మెజారిటీయే లక్ష్యం
సాక్షి, సంగారెడ్డి: ఉద్యమపార్టీగా ఆవిర్భవించిన టీఆర్‌ఎస్ ఇప్పుడు అధికారపార్టీ. ప్రత్యేక రాష్ర్టంలో పాలనా పగ్గాలు చేపట్టాక మొదటి ఎన్నికను ఎదుర్కొనబోతోంది. అదీ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సొంత జిల్లాలో. కేసీఆర్ రాజీనామా చేసిన మెదక్ పార్లమెంట్ స్థానంపైనే ప్రస్తుతం అన్ని పార్టీలు దృష్టిని సారించాయి. కాగా మెదక్ ఎంపీ స్థానాన్ని తిరుగులేని మెజార్టీతో సొంతం చేసుకుని తమ సత్తా చాటిచెప్పాలని గులాబీ పార్టీ భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా టీఆర్‌ఎస్ ఉప ఎన్నికకు సమాయత్తమవుతోంది. కేసీఆర్ ఉప ఎన్నిక బాధ్యతలను మంత్రి హరీష్‌రావుకు అప్పగించిన విషయం తెలిసిందే.
టీఆర్‌ఎస్‌లో ట్రబుల్‌షూటర్‌గా పేరున్న హరీష్.. ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. గెలుపుపై కాకుండా మెజార్టీపైనే దృష్టి పెట్టారు. సుమారు 4 లక్షలకు పైగా మెజార్టీ సాధించి టీఆర్‌ఎస్ బలాన్ని జాతీయస్థాయిలో చాటాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం పక్కా ప్రచార ప్రణాళికను రూపొందించి ఉపపోరుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కేవలం జిల్లా నేతలతోనే ప్రచారం నిర్వహించి పార్టీకి తిరుగులేని విజయాన్ని అందించాలని హరీష్‌రావు పట్టుదలతో ఉన్నట్లు సమాచారం.
శనివారం జిల్లాకు చెందిన ముఖ్యనేతలతో సమావేశమైన మంత్రి హరీష్‌రావు ఎమ్మెల్యేలు, నేతలకు పలు సూచనలు చేయటంతోపాటు బాధ్యతలు అప్పగించారు. కేసీఆర్ మెదక్ ఎంపీ అభ్యర్థి పేరు ప్రకటించిన వెంటనే ప్రచార రంగంలోకి దిగేలా టీఆర్‌ఎస్ సిద్ధమవుతోంది. పార్టీ అభ్యర్థి ఎవరైనా అతని విజయం కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని హరీష్‌రావు జిల్లా నేతలు, ఎమ్మెల్యేలకు స్పష్టం చేసినట్లు సమాచారం.
మెదక్ ఉప ఎన్నికకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేందుకు టీఆర్‌ఎస్ ఈ నెల 28 నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు సన్నాహక సభలు నిర్వహించనుంది. ప్రతి నియోజకవర్గంలో ఐదువేల మందితో సన్నాహక సభలు జరపనున్నారు. మంత్రి హరీష్‌రావు సభలకు హాజరై పార్టీ నాయకులు, కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయనున్నారు. ఈ నెల 28 నర్సాపూర్, సంగారెడ్డి, 30న మెదక్, గజ్వేల్ నియోజకవర్గాల్లో సన్నాహక సభలు జరుపుతారు. 31న సిద్దిపేట, దుబ్బాక, 1వ తేదీన పటాన్‌చెరు నియోజకవర్గంలో సభలు నిర్వహించనున్నారు.
సభలకు ఎమ్మెల్యేలు, జిల్లా నాయకులతోపాటు టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. సన్నాహక సభలు జరిగిన వెంటనే టీఆర్‌ఎస్ ఏడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేయనుంది. ఇందుకు అవసరమైన ఎన్నికల ప్రచార సామగ్రిని సిద్ధం చేసుకుంది. అభ్యర్థి ప్రకటించిన వెంటనే ఉప ఎన్నికల ప్రచారానికి టీఆర్‌ఎస్ గ్రామాల్లో తెరలేపనుంది.
కేసీఆర్ సభలపైనే తర్జనభర్జన
మెదక్ ఎంపీ ఉప ఎన్నిక ప్రచారంలో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పాల్గొనేందుకు అవసరమైన ఏర్పాట్లను పార్టీ చేపడుతోంది. కేసీఆర్ ప్రచార సభల నిర్వహణపైనా శనివారం జరిగిన జిల్లా ముఖ్యనేతల సమావేశంలో మంత్రి హరీష్‌రావు చర్చించినట్లు సమాచారం. ఉప ఎన్నిక జరగనున్న మెదక్ పార్లమెంట్ పరిధిలోని సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి డివిజన్ కేంద్రాల్లో కేసీఆర్ ప్రచారసభలు నిర్వహించాలా? లేక ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో సభులు ఏర్పాటుచేయాలా? అన్న అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. భారీ మెజార్టీ దక్కించుకోవాలంటే నియోజకవర్గ కేంద్రాల్లో సభలు నిర్వహిస్తే బాగుంటుందని ఎమ్మెల్యేలు అభిప్రాయపడినట్లు సమాచారం. అయితే కేసీఆర్ బహిరంగ సభలపైన ఈ నెలాఖరులోగా స్పష్టత రావొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.