Trouble Shooter
-
Lok sabha elections 2024: కాంగ్రెస్‌లో ప్రియాంకం
ప్రియాంకా గాంధీ వాద్రా. తండ్రి రాజీవ్ హత్యకు గురైనప్పుడు సమాజంతో పాటు మొత్తం ప్రపంచంపైనే కోపం పెంచుకున్న అమ్మాయి. ఎదిగే కొద్దీ క్షమాగుణం విలువను తెలుసుకున్నారు. ప్రధాని పదవి స్వీకరించాలని తల్లి సోనియాను కాంగ్రెస్ నేతలంతా కోరితే తననూ హత్య చేస్తారని భయపడి ఏడ్చిన సగటు యువతి. ఇప్పుడదే కాంగ్రెస్‌కు ట్రబుల్ షూటర్‌గా మారారు. అచ్చం నానమ్మ ఇందిర పోలికలను పుణికిపుచ్చుకున్న ప్రియాంక రాజకీయాల్లోకి వస్తారా, రారా అన్న చర్చ ఆమె పద్నాలుగో ఏట నుంచే మొదలైంది! తనకు రాజకీయాలు సరిపడవని మొదట్లో గట్టిగా నమ్మారామె. అలాంటిది ఇప్పుడు రాజకీయాల్లో పూర్తిగా తలమునకలయ్యారు. గాంధీల కంచుకోటైన యూపీలోని రాయ్‌బరేలీలో తల్లికి బదులుగా కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తారంటూ ప్రచారమూ జరుగుతోంది. రాజకీయ జీవితం ప్రియాంక తొలుత క్రియాశీల రాజకీయాల్లో అంతగా పాల్గొనలేదు. తల్లి, సోదరుల లోక్‌సభ నియోజకవర్గాలైన రాయ్‌బరేలీ, అమేథీలకు వెళ్లేవారు. 2004 లోక్‌సభ ఎన్నికలలో సోనియాకు ప్రచార నిర్వాహకురాలిగా వ్యవహరించారు. రాహుల్ ప్రచారాన్ని కూడా పర్యవేక్షించారు. 2007 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు లోక్‌సభ స్థానాల పరిధిలోని పది అసెంబ్లీ సీట్లలో ప్రచారం మొదలుకుని సీట్ల కేటాయింపులు, అంతర్గత పోరును పరిష్కరించడం దాకా అన్నీ తానై వ్యవహరించారు. 2019లో యూఈ తూర్పు భాగానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా అధికారికంగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. తర్వాత యూపీ ఇన్చార్జిగా వ్యవహరించారు. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలను తీసుకున్నారు. మహిళలకు 40 శాతం టికెట్ల డిమాండ్‌తో ‘లడ్కీ హూ, లడ్ సక్తీ హూ’ నినాదాన్ని తెరపైకి తెచ్చారు. ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమే చవిచూసింది. ఆ అనుభవం తన జీవితంలో స్థితప్రజ్ఞత తీసుకొచి్చందంటారు ప్రియాంక. అయితే 2022 హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారానికి సారథ్యం వహించి పార్టీని విజయ తీరాలకు చేర్చారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లోనూ క్రియాశీల పాత్ర పోషించారు. హిందీ సాహిత్యం.. బౌద్ధం... ప్రియాంక 1972 జనవరి 12న జని్మంచారు. డెహ్రాడూన్ వెల్హామ్ బాలికల పాఠశాలలో చదివారు. తర్వాత భద్రతా కారణాలతో రాహుల్‌తో పాటు ఢిల్లీలోని డే స్కూల్‌కు మారారు. ఇందిర హత్యానంతరం ఇద్దరూ ఇంట్లోనే చదువుకున్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం అనుబంధ కాలేజీ జీసస్ అండ్ మేరీ నుంచి ప్రియాంక సైకాలజీలో డిగ్రీ చేశారు. బౌద్ధ అధ్యయనంలో మాస్టర్స్ చేశారు. నానమ్మను అత్యంత శక్తివంతమైన మహిళగా చెబుతారు. బాల్యంలో నానమ్మతో రాహులే ఎక్కువగా గడపడం చూసి ఈర‡్ష్య పడేదాన్నంటూ నవ్వేస్తారు. ప్రియాంక బాల్యం ఎక్కువగా బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ తల్లి తేజీ బచ్చన్‌తో గడిచింది. అమితాబ్ తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ కవిత్వం చదివి హిందీ సాహిత్యంపై మక్కువ పెంచుకున్నారు. ప్రేమ్‌చంద్ సాహిత్యాన్ని ఇష్టపడతారు. ఖాళీ దొరికితే పుస్తకాలు పట్టుకుంటారు. బౌద్ధ తత్వశా్రస్తాన్ని ఆచరిస్తారు. 1999లో రాజకీయాల్లోకి రావాల్సి వచి్చనప్పుడు పది రోజులపాటు మెడిటేషన్ చేసి నిర్ణయం తీసుకున్నారు. 1997లో వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాను పెళ్లాడారు. వారికిద్దరు పిల్లలు. ప్రియాంక రేడియో ఆపరేటర్ కూడా! -
బుల్లెటు బండెక్కి డుగ్గుడుగ్గుమని వచ్చేత్తపా... వచ్చేత్తపా
బుల్లెటు బండి ఎక్కి డుగ్గు డుగ్గుమని వచ్చేత్తపా...వచ్చేత్తపా పాట ఎంత వైరల్ అయిందో చెప్పనక్కర్లేదు. ఈ పాటలో కొన్ని చరణాలు ఇలా ఉంటాయి... నువ్వు యాడంగ వస్తావురో/ చెయ్యి నీ చేతి కిస్తారో ఈ చరణాలను కొట్టాయంకు తీసుకువెళితే అక్కడ మస్త్‌గా సూట్ అవుతాయి. అయితే అక్కడ పాడుతున్నది పెళ్లికూతురు కాదు. ఎదురు చూస్తుంది పెళ్లికొడుకు కోసం కాదు. స్వయంగా బుల్లెట్ బండే! కొట్టాయంలో ఏ బుల్లెట్ బండికి ఏ ట్రబుల్ వచ్చినా బుల్లెట్ బండిపై రయిరయ్యిమని వచ్చి ట్రబుల్ షూట్ చేసి వెళుతుంటుంది ఆమె. అందుకే ‘బుల్లెట్ దివ్య’ అని కూడా ఆమెను పిలుచుకుంటారు. ‘నా బుల్లెట్ బండి తరచుగా ట్రబులిస్తోంది. మంచి మోకానిక్ ఉంటే చెప్పు...’ కొద్దిసేపటి తరువాత: ‘ఇదిగో బాబాయ్ మంచి మెకానిక్. ఈ అమ్మాయి చేయిపడితే ఇక తిరుగే ఉండదు’ ‘ఈ పాప బుల్లెట్‌బండి ఏం బాగుచేస్తుందయ్యా...నీ పిచ్చిగానీ....పదా వేరే మెకానిక్ దగ్గరికి’ ‘బాబాయ్... నా మాట విని కొద్దిసేపు ఓపిక పట్టు’ కొద్దిసేపటి తరువాత.... ‘నిజమే సుమీ...టకీమనీ చేసి పారేసింది. ఏదో మంత్రం వేసినట్లుగానే ఉంది. పేరేంటి పాపా నీది? దివ్యా! వెరీగుడ్నేమ్’ కేరళలోని కొట్టాయంలో ఇలాంటి సంభాషణలు వినిపించడం కొత్తేమీ కాదు. కమల్‌హాసన్ పాట గుర్తుంది కదా... రాజా చేయివేస్తే అది రాంగై పోదులేరా! దివ్య జోసెఫ్ చేయి పడితే చాలు రాంగ్గా మొరాయిస్తున్న బండ్లు రైటైపోతాయి. మళ్లీ ఫామ్‌లోకి వస్తాయి. ఇంతకీ దివ్య జోసెఫ్ మెకానిక్ ఎందుకు అయింది? తన కుటుంబ భారాన్ని మోయడానికి మాత్రం కాదు. మెకానిజం అంటే ఆమెకు పాషన్! నాన్న పులిక్కపరంబిల్ జోసెఫ్ మెకానిక్. ఆయనకు కొట్టాయంలో వర్క్‌షాప్ ఉంది. బడి అయిపోగానే దివ్య వచ్చేది ఇక్కడికే. ఇది తనకు మరో బడి. అక్కడ ఉన్న బుల్లెట్ బండ్లు తన తోబుట్టువులుగానే అనిపించేవి. చూస్తూ చూస్తూనే ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ నుంచి ఆయిల్ అండ్ కేబుల్ ఛేంజెస్ వరకు ఏ టూ జెడ్ అన్నీ నేర్చేసుకుంది. యంత్రవేగంతో బుల్లెట్ బండ్లను బాగుచేస్తుంది. ఒకానొక దశలో తల్లిదండ్రులు భయపడ్డారు, మెకానిజం ధ్యాసలో పడి చదువులో వెనకబడిపోతుందేమోనని! కానీ అలా ఎప్పుడూ జరగలేదు. చదువులో దివ్య ఎక్కడా తగ్గలేదు. దీంతో వారు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ప్రస్తుతం దివ్యా జోసెఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతోంది. బుల్లెట్ బండ్ల సర్వీస్ ద్వారా వచ్చిన డబ్బులో కొంత మొత్తాన్ని సోషల్ సర్వీస్ కు కూడా వెచ్చించాలని నిర్ణయించుకుంది. శభాష్ దివ్యా! -
అహ్మద్ పటేల్ కన్నుమూత
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్‌నేత, వ్యూహకర్త అహ్మద్‌పటేల్(71) గుర్గావ్లో కన్నుమూశారు. నెలరోజులుగా ఆయన కరోనా సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఆయన్ను ఈ నెల 15న ఆస్పత్రిలో చేర్చారు. అయితే చికిత్సకు అవయవాలు స్పందించని కారణంగా బుధవారం తెల్లవారుజామున 3.30 గంటలకు మరణించినట్లు ఆయన కుమారుడు ఫైజల్ తెలిపారు. çపటేల్ మృతిపట్ల రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత సోనియా, రాహుల్‌తో పాటు పలువురు నాయకులు సంతాపం తెలిపారు. ప్రస్తుతం పటేల్ గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. మూడు పర్యాయాలు లోక్‌సభకు ఎన్నికైన ఆయన ఐదు దఫాలుగా రాజ్యసభకు ఎన్నికవుతూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి మూడు దఫాలుగా పటేల్ కోశాధికారిగా వ్యవహరిస్తున్నారు. ఆయన స్వగ్రామం పిరమన్‌లో పటేల్ అంత్యక్రియలు జరుగనున్నాయి. ‘కాంగ్రెస్‌పార్టీకి జీవితాన్ని అంకింతం చేసిన ఒక కీలక నేతను కోల్పోయాము. భర్తీ చేయలేని ఒక సహచరుడు, నమ్మకస్తుడు, స్నేహితుడిని కోల్పోయాను’ అని కాంగ్రెస్ నేత సోనియా గాంధీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆపదలు దాటించే అహ్మద్ భాయ్ స్నేహితులు ‘ఏపీ’ లేదా ‘బాబూ భాయ్’అని పిలుచుకునే అహ్మద్ పటేల్ సోనియాకు 2001 నుంచి రాజకీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. పార్టీకి ఆపద వస్తే అహ్మద్వైపే అధినేత్రి చూసేవారు. కీలకాంశాల్లో పార్టీలో ఏకాభిప్రాయం సాధించే చతురుడుగా పటేల్ పేరుగాంచారు. ఏపీకి అన్ని పార్టీల్లో దోస్తులు, అభిమానులు ఉన్నారు. మూడు నెలల క్రితమే పార్టీలో తలెత్తబోయిన ఒక తిరుగుబాటును సైతం ఆయన చాకచక్యంగా సద్దుమణిగేలా చేశారు. పటేల్ ప్రస్థానం 1949 ఆగస్టులో జన్మించిన పటేల్ రాజకీయ ప్రస్థానం గుజరాత్‌లోని భరూచా జిల్లాల స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడంతో మొదలైంది. 1977లో 28ఏళ్ల వయసులో ఆయన లోక్‌సభకు ఎన్నికయ్యారు. అనంతరం 1993 లో రాజ్యసభకు తొలిసారి ఎన్నికయ్యారు. రాజీవ్‌గాంధీకి ఆయన సన్నిహితుడు. అప్పట్లో ప్రధానికి పార్లమెంట్ సెక్రటరీగా పనిచేశారు. 1985, 1992ల్లో ఆయన ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా వ్యవహరించారు. 1992నుంచి మంత్రిగా ఆయన ఎప్పుడూ పదవీ బాధ్యతలు నిర్వహించలేదు. కానీ కాంగ్రెస్ తరఫున కీలక నిర్ణయాలు తీసుకునే అతికొద్దిమందిలో ఆయన ఒకరు. పటేల్‌కు ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. -
బహుముఖ ప్రజ్ఞాశాలి... ప్రణబ్‌దా!
న్యూఢిల్లీ: బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రణబ్ ముఖర్జీ. దాదాపు 5 దశాబ్దాల క్రియాశీల రాజకీయ జీవితం ఆయన సొంతం. చివరగా, అత్యున్నత రాజ్యాంగ పదవి ఆయన రాష్ట్రపతిగా 2012 నుంచి 2017 వరకు విధులు నిర్వర్తించారు. అన్ని పార్టీలకు ఆమోదనీయ నేతగా ఆయన ఆ పదవి చేపట్టారు. 2019లో అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’పొందారు. కాంగ్రెస్ పార్టీలో, పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వంలో ప్రణబ్ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరు గాంచారు. ఇందిరాగాంధీ నుంచి సోనియాగాంధీ వరకు.. గాంధీ కుటుంబానికి నమ్మకమైన నేతగా, కుడి భుజంగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన విదేశాంగ, రక్షణ, ఆర్థిక శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా సంస్కరణల అమలుకు సాయమందించారు. తండ్రి సమరయోధుడు 1935 డిసెంబర్ 11న అప్పటి బ్రిటిష్ ఇండియాలో భాగమైన బెంగాల్ ప్రెసిడెన్సీలో ఉన్న మిరాటి గ్రామంలో(ప్రస్తుతం పశ్చిమబెంగాల్లోని బీర్బుమ్ జిల్లాలో ఉంది) ఒక బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో ప్రణబ్ ముఖర్జీ జన్మించారు. తల్లిదండ్రులు రాజ్యలక్ష్మి ముఖర్జీ, కమద కింకర్ ముఖర్జీ. తండ్రి స్వాతంత్య్ర సమరయోధుడు. 1952–64 మధ్య పశ్చిమబెంగాల్ శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ తరఫున సభ్యుడిగా ఉన్నారు. ప్రణబ్ ముఖర్జీ కలకత్తా యూనివర్సిటీలో ఎంఏ(చరిత్ర), ఎంఏ(రాజనీతి శాస్త్రం), ఎల్ఎల్బీ చదివారు. మొదట డిప్యూటీ అకౌంటెంట్ జనరల్(పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్) కార్యాలయంలో యూడీసీగా ఉద్యోగంలో చేరారు. ఆ తరువాత కలకత్తాలోని విద్యాసాగర్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం సాధించారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టేముందు జర్నలిస్ట్‌గా కొంతకాలం పనిచేశారు. 1969 నుంచి అప్రతిహతంగా.. 1969లో ప్రణబ్ ముఖర్జీ క్రియాశీల రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఆ సమయంలో జరిగిన మిడ్నాపుర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి వీకే కృష్ణమీనన్ విజయంలో ప్రణబ్ కీలక పాత్ర పోషించారు. ఆయన సామర్థ్యా న్ని కాంగ్రెస్ నాయకురాలు, అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గుర్తించి, పార్టీలో చేర్చుకున్నారు. 1969 జూలైలో రాజ్యసభకు పంపించారు. ఆ తరువాత 1975, 1981, 1993, 1999ల్లోనూ ఎగువ సభకు ఎన్నికై, పలుమార్లు సభా నాయకుడిగా విశేష సేవలందించారు. రాజకీయాల్లో ఇందిరాగాంధీ ఆశీస్సులు, తన సామర్ధ్యంతో అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. 1973లో తొలిసారి కేంద్రంలో సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత వివిధ శాఖలు నిర్వహించి, 1982లో కీలకమైన ఆర్థిక శాఖ పగ్గాలు చేపట్టారు. ఆ సమయంలో మన్మోహన్ సింగ్‌ను ఆర్బీఐ గవర్నర్‌గా నియమించింది ప్రణబ్ ముఖర్జీనే కావడం విశేషం. 1978లోనే సీడబ్ల్యూసీ సభ్యుడయ్యారు. ఇందిరాగాంధీ కేబినెట్లో నంబర్ 2గా ప్రణబ్ ప్రఖ్యాతి గాంచారు. అయితే, ఇందిరాగాంధీ హత్య అనంతరం పరిస్థితులు తారుమారయ్యాయి. పార్టీలో, ప్రభుత్వంలో ప్రణబ్‌ను పక్కనపెట్టడం ప్రారంభమైంది. చివరకు, ఆయనను పశ్చిమబెంగాల్ పీసీసీ వ్యవహారాలు చూసుకొమ్మని కలకత్తాకు పంపించేశారు. ► ప్రణబ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ), ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్‌లలో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సభ్యులుగా ఉన్నారు. ► దేశంలో అత్యున్నత పురస్కారం భారత రత్నతో పాటు, పద్మ విభూషణ్, ఉత్తమ పార్లమెంటేరియన్, బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ ఇన్ ఇండియా అవార్డులు ఆయన్ను వరించాయి. ► ప్రపంచంలోని వివిధ విశ్వవిద్యాలయాలు ఆయనకు ఐదు గౌరవ డాక్టరేట్స్‌ను ప్రదానం చేశాయి. కుటుంబం ప్రణబ్‌కు మొత్తం ముగ్గురు సంతానం. ఇద్ద రు కుమారులు... ఇంద్రజిత్, అభిజిత్. కూతు రు షర్మిష్ట. రాష్ట్రపతిగా ఆయన పదవీకాలం లో షర్మిష్ట కీలకమైన సందర్భాల్లో తండ్రికి తోడుగా ఉన్నారు. ప్రణబ్ అర్ధాంగి సువ్ర ముఖర్జీ 2015లో మరణించారు. 47 ఏళ్లకే ఆర్థికమంత్రి అపారమైన జ్ఞాపకశక్తి, లోతైన విషయపరిజ్ఞానం, సమకాలీన అంశాలపై విస్తృత అవగాహన, పదునైన మేధోశక్తి... ప్రణబ్‌ను విశిష్టమైన రాజకీయవేత్తగా నిలిపాయి. 1982లో ఆయన 47 ఏళ్లకే ఆర్థికమంత్రి అయ్యారు. దేశ చరిత్రలో అత్యంత పిన్నవయస్కుడైన ఆర్థికమంత్రిగా గుర్తింపు పొందారు. విదేశీ వ్యవహారాలు, రక్షణ, ఆర్థిక, వాణిజ్య శాఖలను చూశారు. ఇన్ని కీలకశాఖలను చూసిన తొలి రాష్ట్రపతి ప్రణబే. ముగ్గురు ప్రధానమంత్రులు... ఇంధిరాగాంధీ, పీవీ నరసింçహారావు, మన్మోహన్‌ల వద్ద పనిచేసిన అరుదైన గుర్తింపు పొందారు. ప్రధానమంత్రిగా పనిచేయకుండా... లోక్‌సభ నాయకుడిగా 8 ఏళ్లు పనిచేసిన ఏకైక నేత. 1980–85 ఏళ్లలో రాజ్యసభలో సభానాయకుడిగా ఉన్నారు. 2004–2012 మధ్యకాలంలో మొత్తం 39 మంత్రివర్గ ఉపసంఘాలు (గ్రూప్స్ ఆఫ్ మినిస్టర్స్) ఉండగా... వీటిలో ఏకంగా ఇరవై నాలుగింటికి ప్రణబ్ ముఖర్జీ నేతృత్వం వహించారు. విస్తృత ఏకాభిప్రాయాన్ని నిర్మించడంలో దిట్ట. పార్టీలకతీతంగాఅందరి విశ్వాసం చూరగొన్నారు. ఐదుసార్లు రాజ్యసభ సభ్యుడిగా, రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా పనిచేసిన ప్రణబ్‌కు స్వాతంత్య్రానంతర దేశ రాజకీయ చరిత్ర, పాలనా వ్యవహారాలు కొట్టినపిండి. దీంతో దేశ అభివృద్ధిపథంలో కీలకపాత్ర పోషించారు. 2005లో ప్రణబ్ రక్షణమంత్రిగా ఉన్నపుడే భారత్– అమెరికా రక్షణ సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. సహ చట్టం, జాతీయ ఆహారభద్రతా చట్టం, ఆధార్, మెట్రో రైలు ప్రాజెక్టులు లాంటి మన్మోహన్ సర్కారు నిర్ణయాల్లో ఆయనది ముఖ్యభూమిక. రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన ఏడాది తర్వాత జూన్, 2018లో నాగ్‌పూర్‌లోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కేంద్ర కార్యాలయాన్ని సందర్శించి సంచలనం సృష్టించారు. 2019లో బీజేపీ ప్రభుత్వం ప్రణబ్‌ముఖర్జీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ను ప్రకటించింది. ప్రధాని కాలేకపోయారు 1986లో సొంతంగా రాష్ట్రీయ సమాజ్‌వాదీ కాంగ్రెస్ అనే ఒక రాజకీయ పార్టీని ప్రణబ్ స్థాపించారు. 1987లో జరిగిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రణబ్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. రాజీవ్‌గాంధీతో సయోధ్య అనంతరం 1989లో ఆ పార్టీని ఆయన కాంగ్రెస్‌లో విలీనం చేశారు. 1991లో రాజీవ్ హత్య తరువాత కేంద్ర రాజకీయాల్లో మళ్లీ ప్రణబ్ క్రియాశీలకం అయ్యారు. ప్రధాని పీవీ నరసింహారావు ఆయనను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఆ తరువాత కీలకమైన విదేశాంగ శాఖ అప్పగించారు. సోనియా రాజకీయాల్లోకి రావడానికి ప్రణబ్ వ్యూహమే కారణమని భావిస్తారు. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను సోనియా స్వీకరించిన తరువాత, ప్రణబ్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. 2004లో ప్రధాని పదవిని సోనియా నిరాకరించిన సమయంలో ప్రధానిగా అనుభవజ్ఞుడైన ప్రణబ్ పేరే ప్రముఖంగా వినిపించింది. కానీ అనూహ్యంగా మన్మోహన్ ప్రధాని అయ్యారు. మన్మోహన్ కేబినెట్లోనూ ప్రణబ్ కీలకంగా ఉన్నారు. 2007లోనే ప్రణబ్‌ను రాష్ట్రపతిని చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. కానీ కేబినెట్లో ఆయన సేవలు అవసరమని భావించి, ఆ ఆలోచనను విరమించుకున్నారు. 2012లో రాష్ట్రపతి పదవిని స్వీకరించే వరకు కాంగ్రెస్‌తోనే అనుబంధం కొనసాగింది. ఏకంగా 23 ఏళ్ల పాటు సీడబ్ల్యూసీలో ఉన్నారు. మూడోసారి... కలిసొచ్చింది ఐదుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసినా... ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టాలనే బలమైన కోరిక మాత్రం ప్రణబ్ దాకు చాలాకాలం సాకారం కాలేదు. 1977లో మాల్దా నుంచి, 1980లో బోల్పూర్ నుంచి లోక్‌సభకు పోటీచేసిన ప్రణబ్‌ముఖర్జీ ఓటమిపాలయ్యారు. తర్వాత 2004 దాకా ఆయన ప్రత్యక్ష ఎన్నికల జోలికి పోలేదు. మూడు కారణాలతో తాను మళ్లీ ఎన్నికల గోదాలోకి దిగానని దాదా తన ‘ది కొయలిషన్ ఇయర్స్’పుస్తకంలో రాసుకున్నారు. ‘రాజ్యసభ సభ్యుడు మంత్రి కాగానే సాధ్యమైనంత తొందరగా లోక్‌సభకు ఎన్నిక కావడం మంచిదనేది నెహ్రూ విధానం. ఇదెప్పుడూ నా దృష్టిలో ఉండేది. రెండోది... 1984 తర్వాత ప్రతి ఎన్నికల్లో జాతీయ ప్రచార కమిటీ సారథిగా బాధ్యతలు నిర్వర్తించాను. ప్రచార కమిటీకి చైర్మన్‌గా ఉంటూ ప్రజాతీర్పును ఎదుర్కొనకపోతే ఎట్లా? అనేది నా మదిని తొలుస్తుండేది. మూడోది... నేను పోటీచేయాల్సిందేనని బెంగాల్ కాంగ్రెస్ శ్రేణుల నుంచి గట్టి డిమాండ్ వచ్చింది. అందుకే 2004లో ముర్షిదాబాద్ నుంచి బరిలోకి దిగా’అని చెప్పుకొచ్చారు. రెండుసార్లు ఎంపీగా చేసిన అబుల్ హస్నత్ ఖాన్ (సీపీఎం) ఆయన ప్రత్యర్థి. స్థానిక బీడీ కార్మికుల్లో బాగా పట్టున్న నేత. గెలుస్తానని స్వయంగా తనకే నమ్మకం లేనప్పటికీ... ప్రణబ్‌ను ముచ్చటగా మూడోసారి అదృష్టం వరించింది. దాదాపు 36 వేల మెజారిటీతో ఆయన గెలుపొందారు. చెప్పుకోదగిన విషయం ఏమిటంటే... పదవీకాలం ముగియగానే మళ్లీ రాజ్యసభకు పంపిస్తానని సోనియాగాంధీ అప్పటికే ఆయనకు హామీ ఇచ్చారు. పైగా ఓట్ల లెక్కింపు కోసం ప్రణబ్ ముర్షిదాబాద్‌కు వెళుతున్నపుడు... ఓటమి ఖాయమయ్యే దాకా వేచి ఉండొద్దు. సాధ్యమైనంత త్వరగా ఢిల్లీ వచ్చేయమని సోనియా చెప్పారట. నాలుగో పుస్తకం... రాష్ట్రపతిగా తన ప్రయాణాన్ని ప్రణబ్ ముఖర్జీ చాలా విపులంగా అక్షరబద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబరు 11వ తేదీన ఆయన జయంతిని పురస్కరించుకొని ఈ పుస్తకం... ‘ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్’ను విడుదల చేస్తామని ప్రచురణ సంస్థ రూపా పబ్లికేషన్స్ సోమవారం వెల్లడించింది. ఇది ప్రణబ్ రాసిన నాలుగో పుస్తకం. ఇంతకుముందు ఆయన... ‘ది డ్రమటిక్ డికేడ్ (2014), ది టర్బులెంట్ ఇయర్స్ (2016), ది కొయలిషన్ ఇయర్స్ (2017)లను రాశారు. రాష్ట్రపతి భవన్ పనితీరుపై సమగ్ర అవగాహన కల్పించడమే కాకుండా, అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన, నోట్లరద్దు... వంటి అంశాల్లో అసలేం జరిగిందో తాజా పుస్తకం వివరిస్తుందని రూపా పబ్లికేషన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ‘సర్జికల్ స్ట్రయిక్స్, ప్రధాని నరేంద్ర మోదీతో, ఎన్డీయే ప్రభుత్వంతో ప్రణబ్ సంబంధాలపై కూడా ఇందులో వివరించారని తెలిపింది. శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల పనితీరుపై కూడా ఆయన తన అభిప్రాయాలను ఇందులో వెల్లడించారు. 2019లో రెండోసారి ఎన్నికల్లో గెలిచాక ప్రధాని మోదీకి మిఠాయి తినిపిస్తున్న ప్రణబ్‌ముఖర్జీ రాష్ట్రపతి కోవింద్ నుంచి భారతరత్న పురస్కారాన్ని స్వీకరిస్తున్న ప్రణబ్ దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీతో ప్రణబ్ -
కలియుగ కర్ణ
ప్రముఖ కన్నడ నటుడు అంబరీష్ (66) శనివారం రాత్రి గుండె పోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. మాండ్య జిల్లాలో దొడ్డరాసినకెరెలో హుచ్చేగౌడ, పద్మమ్మ దంపతులకు 1952 మే 29న జన్మించారు అంబరీష్. ఏడుగురిలో ఆరో సంతానం ఆయన. అసలు పేరు మలవల్లి హుచ్చేగౌడ అమర్నాథ్. అంబరీష్ పేరుతో 1972లో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కన్నడనాట అభిమానులు అంబరీష్‌ను ‘రెబల్ స్టార్, మాండ్యాడ గండు (మ్యాన్ ఆఫ్ మాండ్య)’ అని అభిమానంగా పిలుచుకుంటుంటారు. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో సుమారు 230 సినిమాలకుపైగా నటించారు అంబరీష్. అంబరీష్‌పై ‘దేనికీ పనికి రాడు’ అనే ప్రగాఢమైన నమ్మకం ఉండేదట వాళ్ల ఇంట్లో. ఆయన టీనేజ్‌కి వచ్చే సమయానికి అన్నయ్యలు, అక్కలందరూ ఇంజినీరింగ్, డాక్టర్లుగా స్థిరపడ్డారు. అప్పటికి అంబరీష్ ఖాళీగా ఉండేవారు. ‘నాగరాహువు’ సినిమా కోసం దర్శకుడు పుట్టన్న కనగళ్ కొత్త వాళ్ల కోసం వెతుకుతున్నారు. ఆల్రెడీ హీరోగా విష్ణువర్థన్‌ను ఎంపిక చేసుకున్నారు. విలన్ కావాలి. అంబరీష్ ఇష్టానికి వ్యతిరేకంగా స్క్రీన్ టెస్ట్ కోసం దర్శక–నిర్మాతలకు తన పేరుని సూచించారు ఆయన మిత్రులు. చూడటానికి బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హాలా ఉండటం, స్క్రీన్ టెస్ట్‌లో ఒకటే టేక్‌లో చేతిలో సిగరెట్‌ను నోట్లో వేసుకోవడంతో పుట్టన్న కనగళ్ ఇంప్రెస్ అయిపోయారు. అమర్నాథ్ని అంబరీష్‌గా కన్నడ సిల్వర్ స్క్రీన్కు పరిచయం చేశారు. సినిమా బ్లాక్బాస్టర్. అలా అనుకోకుండా ఇండస్ట్రీకు పరిచయం అయ్యారాయన. కన్నడ పరిశ్రమకు విష్ణువర్థన్, అంబరీష్ అనే ఇద్దరు స్టార్స్‌ను అందించిన సినిమా అది. ఆ సినిమాలాగే వీళ్ల ఫ్రెండ్షిప్ సూపర్ హిట్. ‘నాగరాహువు’ తర్వాత వచ్చిన సినిమాలను వచ్చినట్టు వరుసగా ఒప్పేసుకున్నారు అంబరీష్. సహాయ నటుడిగా, విలన్‌గా సినిమాలు చేస్తూ పోతున్నారు. ‘అంత’లో పోషించిన పవర్ఫుల్ పోలీస్ పాత్ర ఆయన కెరీర్‌కు బ్రేక్ అనుకోవచ్చు. ‘రెబల్’ అనే లేబుల్ అంబరీష్ పేరు ముందు ఫిక్స్ అవ్వడానికి పునాదిగా మారిన సినిమా అది అని అంటుంటారు. ఆ తర్వాత ఎక్కువశాతం సినిమాల్లో రెబల్ పాత్రలే ఆయనకు రావడం, దర్శక–రచయితలు కూడా అవే రాయడంతో ‘రెబల్‌స్టార్ అంబరీష్’గా మారిపోయారు. ‘చక్రవ్యూహ, నాగరాహువు, రంగనాయకీ, మసండ హూవు, గండు బేరుండ’ వంటి పలు ఫేమస్ సినిమాలు ఆయన ఫిల్మోగ్రఫీలో ఉన్నాయి. చిరంజీవి ‘శ్రీమంజునాథ’ సినిమాలో మహరాజు పాత్రలో అంబరీష్ కనిపించారు. ఆ చిత్రం తెలుగు– కన్నడ భాషల్లో తెరకెక్కింది. స్టార్ హీరోలుగా కొనసాగుతున్నప్పటికీ విష్ణువర్థన్, అంబరీష్‌ల స్నేహానికి పోటీ, అహం అనే సమస్య ఎప్పుడూ అడ్డురాలేదట. అంబరీష్, విష్ణువర్థన్ ఇద్దరూ కలసి ‘స్నేహితర సవాల్, స్నేహ సేదు, మహా ప్రచండరు, అవల హెజ్జే, దిగ్గరాజు’ వంటి సినిమాల్లో కనిపించారు. అంబరీష్, సుమలత హీరో హీరోయిన్లుగా ‘ఆహుతి, అవతార పురుషా, శ్రీమంజునాథ, కళ్లరాలై హూవగీ’ తదితర సినిమాల్లో నటించారు. వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరూ 1991లో వివాహం చేసుకున్నారు. వీరికి అభిషేక్ అనే కుమారుడు ఉన్నారు. అంబరీష్ బోల్డ్, రెబల్ యాటిట్యూడ్‌నే ఇష్టపడ్డానని సుమలత పలు సందర్భాల్లో పేర్కొన్నారు. అంబరీష్ ఎంత పెద్ద నటుడైనా బయట నటించడం తెలియదంటారు ఆయన సన్నిహితులు. సాధారణంగా స్టార్ సెలబ్రిటీలంతా బయట క్లీన్ ఇమేజ్‌తో ఉండాలనుకుంటారు. కానీ, అంబరీష్ తన ప్రవర్తనని, స్వభావాన్ని, అలవాట్లని బయట చెప్పడానికి సంకోచించలేదు. షుగర్ కోటింగ్ ఇవ్వాలనుకోలేదు. తన అలవాట్లను బహిరంగంగానే ఒప్పుకునేవారు. అంబరీష్ చాలా సెంటిమెంటల్ మనిషి. సొంత ఊరిని, వారసత్వంగా లభించినవి వదులుకోవడానికి ఇష్టపడేవారు కాదట. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఇంటిని తన చెల్లికి ఇచ్చేశారు. కొన్ని కారణాలతో ఆమె ఆ ఇంటిని అమ్మేయడంతో బాధపడ్డానని ఆయన గతంలో పేర్కొన్నారు. అంబరీష్ మంచి భోజన ప్రియుడు. ‘ఒకసారి ఏకంగా 45 దోశెల వరకూ లాగించేశా’ అని నవ్వుతూ చెప్పుకొచ్చారు కూడా. తన సినిమాల్లో స్టంట్స్, డ్యాన్స్‌లు చేయడానికి ఎక్కువగా ఇష్టపడేవారు కాదు అంబరీష్. డ్యాన్స్ ఉందంటే క్రేన్ తెచ్చుకొని లాంగ్ షాట్లో కెమెరా పెట్టుకోండి అని దర్శక–నిర్మాతలకు సూచించేవారట. ‘దేనికీ పనికి రాడనుకున్న అమర్నాథ్ను కన్నడ ప్రజలంతా ప్రేమించే అంబరీష్‌గా మలిచారు’ అంటూ తన మొదటి చిత్ర దర్శకుడు పుట్టన్న కనగళ్ పేరును ఎప్పుడూ గౌరవంగా ప్రస్తావిస్తూనే ఉంటారు అంబరీష్. కన్నడ ఇండస్ట్రీలో అత్యధిక చిత్రాల్లో›నటించిన రికార్డ్ కూడా ఆయనకే సొంతం. రాజ్‌కుమార్ 206 సినిమాల్లో యాక్ట్ చేయగా, విష్ణువర్థన్ 230 సినిమాల్లో కనిపించారు. రజనీకాంత్, చిరంజీవి, మోహన్‌బాబు, మమ్ముట్టి.. అంబరీష్‌కు ఆప్త మిత్రులు. ఆయన లేరని తెలుసుకున్న వీరు కన్నీటి పర్యంతమయ్యారు. రాజకీయాల్లోనూ... 1994లో కాంగ్రెస్ పార్టీలో చేరారు అంబరీష్. ఆ పార్టీ టికెట్ రాకపోవడంతో జనతా దళ్ పార్టీలో జాయిన్ అయ్యారు. మాండ్య నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో సమాచార, ప్రసారశాఖ మంత్రిగా సేవలందించారు అంబరీష్. కన్నడ ఇండస్ట్రీ మిగతా వాటితో పోటీగా నిలవాలని కలలు కంటుంటారు అంబరీష్. ‘‘మిగతా ఇండస్ట్రీలతో పోలిస్తే కన్నడ ఇండస్ట్రీ చిన్నదే. భారీ బడ్జెట్ సినిమాల్లో పాటలకు ఖర్చు పెట్టేంత మొత్తంతో మా కన్నడ సినిమా మొత్తం పూర్తి చేయొచ్చు. కానీ, మిగతా ఇండస్ట్రీలతో ఎప్పుడూ పోటీపడుతూనే ఉంటాం’’ అంటూ ఇటీవల జరిగిన కన్నడ చిత్రం ‘కేజీయఫ్’ ఫంక్షన్లో చివరిగా మాట్లాడారు అంబరీష్. ఆసరా కోసం వచ్చే ఏ చేతినీ కూడా అంబరీష్ వట్టి చేతులతో పంపేవారు కాదనీ, ధైర్యంతో నింపేవారని అంటుంటారు. అవును.. దాదాపు ఐదు దశాబ్దాల కెరీర్లో అంబరీష్ సంపాదించుకుంది ఆస్తుల్ని కాదు.. ఆప్తుల్ని. ఇప్పుడు ఆ అభిమానులను, ఆప్తులను భౌతికంగా విడిచి వెళ్లిపోయి, జ్ఞాపకంగా మిగిలిపోయారు. ట్రబుల్షూటర్ అంబరీష్ కన్నడ ఇండస్ట్రీ ‘ట్రబుల్ షూటర్’ అనే పేరుని గడించారు. ఇండస్ట్రీలో ఎటువంటి మనస్పర్థలు ఏర్పడినా, చిన్న చిన్న గొడవలైనా కూడా వాళ్ల మధ్య సఖ్యత కుదురుస్తారట అంబరీష్. ఇండస్ట్రీలో చాలా మంది గౌరవంగా అంబరీష్‌ను ‘అప్పాజీ’ (నాన్న) అని పిలుస్తారట. కన్నడలో రాజ్‌కుమార్, విష్ణువర్థన్ తర్వాత అంతగా పాపులర్ అయిన నటుడు అంబరీషే కావడం విశేషం. 1994లో ‘మాండ్య గండు’ అనే చిత్రంలో యాక్ట్ చేశారు అంబరీష్. ఆ సినిమా తర్వాత నుంచి అదే పేరుతో ఫేమస్ అయ్యారు ఆయన. రెబల్ స్టార్‌తో పాటుగా కళియుగ కర్ణ అని కూడా అంబరీష్‌ని పిలుస్తుంది కన్నడ పరిశ్రమ. -
ట్రబుల్ షూటర్ ఏమయ్యాడు?
గ్రేటర్ ఎన్నికలకు దూరంగా మంత్రి హరీశ్‌రావు * ప్రాజెక్టులు, నిధులు అంటూ ఢిల్లీ, ముంబై పర్యటనలు * ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా ముందుండి నడిపించిన నేత * ‘గ్రేటర్’లో కనిపించకపోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ * జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అన్నీ తానై నడిపిస్తున్న కేటీఆర్ * హరీశ్ ఇక మెదక్ జిల్లాకే పరిమితం! * ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించడంపై అసంతృప్తి * అయినా పార్టీ అధినేత నిర్ణయమే శిరోధార్యమని తన వర్గీయులతో వ్యాఖ్య సాక్షి ప్రత్యేక ప్రతినిధి: టీఆర్ఎస్కు ఆయన ట్రబుల్ షూటర్. ఇబ్బందికర పరిస్థితులు ఎప్పుడు తలెత్తినా వాటి నుంచి బయటపడేసే బాధ్యతలను పార్టీ అధినేత కె.చంద్రశేఖరరావు ఆయనకే అప్పగించేవారు. ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా ఆయనే ముందుండి కేడర్‌ను నడిపించారు. కానీ ఇప్పుడు టీఆర్ఎస్కు అత్యంత కీలకమైన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆయన కనిపించడం లేదు! ఈ ఎన్నికల్లో ఆ నాయకుడి పాత్ర ఏమిటో తెలియక ఆయన వెన్నంటి ఉండే నేతలు అయోమయంలో పడ్డారు. ఆయనెవరో కాదు.. రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు టి.హరీశ్‌రావు! టీఆర్ఎస్ను స్థాపించిన నాటి నుంచి పార్టీ అధినేతను వెన్నంటి ఉండటమే కాకుండా ఆయనకు అత్యంత నమ్మకస్తుడిగా పార్టీ వర్గాల్లో ముద్రపడిన హరీశ్‌రావు.. కేసీఆర్ పోటీ చేసిన అన్ని ఎన్నికలకు సారథ్యం వహించారు. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆయన కనిపించకపోవడం టీఆర్ఎస్లోనే కాదు రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీల్లో చర్చకు తెరదీసింది. ఓవైపు టీఆర్ఎస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడుతుంటే.. మరోవైపు హరీశ్‌రావు నీటిపారుదల ప్రాజెక్టులకు అనుమతులు, నిధుల మంజూరు అంటూ మహారాష్ట్ర, ఢిల్లీ పర్యటనలు చేస్తుండటంతో సహజంగానే అందరి దృష్టి ఆయనపై పడింది. తన సొంత జిల్లా మెదక్‌లో ఉన్న మూడు జీహెచ్ఎంసీ డివిజన్లలో అభ్యర్థుల ఎంపిక సహా ఏ విషయంలోనూ హరీశ్‌రావు జోక్యం చేసుకోవడం లేదు. దీని వెనుక ఏం జరిగి ఉంటుందని ఆరా తీయగా.. ఇటీవల జరిగిన పార్టీ శాసనసభాపక్షం సమావేశంలోనే ఇందుకు బీజం పడినట్లు తెలిసింది. వ్యూహం ప్రకారమే పార్టీ అధ్యక్షులకు ఆహ్వానం సాధారణంగా పార్టీ శాసనసభా పక్షం సమావేశాలకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మాత్రమే హాజరవుతారు. కానీ గ్రేటర్ ఎన్నికల కోసం ఇటీవల జరిగిన సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షులు, జిల్లా పరిషత్ అధ్యక్షులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షులు, నగర పాలక సంస్థ మేయర్లను కూడా ఆహ్వానించారు. దీంతో ఏదో ప్రాధాన్యత ఉందని సమావేశానికి వచ్చిన వారంతా భావించారు. సమావేశం మొదలయ్యాక ప్రభుత్వ ప్రాథమ్యాలు, సంక్షేమ పథకాలు, గ్రేటర్ హైదరాబాద్‌ను విశ్వనగరంగా తయారు చేసేందుకు తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి వివరించారు. సమావేశం ముగుస్తుందనగా అనూహ్యంగా.. ‘‘హరీశ్ మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ ఉప ఎన్నిక వ్యవహారాలు చూస్తారు. ఆయనకు అక్కడ చాలా పనుంది. గ్రేటర్లో మంత్రి కేటీ రామారావు, జగదీశ్‌రెడ్డి చూస్తారు. వాళ్లు కావాలంటే హరీశ్ సహకరిస్తారు..’’ అని ప్రకటించారు. దీంతో గ్రేటర్ ఎన్నికల నుంచి హరీశ్‌ను పూర్తిగా తప్పించినట్టేనని సమావేశంలో ఉన్న వారందరికీ అప్పుడే ఆర్థమైంది. అందుకు తగ్గట్టే హరీశ్‌రావు గ్రేటర్ ఎన్నికల ఛాయల్లోకి రాలేదు. నామినేషన్ల ఘట్టం ప్రారంభమైన రోజునే ఆయన మేడిగడ్డ, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుల నిర్మాణంపై మహారాష్ట్ర అధికారులతో చర్చించేందుకు ముంబై వెళ్లారు. అంతేకాదు అక్కడ్నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లారు. నన్ను అడగొద్దు.. గ్రేటర్ ఎన్నికల్లో ఫలానా వారికి టిక్కెట్ ఇప్పించాలంటూ ఇటీవలి దాకా హరీశ్‌రావు వద్దకు వెళ్లిన పార్టీ నేతలు ఇప్పుడు మంత్రి కేటీఆర్ దగ్గరకు వెళ్తున్నారు. కేటీఆర్ సచివాలయంలో ఉన్నా, క్యాంప్ అఫీసులో ఉన్నా జాతరే. వందలాది మంది ఆయన దర్శనం కోసం పడిగాపులు కాస్తున్నారు. ఎవరైనా తెలిసో తెలియకో గ్రేటర్ ఎన్నికల్లో టిక్కెట్ ఇప్పించాలని హరీశ్ వద్దకు వెళ్తే.. తనను అడగొద్దని ఆయన నిర్మొహమాటంగా చెబుతున్నారు. మెదక్ జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని మూడు డివిజన్ల విషయంలోనూ హరీశ్ జోక్యం చేసుకోవడం లేదని తెలిసింది. దీంతో అక్కడ్నుంచి కార్పొరేటర్ టిక్కెట్ ఆశిస్తున్న ఆశావహులు ఏర్పాటు చేస్తున్న హోర్డింగ్‌లు, ఫ్లెక్సీల్లో హరీశ్ ఫోటో కూడా పెట్టడం లేదు. ‘రాజకీయాల్లో ఇది సహజం. మనతో అవసరం ఉందనుకుంటేనే కేడర్ మనకు గౌరవం ఇస్తారు. లేదంటే ఇంతే.. రాజకీయాల్లో ఇప్పటిదాకా ఎంత మంది ఎత్తుపల్లాలు చూడలేదు, ఇదీ అంతే..’ అని సీనియర్ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని బట్టి నడుచుకుంటానని, తనకు సంబంధం లేని విషయాల్లోకి లాగొద్దని హరీశ్ చెబుతుండటంతో సచివాలయంలో ఆయన కార్యాలయానికి వచ్చేవారి సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది. గ్రేటర్ ఎన్నికల నుంచి తనను అకస్మాత్తుగా తప్పించడంపై అసంత ృప్తిగా ఉన్నా.. దీన్ని సీరియస్‌గా తీసుకోవద్దని హరీశ్ తన వర్గీయులకు చెప్పారు. పార్టీ అధినేత నిర్ణయమే శిరోధార్యమని ఆయన వారికి చెప్పినట్లు సమాచారం. వారసుడు కేటీఆర్! ముఖ్యమంత్రి కేసీఆర్ తన వారసుడిగా కేటీఆర్‌ను దాదాపు నిర్ణయించినట్టేనని టీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే చెపుతున్నారు. అందులో భాగంగానే గ్రేటర్ ఎన్నికల బాధ్యతను కేటీఆర్‌కు అప్పగించారని మెజారిటీ మంత్రులు, పార్టీ సీనియర్లు అంటున్నారు. సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎంను కలిసి తమ సమస్యలు విన్నవించినా, నియోజకవర్గంలో పరిస్థితి బాగా లేదని చెప్పినా, ఫలానా జిల్లాలో పార్టీ నేతల మధ్య విభేదాలు ఎక్కువయ్యాయని దృష్టికి తెచ్చినా రాము(కేటీఆర్)తో చర్చించాలని చెపుతున్నారట. అదే సమయంలో మెదక్ జిల్లాలో మాత్రం మంత్రి హరీశ్ నిర్ణయాలకు సీఎం పెద్దపీట వేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
ముగ్గురూ.. ముగ్గురే
మెదక్‌లో త్రిముఖ పోటీ ►జగ్గారెడ్డి రాకతో వేడెక్కిన రాజకీయం ►‘ట్రబుల్ షూటర్’పైన మరింత భారం ►నర్సాపూర్పైనే సునీతమ్మ ఆశలు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మెదక్ లోక్‌సభ ఉపపోరు ఊపందుకుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కీలకమైన అభ్యర్థులనే బరిలోకి దింపటంతో త్రిముఖ పోటీ ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.‘ట్రబుల్ షూటర్’ మంత్రి హరీష్‌రావు ఎత్తులు.. గ్రామీణ ప్రాంతంలో బలమైన క్యాడర్‌తో.. టీఆర్ఎస్ పార్టీ పతిష్టమైన స్థితిలో కనిపించినప్పటికీ తీవ్ర పోటీ మాత్రం తప్పదని వారు లెక్కలు కడుతున్నారు. బీజేపీ అభ్యర్థిగా ఫైర్‌బ్రాండ్ జగ్గారెడ్డి బరిలోకి దిగటం, తెలుగుదేశం శ్రేణులు బీజేపీతో కలిసి రావటం, ఇక నర్సాపూర్ నియోజకవర్గంలో పట్టున్న మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి బరిలో నిలబడటంతో మూడు స్తంబాలాట మొదలైంది. మెదక్ పార్ల మెంటు నియోజకవర్గం కింద మెదక్, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, నర్సాపూర్, పటాన్చెరు, సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.ఈ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సిద్దిపేట, దుబ్బాక, నియోజకవర్గాల్లో టీఆర్ఎస్కు మంచి పట్టు ఉండగా, నర్సాపూర్ నియోజకవర్గం సునీతారెడ్డికి, సంగారెడ్డి నియోజకవర్గం జగ్గారెడ్డికి అనుకూలంగా ఉంది. పటాన్చెరు నియోజకవర్గంలో మూడు పార్టీలకు చెందిన ఓటర్లు ఉన్నారు. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజవర్గాల్లో భారీ మెజార్టీ తెచ్చుకోవాలని టీఆర్ఎస్ ఎత్తులు వేస్తుండగా... సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ మెజార్టీని నిరోధించగలిగితే గెలుపు బాట పట్టవచ్చని బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు యోచిస్తున్నారు. ముఖ్యులంతా ఇన్చార్జులే... రాష్ట్రంలో టీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాల 100 రోజుల పాలనకు ఈ ఉప ఎన్నికలు రెఫరెండంగా మారాయి. ఇక కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకు ఈ ఎన్నికలు జీవగంజి లాంటివి. ఈ నేపథ్యంలో మూడు పార్టీలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నాయి. గులాబీ దళపతి కేసీఆర్‌కు గత ఎన్నికల్లో 3.97 లక్షల ఓట్ల మెజార్టీ వచ్చింది. కేసీఆర్‌కు 6,57,497 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రవణ్‌కుమార్‌రెడ్డికి 2,60,463 ఓట్లు వచ్చాయి. ఈ సారి కనీసం 4 లక్షల పైచిలుకు ఓట్ల మెజార్టీ తీసుకరావాలని కేసీఆర్ జిల్లా నేతలకు ఆదేశాలు జారీ చే శారు. పార్లమెంటు నియోజవర్గంలో ప్రతి మండలానికి ఒక ఎమ్మెల్యేను, ఎమ్మెల్సీలను ఇన్చార్జిగా నియమించారు. పూర్తి పర్యవేక్షణ బాధ్యతలను హరీష్‌రావుకు అప్పగించారు. ఇక కాంగ్రెస్ , బీజేపీ పార్టీలు కూడా మండలానికో ఎమ్మెల్యేను ఇన్చార్జులుగా నియమించింది. గులాబీ దళపతి మీదనే ఆశలు.. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గులాబీ దళపతి కేసీఆర్‌నే నమ్ముకోగా, కాంగ్రెస్ పార్టీ రాహుల్‌గాంధీ, సోనియాగాంధీలతో పాటు దిగ్విజయ్‌సింగ్, తదితరులను రంగంలోకి దించేందుకు పథకం రచిస్తోంది. రాష్ర్ట నాయకులు పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు పర్యవేక్షిస్తారు. బీజేపీ కూడా భారీ ప్రణాళికే వేస్తోంది. మోడీని ప్రచారంలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. ఆయనతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులతో పాటు సినీనటుడు పవన్ కల్యాణ్‌ను కూడా ప్రచార రంగంలోకి దించడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. -
ఎత్తు వేస్తే.. చిత్తే
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఆటుపోట్లు ఎదుర్కొంటున్న పార్టీకి అండగా నిలిచాడు..ఆత్మవిశ్వాసం సడలుతున్న కేడర్‌కు అన్నీ తానై వ్యవహరించాడు. అధికార పార్టీ ‘ట్రబుల్ షూటర్’ అయ్యాడు. స్థానిక సంస్థల సమరం మొదలు..సార్వత్రిక ఎన్నికలు..నిన్నటి జిల్లా పరిషత్తు చైర్పర్సన్ ఎన్నిక వరకూ సింగిల్ హ్యాండ్‌తో ‘గోల్’కొట్టి, కాంగ్రెస్ కంచుకోటను బద్ధలు కొట్టాడు. మెతుకుసీమలో గులాబీ జెండా ఎగుర వేశాడు. ఆయనే భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు. ప్రస్తుతం అభివృద్ధికోసం అదే స్పీడ్‌తో పనులు చేస్తున్నారు. కలిసివచ్చే ఏ అంశాన్ని వదలకుండా జిల్లా సమగ్రాభివృద్ధికోసం తనవంతు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం సిద్దిపేటలో మొక్కజొన్న పరిశోధనా కేంద్రానికి శంకుస్థాపన చేయిస్తున్నారు. 2014 ఎన్నికల్లో మహా మహా ఉద్దండులను మట్టి కరిపించి,,, మహిపాల్‌రెడ్డి, మదన్‌రెడ్డి, చింతా ప్రభాకర్ లాంటి వాళ్లను ఎమ్మెల్యేలుగా నిలబెట్టిన ఘనత హరీష్‌రావుది. ఒంటి చేత్తో జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో 8 చోట్ల విజయఢంకా మోగించారు. స్థానిక ఎన్నికల్లో పార్టీకి తగినంత మెజార్టీ లేకున్నా, తన రాజకీయ చతురతతో జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా ఎగురవేయడం.. మున్సిపల్, మండల పరిషత్ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలకు కోలుకోని ఝలక్ ఇవ్వడం, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 30 మండల పరిషత్ అధ్యక్ష పదవులను పట్టుకురావడంతో జిల్లా ప్రజలు ఆయన్ను ఓవరాల్ చాంపియన్ అంటున్నారు. స్థానికంలో తనదైన ముద్ర మండల పరిషత్, మున్సిపల్, జెడ్పీలపై గులాబీ జెండా ఎగురవేసేందుకు హరీష్‌రావు జిల్లాలోనే మకాం వేసి వ్యూహరచన చేశారు. సదాశివపేట, జహీరాబాద్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీకి చైర్మన్ పదవికి కావలసినంత మెజార్టీ ఉంది. రాజకీయ ఉద్దండులు తూర్పు జయప్రకాష్‌రెడ్డి, గీతారెడ్డి ఈ రెండు మున్సిపాల్టీల నాయకత్వాన్ని నడిపిస్తున్నారు. ఎన్నిక జరిగే వేళ ఇక్కడ అద్భుతమే జరిగింది. హరీష్ వ్యూహాత్మక ఎత్తుగడతో ఇక్కడ ప్రత్యర్థి పార్టీల కౌన్సిలర్లు టీఆర్ఎస్ వైపు తిరిగారు. రెండు మున్సిపాల్టీల చైర్మన్ స్థానాలు టీఆర్ఎస్కే దక్కాయి. ఇక మెదక్ మున్సిపాలిటీ, గజ్వేల్ నగర పంచాయతీలను సైతం అధికార పార్టీనే కైవసం చేసుకుంది. మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లోనూ చాలాచోట్ల టీఆర్ఎస్కు బలం లేదు. న్యాల్కల్ మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలుంటే 8 స్థానాలు కాంగ్రెస్,7 స్థానాలు టీడీపీ గెలుచుకుంది. టీఆర్ఎస్కు ఒక్క స్థానం రాలేదు. దాదాపు రెండు నెలల పాటు ఈ రెండు పార్టీలు తమ ఎంపీటీసీలను అజ్ఞాతంలోకి తరలించి, క్యాంపులు పెట్టాయి. తీరా ఎన్నిక వరకు వచ్చే వరకు టీడీపీ నుంచి ఏడుగురు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు టీఆర్ఎస్ జెండా కిందకు వచ్చారు. ఎంపీపీ పదవిని సొంతం చేసుకున్నారు. ఇలా 30 మండల పరిషత్ అధ్యక్ష పదవులను టీఆర్ఎస్ సాధించడం వెనుక హరీష్ మంత్రాంగం చాలానే ఉంది. 125 ఏళ్ల పార్టీ కూడా బోల్తా పడింది ఇక జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఎన్నిక హరీష్ రాజకీయ చతురతకు ఓ మచ్చుతునక. నేతలు ఇటు నుంచి అటు... అటు నుంచి ఇటు గోడ దూకడం సర్వసాధరాణమే కావచ్చు. కానీ 125 ఏళ్ల చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఓ యువనేత వ్యూహం ముందు మోకరిల్లింది. జెడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు 21, కాంగ్రెస్ 21, టీడీపీకి 4 స్థానాలు వచ్చాయి. జెడ్పీపీఠం కైవసం చేసుకోవాలని కాంగ్రెస్, టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ఎత్తుగడలు వేశాయి. కాంగ్రెస్ పార్టీ అయితే సీనియర్ నాయకులతో సమావేశమై.... విప్పు అస్త్రం ప్రయోగించి జెడ్పీటీసీలు టీఆర్ఎస్ వైపు వెళ్లకుండా కట్టడి చేయాలని నిర్ణయించింది. అయితే ఎన్నిక సమయానికి కాంగ్రెస్, టీడీపీల నుంచి నలుగురు చొప్పున 8 మంది టీఆర్ఎస్లో చేరారు. తీరా ఎన్నిక జరిగే వేళ ఇన్చార్జి కలెక్టర్ విధివిధానాలు చదువుతూ... ఒక్క టీఆర్ఎస్ మాత్రమే విప్ జారీ చేసిందని, మిగిలిన ఏ పార్టీ విప్ జారీ చేయలేదని ప్రకటించారు. ఎమ్మెల్యే గీతారెడ్డి కల్పించుకొని కాంగ్రెస్ కూడా విప్ పత్రాలు అందజేసిందని కలెక్టర్‌కు చెబుతుండగా, కాంగ్రెస్ పార్టీ విప్ అధికారాలు కట్టబెట్టిన టేక్మాల్ జెడ్పీటీసీ ముక్తార్ లేచి ‘విప్ పత్రాలు ఇచ్చాననుకున్న మేడం’ అని నసగ డంతో నోరెళ్లబెట్టడం అక్కడున్న కాంగ్రెస్ నేతల వంతైంది. కాంగ్రెస్ సెల్ఫ్‌గోల్ వ్యవహారాన్ని చూసిన సొంత పార్టీ, ప్రత్యర్థి పార్టీ నేతలు హరీష్‌రావా..మజాకా అనుకున్నారు.