సాక్షి, హైదరాబాద్: యాసంగిలో వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా అధికార టీఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపు మేరకు.. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా మహా ధర్నాకు రంగం సిద్ధమైంది. అసెంబ్లీ నియోజకవర్గాలు, జిల్లా కేంద్రాల్లో జరిగే ఈ ధర్నా కార్యక్రమాలకు సంబంధిత జిల్లా మంత్రులతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు నేతృత్వం వహిస్తారు. సీఎం కేసీఆర్ మినహా రాష్ట్ర మంత్రులందరూ తాము ప్రాతినిథ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజవకర్గ కేంద్రాల్లో జరిగే ధర్నాల్లో పాల్గొంటారు.
సిరిసిల్లలో కేటీఆర్, సిద్దిపేటలో హరీశ్ హాజరు
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు సిరిసిల్లలో, ఆర్థిక, వైద్య శాఖల మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట జిల్లా కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా నిర్వహిస్తారు. హైదరాబాద్ నగరానికి సంబంధించి పార్టీ ఎమ్మెల్యేలందరూ ఒకేచోట రైతులకు సంఘీభావంగా ధర్నాలో పాల్గొంటారు. మరో వంద అసెంబ్లీ నియోజకవర్గాల్లో రైతులతో కలిసి స్థానిక ఎమ్మెల్యేలు ధర్నాలు నిర్వహిస్తారు. ఒక్కో నియోజకవర్గంలో సుమారు 3వేల మంది చొప్పున సుమారు మూడు లక్షల మంది రైతులు శుక్రవారం జరిగే ధర్నాల్లో పాల్గొంటారని అంచనా.
శాసన మండలి స్థానిక సంస్థల కోటా ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ మినహా మిగతా చోట్ల ఎన్నికల కోడ్ అమ ల్లో ఉండటంతో ధర్నాలకు అనుమతి కోరుతూ సంబంధిత నియోజకవర్గాలకు చెందిన టీఆర్‌ఎస్ నేతలు ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకున్నారు.
కేంద్రం వైఖరిని వివరించేలా ధర్నా
వరి సాగు, ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని రాష్ట్ర ప్రజలకు వివరించేలా ఈ ధర్నాను నిర్వహించాలని ముఖ్య మంత్రి కేసీఆర్ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం వైఖరిని విమర్శిస్తూ టీఆర్‌ఎస్ ఒకటి రెండు సందర్భాల్లో మాత్రమే ప్రత్యక్ష ఆందోళనకు దిగింది. రాష్ట్ర అవతరణ సమయంలో ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు, 136 గ్రామాలను ఏపీలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ 2014 మే 29న బంద్ పాటించింది.
కేంద్ర ప్రభుత్వం చేసిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా గత ఏడాది డిసెంబర్ 8న జరిగిన రాస్తారోకోలో పార్టీ నేతలు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. తాజాగా రాష్ట్ర రైతాంగానికి సంబంధించిన అంశంపై అధికార పార్టీ మరోమారు ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవడంతో ధాన్యం కొనాల్సిన కేంద్రం ససేమిరా అంటుంటే.. రాష్ట్ర ప్రభుత్వమే రైతుల నుంచి ధాన్యం కొనాలని రాష్ట్ర బీజేపీ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment