ట్రబుల్ షూటర్ ఏమయ్యాడు? | where is trs trouble shooter | Sakshi
Sakshi News home page

ట్రబుల్ షూటర్ ఏమయ్యాడు?

Published Thu, Jan 14 2016 1:19 AM | Last Updated on Sun, Sep 3 2017 3:37 PM

ట్రబుల్ షూటర్ ఏమయ్యాడు?

ట్రబుల్ షూటర్ ఏమయ్యాడు?

గ్రేటర్ ఎన్నికలకు దూరంగా మంత్రి హరీశ్‌రావు
* ప్రాజెక్టులు, నిధులు అంటూ ఢిల్లీ, ముంబై పర్యటనలు
* ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా ముందుండి నడిపించిన నేత
* ‘గ్రేటర్’లో కనిపించకపోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ
* జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అన్నీ తానై నడిపిస్తున్న కేటీఆర్
* హరీశ్ ఇక మెదక్ జిల్లాకే పరిమితం!
* ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించడంపై అసంతృప్తి
* అయినా పార్టీ అధినేత నిర్ణయమే శిరోధార్యమని తన వర్గీయులతో వ్యాఖ్య


 సాక్షి ప్రత్యేక ప్రతినిధి: టీఆర్‌ఎస్‌కు ఆయన ట్రబుల్ షూటర్. ఇబ్బందికర పరిస్థితులు ఎప్పుడు తలెత్తినా వాటి నుంచి బయటపడేసే బాధ్యతలను పార్టీ అధినేత కె.చంద్రశేఖరరావు ఆయనకే అప్పగించేవారు. ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా ఆయనే ముందుండి కేడర్‌ను నడిపించారు. కానీ ఇప్పుడు టీఆర్‌ఎస్‌కు అత్యంత కీలకమైన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆయన కనిపించడం లేదు! ఈ ఎన్నికల్లో ఆ నాయకుడి పాత్ర ఏమిటో తెలియక ఆయన వెన్నంటి ఉండే నేతలు అయోమయంలో పడ్డారు. ఆయనెవరో కాదు.. రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు టి.హరీశ్‌రావు! టీఆర్‌ఎస్‌ను స్థాపించిన నాటి నుంచి పార్టీ అధినేతను వెన్నంటి ఉండటమే కాకుండా ఆయనకు అత్యంత నమ్మకస్తుడిగా పార్టీ వర్గాల్లో ముద్రపడిన హరీశ్‌రావు.. కేసీఆర్ పోటీ చేసిన అన్ని ఎన్నికలకు సారథ్యం వహించారు.

ఇప్పుడు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆయన కనిపించకపోవడం టీఆర్‌ఎస్‌లోనే కాదు రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీల్లో చర్చకు తెరదీసింది. ఓవైపు టీఆర్‌ఎస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడుతుంటే.. మరోవైపు హరీశ్‌రావు నీటిపారుదల ప్రాజెక్టులకు అనుమతులు, నిధుల మంజూరు అంటూ మహారాష్ట్ర, ఢిల్లీ పర్యటనలు చేస్తుండటంతో సహజంగానే అందరి దృష్టి ఆయనపై పడింది. తన సొంత జిల్లా మెదక్‌లో ఉన్న మూడు జీహెచ్‌ఎంసీ డివిజన్లలో అభ్యర్థుల ఎంపిక సహా ఏ విషయంలోనూ హరీశ్‌రావు జోక్యం చేసుకోవడం లేదు. దీని వెనుక ఏం జరిగి ఉంటుందని ఆరా తీయగా.. ఇటీవల జరిగిన పార్టీ శాసనసభాపక్షం సమావేశంలోనే ఇందుకు బీజం పడినట్లు తెలిసింది.

 వ్యూహం ప్రకారమే పార్టీ అధ్యక్షులకు ఆహ్వానం
 సాధారణంగా పార్టీ శాసనసభా పక్షం సమావేశాలకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మాత్రమే హాజరవుతారు. కానీ గ్రేటర్ ఎన్నికల కోసం ఇటీవల జరిగిన సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షులు, జిల్లా పరిషత్ అధ్యక్షులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షులు, నగర పాలక సంస్థ మేయర్లను కూడా ఆహ్వానించారు. దీంతో ఏదో ప్రాధాన్యత ఉందని సమావేశానికి వచ్చిన వారంతా భావించారు. సమావేశం మొదలయ్యాక ప్రభుత్వ ప్రాథమ్యాలు, సంక్షేమ పథకాలు, గ్రేటర్ హైదరాబాద్‌ను విశ్వనగరంగా తయారు చేసేందుకు తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి వివరించారు.

సమావేశం ముగుస్తుందనగా అనూహ్యంగా.. ‘‘హరీశ్ మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ ఉప ఎన్నిక వ్యవహారాలు చూస్తారు. ఆయనకు అక్కడ చాలా పనుంది. గ్రేటర్‌లో మంత్రి కేటీ రామారావు, జగదీశ్‌రెడ్డి చూస్తారు. వాళ్లు కావాలంటే హరీశ్ సహకరిస్తారు..’’ అని ప్రకటించారు. దీంతో గ్రేటర్ ఎన్నికల నుంచి హరీశ్‌ను పూర్తిగా తప్పించినట్టేనని సమావేశంలో ఉన్న వారందరికీ అప్పుడే ఆర్థమైంది. అందుకు తగ్గట్టే హరీశ్‌రావు గ్రేటర్ ఎన్నికల ఛాయల్లోకి రాలేదు. నామినేషన్ల ఘట్టం ప్రారంభమైన రోజునే ఆయన మేడిగడ్డ, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుల నిర్మాణంపై మహారాష్ట్ర అధికారులతో చర్చించేందుకు ముంబై వెళ్లారు. అంతేకాదు అక్కడ్నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లారు.

 నన్ను అడగొద్దు..
 గ్రేటర్ ఎన్నికల్లో ఫలానా వారికి టిక్కెట్ ఇప్పించాలంటూ ఇటీవలి దాకా హరీశ్‌రావు వద్దకు వెళ్లిన పార్టీ నేతలు ఇప్పుడు మంత్రి కేటీఆర్ దగ్గరకు వెళ్తున్నారు. కేటీఆర్ సచివాలయంలో ఉన్నా, క్యాంప్ అఫీసులో ఉన్నా జాతరే. వందలాది మంది ఆయన దర్శనం కోసం పడిగాపులు కాస్తున్నారు. ఎవరైనా తెలిసో తెలియకో గ్రేటర్ ఎన్నికల్లో టిక్కెట్ ఇప్పించాలని హరీశ్ వద్దకు వెళ్తే.. తనను అడగొద్దని ఆయన నిర్మొహమాటంగా చెబుతున్నారు. మెదక్ జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలోని మూడు డివిజన్ల విషయంలోనూ హరీశ్ జోక్యం చేసుకోవడం లేదని తెలిసింది. దీంతో అక్కడ్నుంచి కార్పొరేటర్ టిక్కెట్ ఆశిస్తున్న ఆశావహులు ఏర్పాటు చేస్తున్న హోర్డింగ్‌లు, ఫ్లెక్సీల్లో హరీశ్ ఫోటో కూడా పెట్టడం లేదు.

‘రాజకీయాల్లో ఇది సహజం. మనతో అవసరం ఉందనుకుంటేనే కేడర్ మనకు గౌరవం ఇస్తారు. లేదంటే ఇంతే.. రాజకీయాల్లో ఇప్పటిదాకా ఎంత మంది ఎత్తుపల్లాలు చూడలేదు, ఇదీ అంతే..’ అని సీనియర్ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని బట్టి నడుచుకుంటానని, తనకు సంబంధం లేని విషయాల్లోకి లాగొద్దని హరీశ్ చెబుతుండటంతో సచివాలయంలో ఆయన కార్యాలయానికి వచ్చేవారి సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది. గ్రేటర్ ఎన్నికల నుంచి తనను అకస్మాత్తుగా తప్పించడంపై అసంత ృప్తిగా ఉన్నా.. దీన్ని సీరియస్‌గా తీసుకోవద్దని హరీశ్ తన వర్గీయులకు చెప్పారు. పార్టీ అధినేత నిర్ణయమే శిరోధార్యమని ఆయన వారికి చెప్పినట్లు సమాచారం.

 వారసుడు కేటీఆర్!
 ముఖ్యమంత్రి కేసీఆర్ తన వారసుడిగా కేటీఆర్‌ను దాదాపు నిర్ణయించినట్టేనని టీఆర్‌ఎస్ నేతలు బహిరంగంగానే చెపుతున్నారు. అందులో భాగంగానే గ్రేటర్ ఎన్నికల బాధ్యతను కేటీఆర్‌కు అప్పగించారని మెజారిటీ మంత్రులు, పార్టీ సీనియర్లు అంటున్నారు. సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎంను కలిసి తమ సమస్యలు విన్నవించినా, నియోజకవర్గంలో పరిస్థితి బాగా లేదని చెప్పినా, ఫలానా జిల్లాలో పార్టీ నేతల మధ్య విభేదాలు ఎక్కువయ్యాయని దృష్టికి తెచ్చినా రాము(కేటీఆర్)తో చర్చించాలని చెపుతున్నారట. అదే సమయంలో మెదక్ జిల్లాలో మాత్రం మంత్రి హరీశ్ నిర్ణయాలకు సీఎం పెద్దపీట వేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement