గజ్వేల్ సభలో మాట్లాడుతున్న హరీశ్‌రావు
గజ్వేల్: అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్‌కు అద్భుతమైన మెజార్టీ ఇచ్చిన ప్రజల బాధ్యత తీరిపోయిందని, ఇప్పుడు వారి నమ్మకాన్ని మరింత పెంచే బాధ్యత టీఆర్‌ఎస్‌పై ఉందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సాయంత్రం గజ్వేల్‌లోని సంగాపూర్‌లో ఏర్పాటు చేసిన కార్యకర్తలు, నాయకుల కృతజ్ఞతా సభకు ఆయన హాజరయ్యారు. హరీశ్‌రావు మాట్లాడుతూ, ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ మొసలి కన్నీరు కార్చినా, డ్రామాలాడినా నమ్మకుండ.. కేసీఆర్ వేలు పట్టుకుంటేనే అభివృద్ధి పరంపర కొనసాగుతుందని నమ్మి అఖండ విజయం అందించారని పేర్కొన్నారు. త్వరలో జరుగనున్న సర్పంచ్ ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌కు ఎదురులేని విజయం అందించాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో ఇద్దరు, ముగ్గురు పోటీ పడకుండా అందరూ మాట్లాడుకొని ఒక్కరే పోటీలోకి దిగాలని సూచించారు. సేవా దృక్పథంతో పనిచేయాలన్న ఆసక్తి కలిగినవారే పోటీలో దిగితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
పనిచేయకపోతే వేటు తప్పదు..
పంచాయతీరాజ్ చట్టంలో గతంలో మాదిరిగా కాకుండా కఠిన నియమాలు వచ్చాయని హరీశ్‌రావు గుర్తుచేశారు. చెట్లు పెంచకున్నా, గ్రామంలో పారిశుద్ధ్య లోపం కనిపించినా, రెండు నెలలకోసారి గ్రామసభ నిర్వహించకున్నా సర్పంచ్‌లపై వేటు తప్పదని తెలిపారు. ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకొని పోటీలోకి దిగాల్సి ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్ల నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో భూముల ధరలు భారీగా పెరిగాయని చెప్పారు. త్వరలో రీజినల్ రింగురోడ్డు రాబోతోందని, దీని వల్ల కూడా ధరలు మరింతగా పెరిగే అవకాశముందని తెలిపారు.
హామీల అమలుకు కార్యాచరణ..
ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికి కార్యాచరణ సిద్ధమవుతోందని హరీశ్‌రావు తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటికీ భూ రికార్డులకు సంబంధించిన సమస్యలతో, రైతుబంధు చెక్కులు అందక అన్నదాతలు ఇక్కట్లు పడుతున్నారని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూంరెడ్డి లేవనెత్తిన అంశంపై హరీశ్ స్పందించారు. జనవరి 2 లేదా 3న జిల్లా కలెక్టర్‌తో పాటు తహసీల్దార్లు, వీఆర్వోలను సైతం పిలిచి సమీక్ష నిర్వహించి పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని హామీనిచ్చారు. ఈలోగా రైతు సమన్వయ సమితి నాయకులు, సభ్యు లు తమ గ్రామాల్లో ఉన్న సమస్యలు గుర్తించి సమావేశంలో చెప్పేందుకు సిద్ధం కావాలని సూచించారు.
త్వరలో కేసీఆర్ కలుస్తారు..
సీఎం కేసీఆర్‌కు గజ్వేల్‌లో అద్భుత విజయాన్ని అందించిన కార్యకర్తలు, నాయకులను కలవడానికి త్వరలోనే రెండ్రోజుల పాటు ఫామ్‌హౌస్‌లో ప్రత్యేక సమావేశా లు ఏర్పాటు చేయనున్నారని హరీశ్ వెల్లడించారు. ఈ సమావేశానికి వచ్చే సందర్భంలో నాయకులు గ్రామస్థాయిలో ప్రధాన సమస్యలను గుర్తించి సీఎం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment