
సంగారెడ్డి: దురదృష్టవశాత్తు మనం అధికారం కోల్పోయాం.. బీఆర్ఎస్ ఒడిదొడుకులు కొత్త కాదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. సంగారెడ్డిలో నిర్వహించిన బీఆర్ఎస్ కృతజ్ఞత సభలో హరీశ్‌రావు మాట్లాడారు. పరీక్ష ఫెయిల్ అయిన తర్వాత విద్యార్థి కుంగిపోతే ఇంకో పరీక్ష పాస్ కాలేడని అన్నారు. రానున్న రోజుల్లో స్థానిక, పార్లమెంట్ ఎన్నికల రూపంలో పరీక్షలు రాబోతున్నాయని తెలిపారు. వచ్చే ఎన్నికలు ఎదుర్కోవడానికి పకడ్భంధీ కార్యాచరణతో ముందుకు పోదామని చెప్పారు.
కేసీఆర్ పాలనలో తెలంగాణ ఎన్నో విజయాలు సాధించిందని అన్నారు. వాళ్లు మనకన్నా బాగా పాలిస్తారని ప్రజలు అవకాశమిచ్చారని తెలిపారు. దుష్ప్రచారం కూడా కొంతపై చేయి సాధించిందని తెలిపారు. కేవలం 2 శాతం ఓట్లతో అధికారం కోల్పోయామని, బీఆర్ఎస్ ఎపుడూ తెలంగాణ ప్రజల పక్షమేమని స్పష్టం చేశారు. తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్‌ఎస్ అని గెలిచినప్పుడు పొంగి పోలేదు.. ఓటమితో కుంగి పోలేదని తెలిపారు.
కొత్త ప్రభుత్వానికి కొంత టైం ఇద్దామని, వాళ్ళిచ్చిన హామీల అమలులో విఫలం అయితే ప్రజా గొంతుక అవుదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మన నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారని, మనం ధైర్యం కోల్పోవద్దని ఏమైనా లోపాలు ఉంటే సమీక్షించుకుందామని అన్నారు. మనకు పోరాటాలు కొత్త కాదని,భవిష్యత్ మనదేనని అన్నారు. కేసీఆర్ దమ్మున్న నాయకుడు కనుకే తెలంగాణ వచ్చిందని తెలిపారు.సంగారెడ్డి కార్యకర్తల గురించి ఎంత చెప్పినా తక్కువేనని, కార్యకర్తలకే సంగారెడ్డి విజయం అంకితం చేస్తున్నానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment