దివ్య జోసెఫ్
బుల్లెటు బండి ఎక్కి డుగ్గు డుగ్గుమని వచ్చేత్తపా...వచ్చేత్తపా పాట ఎంత వైరల్ అయిందో చెప్పనక్కర్లేదు. ఈ పాటలో కొన్ని చరణాలు ఇలా ఉంటాయి... నువ్వు యాడంగ వస్తావురో/ చెయ్యి నీ చేతి కిస్తారో ఈ చరణాలను కొట్టాయంకు తీసుకువెళితే అక్కడ మస్త్‌గా సూట్ అవుతాయి. అయితే అక్కడ పాడుతున్నది పెళ్లికూతురు కాదు. ఎదురు చూస్తుంది పెళ్లికొడుకు కోసం కాదు. స్వయంగా బుల్లెట్ బండే! కొట్టాయంలో ఏ బుల్లెట్ బండికి ఏ ట్రబుల్ వచ్చినా బుల్లెట్ బండిపై రయిరయ్యిమని వచ్చి ట్రబుల్ షూట్ చేసి వెళుతుంటుంది ఆమె. అందుకే ‘బుల్లెట్ దివ్య’ అని కూడా ఆమెను పిలుచుకుంటారు.
‘నా బుల్లెట్ బండి తరచుగా ట్రబులిస్తోంది. మంచి మోకానిక్ ఉంటే చెప్పు...’ కొద్దిసేపటి తరువాత:
‘ఇదిగో బాబాయ్ మంచి మెకానిక్. ఈ అమ్మాయి చేయిపడితే ఇక తిరుగే ఉండదు’
‘ఈ పాప బుల్లెట్‌బండి ఏం బాగుచేస్తుందయ్యా...నీ పిచ్చిగానీ....పదా వేరే మెకానిక్ దగ్గరికి’
‘బాబాయ్... నా మాట విని కొద్దిసేపు ఓపిక పట్టు’
కొద్దిసేపటి తరువాత....
‘నిజమే సుమీ...టకీమనీ చేసి పారేసింది. ఏదో మంత్రం వేసినట్లుగానే ఉంది. పేరేంటి పాపా నీది? దివ్యా! వెరీగుడ్‌నేమ్’
కేరళలోని కొట్టాయంలో ఇలాంటి సంభాషణలు వినిపించడం కొత్తేమీ కాదు. కమల్‌హాసన్ పాట గుర్తుంది కదా... రాజా చేయివేస్తే అది రాంగై పోదులేరా! దివ్య జోసెఫ్ చేయి పడితే చాలు రాంగ్‌గా మొరాయిస్తున్న బండ్లు రైటైపోతాయి. మళ్లీ ఫామ్‌లోకి వస్తాయి. ఇంతకీ దివ్య జోసెఫ్ మెకానిక్ ఎందుకు అయింది?
తన కుటుంబ భారాన్ని మోయడానికి మాత్రం కాదు.
మెకానిజం అంటే ఆమెకు పాషన్!
నాన్న పులిక్కపరంబిల్ జోసెఫ్ మెకానిక్. ఆయనకు కొట్టాయంలో వర్క్‌షాప్ ఉంది. బడి అయిపోగానే దివ్య వచ్చేది ఇక్కడికే. ఇది తనకు మరో బడి. అక్కడ ఉన్న బుల్లెట్ బండ్లు తన తోబుట్టువులుగానే అనిపించేవి. చూస్తూ చూస్తూనే ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ నుంచి ఆయిల్ అండ్ కేబుల్ ఛేంజెస్ వరకు ఏ టూ జెడ్ అన్నీ నేర్చేసుకుంది.
యంత్రవేగంతో బుల్లెట్ బండ్లను బాగుచేస్తుంది.
ఒకానొక దశలో తల్లిదండ్రులు భయపడ్డారు, మెకానిజం ధ్యాసలో పడి చదువులో వెనకబడిపోతుందేమోనని! కానీ అలా ఎప్పుడూ జరగలేదు. చదువులో దివ్య ఎక్కడా తగ్గలేదు. దీంతో వారు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ప్రస్తుతం దివ్యా జోసెఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతోంది. బుల్లెట్ బండ్ల సర్వీస్ ద్వారా వచ్చిన డబ్బులో కొంత మొత్తాన్ని సోషల్ సర్వీస్ కు కూడా వెచ్చించాలని నిర్ణయించుకుంది.
శభాష్ దివ్యా!
Comments
Please login to add a commentAdd a comment