Telangana Budget 2023: Telangana Finance Minister T Harish Rao Presenting Rs 2.90 Lakh Crore Outlay - Sakshi
Sakshi News home page

ఎలక్షన్‌ టైమ్‌.. బడ్జెట్‌ లైన్‌, కేరాఫ్‌ ఊరు

Published Tue, Feb 7 2023 4:30 AM | Last Updated on Tue, Feb 7 2023 8:51 AM

Hyderabad: Harish Rao Present Telangana Budget Nearly 3 Lakh Crore - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వ్యవ‘సాయమే’ ఎజెండా.. పల్లెల అభివృద్ధి, నిధుల వ్యయంలో స్వయం ప్రతిపత్తే ధ్యేయం.. ఎన్నికల ఏడాదిలో క్షేత్రస్థాయి కేటాయింపులకు ప్రాధాన్యం, పల్లె, పట్టణ ప్రగతుల నిధులను నేరుగా గ్రామ పంచాయతీలకే బదిలీ చేసేందుకు అవకాశం.. సంక్షేమ పథకాలు య«థాతథం.. విద్యుత్‌ సబ్సిడీలకు నిధుల పెంపు.. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై స్పష్టత.. మొత్తం మీద 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం రూ.2,90,396 కోట్ల వార్షిక బడ్జెట్‌ను ప్రతిపాదించింది. రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధే ధ్యేయంగా బడ్జెట్‌లో ఈ రెండు శాఖలకు కలిపి ఏకంగా రూ.60 వేల కోట్ల వరకు కేటాయించింది.

ఇక బీఆర్‌ఎస్‌ మార్కు సంక్షేమ పథకాలైన రైతుబంధు, కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, రైతు బీమా, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలకు నిధులను ఆశించిన మేరకు పెంచింది. రాష్ట్ర ఆర్థిక వృద్ధితో పాటు సొంత పన్నుల ఆదాయాన్ని ఆసరాగా చేసుకుని, కేంద్రంపై ఆశలు వదులుకోకుండానే, రుణాలను పెద్దగా పెంచకుండానే, ఆర్థికాభివృద్ధికి సూచిక అయిన మూలధన వ్యయానికి 40 శాతం మేరకు నిధులు పెంచింది. ఈ మేరకు బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఏడాదికి రూ.5 కోట్ల అభివృద్ధి నిధులను కేటాయిస్తూనే, సీఎం విచక్షణ మేరకు నిధులు మంజూరు చేసేందుకు రూ.10 వేల కోట్లకు పైగా నిధులను ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్‌డీఎఫ్‌) కింద చూపెట్టడం ఈ బడ్జెట్‌లోనే హైలెట్‌గా చెప్పుకోవచ్చు.  

రహదారుల నిర్వహణ, మరమ్మతులకు నిధులు 
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని రహదారులపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. రహదారుల నిర్మాణానికి కేటాయించే నిధులకు అదనంగా మున్సిపాలిటీలకు రూ.2,500 కోట్లు, పంచాయతీరాజ్‌ శాఖకు రూ.2,000 కోట్లను ప్రతిపాదించింది. వీటితో పాటు ఆర్‌అండ్‌బీ శాఖకు (బీటీ రెన్యువల్స్‌) అదనంగా మరో రూ.2,500 కోట్లను ప్రతిపాదించింది. పల్లె ప్రగతి కింద రూ.3,360 కోట్లు, పట్టణ ప్రగతి కింద రూ.1,474 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈ నిధులను నేరుగా గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకే ఇవ్వనుంది.

గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం అప్పులు చేసి మరీ నిధులు వెచ్చించామని, అయినా ప్రభుత్వం నుంచి డబ్బులు రావడం లేదనే స్థానిక ప్రజాప్రతినిధుల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని ఈ నిధులను గ్రీన్‌చానల్‌ (ట్రెజరీ ఆంక్షలు లేకుండా) విధానంలో పంచాయతీలు, మున్సిపాలిటీల అభివృద్ధికి వెచి్చంచనున్నారు. గతంలో టీయూఎఫ్‌ఐడీసీ కింద మున్సిపాలిటీలకు ఇచ్చే రూ.300 కోట్లను కూడా నేరుగా బడ్జెట్‌లోనే కేటాయించడం గమనార్హం. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.31,426 కోట్లు ప్రతిపాదించడం విశేషం.  

వ్యవసాయానికి ఊతం 
బడ్జెట్‌లో వ్యవసాయానికి ఊతమిచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపులు చూపెట్టింది. వ్యవసాయ, సహకార రంగాలకు ఈసారి రూ.26,831 కోట్లు కేటాయించింది. రైతుబంధు కింద 2022–23లో రూ.14,800 కోట్లు కేటాయించగా, ప్రస్తుతం రూ.15,075 కోట్లు ప్రతిపాదించింది. గత ఏడాదితో పోలిస్తే రైతుబంధు పథకానికి రూ.275 కోట్లు ఎక్కువ చూపెట్టింది. తాజా బడ్జెట్‌లో రైతు రుణమాఫీకి రూ.6,380 కోట్లు కేటాయించింది. రూ.లక్ష వరకు రుణాలను మాఫీ చేసేందుకు రూ.20 వేల కోట్ల వరకు అవసరం అవుతాయని అంచనా వేసినప్పటికీ రూ.90 వేల లోపు రుణాలను మాఫీ చేయడమే లక్ష్యంగా నిధులు కేటాయించింది. రైతు బీమా కోసం రూ.123 కోట్లు, మత్స్యశాఖకు రూ.100 కోట్లు చూపెట్టిన ప్రభుత్వం.. సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకానికి కేవలం రూ.100 కోట్లు మాత్రమే కేటాయించి, ఎన్‌సీడీసీ ఇచ్చే రూ.4,500 కోట్ల రుణం ద్వారానే గొర్రెలు పంపిణీ చేస్తామని చెప్పకనే చెప్పింది.  

సంక్షేమం యధాతథం 
 బీఆర్‌ఎస్‌ మార్కు సంక్షేమ పథకాలకు ఈసారి బడ్జెట్‌లో కూడా తగిన ప్రాధాన్యత లభించింది. కల్యాణలక్షి్మ, షాదీముబాకర్‌లకు రూ.3,210 కోట్లు (గత ఏడాది కంటే రూ.460 కోట్లు ఎక్కువగా) చూపెట్టింది. విద్యుత్‌ సబ్సిడీల (వ్యవసాయం, హెయిర్‌ సెలూన్‌లు, ఇస్త్రీ షాపులకు ఇచ్చే సబ్సిడీలు) రూపంలో గత బడ్జెట్‌ కంటే అధికంగా రూ.12 వేల కోట్లు, ఉచిత బియ్యం పంపిణీకి రూ.213 కోట్లు అదనంగా రూ.3 వేల కోట్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి రూ.919 కోట్లు ఎక్కువగా రూ.5,609 కోట్లు కేటాయించింది. కొత్తగా న్యూట్రిషన్‌ కిట్ల కోసం 33 జిల్లాలకు గాను రూ.200 కోట్లను ప్రతిపాదించింది.

గత బడ్జెట్‌లో కేటాయించిన విధంగానే దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు కేటాయించింది. నియోజకవర్గానికి 1,500 మంది లబి్ధదారులను ఎంపిక చేసి ఈ నిధులను పంపిణీ చేయాలని ప్రతిపాదించింది. ఆసరా పింఛన్లకు గత బడ్జెట్‌లో రూ.11,728 కోట్లు కేటాయించగా, ఈ బడ్జెట్‌లో రూ.12 వేల కోట్లు చూపెట్టింది.  బడ్జెటేతర నిధుల నుంచి నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు అదనంగా ‘సొంత జాగా ఉంటే రూ.3 లక్షలు’ పథకానికి కూడా నిధులు కేటాయించింది. గృహా నిర్మాణ పథకానికి ఈ బడ్జెట్‌లో రూ.12 వేల కోట్లు కేటాయించగా, ఇందులో సొంత జాగాల ఇళ్లకు రూ.7,890 కోట్లు ప్రతిపాదించిన ప్రభుత్వం.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 2 వేల మంది లబి్ధదారులను ఎంపిక చేయాలని నిర్ణయించింది. సీఎం విచక్షణ మేరకు మరో 25 వేల మందిని ఎంపిక చేస్తారు. కొత్త తాయిలాలు పెద్దగా లేకపోగా.. నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3,016 ఇచ్చే పథకాన్ని ప్రస్తుత బడ్జెట్‌లో కూడా ప్రతిపాదించకపోవడం గమనార్హం.  

విద్య, వైద్య రంగాలకూ ప్రాధాన్యం 
 బడ్జెట్‌లో నిధులు ఆశించే విద్య, వైద్య రంగాలకు ఈసారి కూడా తగిన ప్రాధాన్యతనిస్తూ కేటాయింపులు చూపెట్టారు. విద్యాశాఖకు రూ.19 వేల కోట్లు, వైద్య శాఖకు రూ.12,161 కోట్లు ప్రతిపాదించారు. వీటితో పాటు పురపాలక శాఖకు రూ.11,372 కోట్లు, ప్రణాళిక శాఖకు రూ.11,495 కోట్లు, రోడ్లు, భవనాల శాఖకు రూ.22,260 కోట్లు చూపెట్టారు. ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలకు కలిపి రూ.31 వేల కోట్ల వరకు ప్రతిపాదించారు. హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు రూ.1,500 కోట్లు, మిషన్‌ భగీరథ నిర్వహణకు రూ.1,000 కోట్లు, హరిత హారానికి రూ.932 కోట్లు, ఐఅండ్‌పీఆర్‌కు రూ.1,000 కోట్లు, ఎయిర్‌పోర్ట్‌–మెట్రో అనుసంధానానికి రూ.500 కోట్లు, ఓల్డ్‌ సిటీ మెట్రోకు రూ.500 కోట్లు, సమీకృత వెజ్, నాన్‌వెజ్‌ మార్కెట్‌ల ఏర్పాటుకు రూ.400 కోట్ల వరకు బడ్జెట్‌ కేటాయింపులు చేయడం గమనార్హం. ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్లతో పాటు ఇతర అవసరాల నిమిత్తం ఆర్థిక శాఖకు రూ.49,749 కోట్లు కేటాయించగా, అందులో కొత్త నియామకాలకు అవసరమయ్యే వేతనాల కోసం రూ.100 కోట్లు ప్రతిపాదించారు.  

ఏప్రిల్‌ 1 నుంచి క్రమబద్ధీకరణ 
    కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబదీ్ధకరణపై ఈ బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత నిచ్చింది. రాష్ట్రంలోని 11 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేసే ప్రక్రియ ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తుందని, సెర్ప్‌లో పనిచేస్తోన్న ఉద్యోగులకు వేతన సవరణను కూడా ఏప్రిల్‌ 1 నుంచి అమలు చేస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అయితే వీఆర్‌ఏలకు పేస్కేల్‌ వర్తింపజేసే అంశాన్ని మాత్రం ప్రస్తావించలేదు. 

రూ. 2.37 లక్షల కోట్ల మేర అంచనా సవరణ 
 2022–23 ఆర్థిక సంవత్సరానికి గాను గత ఏడాది మార్చి 6వ తేదీన రూ.2.56 లక్షల కోట్లకు పైగా బడ్జెట్‌ అంచనాలను ప్రతిపాదించగా, ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి రెవెన్యూ రాబడులు, మూలధన రాబడులు కలిపి రూ.2,37,884.55 కోట్లుగా సవరించారు. అంటే ప్రతిపాదించిన మొత్తం కంటే రూ.19 కోట్ల వరకు లోటు తేలిందని బడ్జెట్‌ గణాంకాలు చెబుతున్నాయి. అప్పులు తీసుకోవడంలో ఎఫ్‌ఆర్‌బీఎం పేరుతో కేంద్రం విధించిన నిబంధనల వల్లే రూ.13 వేల కోట్లు నష్టపోయామని, గ్రాంట్స్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద రూ.40 వేల కోట్లు ప్రతిపాదిస్తే చాలా తక్కువగా కేంద్రం ఇస్తోందని, పన్నుల్లో వాటా తగ్గిస్తోందని చెప్పిన ప్రభుత్వం.. సవరించిన అంచనాల్లో మాత్రం గ్రాంట్స్‌ ఇన్‌ ఎయిడ్‌ నిధులను భారీగానే చూపెట్టడం గమనార్హం.  

పంచ సూత్రతోనే ఖజానాకు కిక్కు 
– రుణాల సమీకరణ ద్వారా రూ. 46,317 కోట్లు 
రాష్ట్ర ప్రభుత్వం ఈసారి రూ.2.90 లక్షల కోట్లతో ప్రతిపాదించిన బడ్జెట్‌కు అనుగుణంగా ఖజానా నింపేందుకు ఐదు పద్దులు దోహద పడనున్నాయి. ఇందులో సొంత పన్ను ఆదాయ పద్దు కింద రూ.1.31 లక్షల కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్స్‌ ఇన్‌ ఎయిడ్‌ కలిపి దాదాపు రూ.62,500 కోట్లు, రుణాల సమీకరణ ద్వారా రూ. 46,317 కోట్లు, పన్నేతర ఆదాయం కింద (భూముల అమ్మకాలతో కలిపి) రూ.22,808 కోట్లు, ఇతర రూపాల్లో మరో రూ.20 వేల కోట్లు సమకూర్చుకునేలా బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం గమనార్హం. 

అన్నింటికీ నిధులు పెంచాం: ఆర్థికమంత్రి 
ఈసారి బడ్జెట్‌లో ఉన్న పథకాలకు నిధులు పెంచుతూనే కొన్ని కొత్త పథకాలను ప్రవేశపెట్టామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం అసెంబ్లీ మీడియా హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు జీఆర్‌ రెడ్డి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, ఇతర ఆర్థిక, ప్రణాళిక, గణాంక శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఆయన మాట్లాడారు.

పలు పథకాలకు నిధుల కేటాయింపు క్రమాన్ని వివరించారు. 2023 సంవత్సరానికి గాను ఆర్థిక, సామాజిక సర్వేను ఈ సందర్భంగా ఆయన ఆవిష్కరించారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం రూ.3.17 లక్షలకు చేరిందని,  2022–23లో రాష్ట్ర ఆర్థిక వృద్ధి 15.6 శాతంగా నమోదయిందని వెల్లడించారు. కాగా ఉదయం 10:30 గంటలకు బడ్జెట్‌ ప్రతిపాదనలను చదవడం ప్రారంభించిన హరీశ్‌రావు 12:15 గంటలకు అంటే సుమారు 105 నిమిషాల్లో తన ప్రసంగాన్ని పూర్తి చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement