సాక్షి, కరీంనగర్: రసవత్తరంగా మారిన హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల పరిశీలన (స్క్రూట్నీ) ఘట్టం సోమవారం ముగిసింది. మొత్తం 61 మంది అభ్యర్థులు 92 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా, వివిధ కారణాలతో 19 మందికి చెందిన నామినేషన్ పత్రాలను తిరస్కరించినట్లు రిటర్నింగ్ అధికారి రవీందర్‌రెడ్డి ప్రకటించారు. 42 మంది అభ్యర్థులకు చెందిన 69 నామినేషన్లు ఎన్నికల నిబంధనల ప్రకారం ఉన్నాయని తెలిపారు.
ఈ నెల 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉందని పేర్కొన్నారు. గుర్తింపు పొందిన పార్టీల నుంచి గెల్లు శ్రీనివాస్‌యాదవ్(టీఆర్‌ఎస్), ఈటల రాజేందర్(బీజేపీ), బల్మూరి వెంకట్(కాంగ్రెస్)ల నామినేషన్లు ఆమోదం పొందాయి. మొత్తం మీద ముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్థులు, ఏడుగురు చిన్నపార్టీలు, మిగిలిన 32 మంది స్వతం త్రులుగా నామినేషన్లు దాఖలు చేశారు. బరిలో నిలిచే అభ్యర్థుల సంఖ్య 13వ తేదీ తరువాత మరింత తగ్గే అవకాశాలున్నాయి.
చిన్న పార్టీల నుంచి వీరే..!
మహమ్మద్ మన్సూర్ అలీ (అన్నా వైఎస్సార్ పార్టీ), శ్రీకాంత్ సిలివేరు (ప్రజా ఏక్తాపార్టీ), దేవునూరి శ్రీనివాస్(దళితబహుజన పార్టీ), కెశెట్టి విజయ్ కుమార్ (యువతరం పార్టీ), వెంకటేశ్వర్లు లింగిడి (ప్రజావాణి పార్టీ), కన్నం సురేశ్‌కుమార్ (జై స్వరాజ్ పార్టీ), రాజిరెడ్డి కర్రా(మార్క్సిస్ట్ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా యునైటెడ్) నామినేషన్లు దాఖలు చేశారు.
రేపు నామినేషన్ల ఉపసంహరణ
ఈ నెల 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు ఎన్నికల సంఘం గడువు విధించింది. ఈటల జమున (స్వతంత్ర), రాజేందర్ (బీజేపీ) నామినేషన్లు ఆమోదం పొందగా, ముందు చెప్పినట్లుగానే జమున తన నామినేషన్‌ను ఉపసంహరించుకోనున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేసిన ఒంటెల లింగారెడ్డి కూడా పోటీ నుంచి తప్పుకునే అవకాశాలున్నాయి.
ముగ్గురు రాజేందర్‌ల నామినేషన్ల తిరస్కరణ
ఈటల రాజేందర్ పేరును తలపించేలా ముగ్గురు వ్యక్తులు నామినేషన్లు వేసిన సంగతి తెలిసిందే. ఇప్పలపల్లి రాజేందర్(ఆలిండియా బీసీ, ఓబీసీ పార్టీ), ఈసంపల్లి రాజేందర్(న్యూ ఇండియా పార్టీ), ఇమ్మడి రాజేందర్ (రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇం డియా) నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment