అంబరీష్
ప్రముఖ కన్నడ నటుడు అంబరీష్ (66) శనివారం రాత్రి గుండె పోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. మాండ్య జిల్లాలో దొడ్డరాసినకెరెలో హుచ్చేగౌడ, పద్మమ్మ దంపతులకు 1952 మే 29న జన్మించారు అంబరీష్. ఏడుగురిలో ఆరో సంతానం ఆయన. అసలు పేరు మలవల్లి హుచ్చేగౌడ అమర్‌నాథ్. అంబరీష్ పేరుతో 1972లో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కన్నడనాట అభిమానులు అంబరీష్‌ను ‘రెబల్ స్టార్, మాండ్యాడ గండు (మ్యాన్ ఆఫ్ మాండ్య)’ అని అభిమానంగా పిలుచుకుంటుంటారు. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో సుమారు 230 సినిమాలకుపైగా నటించారు అంబరీష్.
అంబరీష్‌పై ‘దేనికీ పనికి రాడు’ అనే ప్రగాఢమైన నమ్మకం ఉండేదట వాళ్ల ఇంట్లో. ఆయన టీనేజ్‌కి వచ్చే సమయానికి అన్నయ్యలు, అక్కలందరూ ఇంజినీరింగ్, డాక్టర్లుగా స్థిరపడ్డారు. అప్పటికి అంబరీష్ ఖాళీగా ఉండేవారు. ‘నాగరాహువు’ సినిమా కోసం దర్శకుడు పుట్టన్న కనగళ్ కొత్త వాళ్ల కోసం వెతుకుతున్నారు. ఆల్రెడీ హీరోగా విష్ణువర్థన్‌ను ఎంపిక చేసుకున్నారు. విలన్ కావాలి. అంబరీష్ ఇష్టానికి వ్యతిరేకంగా స్క్రీన్ టెస్ట్ కోసం దర్శక–నిర్మాతలకు తన పేరుని సూచించారు ఆయన మిత్రులు.
చూడటానికి బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హాలా ఉండటం, స్క్రీన్ టెస్ట్‌లో ఒకటే టేక్‌లో చేతిలో సిగరెట్‌ను నోట్లో వేసుకోవడంతో పుట్టన్న కనగళ్ ఇంప్రెస్ అయిపోయారు. అమర్‌నాథ్‌ని అంబరీష్‌గా కన్నడ సిల్వర్ స్క్రీన్‌కు పరిచయం చేశారు. సినిమా బ్లాక్‌బాస్టర్. అలా అనుకోకుండా ఇండస్ట్రీకు పరిచయం అయ్యారాయన. కన్నడ పరిశ్రమకు విష్ణువర్థన్, అంబరీష్ అనే ఇద్దరు స్టార్స్‌ను అందించిన సినిమా అది. ఆ సినిమాలాగే వీళ్ల ఫ్రెండ్‌షిప్ సూపర్ హిట్.
‘నాగరాహువు’ తర్వాత వచ్చిన సినిమాలను వచ్చినట్టు వరుసగా ఒప్పేసుకున్నారు అంబరీష్. సహాయ నటుడిగా, విలన్‌గా సినిమాలు చేస్తూ పోతున్నారు. ‘అంత’లో పోషించిన పవర్‌ఫుల్ పోలీస్ పాత్ర ఆయన కెరీర్‌కు బ్రేక్ అనుకోవచ్చు. ‘రెబల్’ అనే లేబుల్ అంబరీష్ పేరు ముందు ఫిక్స్ అవ్వడానికి పునాదిగా మారిన సినిమా అది అని అంటుంటారు. ఆ తర్వాత ఎక్కువశాతం సినిమాల్లో రెబల్ పాత్రలే ఆయనకు రావడం, దర్శక–రచయితలు కూడా అవే రాయడంతో ‘రెబల్‌స్టార్ అంబరీష్’గా మారిపోయారు.
‘చక్రవ్యూహ, నాగరాహువు, రంగనాయకీ, మసండ హూవు, గండు బేరుండ’ వంటి పలు ఫేమస్ సినిమాలు ఆయన ఫిల్మోగ్రఫీలో ఉన్నాయి. చిరంజీవి ‘శ్రీమంజునాథ’ సినిమాలో మహరాజు పాత్రలో అంబరీష్ కనిపించారు. ఆ చిత్రం తెలుగు– కన్నడ భాషల్లో తెరకెక్కింది. స్టార్ హీరోలుగా కొనసాగుతున్నప్పటికీ విష్ణువర్థన్, అంబరీష్‌ల స్నేహానికి పోటీ, అహం అనే సమస్య ఎప్పుడూ అడ్డురాలేదట. అంబరీష్, విష్ణువర్థన్ ఇద్దరూ కలసి ‘స్నేహితర సవాల్, స్నేహ సేదు, మహా ప్రచండరు, అవల హెజ్జే, దిగ్గరాజు’ వంటి సినిమాల్లో కనిపించారు.
అంబరీష్, సుమలత హీరో హీరోయిన్లుగా ‘ఆహుతి, అవతార పురుషా, శ్రీమంజునాథ, కళ్లరాలై హూవగీ’ తదితర సినిమాల్లో నటించారు. వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరూ 1991లో వివాహం చేసుకున్నారు. వీరికి అభిషేక్ అనే కుమారుడు ఉన్నారు. అంబరీష్ బోల్డ్, రెబల్ యాటిట్యూడ్‌నే ఇష్టపడ్డానని సుమలత పలు సందర్భాల్లో పేర్కొన్నారు. అంబరీష్ ఎంత పెద్ద నటుడైనా బయట నటించడం తెలియదంటారు ఆయన సన్నిహితులు. సాధారణంగా స్టార్ సెలబ్రిటీలంతా బయట క్లీన్ ఇమేజ్‌తో ఉండాలనుకుంటారు.
కానీ, అంబరీష్ తన ప్రవర్తనని, స్వభావాన్ని, అలవాట్లని బయట చెప్పడానికి సంకోచించలేదు. షుగర్ కోటింగ్ ఇవ్వాలనుకోలేదు. తన అలవాట్లను బహిరంగంగానే ఒప్పుకునేవారు. అంబరీష్ చాలా సెంటిమెంటల్ మనిషి. సొంత ఊరిని, వారసత్వంగా లభించినవి వదులుకోవడానికి ఇష్టపడేవారు కాదట. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఇంటిని తన చెల్లికి ఇచ్చేశారు. కొన్ని కారణాలతో ఆమె ఆ ఇంటిని అమ్మేయడంతో బాధపడ్డానని ఆయన గతంలో పేర్కొన్నారు. అంబరీష్ మంచి భోజన ప్రియుడు. ‘ఒకసారి ఏకంగా 45 దోశెల వరకూ లాగించేశా’ అని నవ్వుతూ చెప్పుకొచ్చారు కూడా.
తన సినిమాల్లో స్టంట్స్, డ్యాన్స్‌లు చేయడానికి ఎక్కువగా ఇష్టపడేవారు కాదు అంబరీష్. డ్యాన్స్ ఉందంటే క్రేన్ తెచ్చుకొని లాంగ్ షాట్‌లో కెమెరా పెట్టుకోండి అని దర్శక–నిర్మాతలకు సూచించేవారట. ‘దేనికీ పనికి రాడనుకున్న అమర్‌నాథ్‌ను కన్నడ ప్రజలంతా ప్రేమించే అంబరీష్‌గా మలిచారు’ అంటూ తన మొదటి చిత్ర దర్శకుడు పుట్టన్న కనగళ్ పేరును ఎప్పుడూ గౌరవంగా ప్రస్తావిస్తూనే ఉంటారు అంబరీష్. కన్నడ ఇండస్ట్రీలో అత్యధిక చిత్రాల్లో›నటించిన రికార్డ్ కూడా ఆయనకే సొంతం. రాజ్‌కుమార్ 206 సినిమాల్లో యాక్ట్ చేయగా, విష్ణువర్థన్ 230 సినిమాల్లో కనిపించారు. రజనీకాంత్, చిరంజీవి, మోహన్‌బాబు, మమ్ముట్టి.. అంబరీష్‌కు ఆప్త మిత్రులు. ఆయన లేరని తెలుసుకున్న వీరు కన్నీటి పర్యంతమయ్యారు.
రాజకీయాల్లోనూ...
1994లో కాంగ్రెస్ పార్టీలో చేరారు అంబరీష్. ఆ పార్టీ టికెట్ రాకపోవడంతో జనతా దళ్ పార్టీలో జాయిన్ అయ్యారు. మాండ్య నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో సమాచార, ప్రసారశాఖ మంత్రిగా సేవలందించారు అంబరీష్.
కన్నడ ఇండస్ట్రీ మిగతా వాటితో పోటీగా నిలవాలని కలలు కంటుంటారు అంబరీష్. ‘‘మిగతా ఇండస్ట్రీలతో పోలిస్తే కన్నడ ఇండస్ట్రీ చిన్నదే. భారీ బడ్జెట్ సినిమాల్లో పాటలకు ఖర్చు పెట్టేంత మొత్తంతో మా కన్నడ సినిమా మొత్తం పూర్తి చేయొచ్చు. కానీ, మిగతా ఇండస్ట్రీలతో ఎప్పుడూ పోటీపడుతూనే ఉంటాం’’ అంటూ ఇటీవల జరిగిన కన్నడ చిత్రం ‘కేజీయఫ్’ ఫంక్షన్‌లో చివరిగా మాట్లాడారు అంబరీష్.
ఆసరా కోసం వచ్చే ఏ చేతినీ కూడా అంబరీష్ వట్టి చేతులతో పంపేవారు కాదనీ, ధైర్యంతో నింపేవారని అంటుంటారు. అవును.. దాదాపు ఐదు దశాబ్దాల కెరీర్‌లో అంబరీష్ సంపాదించుకుంది ఆస్తుల్ని కాదు.. ఆప్తుల్ని. ఇప్పుడు ఆ అభిమానులను, ఆప్తులను భౌతికంగా విడిచి వెళ్లిపోయి, జ్ఞాపకంగా మిగిలిపోయారు.
ట్రబుల్‌షూటర్
అంబరీష్ కన్నడ ఇండస్ట్రీ ‘ట్రబుల్ షూటర్’ అనే పేరుని గడించారు. ఇండస్ట్రీలో ఎటువంటి మనస్పర్థలు ఏర్పడినా, చిన్న చిన్న గొడవలైనా కూడా వాళ్ల మధ్య సఖ్యత కుదురుస్తారట అంబరీష్. ఇండస్ట్రీలో చాలా మంది గౌరవంగా అంబరీష్‌ను ‘అప్పాజీ’ (నాన్న) అని పిలుస్తారట. కన్నడలో రాజ్‌కుమార్, విష్ణువర్థన్ తర్వాత అంతగా పాపులర్ అయిన నటుడు అంబరీషే కావడం విశేషం.
1994లో ‘మాండ్య గండు’ అనే చిత్రంలో యాక్ట్ చేశారు అంబరీష్. ఆ సినిమా తర్వాత నుంచి అదే పేరుతో ఫేమస్ అయ్యారు ఆయన. రెబల్ స్టార్‌తో పాటుగా కళియుగ కర్ణ అని కూడా అంబరీష్‌ని పిలుస్తుంది కన్నడ పరిశ్రమ.
Comments
Please login to add a commentAdd a comment