మెదక్ పోరుకు 17 మంది నామినేషన్లు
సంగారెడ్డి: మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికకు బుధవారం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మూడు ప్రధాన రాజకీయ పార్టీల తో పాటు స్వతంత్రులను కలుపుకొని మొత్తం 17 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్‌ఎస్ నుంచి కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీజేపీ నుంచి తూర్పు జయప్రకాష్‌రెడ్డి(జగ్గారెడ్డి), కాంగ్రెస్ నుంచి సునీతాలక్ష్మారెడ్డి నామినేషన్లు వేశారు. దాఖలైన నామినేషన్లను గురువా రం పరిశీలిస్తారు. ఉపసంహరణకు 30న గడువు నిర్దేశించారు. అనంతరం పోటీలో ఉండే అభ్యర్థులను ప్రకటిస్తారు. వచ్చే నెల 13వ తేదీన పోలింగ్ నిర్వహించి.. 16న ఫలితాలను ప్రకటిస్తారు. అయితే మెదక్ లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ప్రధాన పార్టీల నుంచి, బలహీనవర్గాల నుంచి అభ్యర్థులు లేకపోవటం ఇదే మొదటిసారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
3 సెట్లు సమర్పించిన సునీతారెడ్డి..
కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి మూడు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాజీ మంత్రులు గీతారెడ్డి, షబ్బీర్ అలీ, ఎంపీ వి.హన్మంతరావు, ఎమ్మెల్యే కిష్టారెడ్డి, మాజీ ఎంపీలు సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్‌లతో కలిసివెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందించారు.
బీజేపీ నుంచి ఇద్దరు!
ఇప్పటిదాకా డీసీసీ అధ్యక్షుడిగా, కాంగ్రెస్ అభ్యర్థిగా రేసులో ఉన్న జగ్గారెడ్డి రాత్రికి రాత్రే బీజేపీలో చేరి.. ఆ పార్టీ తరఫున నామినేషన్ వేశారు. ఆయన నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖ లు చేశారు. బీజేపీ తరఫున జగ్గారెడ్డి బరిలోకి దిగుతుండడంతో మెదక్ జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, నేతలు బద్దం బాల్‌రెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి, రఘునందన్‌రావు, టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి, శశికళాయాదవ్, పాదూరి కరుణ తదితరులు వెంట ఉన్నారు. అయితే ఎస్సార్ ట్రస్టు అధినేత అంజిరెడ్డి కూడా బీజేపీ నుంచి నామినేషన్ వేయడం గమనార్హం. ఐదు రోజుల కిందట హైదరాబాద్ పర్యటనకు వచ్చిన బీజేపీ జాతీయు అధ్యక్షుడు అమిత్ షాతో పవన్‌కల్యాణ్ భేటీ అయిన సమయంలో వారి మధ్య జగ్గారెడ్డి అభ్యర్థిత్వ అంశం చర్చకు వచ్చినట్టు తెలిసింది. మరోవైపు టీడీపీ కూడా జగ్గారెడ్డికి టికెట్ ఇవ్వాలని బీజేపీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. అప్పటికప్పుడు పార్టీ సభ్యత్వం ఇచ్చి బీఫాం కేటాయించటం వెనక బీజేపీ జాతీయ నాయకత్వ నిర్ణయం ఉన్నట్టు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ను ఢీకొని నిలిచే నేతలు స్థానికంగా లేరనే వాదన నేపథ్యంలో పార్టీ అధిష్టానం జోక్యం చేసున్నట్టు సవూచారం.
టీఆర్‌ఎస్ నుంచి ప్రభాకర్‌రెడ్డి..
టీఆర్‌ఎస్ నుంచి కొత్త ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ వేశారు. ఈయన తరఫున బుధవారం ఉదయమే ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌రెడ్డి, మదన్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి మురళి యాదవ్ రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అనంతరం మధ్యాహ్నం ప్రభాకర్‌రెడ్డి మరో రెండు సెట్‌ల నామినేషన్ పత్రాలను మంత్రి హరీష్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, చింతా ప్రభాకర్, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి తదితరులతో కలిసి వచ్చి రిటర్నింగ్ అధికారికి అందజేశారు.
ఇది తెలంగాణ ద్రోహులకు, ఆత్మగౌరవానికి మధ్య పోరాటం: హరీశ్
తెలంగాణ ద్రోహులకు, ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరాటమే మెదక్ లోక్‌సభ ఉప ఎన్నిక అని మార్కెటింగ్, నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అభివర్ణించారు. విజ్ఞలైన మెతుకుసీమ ప్రజలు తెలంగాణ వద్దేవద్దన్న ద్రోహులకు బుద్ధిచెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ విజయం ఎప్పుడో ఖరారైపోయిందని, ద్వితీయ, తృతీ య స్థానాల కోసమే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్నాయన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డితో నామినేషన్ వేయించిన అనంతరం మంత్రి హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో విద్యార్థులు, ఉద్యోగుల మీద కేసులు పెట్టించిన మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, అసలు తెలంగాణ రాష్ర్టం వద్దేవద్దు.. సమైక్య రాష్ట్రమే ముద్దు.. అని సీమాంధ్ర ముఖ్యమంత్రులకు వత్తాసు పలికిన జగ్గారెడ్డి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఎన్నికల్లో నిలబడ్డారని హరీశ్‌రావు ప్రశ్నించారు. తెలంగాణ ద్రోహి జగ్గారెడ్డిని పిలిచి టికెట్ ఇచ్చే బదులు.. ఆ పార్టీలో ఎవరికి టికెట్ ఇచ్చినా బీజేపీకి గౌరవం దక్కేదన్నారు.
బీజేపీకి అభ్యర్థే కరువు: పొన్నాల
హైదరాబాద్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మెదక్ లోక్‌సభ స్థానంలో అభ్యర్థే కరువయ్యాడనీ, దీంతో కాంగ్రెస్‌పార్టీ టికెట్ నిరాకరించిన వ్యక్తిని బతిమిలాడి అరువు తెచ్చుకోవాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడిందని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు.బుధవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ ఎస్, బీజేపీలను ప్రజలు న మ్మే పరిస్థితి లేదన్నారు. తమకుటీఆర్‌ఎస్ ప్రధాన ప్రత్యర్థి అవుతుందని, బీజేపీ అసలు పోటీనే కాదన్నారు.
కేసీఆర్‌ను నిద్రపోనివ్వను: జగ్గారెడ్డి
మెదక్ ఎంపీగా తనను గెలిపిస్తే సీఎం కేసీఆర్‌ను నిద్రపోనివ్వనని.. ఆయున ఫామ్‌హౌస్‌లో పడుకున్నా ప్రజా సమస్యలపై పోరాడి నిద్దురలేపుతానని బీజేపీ ఎంపీ అభ్యర్థి జగ్గారెడ్డి అన్నారు. బుధవారం సంగారెడ్డిలో టీడీపీ, బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. దొంగమాటలు చెప్పటంలో కేసీఆర్ దిట్ట అని అన్నారు. హైదరాబాద్‌ను సింగపూర్ చేస్తానని చెబుతున్న కేసీఆర్ రేపొద్దున అక్కడి నుంచే తెలంగాణకు నీళ్లు తీసుకువస్తానని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు.