మంత్రి హరీశ్‌రావుకు గొంగడి కప్పిన కురుమలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రెండో విడత గొర్రెల పంపిణీ ఉగాది, శ్రీరామనవమి పండగల తర్వాత చేపడతామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖమంత్రి టి.హరీశ్‌రావు ప్రకటించారు. గొర్రెల ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ పథకం యూనిట్ వ్యయాన్ని కూడా పెంచుతామన్నారు. ఆదివారం సంగారెడ్డిలో దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం, కురుమ సంఘం భవన నిర్మాణానికి శుంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో హరీశ్‌రావు మాట్లాడుతూ రూ.300 కోట్లతో హైదరాబాద్‌లో గొల్ల, కురుమల ఆత్మగౌరవ భవనం నిర్మిస్తున్నామన్నారు. టీడీపీ ప్రభుత్వం గొల్ల, కురుమలను వాడుకుందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు బడ్జెట్‌లో బీసీల సంక్షేమానికి రూ.2 వేల కోట్లతో సరిపెట్టి, బీసీలకు అన్యాయం చేస్తోందని హరీశ్ విమర్శించారు. కురుమ సామాజిక వర్గంలో బాల్యవివాహాలు ఎక్కువగా జరిగేవని, కల్యాణలక్ష్మి పథకం అమలు చేసిన తర్వాత ఈ బాల్యవివాహాలు బంద్ అయ్యాయన్నారు.
రాష్ట్రంలో గొల్ల, కురమలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన కర్ణాటక మాజీ మంత్రి రేవన్న సీఎం కేసీఆర్‌ను కలిసి గొంగడి కప్పి అభినందించారని హరీశ్‌రావు గుర్తుచేశారు. ఈ విషయంలో రేవన్నకు ఏఐసీసీ నోటీసులు కూడా జారీ చేసిందన్నారు. సభలో ఎంపీలు బీబీపాటిల్, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, మాణిక్‌రావు, హెచ్‌డీసీ రాష్ట్ర చైర్మన్ చింతప్రభాకర్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, గొల్ల కుర్మ సంఘం నేతలు నగేశ్, శ్రీహరి, పాండు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment