బీబీనగర్ : టీబీ రోగుల కోసం బీబీనగర్ ఎయిమ్స్ ప్రయోగాత్మకంగా చేపట్టిన డ్రోన్ సేవలు విజయవంతమయ్యాయి. టీబీ రోగులు, అనుమానితుల నుంచి రక్త పరీక్షలకు నమునాలు సేకరించి వెనువెంటనే ల్యాబ్‌లకు పంపించడం, తిరిగి అవసరమైన మందులను రోగులకు పంపేందుకు డ్రోన్ సాయం తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాలు, తండాలపరిధిలో 150 మంది నమునాలను సేకరించి డ్రోన్ ద్వారా ల్యాబ్‌లకు పంపి.. తిరిగి మందులు చేరవేశారు.
ఆదివారం ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్‌భాటియా డ్రోన్ సేవల గురించి వెల్లడించారు.రెండు నెలలుగా డ్రోన్ సేవలపై చేపట్టిన ప్రయోగాలు ఫలించడంతో టీబీ రోగులకు చాలా సులువుగా సేవలు అందుతున్నాయి. పైలెట్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన డ్రోన్ సేవలను ఇటీవల ఎయిమ్స్‌కు వచ్చిన కేంద్రమంత్రి ఆర్‌కే.సింగ్ పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు.
పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లకు అనుసంధానం
భువనగిరి, రామన్నపేట, బీబీనగర్ బొమ్మల రామారం మండలాల పరిధిలోని పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లకు డ్రోన్‌లను అనుసంధానం చేశారు. ఇక్కడి నుంచి రోగుల నమునాలను సేకరించి రిమోట్ ద్వారా జిల్లా కేంద్రంలోని క్షయవ్యాధి యూనిట్‌లకు డ్రోన్ ద్వారా పంపుతారు. తిరిగి అక్కడి నుంచి రోగులకు అవసరమయ్యే టీబీ మందులు, ట్యూబ్‌లు, రియాజెంట్‌లను డ్రోన్‌లో అమర్చి రోగులకు పంపుతారు. దీని కోసం ప్రస్తుతం ఎయిమ్స్‌లోని 3 డ్రోన్ పైలెట్లు, 2 డ్రోన్‌లు అందుబాటులో ఉంచారు.
రోగుల ఖర్చు తగ్గించేందుకు సహాయపడుతుంది
డ్రోన్ సేవల ద్వారా టీబీ నిర్థారణలో ట్యూమరౌండ్ సమయం తగ్గించడం, దూర ప్రాంతాల్లో, రవాణా సరిగ్గా లేని చోట నివసించే వ్యక్తులకు రవాణా ఖర్చులు తగ్గించేలా డ్రోన్ సేవలు సహాయపడతాయి, జిల్లా టీబీ కార్యాలయం నుంచి డ్రోన్ కార్యకలాపాలను పీహెచ్‌సీలతో పాటు సబ్‌సెంటర్లకు సైతం విస్తరిస్తున్నాం. – వికాస్‌భాటియా, డైరెక్టర్, ఎయిమ్స్
Comments
Please login to add a commentAdd a comment