బియ్యం ఎగుమతులపై నిషేధం.. రైతులకు శాపం | Telangana Minister Harish Rao Criticize BJP Govt Over Rice Exports | Sakshi
Sakshi News home page

బియ్యం ఎగుమతులపై నిషేధం.. రైతులకు శాపం

Published Sun, Sep 11 2022 2:24 AM | Last Updated on Sun, Sep 11 2022 2:24 AM

Telangana Minister Harish Rao Criticize BJP Govt Over Rice Exports - Sakshi

మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు 

సాక్షి, ప్రతినిధి, సంగారెడ్డి: బియ్యం ఎగుమ­తులపై సుంకాన్ని, నూకల ఎగుమతులపై నిషేధాన్ని విధిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతుల పాలిట శాపంగా మారుతోందని ఆర్థిక, వైద్యా­రోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న తలాతోక లేని నిర్ణయాలు రైతులను ముంచి కార్పొరేట్‌లకు పంచేలా ఉన్నాయని మండిపడ్డారు.

శనివారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన మంత్రి పటాన్‌చెరులో జరిగిన సభలో మాట్లాడారు. దేశంలో ఆహార నిల్వలు తగ్గినప్పుడు మాత్ర­మే ఆహార ఉత్పత్తులపై నిషేధం విధిస్తారని, ఇప్పుడు కేంద్రం ఎందుకు నిషేధం విధిస్తోందో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రక­టించిన బీజేపీ.. ఎరువులు, విత్తనాల ధరలను పెంచి రైతుల పెట్టుబడులను రెట్టింపు చేసిందని ఎద్దేవా చేశారు.

దేశంలో నాలుగేళ్లకు సరి­పడా బియ్యం నిల్వలున్నా­యని, వడ్లు కొనేదిలేదని చెప్పిన కేంద్రమంత్రి ఇప్పుడు బియ్యం ఎగుమతులపై సుంకాలను విధించ­డం ఏంటని ప్రశ్నించారు. దేశంలోని పలు రాష్ట్రాలతోపాటు, చైనా, పాకిస్తాన్‌ వంటి దేశా­ల్లో కరువు ఏర్పడిందని, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులతో తెలంగాణ మాత్రం దక్షిణ భార­తదేశానికే అన్నంపెట్టే ధాన్యాగారంగా మారిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 75 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యేదని, ఇప్పుడు ఒక్క తెలంగాణలోనే 65 లక్షల ఎకరాల వరి సాగ­వుతోందని హరీశ్‌ వివరించారు. కార్యక్రమంలో మెద­క్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement