక ఆరాధన ‘రోజా’ (ఉపవాసవ్రతం) యే. దేవుడు ఈ నెలను బహుళ ప్రయోజనకారిగా తీర్చిదిద్దాడు. కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రయోజనం పొందే ప్రయత్నం చెయ్యాలి.నిజానికి ఉపవాస వ్రతమన్నది కేవలం ముహమ్మద్ ప్రవక్త అనుచరులకు మాత్రమే, అంటే ముస్లింలకు మాత్రమే పరిమితమైన ఆరాధన కాదు. ఇది సార్వకాలికమైన, సార్వజనీనమైన ఆరాధన. దీనికి చాలా ఘనమైన, ప్రాచీన సామాజిక నేపథ్యం ఉంది. ఇది అనాదిగా అన్నికాలాల్లో. అన్ని సమాజాల్లో చెలామణిలోఉన్నట్లు దైవగ్రంథం పవిత్రఖురాన్ చెబుతోంది.‘విశ్వాసులారా..! పూర్వప్రవక్తల అనుయాయులకు ఏవిధంగా ఉపవాసాలు విధించబడ్డాయో, అదేవిధంగా ఇప్పుడు మీరు కూడా విధిగా ఉపవాసాలు పాటించాలని నిర్ణయించాము. దీనివల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది.’అంటే, ఉపవాస వ్రతం కేవలం ఈనాటి ముస్లిం సముదాయానికి మాత్రమే ప్రత్యేకమైనది, పరిమితమైనది కాదని, పూర్వకాలం నుండీ ఆచరణలో ఉన్న సనాతన ధర్మాచారమని మనకు అర్ధమవుతోంది. ఈ రోజు కూడా ప్రపంచంలోని అన్నిదేశాల్లో అన్నిజాతులు, అన్ని మతాల వారిలో ఏదో ఒక రూపంలో ఈ సంప్రదాయం కొనసాగుతూ ఉంది. మానవ సమాజంలో మంచి, మానవీయత, భయభక్తుల వాతావరణాన్ని జనింపజేయడం, విస్తరింపజేయడమే ఈ ఉపవాసాల ఆచరణలోని అసలు ఉద్దేశ్యం. అందుకే దేవుడు సృష్టిలో ఏ జీవరాసికీ ఇవ్వనటువంటి ప్రత్యేకత, బుధ్ధికుశలత, విచక్షణా జ్ఞానం ఒక్కమానవుడికే ప్రసాదించాడు. కాని మనిషి తనస్థాయిని గుర్తించక, దేవుడు ప్రసాదించిన బుద్ధీజ్ఞానాలను, శక్తియుక్తులను దుర్వినియోగ పరుస్తూ, ఇష్టానుసారం జీవితం గడుపుతూ కోరి కష్టాలను కొని తెచ్చుకుంటున్నాడు. ఎలా బతికినా ఇహలోక జీవితం సుఖంగా, సాఫీగా గడిచిపోతున్నదంటే ఇక ఏం చేసినా చెల్లిపోతుందని కాదు. ఏదో ఒకనాడు వీటన్నిటికీ దైవం ముందు హాజరై సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది, ఫలితం అనుభవించవలసి ఉంటుంది.అందుకని మానవుడు తన స్థాయిని గుర్తించాలి. మానవ సహజ బలహీనతలవల్ల జరిగిన తప్పుల్ని తెలుసుకోవాలి. పశ్చాత్తాపంతో దైవం వైపుకు మరలి సత్కార్యాల్లో లీనమై పోవాలి. దానికోసం పవిత్ర రమజాన్‌కు మించిన అవకాశం మరొకటి లేదు. ఈ నెలలో సత్కార్యాల పుణ్యం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంది. గోరంతచేసి కొండంత పొందవచ్చు. ఒక నఫిల్కు సున్నత్‌తో సమానంగా, సున్నత్‌కు ఫర్జ్‌తో సమానంగా, ఒక పర్జ్కు 70 ఫరజ్లతో సమానంగా పుణ్యఫలం లభిస్తుంది. మానవుడి ప్రతి ఆచరణకు పదినుండి ఏడు వందల రెట్లవరకు పుణ్యఫలం పెరిగిపోతుంది. అయితే ఒక్క ఉపవాసం మాత్రం వీటన్నిటికంటే అతీతం, ప్రత్యేకం. దీనికి ఒక పరిమితి అంటూ లేదు. ఉపవాసం ప్రతిఫలం అనంతం. అనూహ్యం. విశ్వప్రభువైన అల్లాహ్ తన అనంత ఖజానాలోంచి ఉపవాస ప్రతిఫలాన్ని స్వయంగా తానే అనుగ్రహిస్తానంటున్నాడు. అల్లాహు అక్బర్! కనుక అత్యంత భక్తిశ్రద్ధలతో రోజా పాటించి పరమ ప్రభువైన అల్లాహ్ నుండి నేరుగా ప్రతిఫలాన్ని అందుకొనే ప్రయత్నం చెయ్యాలి.మనసా, వాచా, కర్మణా త్రికరణ శుద్ధితో ఉపవాసాలు పాటించేవారి అంతర్గతంతో పాటు, బాహ్య శరీరంలోని పవిత్రాత్మనిత్యం జాగృతమై ఉంటుంది. అనుక్షణం వారు అప్రమత్తంగా ఉంటూ, అన్నిరకాల దోషాలనుండి పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. అయినప్పటికీ మానవ సహజ బలహీనతవల్ల ఏవో చిన్న చిన్న పొరపాట్లు దొర్లిపోవచ్చు. ఇలాంటి చిన్నా చితకా పొరపాట్లనుండి ఉపవాసాన్ని దోషరహితంగా, లోపరహితంగా తీర్చిదిద్దడానికి ముహమ్మద్ ప్రవక్త(స)ఫిత్రాలు చెల్లించమని ఉపదేశించారు. వీటివల్ల మరో గొప్ప సామాజిక ప్రయోజనం కూడా ఉంది. సమాజంలోని పేదసాదలకు ఈ ఫిత్రాల ద్వారా కాస్తంత ఆర్ధిక వెసులుబాటు కలుగుతుంది. అందుకే ప్రవక్తమహనీయులు ఫిత్రాదానాన్ని ‘దీనులు, నిరుపేదల భృతి’ అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఆనందంతో, సుఖసంతోషాలతో జీవితం గడుపుతూ, పరలోక సాఫల్యం పొందాలన్నది ఇస్లామ్ ఆశయం. అందుకే జకాత్ , ఫిత్రాద్ ఖ, ఖైరాత్ అంటూ రకరకాల దానధర్మాలను ప్రోత్సహిస్తూ, సమాజంలో పేదరిక నిర్మూలనకు నిర్దిష్టమైన కార్యాచరణను ప్రతిపాదించింది. పవిత్రఖురాన్ మార్గదర్శకంలో, ప్రవక్తవారి ఉపదేశానుసారం మనం మన జీవితాలను సమీక్షించుకుంటే, సంస్కరణ ఎక్కడ అవసరమో గుర్తించే వీలు కలుగుతుంది. తద్వారా ఆచరణకు మార్గం సుగమం అవుతుంది. ఇలాంటి స్వీయసమీక్షకు, సింహావలోకనానికి రమజాన్ కంటే మంచి తరుణం మరొకటి ఉండబోదు. అల్లాహ్ అందరికీ రమజాన్ శుభాలను సొంతం చేసుకునే సద్బుద్ధిని ప్రసాదించమని వినమ్రంగా వేడుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
ప్రణబ్‌కు ఇఫ్తార్ ఆహ్వానం పంపాం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ బుధవారం ఢిల్లీలోని తాజ్ప్యాలెస్ హోటల్లో ఇవ్వనున్న ఇఫ్తార్ విందుకు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఆహ్వానం పంపామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా స్పష్టంచేశారు. ఈ ఆహ్వానాన్ని ప్రణబ్ అంగీకరించారన్నారు. ఇటీవల నాగపూర్‌లో ఆరెస్సెస్ సమావేశానికి వెళ్లిన ప్రణబ్‌పై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఇస్తున్న ఇఫ్తార్ విందుకు ప్రణబ్‌కు ఆహ్వానం అందలేదని వార్తలొచ్చాయి.ఈ విందులో పాల్గొనేందుకు ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం, జేడీయూ తిరుగుబాటు నేత శరద్‌యాదవ్, ఎన్సీపీ అధినేత పవార్, సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆహ్వానాలు అందినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. -
ఎల్లలు లేని ఇఫ్తార్ సంబరం
సాక్షి, బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు) : రంజాన్ పర్వదినం చేరువవుతున్న శుభతరుణాన.. భారీ ఎత్తున జరిగిన ఇఫ్తార్ ఆనందాతిశయానికి నెలవైంది. ఆధ్యాత్మిక భావన ఉప్పొంగిపోగా.. సౌభ్రాతృత్వం వెల్లువైంది. వైఎస్సార్సీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ.హెచ్. ఫరూఖీ ఆధ్వర్యంలో ఎంవీపీ కాలనీలో ఆదివారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ అద్భుతమనిపించింది. ఈ ఇఫ్తార్‌లో సుమారు 5 వేల మంది ముస్లిం సోదరులు పాల్గొని విందు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ ఇంత మందితో కలిసి ఇఫ్తార్‌లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. పార్టీ కార్యకర్తలకైనా, ప్రజలకైనా ఎలాంటి సమస్య ఉన్నా పార్టీ కార్యాలయానికి వచ్చి వివరిస్తే వారిని అందుకుంటామని హామీ ఇచ్చారు. ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే పార్లమెంట్లో మాట్లాడి వైద్యానికి అయ్యే ఖర్చు మంజూరయ్యేలా చేస్తానని హామీ ఇచ్చారు. మైనార్టీల అభివృద్ధి కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి చాలా పథకాలను ప్రవేశపెట్టారని, జగన్ సీఎం అయితే అదే తరహాలో పథకాలను అమలవుతాయని హామీ ఇచ్చారు. ముస్లిముల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. ముస్లింలంతా రంజాన్‌ను సంతోషంగా చేసుకోవాలని కోరారు. ఇన్ని వేల మందికి ఇఫ్తార్ ఇచ్చిన ఫరూకీని అభినందించారు. కార్యక్రమంలో ముందు ముస్లిం సోదరులు పవిత్ర ప్రార్థనలు చేశారు. జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్ర«ధాన కార్యదర్శులు గొల్ల బాబురావు, ప్రసాద్ రాజ్, కరణం ధర్మశ్రీ , పార్లీ నగర విభాగం అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తైనాల విజయకుమార్, సమన్వయకర్తలు వంశీకృష్ణ శ్రీనివాస్, గురువులు, రామకృష్ణ మూర్తి, తిప్పల నాగిరెడ్డి, ఉషాకిరణ్, చంద్రమౌళి, కొయ్య ప్రసాదరెడ్డి, నగర మైనార్టీ సెల్ అ«ధ్యక్షుడు షరీఫ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బోని శివరామకృష్ణ, రాష్ట్ర అదనపు కార్యదర్శులు రవిరెడ్డి, పక్కి దివాకర్, నాయకులు జాన్ వెస్లీ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక చెఫ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇఫ్తార్ కోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేక చెఫ్స్‌ను తీసుకొని వచ్చారు. వీరు తమ పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని ప్రదర్శించి వహ్వా అనిపించారు. ఇఫ్తార్ జరిగిన ప్రదేశానికి వెలుపల కూడా హలీమ్ పంపిణీ చేశారు. -
మైనార్టీల ఓట్లడిగే హక్కు టీఆర్ఎస్కు లేదు: ఉత్తమ్
నిర్మల్: టీఆర్ఎస్కు మైనార్టీల ఓట్లు అడిగే హక్కు లేదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, స్థానికుడు అర్జుమంద్‌అలీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో సీఎల్పీ నేత కె.జానారెడ్డి,, మండలిలో కాంగ్రెస్ విపక్ష నేత షబ్బీర్‌అలీ తదితరులతో కలసి ఆయన పాల్గొన్నారు. ఉత్తమ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లను ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారని, నాలుగేళ్లయినా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్, బీజేపీల మధ్య రహస్య ఒప్పందం ఉందన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీలకు ఓట్లు వేస్తే వృథాయేనని చెప్పారు. రాష్ట్రంలో టీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ పాలనతో అభద్రత, అసహనం పెరిగాయని జానా అన్నారు. ఎంఐఎంను అడ్డుపెట్టుకుని ముస్లింలతో కేసీఆర్ గేమ్ ఆడుతున్నారని షబ్బీర్ మండిపడ్డారు. -
నేడు సర్కార్ ఇఫ్తార్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పవిత్ర రంజాన్ ఉపవాసాల సందర్భంగా ముస్లిం సోద రులకు శుక్రవారం దావత్–ఏ–ఇఫ్తార్ విందు ఇవ్వనుంది. ఉపవాస దీక్ష విరమించే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 800 మసీదుల్లో సుమారు 4 లక్షల మందికి ఇఫ్తార్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 400 మసీదులు, జిల్లాల పరిధిలో 400 మసీదుల్లో కమిటీల ఆధ్వర్యంలో ఇఫ్తార్ ఇవ్వనున్నారు. ప్రతి నియోజకవర్గానికి నాలుగు మసీదుల చొప్పున ప్రతీ మసీదు కమిటీ ఆధ్వర్యంలో కనీసం 500 మందికి తగ్గకుండా పండ్లు, బిర్యానీ, స్వీట్లు సిద్ధంగా ఉంచేలా చర్యలు చేపట్టారు. దీని కోసం మసీదుకు రూ.లక్ష చొప్పున సుమారు రూ.8 కోట్లను ఆన్లైన్ ద్వారా కమిటీలకు అందజేశారు. హైదరాబాద్‌లో మెగా ఇఫ్తార్.. ఎల్బీ స్టేడియంలో శుక్రవారం ముస్లిం సోదరు లకు మెగా ఇఫ్తార్ ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్‌రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యే ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ నేతలతో పాటు వివిధ దేశాలకు చెందిన రాయబారులు కూడా పాల్గొన నున్నారు. ఇక్కడ దాదాపు 8 వేల మందికి ఇఫ్తార్ విందు ఏర్పాట్లు చేశారు. రంజాన్ కానుకగా కొత్త బట్టలు.. ప్రభుత్వం సుమారు 4 లక్షల నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుకగా కొత్త బట్టలు పంపిణీ చేస్తోంది. 800 మసీదు కమిటీలకు వీటి పంపిణీ బాధ్యతలు అప్పగించింది. ప్రతీ మసీదు పరిధిలో 500 చొప్పున పేద కుటుంబాలను ఎంపిక చేసి మూడు జతల కొత్త బట్టలు ఉండే ప్యాకెట్లను అందజేస్తారు. ఒక్కొక్క ప్యాకెట్లో రూ.525 విలువగల కుర్తా, పైజామా, సల్వారు, కమీజు, చీర, బ్లౌజ్ ఉండనున్నాయి. -
పవిత్ర దీక్షకు పుణ్యబలం
ఉపవాసం ఉన్నప్పుడు ఆత్మికమైన శక్తి జాగృతమవుతుంది. భౌతికమైన శక్తి పునరుజ్జీవం అవుతుంది. ప్రాకృతిక శక్తి తోడు నిలుస్తుంది. దైవిక శక్తి అభయమిస్తుంది. ఉపవాసం అనే ఆరాధానను ముగించి తీసుకునే ఆహారం సత్తువ ఇచ్చేదిలా ఉండటానికి ప్రకృతి అన్ని ఏర్పాట్లు చేసింది. ఇది అలాంటి ఆహారం. పవిత్రమైన ఉపవాసాలు ఆచరించండి. పుణ్యబలం ఇచ్చే ఆహారాన్ని స్వీకరించండి. ఖర్జూర సేవనం ప్రవక్త సంప్రదాయం రమజాన్ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఖర్జూరం. అందరూ ఇష్టపడే పండు ఖర్జూరం అంటే అతిశయోక్తి కాదు. దైవప్రవక్త ముహమ్మద్ (స) ఖర్జూరాలను చాలా ప్రీతిగా ఆరగించేవారు. మనిషి సమస్త అవసరాలు తీర్చే సామర్థ్యం గల పోషకాలు ఖర్జూరంలో ఉన్నాయి. మనిషికి ఇతర ఏ ఆహారం దొరక్కపోయినా ఒక్క ఖర్జూరం మాత్రమే దొరికినా సంపూర్ణ ఆహారం లభించినట్లే. ప్రస్తుత పరిశోధన ల ప్రకారం మానవుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా, సంపూర్ణ శక్తిసామర్థ్యాలు కలవాడుగా ఉండడానికి అతడి ఆహారంలో ఎన్ని క్యాలరీలు అవసరమో అవన్నీ ఖర్జూరంలో ఉన్నాయి. ఈ కారణంగానే ఆ కాలంలో సైన్యాలు ఎడారి ప్రాంతాల్లో చాలాకాలం పాటు బస చేయాల్సి వచ్చినప్పుడు, మరే ఆహారం సమకూరే అవకాశం లేనప్పుడు ఖర్జూరం నిల్వ చేసుకొని నెలల తరబడి ఖర్జూరంతోనే తమ ఆహార అవసరాలు తీర్చుకునేవి. ఖర్జూరం మంచి పోషక విలువలు కలిగిన సంపూర్ణ ఆహారం. అలసటను, నీరసాన్ని దూరం చేసి తక్షణ శక్తినిస్తుంది. ఖర్జూరం ఇంత పౌష్టికాహారం కాబట్టే, ఇందులో ఇన్ని శుభాలు ఉండబట్టే ముహమ్మద్ ప్రవక్త (స) శ్రేష్ఠమైన సెహరీ (ఉపవాసం పాటించేవారు తెల్లవారుజామున సేవించే ఆహారం) ఖర్జూరం అని చెప్పారు. సెహరీలో ఖర్జూరం తినడం వల్ల ఉపవాసకులలో శక్తిసామర్థ్యాలు వృద్ధి చెందుతాయి. తద్వారా పగటివేళ ఇతరత్రా పనులు చేసుకోవడానికి శక్తి లభిస్తుంది. అలాగే ఉపవాస విరమణకు కూడా ఖర్జూరమే శుభప్రదం. ప్రవక్త మహనీయులు ఖర్జూరంతోనే రోజా విరమించమని ఉపదేశించారు. ఖర్జూరంలో శుభం ఉందని సెలవిచ్చారు. ఒకవేళ ఖర్జూరం దొరకని పక్షంలో నీటితోనే ఉపవాసం విరమించాలి. అందుకే రోజువారీ ఆహారంలో ఖర్జూరాలు చేర్చుకోవాలని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. రోజుకు కనీసం మూడు ఖర్జూరాలు తిన్నా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే రమజాన్ మాసంలో ముస్లింలు దైవప్రవక్త సంప్రదాయాన్ని అనుసరిస్తూ, ఇఫ్తార్ (ఉపవాస విరమణ) సమయంలో ఖర్జూరం తీసుకోవడానికి ప్రత్యేక ప్రాముఖ్యతనిస్తారు. రమజాన్ మాసంలో ఇఫ్తార్ సమయంలో వీటిని తీసుకుంటారు... ఖర్జూరం హల్వా కావలసినవి:ఖర్జూరాలు – అర కేజీపాలు – అర లీటరుపంచదార – అర కిలోబాదం పప్పులు – 30జీడి పప్పులు – 20కిస్మిస్ – 20ఏలకుల పొడి – 2 టీ స్పూన్లునెయ్యి – 50 గ్రా. తయారీ: ముందుగా బాదం పప్పు, జీడి పప్పు, కిస్మిస్లను నేతిలో విడివిడిగా వేయించి పక్కన ఉంచుకోవాలి ఠి గింజలు తీసిన ఖర్జూరాలను పాలలో వేసి స్టౌ మీద ఉంచి, సన్న మంట మీద ఉడికించాలి ఠి ఖర్జూరాలు మెత్తగా అయ్యాక పంచదార, నెయ్యి వేసి మూత పెట్టాలి ఠి మిశ్రమం అడుగంటి పోకుండా గరిటెతో తిప్పుతుండాలి ఠి కొద్దిగా చిక్కబడ్డాక ఏలకుల పొడి వేయాలి ఠి నేతిలో వేయించిన డ్రైఫ్రూట్స్ వేసి బాగా కలిపి దించేయాలి ఠి కమ్మటి హల్వా రెడీ అయినట్లే. దహీ వడ కావలసినవి:మినప్పప్పు – 150 గ్రా.పెరుగు – 400 గ్రా.ఉప్పు – తగినంతపచ్చి మిర్చి – 3 (చిన్న చిన్న ముక్కలుగా తరగాలి)పోపు కోసంఆవాలు – టీ స్పూనుజీలకర్ర – టీ స్పూను పచ్చి సెనగ పప్పు – టీ స్పూనుఎండు మిర్చి – 4 (ముక్కలు చేయాలి) కరివేపాకు – రెండు రెమ్మలు తయారీ: ముందురోజు రాత్రి మినప్పప్పు నానబెట్టాలి ఠి మరుసటి రోజు ఉదయం మినప్పప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు (నీళ్లు ఎక్కువైతే గారెలు ఎక్కువ నూనె పీల్చుకుంటాయి) జత చేసి గ్రైండ్ చేయాలి ఠి పచ్చి మిర్చి, ఉప్పు జత చేసి పక్కన ఉంచాలి ఠి స్టౌ మీద బాణలిలో నూనె కాగాక గారెలు ఒత్తుకొని నూనెలో వేసి వేయించి తీసేయాలి ఠి ఇలా మొత్తం గారెలు తయారుచేసుకుని పక్కన ఉంచాలి ఠి ఒక గిన్నెలో పెరుగు వేసి కొద్దిగా నీళ్లు జత చేసి చిక్కగా గిలకొట్టి, ఉప్పు జత చే సి పక్కన ఉంచాలి ఠి బాణలిలో నూనె కాగాక పచ్చి సెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించి పెరుగులో వేసి కలపాలి ఠి తయారుచేసి ఉంచుకున్న గారెలను పెరుగులో వేసి కొద్దిసేపు నానిన తరవాత కొత్తిమీరతో అలంకరించి అందించాలి. చన్నా మసాలా కావలసినవి:సెనగలు – పావు కిలోమిరప కారం – అర టీ స్పూనుఒరుగుల పొడి – అర టీ స్పూనుఅల్లం పొడి – అర టీ స్పూనుజీలకర్ర పొడి – ఒక టీ స్పూనుధనియాల పొడి – ఒక టీ స్పూను జీలకర్ర పొడి – ఒక టీ స్పూనుఇంగువ – చిటికెడుపచ్చి మిర్చి తరుగు – ఒక టీ స్పూనుపుదీనా తరుగు – రెండు టీ స్పూన్లుఉప్పు – అర టీ స్పూనుఉల్లి తరుగు – రెండు టేబుల్ స్పూన్లునూనె – 2 టేబుల్ స్పూన్లు నీళ్లు – 200 మి.లీ. తయారీ: సెనగలను ముందు రోజు రాత్రి నానబెట్టాలి ఠి మరుసటిరోజు సెనగలలో నీళ్లు ఒంపి, శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జతచేసి కుకర్‌లో ఉంచి ఒక విజిల్ వచ్చాక మంట తగ్గించి, పది నిముషాల పాటు ఉడికించి దింపేయాలి ఠి విజిల్, కుకర్ మూత తీసి, మరోమారు స్టౌ మీద పెద్ద మంట మీద ఉంచి, నీళ్లు ఇగిరేవరకు కలుపుతుండాలి ఠి మరొక పాత్రలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి, కాగాక ఇంగువ, జీలకర్ర పొడి వేసి కలిపాక, పైన చెప్పిన పొడులన్నీ వేసి కలపాలి ఠి అడుగు అంటకుండా కొద్దిగా నీళ్లు పోసి ఒక నిమిషం పాటు కలపాలి ఠి ఉడికించిన సెనగలను అందులో వేసి, పుదీనా, ఉల్లి తరుగు జత చేసి కలపాలి ఠి అంతే... ఘుమఘుమలాడే చన్నా మసాలా రెడీ ఠి దీనికి నిమ్మరసం కూడా జోడిస్తే మరింత రుచిగా ఉంటుంది. ప్రయత్నించండి. ఇఫ్తార్ కి దాల్ కావలసినవి:పచ్చి సెనగ పప్పు – 150 గ్రా.నీళ్లు – 350. మి.లీ.ఉప్పు – సరిపడానిమ్మ రసం – ఒక టీ స్పూన్మిరియాల పొడి – కొద్దిగా కొత్తిమీర – కొద్దిగా తయారీ: పచ్చి సెనగపప్పుకు తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించాలి ఠి బాగా మెత్తపడ్డాక ఉప్పు, నిమ్మరసం, మిరియాల పొడి వేసి కలిపి దింపేయాలి ఠి కొత్తిమీరతో అలంకరించి అందించాలి. ఉపవాసాల రోజుల్లో రోజా విరమణ సమయంలో ఈ పదార్థాలను తీసుకుంటారు మటన్ హలీమ్ కావలసినవి:కంది పప్పు – అర కప్పుఎర్ర కంది పప్పు (మసూర్ దాల్) – అర కప్పుపెసర పప్పు – అర కప్పుమినప్పప్పు – అర కప్పుసెనగలు – అర కప్పుటొమాటో తరుగు – ఒక కప్పుగరం మసాలా – ఒక టీ స్పూనుమిరియాల పొడి – ఒక టీ స్పూను ఉల్లి తరుగు – రెండు కప్పులుఉప్పు – తగినంతజీడి పప్పు – 50 గ్రా.పసుపు – ఒక టీ స్పూనుమటన్ – అర కేజీమిరప కారం – 4 టీ స్పూన్లు పెరుగు – ఒక కప్పుకొత్తిమీర తరుగు – అర కప్పుపుదీనా తరుగు – అర కప్పుగోధుమ రవ్వ – పావు కేజీ అల్లం వెల్లుల్లి ముద్ద – సరిపడా తయారీ: పైన పేర్కొన్న పప్పులను విడివిడిగా నూనె లేకుండా బాణలిలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి ఠి గోధుమ రవ్వను కూడా దోరగా వేయించి పక్కన ఉంచాలి ఠి వేయించిన పప్పులను, గోధుమ రవ్వను ఒక పెద్ద పాత్రలో వేసి, రెండు లీటర్ల నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి మూత పెట్టి సుమారు అరగంటసేపు ఉడికించి (మధ్యమధ్యలో కలుపుతుండాలి) పక్కన ఉంచాలి ఠి మరొక కడాయిలో నూనె పోసి స్టౌ మీద ఉంచి వేడయ్యాక, ఉల్లి తరుగు వేసి వేయించాలి ఠి అదే నూనెలో జీడి పప్పు వేసి మరోమారు వేయించి దింపేయాలి ఠి కుకర్‌లో రెండు టీ స్పూన్ల నూనె పోసి స్టౌ మీద ఉంచి వేడయ్యాక అల్లం వెల్లుల్లి ముద్ద వేసి మూడు నిమిషాల పాటు బాగా కలపాలి ఠి పసుపు, టొమాటో ముక్కలు వేసి బాగా కలిపి ఉడికించాలి ఠి మటన్, అర టీ స్పూను ఉప్పు, నాలుగు టీ స్పూన్ల మిరప కారం వేసి బాగా కలపాలి ఠి అర కప్పు పెరుగు వేసి కలిపి, రెండు కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి ఐదు విజిల్స్ వచ్చాక దింపేయాలి ఠి మూత తీసి మరోమారు స్టౌ మీద పెట్టి, నీరు ఇంకిపోయేవరకు కలిపి దించేయాలి ఠి బాగా చల్లారాక పప్పు గుత్తితో మెత్తగా అయ్యేవరకు బాగా మెదపాలి ఠి ఉడికించి ఉంచుకున్న పప్పులను మిక్సీలో వేసి మెత్తగా చేసి, ఒక పెద్ద పాత్రలోకి తీసుకోవాలి ఠి ఉడికించుకున్న మటన్, రెండు కప్పుల నీళ్లు, సగం పుదీనా తరుగు, సగం కొత్తిమీర తరుగు, ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా, నూనె, నెయ్యి, వేయించి ఉంచుకున్న ఉల్లి తరుగు (ఒక కప్పు) జత చేసి బాగా కలిపి స్టౌ మీద ఉంచి, సన్నని మంట మీద సుమారు 20 నిమిషాలు ఉడికించాలి ఠి అడుగు అంటకుండా మధ్యమధ్యలో కలిపి దించేయాలి ఠి జీడి పప్పు, నెయ్యి, ఒక కప్పు ఉల్లి తరుగు, పుదీనా, కొత్తిమీరలతో అలంకరించి మటన్ హలీం అందించాలి. మటన్ మందీ కావలసినవి: మటన్ – 750 గ్రా.బాస్మతి బియ్యం – 500 గ్రా.జీడి పప్పు – 50 గ్రా.బాదం పప్పులు – 50 గ్రా.నెయ్యి – 4 టేబుల్ స్పూన్లునూనె – తగినంతపచ్చి మిర్చి తరుగు – రెండు టీ స్పూన్లు పసుపు – అర టీ స్పూనుమిరప కారం – ఒక టీ స్పూనుఉప్పు – తగినంతశొంఠి పొడి – ఒక టీ స్పూనులవంగాలు – 2దాల్చిన చెక్క – మూడు చిన్న ముక్కలుకొత్తిమీర, పుదీనా – తగినంతఎండు నిమ్మ చెక్కలు – 2మందీ స్పైస్ కోసంధనియాలు – ఒక టేబుల్ స్పూనుజీలకర్ర – ఒక టేబుల్ స్పూనులవంగాలు – 4దాల్చిన చెక్క – చిన్న ముక్కఏలకులు – 4మిరియాలు – అర టేబుల్ స్పూనుజాజికాయ – చిన్న ముక్కశొంఠి – కొద్దిగా బిరియానీ ఆకు – 2 (ఈ పదార్థాలన్నీటినీ పొడి చేసి ఉంచుకోవాలి) తయారీ: మటన్‌ను శుభ్రంగా కడిగి తడి లేకుండా నీళ్లు శుభ్రంగా తీసేయాలి ఠి మటన్‌లో ఒక టేబుల్ స్పూను మందీ స్పైస్, ఒకటిన్నర టీ స్పూన్ల ఉప్పు, అర టీ స్పూను పసుపు... వీటిని మటన్‌కు పట్టించి, మూడు గంటలపాటు పక్కన ఉంచాలి ఠి మూడు గంటల తరవాత ఒక పాత్రలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి, ఒక టేబుల్ స్పూన్ నూనె, ఉల్లి తరుగు, దాల్చిన చెక్క ముక్కలు, రెండు లవంగాలు వేసి నిమిషం పాటు వేయించాలి ఠి మసాలా పట్టించిన మటన్ ముక్కలు వేసి మరో నిమిషం పాటు కలియతిప్పాలి ఠి ఒకటిన్నర టీ స్పూన్ల మిరప కారం, ఒక టీ స్పూను శొంఠి పొడి వేసి బాగా కలిపి, లీటరున్నర నీళ్లు, అర టేబుల్ స్పూను మందీ స్పైస్, రెండున్నర టీ స్పూన్ల ఉప్పు, పచ్చి మిర్చి తరుగు వేసి బాగా కలపాలి ఠి ఎండు నిమ్మ చెక్కలు వేసి మూత పెట్టి సన్నని మంట మీద ఉడకనివ్వాలి ఠి కొద్దిగా పొంగు వచ్చిన తరవాత మూత తీసి, మటన్ ముక్కలు మెత్తగా అయ్యేవరకు మధ్యమధ్యలో కలుపుతూ ఉడకనివ్వాలి ఠి మటన్ ముక్కలు మెత్తగా అయిన తరవాత, ముక్కలు తీసేయాలి ఠి అరగంట నానబెట్టిన బాస్మతి బియ్యం మరుగుతున్న నీటిలో వేసి, సన్నటి మంట మీద ఉడికించి దింపేయాలి ఠి ఉడికిన అన్నం మీద మటన్ ముక్కలు పరిచి, మధ్యలో స్టీలు గిన్నె పెట్టి, అందులో కాలుతున్న బొగ్గు ముక్క ఉంచి, దాని మీద ఒక టీ స్పూను నెయ్యి పోయాలి ఠి పొగరావడం మొదలైన వెంటనే మూత పెట్టి ఐదు నిమిషాల తరవాత మూత తీసేసి, స్టీలు గిన్నె కూడా తీసేయాలి ఠి మటన్ మందీ రెడీ అయినట్లే ఠి ప్లేటులో వడ్డించి, వేయించి ఉంచిన బాదం పప్పులు, జీడి పప్పులతో పాటు, కొత్తిమీర, పుదీనాలతో అలంకరించి అందించాలి. -
ఇఫ్తార్ విందులో జగన్
ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతిపక్ష నేత సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లా కడపలో గురువారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే ఎస్బీ అంజాద్‌బాషా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మతగురువు వల్లీఉల్లా రంజాన్ ఉపవాసదీక్ష విశిష్టత వివరించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులతో ఉపవాస దీక్షను విరమింపజేశారు. అంజాద్‌బాషా మతగురువులతో కలసి జగన్‌కు ఫలహారం తినిపించారు. ముస్లిం సోదరులకు తన తరుఫున, పార్టీ తరుఫున జగన్ ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే అంజాద్‌బాషా మాట్లాడుతూ వైఎస్సార్ జిల్లా మత సామరస్యానికి మారుపేరుగా నిలుస్తోం దన్నారు. జిల్లావాసులంతా ఇఫ్తార్‌లో పాల్గొనడంపై హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం అధ్యక్షుడు నదీమ్ అహమ్మద్, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఎస్.రఘురామిరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, పి.రవీంద్రనాథరెడ్డి, మేయర్ సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి, ఎస్బీ అహ్మద్‌బాషా, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెద్దదర్గాలో ప్రత్యేక ప్రార్థనలు: కడపలోని అమీన్‌పీర్ దర్గా (పెద్దదర్గా)లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రార్థనలు నిర్వహించారు. ఇఫ్తార్‌విందు అనంతరం పెద్దదర్గా పీఠాధిపతి హజరత్ ఆరీపుల్లా హుస్సేనీ సాహెబ్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం పెద్దదర్గా మజార్లుకు ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రవీంద్రనాథరెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డిలతో కలిసి వైఎస్ జగన్ పూలచాదర్‌ను సమర్పించి ప్రార్థనలు నిర్వహించారు.