కాంగ్రెస్ టికెటా...? వద్దు బాబోయ్.!
మెదక్ నుంచి పోటీచేసేందుకు నేతల అనాసక్తి
పోటీకి నో అంటున్న విజయశాంతి, జగ్గారెడ్డి, శ్రవణ్
హస్తం ఇక భస్మాసుర హస్తమేనంటున్న నేతలు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు మెదక్ పార్లమెంట్ సభ్యత్వానికి సోమవారం రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరగబోయే మొట్టమొదటి ఎన్నిక కాబోతుండడంతో రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక్కడి నుంచి టీఆర్‌ఎస్, బీజేపీల తరపున పోటీ చేసే ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉన్నప్పటికీ కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు నాయకులెవరూ ఆసక్తి చూపడం లేదు. ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలవడంతో మళ్లీ ఇక్కడి నుంచి పోటీ చేస్తే డిపాజిట్ కూడా దక్కే పరిస్థితి ఉండదనే భయం ఆ పార్టీనేతలను వెంటాడుతోంది. కోట్లు ఖర్చు చేసి ఎన్నికల్లో డిపాజిట్ గల్లంతు చేసుకోవడం కంటే పోటీ చేయకపోవడమే మేలనే భావనలో వారున్నారు. ఇటీవల మెదక్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన డాక్టర్ పి.శ్రవణ్‌కుమార్‌రెడ్డిసహా జిల్లా నేతలంతా ఇదే ఆలోచనతో ఉన్నారు. కేసీఆర్ రాజీ నామా చేసిన పార్లమెంట్ స్థానం కావడంతో అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఈ సీటును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటుందని, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే కూడా ఆ పార్టీకే గెలుపు అవకాశాలున్నాయని కాంగ్రెస్ పెద్దలు అంచనా వేస్తున్నారు.
ఇలాంటి స్థితిలో ఆ పార్టీకి గట్టిపోటీ ఇవ్వాలంటే జిల్లాలో రాజకీయంగా పట్టున్న మెదక్ మాజీ ఎంపీ విజయశాంతి, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డిలలో ఒకరిని ఉపఎన్నికల్లో పోటీ చేయించడమే మేలని భావిస్తున్నారు. అయితే వారిద్దరూ కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓడిపోయామని, మళ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసి డబ్బులు ఖర్చుచేసి పరువు పోగొట్టుకోవడం తమకు ఏమాత్రం ఇష్టం లేదని వారు చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ పెద్దలు మాత్రం వీరిలో ఎవరు ఒకరు పోటీ చేస్తేనే మేలనే భావనతో ఒప్పించే పనిలో పడ్డారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పలుదఫాలుగా జగ్గారెడ్డి, విజయశాంతిలతో మంతనాలు జరుపుతున్నారు. వారు ఒప్పుకో ని పక్షంలో ఎమ్మెల్సీ వి.భూపాల్‌రెడ్డిని ఉప ఎన్నికల్లో దింపాలని యోచిస్తున్నారు. మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహను పోటీచేయించాలని కొందరు నేతలు ప్రతిపాదిస్తున్నప్పటికీ ఆయన సుముఖంగా లేరని తెలుస్తోంది.
కమలం గుర్తుపై పోటీకి సై : బీజేపీ ఆహ్వానిస్తే ఆ పార్టీ తరపున పోటీచేసే ఆలోచనలో విజయశాంతి, జగ్గారెడ్డి ఉన్నారు. వీరు గతంలో బీజేపీలో పనిచేసిన వారే. దేశమంతటా మోడీ గాలి ఉన్నందున కమలం గుర్తుపై పోటీ చేస్తే టీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా గెలిచే అవకాశాలూ లేకపోలేదని భావిస్తున్నారు. మంగళవారం గాంధీభవన్‌కు వచ్చిన జగ్గారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, మెదక్ లోక్ సభకు కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలనే ఆలోచనైతే నాకు లేదు. బీజేపీ వాళ్లు పిలిచి టికెట్ ఇస్తానంటే పోటీచేస్తా. లేకపోతే కాంగ్రెస్‌లోనే కొనసాగుతానన్నారు.