దేవుడి స్క్రిప్టు గొప్పది | Script of God is great says YS Jagan Mohan Reddy In Iftar Feast | Sakshi
Sakshi News home page

దేవుడి స్క్రిప్టు గొప్పది

Published Tue, Jun 4 2019 4:43 AM | Last Updated on Tue, Jun 4 2019 10:46 AM

Script of God is great says YS Jagan Mohan Reddy In Iftar Feast - Sakshi

సోమవారం గుంటూరులో జరిగిన ఇఫ్తార్‌ విందు కార్యక్రమంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌ ] నమాజ్‌ చేస్తున్న ముఖ్యమంత్రి

సాక్షి, అమరావతి: దేవుడు ఏం చేసినా చాలా గొప్పగా, ఆశ్చర్యపోయేలా చేస్తాడని, గొప్పగా స్క్రిప్టు రాస్తాడని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రంజాన్‌ మాసంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తాను తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిని మించి మెరుగైన పాలన అందించేలా ముస్లిం సోదరులు దువా చేయాలని కోరారు. సోమవారం గుంటూరులోని పరేడ్‌ గ్రౌండ్‌లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన తొలి అధికారిక కార్యక్రమమైన ‘ఇఫ్తార్‌ విందు’లో సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు. ముస్లిం సోదరుల ఉపవాస దీక్ష విరమణ కార్యక్రమంలో పాల్గొని చాలాసేపు వారితో  ఆత్మీయంగా గడిపారు. పవిత్ర రంజాన్‌ మాసంలో అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన మహ్మద్‌ ఇక్బాల్‌కు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని ముస్లిం సోదరుల హర్షధ్వానాల మధ్య జగన్‌ ప్రకటించారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఐదుగురు ముస్లింలకు అసెంబ్లీ టికెట్లు ఇస్తే నలుగురు విజయం సాధించారని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఇంకా ఏమన్నారంటే...

అస్సలామ్‌ అలైకుమ్‌...
‘ఈరోజు రంజాన్‌ శుభమాసంలో ముస్లిం సోదరుల మధ్య ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం నాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. ఈ సందర్భంగా నేను ఒకటి మనవి చేయదల్చుకున్నా. దేవుడు ఏం చేసినా కూడా ఆశ్చర్యంగా, గొప్పగా జరిగింది అనిపించే విధంగా  చేస్తాడు. దేవుడు ఎంత గొప్పగా పని చేస్తాడు, ఆయన స్క్రిప్టు రాస్తే ఎంత గొప్పగా ఉంటుందో చెప్పడానికి మొట్ట మొదటి ఉదాహరణ ఇది... ఐదేళ్ల చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పాలనను మీరంతా చూశారు. ఆ సమయంలో అక్షరాలా 67 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఉంటే... 23 మంది ఎమ్మెల్యేలను అన్యాయంగా, డబ్బులిచ్చి ప్రలోభాలకు గురి చేసి  కొనుగోలు చేశారు. అందులో నలుగురిని ఏకంగా మంత్రులనే చేశారు. ఎమ్మెల్యేలు ఫిరాయిస్తే వాళ్లను అనర్హులుగా చేయాలి. లేదా వారి చేత రాజీనామాలు చేయించి ఎన్నికల్లో వాళ్ల పార్టీ గుర్తు మీద మళ్లీ గెలిపించుకుని శాసనసభకు తెచ్చుకోవాలి. కానీ ఇవేమీ జరగలేదు. మన కళ్ల ముందే అన్యాయం, అధర్మం కనిపించింది. అన్ని రకాల మోసాలు, అబద్ధాలు కనిపించాయి. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ టికెట్‌తో 9 మంది ఎంపీలు గెలిస్తే ముగ్గురిని ఇదే మాదిరిగా కొనుగోలు చేశారు. 

రంజాన్‌ మాసంలోనే...
గత నెల 23వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అది కూడా రంజాన్‌ మాసంలోనే. ఇక టీడీపీకి వచ్చిన ఎమ్మెల్యేల సంఖ్య అక్షరాలా 23, ఆ పార్టీకి వచ్చిన ఎంపీ సీట్లు 3. ఫలితాలు వచ్చింది రంజాన్‌ మాసంలో మే 23వ తేదీన. ఇంత కన్నా గొప్ప స్క్రిప్టు మరెవరూ రాయలేరు. అదొక్క దేవుడు మాత్రమే రాయగలుగుతాడు. రంజాన్‌ శుభమాసంలోనే జగన్‌ అనే నేను మీ అందరి చల్లని దీవెనలతో, దేవుడి ఆశీస్సులతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశా. మళ్లీ రంజాన్‌ మాసంలోనే ముఖ్యమంత్రిగా నా మొట్టమొదటి అధికార కార్యక్రమాన్ని మీ అందరి సమక్షంలోనే ప్రారంభించి ఈ శుభ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నా. ఆ దేవుడి గొప్పతనానికి ఇంత కన్నా ఉదాహరణలు అవసరం లేదు’’ 

పెద్ద ఎత్తున హాజరైన ముస్లింలు..
ఇన్షా అల్లాహ్‌... ఈద్‌ ముబారక్‌ ఇన్‌ అడ్వాన్స్‌ ... మీ అందరికీ అభినందనలు అంటూ సీఎం వైఎస్‌ జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు. అనంతరం మౌలానా ఇస్మాయిల్‌ ఆధ్వర్యంలో ఇఫ్తార్‌కీ దువా, ఉపవాస దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలు, షేక్‌ అంజాద్‌బాష, మహ్మద్‌ ముస్తఫా, హఫీజ్‌ఖాన్, నవాజ్‌బాష సీఎం వైఎస్‌ జగన్‌కు ఖర్జూరం తినిపించారు. జగన్‌ కూడా వారికి ఖర్జూరం తినిపించారు. అనంతరం మగరీబ్‌కీ నమాజ్‌లో వైఎస్‌ జగన్‌ ముస్లిం సోదరులతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గుంటూరు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ముస్లింలు హాజరయ్యారు. 

జగన్‌కు రుణపడి ఉన్నా: ఇక్బాల్‌
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తాను సర్వదా రుణపడి ఉంటానని మాజీ పోలీసు అధికారి, హిందూపురం వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మహ్మద్‌ ఇక్బాల్‌ పేర్కొన్నారు. ఎన్నికల్లో తాను ఓటమి పాలైనప్పటికీ ఆదరించి ఎమ్మెల్సీని చేస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ రంజాన్‌ మాసంలో ప్రకటించడం తనకు నిజంగా శుభవార్త అని తెలిపారు. వైఎస్‌ జగన్‌ సుదీర్ఘకాలం రాష్ట్రానికి మంచి పరిపాలన అందిస్తారని తనకు సంపూర్ణంగా విశ్వాసం ఉందని చెప్పారు.

మున్సిపల్‌ కార్మికుల కష్టాలపై ముఖ్యమంత్రి ఆరా!
ఇఫ్తార్‌ విందు ముగించుకుని బయటకు వస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అక్కడ కనిపించిన మున్సిపల్‌ కార్మికులను పిలిపించి మాట్లాడారు. వారి జీత భత్యాలపై ఆరా తీశారు. ‘జీతాలు ఏమేరకు పెరగాలని ఆశిస్తున్నారు’ అని అడిగారు. ముఖ్యమంత్రి ఇలా తమను పిలిచి మాట్లాడడంతో వారు ఉబ్బితబ్బిబ్బయ్యారు. పాదయాత్ర సమయంలోనూ పలుచోట్ల మున్సిపల్‌ కార్మికులు కలిసి తమ కష్టాలు ఏకరువు పెట్టారని సీఎం గుర్తుచేసుకున్నారు. వారి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానన్నారు.

ఏపీ భవన్‌లో ఇఫ్తార్‌ విందు
సాక్షి, న్యూఢిల్లీ: పవిత్ర రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకొని సోమవారం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ముస్లిం సోదరులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు హస్తినలోని ముస్లిం ప్రముఖులతోపాటు పలు దేశాల భారత రాయబార కార్యాలయాల ప్రముఖులు పాల్గొన్నారు. ముందుగా సాయంత్రం రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి దువా చేశారు. ఇఫ్తార్‌ అనంతరం మగ్రీబ్‌ నమాజ్‌ చేశారు. ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమీషనర్‌ ప్రవీణ్‌ ప్రకాష్‌ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది ఇఫ్తార్‌ విందు ఏర్పాట్లను ఘనంగా చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌ ప్రకాష్‌ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గుంటూరులో ఇఫ్తార్‌ విందు ఇస్తుండగా వారి ఆదేశాల మేరకు ఢిల్లీలో కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

సంప్రదాయ తెలుగు పండుగలతోపాటు ముస్లిం, క్రిస్టియన్స్‌ పండుగలను ఏటా ఏపీభవన్‌లో ఘనంగా నిర్వహిస్తున్నామని, దీనిలో భాగంగా రంజాన్‌ మాసం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున ఇఫ్తార్‌ విందు ఇచ్చినట్టు చెప్పారు. సర్వ మానవ సౌభ్రాతృత్వానికి, శాంతి సామరస్యానికి రంజాన్‌ పండుగ ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. ఇఫ్తార్‌ విందులో రిపబ్లిక్‌ ఆఫ్‌ పనామా దేశ రాయబారి ముహమ్మద్‌ తల్హా హాజీ, ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇరాన్‌ దేశ రాయబార కార్యాలయ ప్రతినిధి అసఘర్‌ ఒమిది, మారిషస్‌ హై కమిషనర్‌ సీవరాజ్‌ నుందులాల్, పలువురు సీనియర్‌ ఐఏఎస్‌లు, ఇస్లామిక్‌ సెంటర్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. హజరత్‌ నిజాముద్దీన్‌ ఆలియా జాఫ్ఫాదా నషీన్‌ దర్గా ప్రముఖ ఇమామ్‌ సయెద్‌ జోహాబ్‌ నిజామి ఆధ్వర్యంలో మగ్రీబ్‌ నమాజ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement