క్రైస్తవుల కు దుస్తులు పంపిణీ చేస్తున్న హరీశ్‌రావు
సాక్షి, సిద్దిపేట: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి టీఆర్‌ఎస్ పార్టీ విజయం కోసం బాధ్యతగా పనిచేశానని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోనే భారీ మెజారిటీతో గెలిచిన హరీశ్‌రావు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు సిద్దిపేటలో ఏర్పాటు చేసిన సమావేశంతోపాటు క్రైస్తవులకు క్రిస్మస్ బహుమతుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ, పోరాడి సాధించుకున్న తెలంగాణను అన్నిరంగాల్లో ముందు వరుసలో ఉంచిన కేసీఆర్ అంటే ప్రజలకు నమ్మకమని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి కేసీఆర్ పాలన కావాలని ప్రజలు కోరుకున్నారని పేర్కొ న్నారు. పార్టీ అధినాయకుడి ఆదేశాల మేరకు తాను ఇతర నియోజకవర్గాల్లో ప్రచారానికి వెళ్లినా.. ఇక్కడి టీఆర్‌ఎస్ కార్యకర్తలు అంకితభావంతో పనిచేశారని, రికార్డు స్థాయిలో 1,18,699 ఓట్ల భారీ మెజార్టీతో గెలిపించారని అన్నారు. తన విజయానికి కృషి చేసిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
ఓట్ల మాదిరిగానే.. నదీ జలాల వరద పారాలి
కరువు కాటకాలతో అల్లాడిన తెలంగాణ ప్రజలకు సాగునీరు అందించాల్సిన బాధ్యత తమపై ఉందని హరీశ్‌రావు అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో ప్రజలు టీఆర్‌ఎస్ అభ్యర్థులకు వరదలా ఓట్లు వేశారన్నారు. ఓట్ల వరద మాదిరిగానే రాష్ట్రంలోని బీడు భూముల్లో కృష్ణా, గోదావరి జలాల వరదలు పారాలన్నారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పారు.
సర్పంచ్ ఎన్నికలు ఏకగ్రీవం చేసుకోవాలి..
రాష్ట్రంలో రాజకీయాలు, గ్రూపులతో పనిలేదని, అభివృద్ధే మన ముందు కన్పించే లక్ష్యం అని హరీశ్‌రావు అన్నారు. గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి సాగాలని పేర్కొన్నారు. అయితే రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో పోటీపడి డబ్బులు, సమయాన్ని వృథా చేసుకోవద్దని హితవు పలికారు. గ్రామస్తులంతా కలసి గ్రామాభివృద్ధికి పాటుపడే నాయకుడిని సర్పంచ్‌గా ఎన్నుకోవాలని, అదీ ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గౌరవం ఉంటుందని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి ఏసు ప్రభువు ఆశీర్వాదం ఉండటంతోనే భారీమెజార్టీ వచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో రూ.1.30 కోట్లతో చర్చిల నిర్మాణం, క్రైస్తవ భవనాల కోసం రూ. 25 లక్షలు కేటాయిస్తున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment