సభలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్
సాక్షి, కామారెడ్డి: భూముల రికార్డులను భద్రపరిచి, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా రూపొందించిన ధరణి పోర్టల్ రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పు అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ధరణిలో తలెత్తిన చిన్నచిన్న సమస్యలను పరిష్కరించడానికి త్వరలోనే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గంలో శనివారం ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
కొత్తగా ఏర్పాటైన ‘డోంగ్లీ’మండలాన్ని ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. ధరణితో తహసీల్దార్ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు చేయడం, పాసుపుస్తకాలు ఇంటికి వచ్చేలా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా, త్వరితగతిన పనులు జరగడానికి ధరణి ఎంతగానో దోహదపడుతుందన్నారు.
ఇక్కడ అమలవుతున్న ధరణి పోర్టల్ విధానాన్ని ఇతర రాష్ట్రాల వాళ్లు వచ్చి తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు. అయితే కొందరు ధరణిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ పథకాలను చూసి ఓర్వలేని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఆటంకాలు కలిగిస్తోందని విమర్శించారు. విద్యుత్తు సంస్కరణల పేరుతో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఇబ్బందులు పెడుతోందని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీలు అధికారంలో ఉన్నపుడు ఏ ఊరికీ సరైన రోడ్లు లేవని, తాగునీరు దొరికేది కాదని, కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉండేదని అన్నారు.
టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత తారురోడ్లు నిర్మించామని, మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీరందిస్తున్నామని, 24 గంటల పాటు వ్యవసాయానికి ఉచితంగా కరెంటు ఇస్తున్నామని చెప్పారు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు.
పొరుగునే ఉన్న కర్ణాటక, మహారాష్ట్రల్లోని గ్రామాల ప్రజలు మన పథకాలను చూసి తెలంగాణలో కలుస్తామని అంటున్నారని తెలిపారు. సభలో జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, జెడ్పీ చైర్‌పర్సన్ దఫెదార్ శోభ, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ వీజీగౌడ్, జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్, అదనపు కలెక్టర్ చంద్రమోహన్, జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాంతాచారికి మంత్రి నివాళి
శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా పిట్లం మండ ల కేంద్రంలో ఆయన చిత్రపటానికి మంత్రి హరీశ్‌రావు పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. శ్రీకాంతాచారి త్యాగాన్ని కొనియాడారు.
ఓర్వలేక నిధులు నిలిపేసిన కేంద్రం: హరీశ్
తెలంగాణలో అభివృద్ధిని చూసి ఓర్వలేక కేంద్ర ప్రభుత్వం..రాష్ట్రానికి రావాల్సిన నిధులను నిలిపివేసిందని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కంటే తెలంగాణలో మెరుగైన పాలనను టీఆర్‌ఎస్ అందజేస్తుందని వివరించారు. సంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఏర్పడిన నిజాంపేట్ మండలంలో తహసీల్దార్ కార్యాలయాన్ని శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలిచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 1.50 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిందని, మరో 97 వేల ఉద్యోగాల భర్తీకి నోటి ఫికేషన్ విడుదల చేసిందని తెలిపారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడి తెస్తోందని, అయితేఈ మీటర్లు పెట్టలేదని రాష్ట్రానికి రావాల్సిన రూ.30 వేల కోట్లను కేంద్రం నిలిపివేసిందన్నారు.
మంత్రిని అడ్డుకునేందుకు బీజేపీ ప్రయత్నం..
పిట్లం, బిచ్కుంద మండల కేంద్రాల్లో పర్యటించిన సందర్భంగా మంత్రి హరీశ్‌రావును అడ్డుకునేందుకు బీజేపీ, బీజేవైఎం నేతలు ప్రయత్నించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment