అట్టహాసంగా ఆవిర్భావం | CM Kcr Unveils Brs Party Flag At Telangana Bhavan | Sakshi
Sakshi News home page

అట్టహాసంగా ఆవిర్భావం

Published Sat, Dec 10 2022 1:40 AM | Last Updated on Sat, Dec 10 2022 1:40 AM

CM Kcr Unveils Brs Party Flag At Telangana Bhavan - Sakshi

శుక్రవారం తెలంగాణ భవన్‌లో పార్టీ జెండాను ఆవిష్కరిస్తున్న సీఎం కేసీఆర్

సాక్షి, హైదరాబాద్‌: భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) ఆవిర్భావ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. శుక్రవారం ఉదయం మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు శంకు స్థాపన కార్యక్రమంలో, తర్వాత జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్‌ ప్రత్యేక బస్సులో తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయన వెంట ఉన్నారు.

మంత్రి హరీశ్‌రావుతో పాటు పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు సీఎంకు స్వాగతం పలికారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన తర్వాత త్రైలోక్య మోహన గౌరి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన సీఎంను వేదపండితులు ఆశీర్వదించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ పూజా కార్యక్రమంలో.. పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, మంత్రి ప్రశాంత్‌రెడ్డితో కేసీఆర్‌ గుమ్మడికాయ కొట్టించారు.

మధ్యాహ్నం ఒంటి గంట 20 నిమిషాలకు ముహ్తూర సమయంలో బీఆర్‌ఎస్‌ ఏర్పాటు అధికారిక పత్రాలపై పార్టీ అధినేతగా కేసీఆర్‌ సంతకాలు చేశారు. నిర్ణయించిన ముహూ ర్తం మేరకు 1.25 గంటలకు భారతదేశ చిత్రపటంతో కూడిన గులాబీ జెండాను హర్షధ్వానాల మధ్య ఆహ్వానితులతో కలిసి ఆవిష్కరించారు.  

తరలివచ్చిన ప్రముఖులు, నేతలు: కుమారస్వామి, ప్రకాశ్‌రాజ్‌తో పాటు పలు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు, రైతుసంఘాల నేతలు బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుర్నామ్‌ సింగ్‌ (హరియాణా), అక్షయ్‌ కుమార్‌ (ఒడిశా), హిమాంశు తదితరులు హాజరయ్యారు.

మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, రాష్ల్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, శ్రీనివాస్‌ గౌడ్, జగదీశ్‌రెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మేయ ర్లు, పార్టీ కార్యవర్గ సభ్యులు, కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, ఇతర నేతలు పాల్గొన్నారు. బీఆర్‌ఎస్‌ ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ భవన్‌ పరిసరాల్లో కార్యకర్తలు బాణసంచా పేలుళ్లు, డీజే, డప్పు చప్పుళ్లతో హోరెత్తించారు.

గుణాత్మక మార్పు వస్తుందనే విశ్వాసం ఉంది: కుమారస్వామి 
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, సినీ నటులు ప్రకాశ్‌రాజ్‌తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఆహ్వానితులు, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇతర మంత్రులు, పలువురు ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ భవన్‌ సమావేశ మందిరంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ సమావేశాన్ని పార్టీ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు తొలి పలుకులతో ప్రారంభించగా, పార్టీ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు మాట్లాడారు.

కుమారస్వామి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ స్ఫూర్తితో భారతదేశంలో గుణాత్మక మార్పు వస్తుందనే సంపూర్ణ విశ్వాసం తనకుందని అన్నారు. ఆ తర్వాత కేసీఆర్‌ ప్రసంగించారు. సమావేశం ముగిసిన తర్వాత ప్రగతిభవన్‌లో జరిగిన విందులో పాల్గొన్నారు. ప్రగతిభవన్‌కు చేరుకున్న కేసీఆర్‌కు సతీమణి శోభ, కుమార్తె, ఎమ్మెల్సీ కవిత నుదుటన తిలకం దిద్ది హారతితో స్వాగతం పలికారు. కేసీఆర్‌ సోదరీమణులతో పాటు ఇతర కుటుంబసభ్యులు కూడా సీఎంకు స్వాగతం పలికారు.

‘తెలంగాణలో పుట్టి పెరిగిన ఈ బీఆర్‌ఎస్‌ వృక్షం శాఖోపశాఖలుగా నేడు భారతాన విస్తరిస్తుంది. భారతదేశ ప్రజల సంక్షేమం, అభివృద్ధి అనే చల్లని నీడను పంచనుంది మన భారత్‌ రాష్ట్ర సమితి’     
– హరీశ్‌రావు, ఆర్థిక శాఖమంత్రి  

‘బీఆర్‌ఎస్‌ ఆవిర్భావం మహోజ్వల ఘట్టం. బీఆర్‌ఎస్‌తో దేశ రాజకీయాల్లో నవశకం ప్రారంభమవుతుంది. ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమైన బీఆర్‌ఎస్‌ దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తి’   
– నామా నాగేశ్వర్‌రావు, టీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్షనేత  

‘భారత రాజకీయాల్లో నూతన శకం మొదలైంది. టీఆర్‌ఎస్‌తో సంఘటిత, సమైక్య, అభివృద్ధి రాజకీయాలకు శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్‌ ఎనిమిదేళ్లలో తెలంగాణ ప్రజల ఆశయాలు, ఆకాంక్షలు నెరవేర్చారు. భారతీయుల కలలు నిజం చేసేందుకు సీఎం కట్టుబడి ఉన్నారు. తెలంగాణ భూమికగా భారతావని వేదికగా సమగ్ర, సమ్మిళిత అభివృద్ధి, సంక్షేమం ధ్యేయంగా మొదలైన కేసీఆర్‌ ప్రస్థానం బీఆర్‌ఎస్‌’     
– కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ 

ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షలు ఫలించాలంటే ఎన్నికల్లో గెలవాల్సింది పార్టీలు కాదు.. ప్రజలు, ప్రజా ప్రతినిధులు గెలవాలి. ఆ పరివర్తన కోసమే బీఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పడింది. 
– ముఖ్యమంత్రి కేసీఆర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement