ఎత్తు వేస్తే.. చిత్తే | If the height of .. image | Sakshi
Sakshi News home page

ఎత్తు వేస్తే.. చిత్తే

Published Wed, Jul 9 2014 11:36 PM | Last Updated on Sat, Sep 2 2017 10:03 AM

ఎత్తు వేస్తే.. చిత్తే

ఎత్తు వేస్తే.. చిత్తే

 సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఆటుపోట్లు ఎదుర్కొంటున్న పార్టీకి అండగా నిలిచాడు..ఆత్మవిశ్వాసం సడలుతున్న కేడర్‌కు అన్నీ తానై వ్యవహరించాడు. అధికార పార్టీ ‘ట్రబుల్ షూటర్’ అయ్యాడు. స్థానిక సంస్థల సమరం మొదలు..సార్వత్రిక ఎన్నికలు..నిన్నటి జిల్లా పరిషత్తు చైర్‌పర్సన్ ఎన్నిక వరకూ సింగిల్ హ్యాండ్‌తో ‘గోల్’కొట్టి, కాంగ్రెస్ కంచుకోటను బద్ధలు కొట్టాడు.  మెతుకుసీమలో గులాబీ జెండా ఎగుర వేశాడు. ఆయనే భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు. ప్రస్తుతం అభివృద్ధికోసం అదే స్పీడ్‌తో పనులు చేస్తున్నారు. కలిసివచ్చే ఏ అంశాన్ని వదలకుండా జిల్లా సమగ్రాభివృద్ధికోసం తనవంతు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం సిద్దిపేటలో మొక్కజొన్న పరిశోధనా కేంద్రానికి శంకుస్థాపన చేయిస్తున్నారు.
 
 2014 ఎన్నికల్లో మహా మహా ఉద్దండులను మట్టి కరిపించి,,, మహిపాల్‌రెడ్డి, మదన్‌రెడ్డి, చింతా ప్రభాకర్ లాంటి వాళ్లను ఎమ్మెల్యేలుగా నిలబెట్టిన ఘనత హరీష్‌రావుది. ఒంటి చేత్తో జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో 8 చోట్ల విజయఢంకా మోగించారు. స్థానిక ఎన్నికల్లో పార్టీకి తగినంత మెజార్టీ లేకున్నా, తన రాజకీయ చతురతతో జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా ఎగురవేయడం.. మున్సిపల్, మండల పరిషత్ ఎన్నికల్లో   ప్రత్యర్థి పార్టీలకు కోలుకోని ఝలక్ ఇవ్వడం, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 30 మండల పరిషత్ అధ్యక్ష పదవులను  పట్టుకురావడంతో జిల్లా ప్రజలు ఆయన్ను ఓవరాల్ చాంపియన్ అంటున్నారు.
 
 స్థానికంలో తనదైన ముద్ర
 మండల పరిషత్, మున్సిపల్, జెడ్పీలపై గులాబీ జెండా ఎగురవేసేందుకు హరీష్‌రావు జిల్లాలోనే మకాం వేసి వ్యూహరచన చేశారు. సదాశివపేట, జహీరాబాద్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీకి చైర్మన్ పదవికి కావలసినంత మెజార్టీ ఉంది.  రాజకీయ ఉద్దండులు తూర్పు జయప్రకాష్‌రెడ్డి, గీతారెడ్డి ఈ రెండు మున్సిపాల్టీల నాయకత్వాన్ని నడిపిస్తున్నారు. ఎన్నిక జరిగే వేళ ఇక్కడ అద్భుతమే జరిగింది.
 
 హరీష్ వ్యూహాత్మక ఎత్తుగడతో ఇక్కడ  ప్రత్యర్థి పార్టీల కౌన్సిలర్లు టీఆర్‌ఎస్ వైపు తిరిగారు. రెండు మున్సిపాల్టీల చైర్మన్ స్థానాలు టీఆర్‌ఎస్‌కే దక్కాయి. ఇక మెదక్ మున్సిపాలిటీ, గజ్వేల్ నగర పంచాయతీలను సైతం అధికార పార్టీనే కైవసం చేసుకుంది. మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లోనూ చాలాచోట్ల టీఆర్‌ఎస్‌కు బలం లేదు. న్యాల్‌కల్ మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలుంటే 8 స్థానాలు కాంగ్రెస్,7 స్థానాలు టీడీపీ గెలుచుకుంది. టీఆర్‌ఎస్‌కు ఒక్క స్థానం రాలేదు. దాదాపు రెండు నెలల పాటు ఈ రెండు పార్టీలు తమ ఎంపీటీసీలను అజ్ఞాతంలోకి తరలించి, క్యాంపులు పెట్టాయి.  తీరా ఎన్నిక వరకు వచ్చే వరకు  టీడీపీ నుంచి ఏడుగురు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు టీఆర్‌ఎస్ జెండా కిందకు వచ్చారు. ఎంపీపీ పదవిని సొంతం చేసుకున్నారు. ఇలా  30 మండల పరిషత్ అధ్యక్ష పదవులను టీఆర్‌ఎస్ సాధించడం వెనుక హరీష్ మంత్రాంగం చాలానే ఉంది.
 
 125 ఏళ్ల పార్టీ కూడా బోల్తా పడింది
 ఇక జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఎన్నిక హరీష్ రాజకీయ చతురతకు ఓ మచ్చుతునక. నేతలు ఇటు నుంచి అటు... అటు నుంచి ఇటు గోడ దూకడం సర్వసాధరాణమే కావచ్చు. కానీ 125 ఏళ్ల చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఓ యువనేత వ్యూహం ముందు మోకరిల్లింది.
 
 జెడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 21, కాంగ్రెస్ 21, టీడీపీకి 4 స్థానాలు వచ్చాయి. జెడ్పీపీఠం  కైవసం చేసుకోవాలని కాంగ్రెస్, టీఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా ఎత్తుగడలు వేశాయి.  కాంగ్రెస్ పార్టీ అయితే సీనియర్ నాయకులతో సమావేశమై.... విప్పు అస్త్రం ప్రయోగించి జెడ్పీటీసీలు టీఆర్‌ఎస్ వైపు వెళ్లకుండా కట్టడి చేయాలని నిర్ణయించింది. అయితే ఎన్నిక సమయానికి కాంగ్రెస్, టీడీపీల నుంచి నలుగురు చొప్పున 8 మంది టీఆర్‌ఎస్‌లో  చేరారు.
 
 తీరా ఎన్నిక జరిగే వేళ ఇన్‌చార్జి కలెక్టర్ విధివిధానాలు చదువుతూ... ఒక్క టీఆర్‌ఎస్ మాత్రమే విప్ జారీ చేసిందని, మిగిలిన ఏ పార్టీ విప్ జారీ చేయలేదని ప్రకటించారు. ఎమ్మెల్యే గీతారెడ్డి కల్పించుకొని  కాంగ్రెస్ కూడా విప్ పత్రాలు అందజేసిందని కలెక్టర్‌కు చెబుతుండగా, కాంగ్రెస్ పార్టీ విప్ అధికారాలు కట్టబెట్టిన టేక్మాల్ జెడ్పీటీసీ ముక్తార్  లేచి ‘విప్ పత్రాలు ఇచ్చాననుకున్న మేడం’ అని నసగ డంతో నోరెళ్లబెట్టడం అక్కడున్న కాంగ్రెస్ నేతల వంతైంది.  కాంగ్రెస్ సెల్ఫ్‌గోల్ వ్యవహారాన్ని చూసిన సొంత పార్టీ, ప్రత్యర్థి పార్టీ నేతలు హరీష్‌రావా..మజాకా అనుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement