ఎన్నో మలుపులు..మార్పులు! | medak trs candidate kothha prabakar reddy | Sakshi
Sakshi News home page

ఎన్నో మలుపులు..మార్పులు!

Published Tue, Aug 26 2014 10:46 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

ఎన్నో మలుపులు..మార్పులు! - Sakshi

ఎన్నో మలుపులు..మార్పులు!

కొత్త ప్రభాకర్‌రెడ్డికే గులాబీ మాల
 
కేసీఆర్ అధికారిక ప్రకటన
దేవిప్రసాద్‌కు ‘ఎమ్మెల్సీ’ ఇస్తామని హామీ

 
ఎన్నో మలుపులు.. మార్పులు...ఎత్తులు.. కసరత్తులు... తర్వాత ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. మెదక్ లోకసభ ఉప పోరుకు నామినేషన్ల గడువు బుధవారంతో ముగుస్తుండటంతో మంగళవారం పొద్దుపోయే వరకు  కాంగ్రెస్, బీజేపీలు కసరత్తు చేశాయి. చిట్టచివరకు అభ్యర్థుల జాబితాను మదింపు చేసి గెలుపు గుర్రాలను ఎంపిక చేసి బరిలోకి దింపారు. గెలుపుపై దీమా ఉన్న టీఆర్‌ఎస్ ముందుగా తన అభ్యర్థిని ప్రకటించింది.

సునీతారెడ్డికే కాంగ్రెస్ టికెట్
 
మెదక్ ఉప ఎన్నికకు కాంగ్రెస్‌పార్టీ.. మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి పేరును ఖరారు చేసింది. మేధోమథనం నేపథ్యంలో దాదాపు ఐదు రోజుల పాటు రాష్ట్రంలోనే మకాం వేసిన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ మెదక్ ఉప ఎన్నికపైనే దృష్టి సారించారు. పోటీ చేసేందుకు మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ, జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహ భార్య పద్మినీరెడ్డి పోటీ పడ్డారు. రేసులో మొదట సర్వే సత్యనారాయణ ముందంజలో ఉన్నారు. దీంతో జిల్లా నేతలంతా ఏకమై.. జిల్లాకు చెందిన వ్యక్తికే టికెట్ ఇవ్వాలని డిమాండ్  డిమాండ్ చేయడంతో అధిష్టానం సర్వే సత్యనారాయణ పేరును తొలగించినట్టు సమాచారం. ఫలితంగా రేసులో జగ్గారెడ్డి పేరు ముందు వరుసలోకి వచ్చింది. ఇక సీనియర్ నేతలు కొందరు జగ్గారెడ్డికి చెక్ పెట్టేందుకు సునీతా లక్ష్మారెడ్డి పేరును సూచించారు. ఆమె పేరు దాదాపు ఖరారు అయిందనే రెండు రోజుల కిందనే మీడియాలో వార్తలు వచ్చాయి. దీనికి సునీతారెడ్డి స్పందిస్తూ.. అధిష్టానం ఆదేశిస్తే ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను సిద్ధమేనని, అయితే ఆర్థిక సహకారం అందిస్తేనే పోటీలో ఉంటానని మెలిక పెట్టడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. మరో 48 గంటల పాటు తర్జనభర్జన చేసి ఎట్టకేలకు సునీతారెడ్డి పేరునే ఖరారు చేశారు.
 
కమలంలో ఇంకా వీడని సస్పెన్స్...

బీజేపీ అభ్యర్థి ఎంపిక విషయంలో ఇంకా సస్పెన్స్ వీడటం లేదు. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రభుత్వ మాజీ విప్ జగ్గారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ భార్య పద్మినీరెడ్డి పేర్లు తెరమీదకు వచ్చాయి. ఇద్దరి పేర్లను రాష్ట్ర  నాయకత్వం కేంద్రానికి నివేదించింది. బుధవారం నేరుగా ఢిల్లీ నుంచే బీఫాం అభ్యర్థి పేరు మీదనే రానున్నట్టు సమాచారం. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కోర్ కమిటీ సమావేశమై మంగళవారం పొద్దు పోయేవరకు అభ్యర్థి ఎంపికపై చర్చలు జరిపారు. అంతకు ముందు రెండు రోజులు హైదరాబాద్‌లోనే మకాం వేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మెదక్ ఉపపోరును ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలవాలని రాష్ర్ట నేతలకు సూచించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి గెలుపు గుర్రాల కోసం అన్వేషించారు. పదుల సంఖ్యలో ఉన్న ఆశావహుల జాబితాను వడబోసి తుది జాబితా రూపొందించారు. ఈ జాబితాలో రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఆకుల రాజయ్య, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, ఎస్సార్ ట్రాన్స్‌పోర్టు అధినేత అంజిరెడ్డి పేర్లు తుది పరిశీలనకు వచ్చాయి. వీరిలో ఒకరి పేరు ఖరారు చేస్తారని ప్రచారం జరిగింది. చివరకు జగ్గారెడ్డి, పద్మినీరెడ్డి పేర్లు తెరమీదకు వచ్చాయి. జగ్గారెడ్డి డీసీసీ అధ్యక్షునిగా నియమిస్తున్నట్లు ఈ నెల 23న ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, సీనియర్ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూన్నారనే కారణంతో ఆ మరుసటి రోజే ఆయన నియామకాన్ని నిలిపివేశారు. పార్టీ నిర్ణయం పట్ల జగ్గారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఒక వైపు కాంగ్రెస్ పార్టీ మేధోమథనం కార్యక్రమంలో పాల్గొంటూనే మరోవైపు బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నారు. జగ్గారెడ్డి తనకున్న పాత పరిచయాలతో బీజేపీలో పావులు కదిపారు. జగ్గారెడ్డి సమైక్యవాదిగా ముద్ర పడ్డారనే కారణంతో ఆయన పునరాగమనాన్ని వ్యతిరేకించిన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చివరకు అంగీకరించినట్లు తెలిసింది
 
సంగారెడ్డి: మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికకు టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. ఉద్యమ సమయంలో పార్టీకి అండగా ఉన్న రియల్ ఎస్టేట్  మిగతా వ్యాపారి కొత్త ప్రభాకర్‌రెడ్డికి టికెట్ ఖరారు చేశారు. ఈ మేరకు మంగళవారం గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లో అధికారికంగా ప్రకటించారు. గత సాధారణ ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు, గజ్వేల్ అసెంబ్లీ నుంచి కేసీఆర్ పోటీచేసి రెండు చోట్లా గెలుపొందిన విషయం విదితమే. తదనంతరం కేసీఆర్ మెదక్ పార్లమెంటుకు రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అప్పటినుంచే ఆశావహులు టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు.

కొత్త ప్రభాకర్‌రెడ్డితో పాటు టీఎన్జీవోల సంఘం నాయకుడు దేవిప్రసాద్, పొలిట్‌బ్యూరో సభ్యుడు రాజయ్య యాదవ్, విద్యార్థి నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్, రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రవీణ్‌రెడ్డి తదితరులు పోటీ పడ్డారు. ఎంపీ కల్వకుంట్ల కవిత, మంత్రి హరీష్‌రావు ద్వారా  కొత్త ప్రభాకర్‌రెడ్డి మంత్రాంగం నడపగా... దేవిప్రసాద్ టీఎన్జీవో సంఘాన్ని నమ్ముకున్నారు.. దేవిప్రసాద్‌కు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టీఎన్జీవోలు కేసీఆర్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. ప్రవీణ్‌రెడ్డి మంత్రి కేటీఆర్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలతో టికెట్‌కోసం యత్నించారు. చివరకు కేసీఆర్.. గులాబీ మాలను కొత్త ప్రభాకర్ మెడలో వేశారు. దేవిప్రసాద్ సేవలు రాష్ట్రానికి అవసరమని, అతణ్ణి ఎమ్మెల్సీగా ఎన్నుకుంటామని స్వయంగా కేసీఆర్ చెప్పడంతో టికెట్ కథ సుఖాంతమైంది.

 కొత్త ప్రభాకర్‌రెడ్డికి మొదటి నుంచి కేసీఆర్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయి. ప్రస్తుత నిజామాబాద్ ఎంపీ, కేసీఆర్ కూతురు కవిత  అప్పట్లో స్థాపించిన తెలంగాణ జాగృతిని పల్లె పల్లెకు విస్తరింపజేయడంలో కొత్త ప్రభాకర్‌రెడ్డి విశేష కృషి చేశారు. గత సాధారణ ఎన్నికల్లో ఆయన దుబ్బాక నియోజకవర్గం నుంచి అసెంబ్లీ టికెట్‌ను అశించారు.  అయితే సోలిపేట రామలింగారెడ్డికి టికెట్ దక్కింది. మెదక్ ఉప ఎన్నికలో టికెట్ నీకే ఇస్తానని కేసీఆర్ కొత్త ప్రభాకర్‌రెడ్డికి మాట ఇచ్చినట్లు అప్పట్లోనే ప్రచారం జరిగింది.
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement