ఐసీయూలో పేషెంట్లకు సేవ చేసే నర్సులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.లేకుంటే కొన్ని వ్యాధులు అంటుకునే ప్రమాదం ఉంది.ఢిల్లీ ఎయిమ్స్‌లో పని చేసే దివ్య సోజల్‌మూడుసార్లు టి.బి బారిన పడింది.అయినా సరే రోగుల సేవ మానలేదు.‘నా కర్తవ్యం నుంచి నేను పారి పో ను’ అంటున్న ఆమెను ప్రాణాంతక రోగులు మనిషి అనరు. దేవత అంటుంటారు.
దివ్య సోజల్ ఐసీయూలో ఉందంటే పేషెంట్లకే కాదు తోటి స్టాఫ్‌కు కూడా ఎంతో ధైర్యం. ఐసీయూలో ఉండే పేషెంట్లను చూసుకోవడంలో ఆమెకు ప్రత్యేక శిక్షణ, నైపుణ్యం ఉన్నాయి. అయితే అవి చాలామందిలో ఉంటాయి. అందరూ ఐసీయూలో ఉండటానికి ఇష్టపడరు. కాని దివ్య సోజల్ మాత్రం తనకు తానుగా ఐసియులో ఉండే పేషెంట్ల సేవను ఎంచుకుంది.
ప్రాణాపాయంలో ఉన్న వారిని కాపాడుకోవడంలో నాకో సంతృప్తి ఉంది’ అంటుంది సోజల్. అయితే ఆ పనిలో ప్రమాదం కూడా ఉంది. అదేమిటంటే అలాంటి రోగులకు సేవ చేసేటప్పుడు కొన్ని వ్యాధులు అంటుకోవచ్చు. సోజల్ మూడుసార్లు అలా టి.బి బారిన పడింది.
కేరళ నర్స్
దివ్య సోజల్‌ది కేరళలోని పత్తానంతిట్ట. చదువులో చురుగ్గా ఉండేది. ముంబైలోని పీడీ హిందూజా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నుంచి జనరల్ నర్సింగ్‌లో డిప్లమా చేసి 2011 నాటికి హిందూజా హాస్పిటల్‌లో ఐసీయూ నర్స్‌గా పని చేయడం మొదలు పెట్టింది. అప్పటికి ఆమె వయసు 23. ఆ సమయంలోనే ఒకరోజు నైట్ డ్యూటీలో ఆమెకు శ్వాసలో ఇబ్బంది ఎదురైంది.
ఎక్స్‌రే తీసి చూస్తే ఊపిరితిత్తుల్లో నీరు చేరింది అని తేలింది. పరీక్షలు చేస్తే టి.బి . అని తేలింది. అదే హాస్పిటల్‌లోని వైద్యులు ఆమెకు ఆరు నెలల ట్రీట్‌మెంట్‌లో పెట్టారు. రోజూ నాలుగు రకాల మందులు తీసుకోవాల్సి వచ్చేది. వాటిని తీసుకుంటూ టి.బి. నుంచి బయట పడింది. అయితే వృత్తిని మానేయలేదు. ఐసీయూను వదల్లేదు.
ఢిల్లీ ఎయిమ్స్‌లో
2012లో బి.ఎస్సీ నర్సింగ్ చేయడానికి ఢిల్లీ ఎయిమ్స్‌కు వచ్చింది దివ్య. ఆ తర్వాత అక్కడే న్యూరోసైన్స్ నర్సింగ్‌లో పి.జి. చేరింది. న్యూరోలాజికల్ ఐసీయూలో పని చేయడానికి నిశ్చయించుకోవడం వల్లే ఆ కోర్సులో చేరింది. ఆ సమయంలో అంటే 2014లో మళ్లీ టి.బి. బారిన పడింది దివ్య. నెల రోజులు హాస్పిటల్‌లో ఉంచారు. నీడిల్‌తో ఫ్లూయిడ్‌ను బయటకు తీయాల్సి వచ్చింది నాలుగైదు సార్లు. మూడు నెలల పాటు రోజూ ఇంజెక్షన్ తీసుకోవాల్సి వచ్చేది.
ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా నేరుగా రంగంలో దిగి దివ్య ట్రీట్‌మెంట్‌ను పర్యవేక్షించాడు. దివ్య సేవాతత్పరత ఆయనకు తెలియడం వల్లే ఇది జరిగింది. దాంతో రెండోసారి టి.బి నుంచి విజయవంతంగా బయటపడింది దివ్య సోజల్. ఈ దశలో ఎవరైనా సులభమైన పని ఉండే వార్డుల్లో పని చేయడానికి మారి పో తారు. కాని దివ్య మారలేదు. డ్యూటీని కొనసాగించింది.
ఆహారం సరిగా తినక
ఐసీయూలో ఉద్యోగం అంటే నైట్ డ్యూటీస్ ఉంటాయి. దివ్య సరిగా ఆహారం తినేది కాదు డ్యూటీలో. నిజానికి తినడానికి టైమ్ కూడా ఉండేది కాదు. అది ఆమె రోగ నిరోధక శక్తిని దెబ్బ తీసింది. అప్పటికి దివ్య పెళ్లి చేసుకుంది. జీవితం ఒక మార్గాన పడింది అనుకుంది. కాని 2019లో విదేశాలలో ఉద్యోగానికి అప్లై చేసేందుకు చేయించుకున్న రొటీన్ పరీక్షల్లో మూడోసారి టీబీ బయటపడింది.
విషాదం ఏమంటే ఈసారి వచ్చింది డ్రగ్ రెసిస్టెంట్ అంటే మందులకు లొంగని వేరియెంట్. ‘ఈ వార్త విన్నప్పుడు చాలా కుంగి పో యాను’ అంది దివ్య. ‘నేను కేరళలోని మా ఊరికి వచ్చి ట్రీట్‌మెంట్ కొనసాగించాను. లెక్కలేనన్ని మాత్రలు మింగాల్సి వచ్చేది. ఇంజెక్షన్లు వేసుకోవాల్సి వచ్చేది. బరువు తగ్గాను. నాసియా ఉండేది. నా తల్లిదండ్రులు నన్ను జాగ్రత్తగా చూసుకుని కాపాడుకున్నారు’ అంటుంది దివ్య.
ఇంత జరిగినా ఆమె ఉద్యోగం మానేసిందా? ఐసీయూను వదిలిపెట్టిందా? ఢిల్లీ ఎయిమ్స్‌కు వెళ్లి చూడండి. ్రపాణాపాయంలో ఉన్న రోగులను అమ్మలా చూసుకుంటూ ఉంటుంది. ఇటువంటి మనిషిని నర్సు అని ఎలా అనగలం? దేవత అని తప్ప.
టి.బి రోగులలో స్థయిర్యానికి
‘నేను ఒకటి నిశ్చయించుకున్నాను. టి.బి రోగుల్లో ధైర్యం నింపాలి. వాళ్లు నన్ను చూసే ధైర్యం తెచ్చుకోవాలి. మూడుసార్లు టి.బి వచ్చినా నేను బయటపడగలిగాను. అందువల్ల ఆ వ్యాధి వచ్చినవారు కుంగి పో వాల్సిన పని లేదు. సరైన మందులు సరిగ్గా తీసుకోవాలి.
అంతే కాదు నర్సులు కాని సామాన్య ప్రజలు కాని మంచి తిండి తిని సమయానికి తిని రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి. అప్పుడు అంటువ్యాధుల బారిన పడే ప్రమాదం తగ్గుతుంది. ఇప్పుడు నేను ఆ చైతన్యం కోసం కార్యక్రమాలు చేస్తున్నాను. ప్రచారం చేస్తున్నాను’ అంటుంది దివ్య.
Comments
Please login to add a commentAdd a comment