అమర్నాథ్‌రెడ్డి, రామానాయుడు కుప్పంలో ఓ ఇంటికి వెళ్లి బేరసారాలు చేస్తుండగా బయట కాపలా కాస్తున్న టీడీపీ కార్యకర్తలు, నాయకులు
సాక్షి, తిరుపతి/అమరావతి: చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి గెలుపు అవకాశాలు లేకపోవడంతో ఆ పార్టీ అడ్డదారులు తొక్కుతోంది. 2017లో నంద్యాల ఉపఎన్నిక సమయంలో ప్రయోగించిన జిత్తులను మరోసారి తెరపైకి తెస్తోంది. ఇందులో భాగంగా.. చంద్రబాబు కనుసన్నల్లో ప్రలోభాలు, విధ్వంసాలకు పాల్పడుతోంది. మాజీమంత్రి అమర్నాథ్‌రెడ్డి, పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు వీటి అమలుకు రంగంలోకి దిగారు. అలాగే.. మంగళవారం నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో టీడీపీ నేతలు ఓటర్లను లోబర్చుకునేందుకు బేరసారాలు సాగించారు.
ప్రచారం ముసుగులో వీరు ఓటర్ల నివాసాల్లోకి వెళ్లి గంపగుత్తుగా ఓట్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మున్సిపాలిటీలోని ఉమ్మడి కుటుంబాలపై కూడా టీడీపీ నేతలు గురిపెట్టారు. ఒక ఇంట్లో పది, అంతకుమించి ఓట్లు ఉంటే రూ.25 వేలు నుంచి రూ.50వేలు వరకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. 50 ఓట్లకు మించి ఉన్న వారికి భారీ నజరానాలివ్వాలని నిర్ణయించారు. డబ్బులు తీసుకోని వారికి ఆ స్థాయిలో బహుమతులిచ్చేందుకు సైతం ఏర్పాట్లుచేస్తున్నారు. ఫ్రిడ్జ్, 40 అంగుళాల టీవీలు, బుల్లెట్ వాహనాలు, ట్రాక్టర్ల వంటివి ఇచ్చేందుకు ఆశపెడుతున్నారు.
అసంతృప్తివాదులకు తాయిలాలు
ఇక చంద్రబాబు పాలనలో సాయం కోసం వెళ్లి నిరాశతో వెనక్కి వచ్చిన వారిని కూడా గుర్తించే పనిలో టీడీపీ నేతలు నిమగ్నమయ్యారు. వారు అడిగిన పనులను ఇప్పుడు చేసిపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా మంగళవారం వారు ఐదు కుటుంబాలను కలిసినట్లు తెలిసింది. కానీ, టీడీపీ నేతలపై ఆ ఇళ్లవారు ఆగ్రహం వ్యక్తంచేశారు. టీడీపీ నాయకులు వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నా ఓటర్లు ససేమిరా అన్నట్లు తెలిసింది. దీంతో టీడీపీ నేతలు నేరుగా చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడిస్తున్నారు. అయితే.. ఓటర్లు ఆ నేతలకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఈ విషయంపై టీడీపీ నేతలు మంగళవారం సాయంత్రం మరోసారి చంద్రబాబుతో సుదీర్ఘంగా ఫోన్‌లో మాట్లాడినట్లు ఆ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. ఇలాంటి వారినందరినీ వెంటనే గుర్తించి తన దృష్టికి తీసుకురావాలని చంద్రబాబు ఆ నేతలకు ఆదేశించారు.
బుల్లెట్‌లు, ట్రాక్టర్లు బహుమతులు
దీంతో అసంతృప్తితో పార్టీకి దూరంగా ఉంటున్న ద్వితీయ, తృతీయశ్రేణి కార్యకర్తలు కొందరిని గుర్తించారు. గత నాలుగు రోజులుగా నేతలు వారి ఇళ్లకెళ్లి బుజ్జగిస్తూ పార్టీ గెలుపు కోసం పనిచేయాలని కోరినట్లు తెలిసింది. అందుకు ప్రతిఫలంగా బుల్లెట్ బైకులు కొనిస్తామని హామీ ఇచ్చినట్లు కుప్పంలో విస్తృత ప్రచారం జరుగుతోంది. అంతేకాక.. ఎన్నికలు అయ్యేంత వరకు పెట్రోల్ ఖర్చులు, మందు, విందు తదితర వాటిన్నింటికి ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. అలాగే.. వ్యవసాయ భూములుండి పార్టీ కోసం పనిచేసి ఎలాంటి లబ్ధిపొందలేకపోయిన వారికి ట్రాక్టర్లు బహుమతిగా ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఇంకా ద్వితీయశ్రేణి నాయకుల్లో 500 వరకు ఓటు బ్యాంకు ఉన్న వారికి ఏకంగా కార్లు ఇస్తామని హామీలిస్తున్నారు. ఇలా ఇన్ని రకాలుగా టీడీపీ నేతలు ప్రలోభాలకు గురిచేస్తున్నా ఓటర్ల నుంచి వారికి చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. ఇన్నాళ్లూ బాబుగారు మాకేమీ చేశారంటూ నిలదీస్తుండడం కొసమెరుపు.
వార్డుల వారీగా వ్యూహాలు
ఇక తొలిసారిగా చిత్తూరు జిల్లాతో ఏమాత్రం సంబంధంలేని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడికి కుప్పం బాధ్యత అప్పగించారు. బాబు కూడా రోజుకు మూడు, నాలుగుసార్లు టెలీకాన్ఫరెన్స్‌లు నిర్వహించి వార్డుల వారీగా దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే, వ్యూహాత్మకంగానే ఒక్కో వార్డుకు నలుగురైదుగురితో నామినేషన్ల వేయించారు. అవసరమైతే పోలీసులు, ఎన్నికల అధికారులపై దాడులు చేయగల కరడుగట్టిన నాయకులు, వారి అనుచరులను అక్కడ మొహరించారు.
ఎంతైనా ఇద్దాం.. కుప్పంలో గెలుద్దాం
కుప్పం మున్సిపాల్టీలో ఎలాగైనా గెలిచేందుకు చంద్రబాబు తన శక్తియుక్తులు అన్నింటినీ ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒక మున్సిపాల్టీపై ఆయన పూర్తిస్థాయిలో దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. ఎంత ఖర్చుకైనా వెనుకాడొద్దని.. ఓటర్లకు ఎంతైనా ఇద్దామని నాయకులకు ఆయన పదేపదే చెబుతున్నట్లు తెలిసింది. దశాబ్దాలుగా తన కంచుకోటగా ఉన్న కుప్పం జేజారిపోతుందేమోననే భయం ఆయన్ను వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో కుప్పం టీడీపీ కోటకు బీటలు వారడంతో ఆయనకు తీవ్ర భంగపాటు ఎదురైంది. దీంతో చంద్రబాబు కంగుతిన్నారు. ఇప్పుడు కుప్పం మున్సిపాల్టీ కూడా చేజారితే తన పరువు పోవడమే కాకుండా దాని ప్రభావం పార్టీ మీద తీవ్రంగా ఉంటుందని ఆయన ఆందోళన చెందుతున్నారు. అందుకే కుప్పం మున్సిపాల్టీలో గెలవడమే లక్ష్యంగా సాధారణ ఎన్నికల స్థాయిలో పనిచేస్తున్నారు.
అవసరమైతే కుప్పం పర్యటనకు రెడీ
ఇక అవసరమైతే ఒకరోజు స్వయంగా అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించాలని చంద్రబాబు భావిస్తున్నారు. కానీ, ఒక్క కుప్పం మున్సిపాల్టీ కోసం ఆయన వెళ్తే చులకనగా ఉంటుందని ముఖ్య నేతలు అభిప్రాయపడడంతో దానిపై తర్జనభర్జన పడుతున్నట్లు తెలిసింది. అక్కడ ఏ చిన్న గొడవ జరిగినా దాన్ని సాకుగా చూపి పర్యటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. సోమవారం రాత్రి ఎన్నికల అధికారితో కావాలని గొడవకు దిగి నానా రభస సృష్టించారు. ఈ ఘటనను చూపించి కుప్పం వెళ్లేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. కానీ, చివరి నిమిషంలో ఆ ఆలోచన విరమించుకున్నారు. ప్రచార గడువు ముగిసే లోపు ఏదో ఒక సాకుతో చంద్రబాబు కుప్పం వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment